PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 21 APR 2020 6:53PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • కోవిడ్‌-19 కేసుల సంఖ్య 18,601; మరణాలు 590; నయమై/కోలుకున్నవారి సంఖ్య 3,252
  • దేశంలోని మరో 61జిల్లాల్లో 14 రోజులుగా కోవిడ్‌ కొత్త కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు
  • కోవిడ్‌-19పై పౌరులతో ముఖాముఖి కోసం ‘కోవిడ్‌ ఇండియా సేవ’ పేరిట చర్చా వేదికను ప్రారంభించిన డాక్టర్‌ హర్షవర్ధన్‌
  • దిగ్బంధ వేళ ‘పీఎం-కిసాన్‌’ పథకం కింద 8.89కోట్ల రైతు కుటుంబాలకు రూ.17,793 కోట్లు విడుదల
  • కోవిడ్‌-19మీద భారత్‌ విజయంపై భరోసా ఇచ్చేలా కృషిచేస్తున్న సివిల్ సర్వెంట్లకు ప్రధాని అభినందన.
  • పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు దిగ్బంధం అనంతరం మరో 30 రోజుల అదనపు గడువు మంజూరు

కోవిడ్‌-19పై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తాజా సమాచారం

దేశంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 18,601కి చేరింది. మొత్తం కేసులకుగాను 17.48 శాతం.. అంటే- వైరస్‌ బారినపడి కోలుకుని/పూర్తిగా నయమై ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య 3,252గానూ మరణాల సంఖ్య 590గానూ నమోదయ్యాయి. దేశంలోని 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోగల మరో 61 జిల్లాల్లో గడచిన 14 రోజులుగా కోవిడ్‌ కొత్త కేసు ఒక్కటి కూడా నమోదుకాలేదు. కోవిడ్-19 వ్యాధితో ప్రాణాంత‌క స్థితికి చేరిన రోగుల మరణాలు తగ్గించే దిశ‌గా ఔషధ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు సీఎస్ఐఆర్ ప్ర‌స్తుతం యాదృచ్ఛిక‌, అంధ, రెండు చేతులు, క్రియాశీల పోలిక-నియంత్రిత క్లినికల్ ట్రయల్‌ను ప్రారంభిస్తోంది. బ్లడ్‌ బ్యాంకులలో తగిన పరిమాణంలో రక్తనిల్వలు ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖ రాశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616871

పౌర చర్చావేదిక ‘కోవిడ్‌ ఇండియా సేవ’కు డాక్టర్‌ హర్షవర్ధన్‌ శ్రీకారం

ప్రపంచ మహమ్మారి కోవిడ్‌-19పై ప్రత్యక్ష సంబంధాల దిశగా ‘కోవిడ్‌ ఇండియా సేవ’ పేరిట పౌర చర్చవేదికను కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఇవాళ ప్రారంభించారు. ప్రజలకు పారదర్శక ఎలక్ట్రానిక్‌ పాలనను ప్రత్యక్షంగా అందించడం, ప్రత్యేకించి ప్రస్తుత సంక్షోభం నడుమ పౌరుల ప్రశ్నలకు తక్షణం, సవివరంగా జవాబివ్వడం లక్ష్యంగా దీనికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ట్విట్టర్‌లో @CovidIndiaSeva హ్యాండిల్‌ద్వారా డాక్టర్‌ హర్షవర్ధన్‌ ట్వీట్‌ చేశారు. ఈ హ్యాండిల్‌కు పెద్దసంఖ్యలో అందే ట్వీట్లను పరిశీలించడానికి ఒక డ్యాష్‌బోర్డు ఉంటుంది. దీనికి అందే ట్వీట్లను పరిష్కరించగల ఫిర్యాదులుగా స్వీకరించి, పరిష్కారం కోసం సంబంధిత అధికార స్థానాలకు పంపుతుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616699

కోవిడ్‌-19పై పోరులో భాగంగా విధించిన దిగ్బంధం అమలుపై ప్రత్యక్ష సమీక్ష-అంచనా బాధ్యతల్లో ఉన్న కేంద్ర బృందాలను అడ్డుకోవద్దని పశ్చిమబెంగాల్‌కు కేంద్రం ఆదేశం

కోవిడ్‌-19పై పోరులో భాగంగా విధించిన దిగ్బంధం అమలుపై ప్రత్యక్ష సమీక్ష-అంచనా బాధ్యతల్లో ఉన్న కేంద్ర బృందాలను అడ్డుకోవద్దని కేంద్ర ప్రభుత్వం పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలోని కోల్‌కతా, జల్పాయ్‌గురి నగరాల్లో కర్తవ్య నిర్వహణలోగల కేంద్ర మంత్రివర్గ ఉపసంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగాలు తగిన సహకారం అందించడంలేదని దేశీయాంగ శాఖకు సమాచారం అందింది. తాము పరిశీలన చేపట్టడానికి, ఆరోగ్య కార్యకర్తలను కలవడానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితిపై అంచనాలకు ఆటంకాలు కలుగుతున్నట్లు ఆ బృందాలు తెలియజేయడంతో కేంద్రం పైవిధంగా స్పందించి, ఆదేశాలిచ్చింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616868

దిగ్బంధం నేప‌థ్యంలో పీఎం-కిసాన్ ప‌థ‌కం కింద 8.89 కోట్ల‌ రైతు కుటుంబాల‌కు రూ.17,793 కోట్లు విడుద‌ల

దేశ‌వ్యాప్త దిగ్బంధం నేప‌థ్యంలో రైతులను ఆదుకోవ‌డానికి, వ్య‌వ‌సాయ కార్య‌కలాపాలు సవ్యంగా సాగ‌డానికి కేంద్ర వ్య‌వ‌సాయ‌-స‌హ‌కార-రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేక చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ మేర‌కు ‘పీఎం కిసాన్’ ప‌థ‌కం కింద 2020 మార్చి 24నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ రూ.17,793 కోట్లు విడుద‌ల చేసింది. దీనివ‌ల్ల 8.89 కోట్ల రైతు కుటుంబాల‌కు ల‌బ్ధి చేకూరింది. మ‌రోవైపు ప్ర‌జ‌ల‌కు ఆహార భ‌ద్ర‌త దిశ‌గా ప్ర‌ధాన మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న (పీఎంజీకేవై) కింద లబ్ధిదారులకు 1,07, 077. 85 ట‌న్నుల ప‌ప్పుదినుసుల‌ను ఆయా రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో పంపిణీ చేశారు.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616562

పీఎంజీకేవై కింద మిన‌హాయింపు పొందిన భ‌విష్య‌నిధి ట్ర‌స్టులలోని 40,826 మంది స‌భ్యుల‌కు రూ 481.63 కోట్లు విడుద‌ల‌

ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్  యోజన ప‌థ‌కంలో భాగంగా కోవిడ్ -19 సంక్షోభం నేప‌థ్యంలో ఉద్యోగుల భ‌విష్య‌నిధి ప‌థ‌కం నుంచి ప్రత్యేక ఉపసంహరణకు ప్రభుత్వం వెసులుబాటు క‌ల్పించింది. దీంతో మిన‌హాయింపుగ‌ల భ‌విష్య‌నిధి ట్ర‌స్టులు త‌గువిధంగా స్పందించాయి. ఈ మేర‌కు 17.04.2020 వ‌ర‌కూ 40,826 మంది స‌భ్యుల‌కు మొత్తం రూ.481.63 కోట్లు (481,63,76,714) పంపిణీ చేశాయి.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616505

సివిల్ సర్వీసెస్‌ దినోత్సవం సందర్భంగా సివిల్‌ సర్వెంట్లకు ప్రధానమంత్రి అభినందన; సర్దార్‌ పటేల్‌కు నివాళి

సివిల్ సర్వీసెస్‌ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సివిల్‌ సర్వెంట్లకు అభినందనలు తెలిపారు. “ఇవాళ ఈ సివిల్‌ సర్వీసెస్‌ దినోత్సవం సందర్భంగా సివిల్‌ సర్వెంట్లకు వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కోవిడ్‌-19పై పోరాటంలో భారత్‌ విజయం సాధించగలదన్న భరోసా కల్పించేందుకు వారు చేస్తున్న కృషిని అభినందిస్తున్నాను. వారు 24 గంటలూ పనిచేస్తూ అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడమేగాక ప్రతి ఒక్కరినీ ఆరోగ్యంగా ఉంచేందుకు శ్రమిస్తున్నారు” అని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616640

కోవిడ్ -19పై జాతి పోరాటంలో విశేష సేవ‌లందిస్తున్న సివిల్ సర్వెంట్స్: సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ ప్ర‌శంస‌

ప్రకృతి వైపరీత్యాలలో  తోడ్పడేందుకు 29 స‌ర్వీసు అసోసియేష‌న్ల‌ను ఒకచోట చేర్చిన ‘కరుణ‌’ వేదిక విజ‌య‌వంతం కావ‌డాన్ని డాక్ట‌ర్ సింగ్ ఉదాహ‌రించారు. ఈ మేర‌కు వారితో దృశ్య-శ్ర‌వ‌ణ మాధ్య‌మ స‌మావేశంలో ముచ్చ‌టించారు. స‌ర్వీసుల మ‌ధ్య మ‌రింత స‌హ‌కారానికి ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు. ‘పీఎం కేర్స్’ నిధికి ఒకరోజు జీతం విరాళంగా అందించడం ద్వారా  ప్ర‌భుత్వం చేప‌ట్టిన కోవిడ్ -19 సహాయ కార్యకలాపాలకు సివిల్ స‌ర్వెంట్లు  మద్దతు ఇవ్వ‌డంపై వారిని అభినందించారు. కోవిడ్ -19 మ‌హ‌మ్మారిని ఎదుర్కొన‌‌డంలో సివిల్ స‌ర్వెంట్ల భుజ‌స్కంధాల‌పై గురుత‌ర బాధ్య‌త ఉంద‌ని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616801

కోవిడ్‌-19పై భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ సంఘీభావంతో, ఉమ్మడి సంకల్పంతో సంయుక్తంగా పోరాడుతాయి: ప్రధానమంత్రి

కోవిడ్‌-19పై భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ సంఘీభావంతో, ఉమ్మడి సంకల్పంతో సంయుక్తంగా పోరాడుతాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ అష్రఫ్‌ ఘనీ భారత్‌కు కృతజ్ఞతలు తెలపడంపై ఆయన ఈ మేరకు స్పందించారు. కాగా, తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, పారాసిటమాల్‌ తదితర అత్యవసర మందులు సరఫరా చేసినందుకుగాను ఘనీ ట్విట్టర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616517

న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్ గవర్నర్ల బోర్డు 5వ వార్షిక సమావేశంలో దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్య‌మంద్వారా పాల్గొన్న శ్రీమతి నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ నుంచి దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్య‌మంద్వారా న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ గవర్నర్ల బోర్డు 5వ వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో కోవిడ్‌-19పై చ‌ర్చ సంద‌ర్భంగా- ప్ర‌పంచ మ‌హ‌మ్మారిపై పోరాటం కోసం భార‌త్‌కు 100 కోట్ల డాల‌ర్ల అత్యవసర సహాయంతోపాటు బ్రిక్స్ దేశాలకు 500 కోట్ల డాలర్ల స‌త్వ‌ర సాయం అందించ‌డంపై ఎన్‌డీబీని శ్రీమతి సీతారామన్ ప్రశంసించారు. ఈ స‌దుపాయం కింద ఆర్థిక సహాయాన్ని వెయ్యి కోట్ల డాలర్లకు పెంచాలని ఆమె సూచించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616647

మిగులు బియ్యం ఇథనాల్‌గా మార్పు; ఆల్కహాల్‌ ఆధారిత హస్త పరిశుభ్రత ద్రవాల తయారీకి, పెట్రోలులో కలిపేందుకు వినియోగం

కేంద్ర పెట్రోలియం-సహజవాయువుల శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ అధ్యక్షతన ఇవాళ ఎన్‌బీసీసీ సమావేశం జరిగింది. భారత ఆహార సంస్థ-ఎఫ్‌సీఐ వద్దగల మిగులు బియ్యాన్ని ఇథనాల్‌గా మార్చేందుకు ఈ సందర్భంగా సమావేశం ఆమోదం తెలిపింది. దీన్ని ఆల్కహాల్‌ ఆధారిత హస్త పరిశుభ్రత ద్రవాల తయారీతోపాటు ‘ఇథనాల్‌ సమ్మిళిత పెట్రోలు’ (ఈబీపీ) కార్యక్రమం కింద పెట్రోలులో కలిపేందుకు వినియోగిస్తారు.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616476

ఆమోదిత సౌరశక్తి పీవీ మాడ్యూళ్లు, సెల్స్‌ నమూనాల, తయారీదారుల జాబితా అమలు తేదీ 30.09.2020దాకా పొడిగింపు

ఆమోదిత సౌరశక్తి పీవీ మాడ్యూళ్లు, సెల్స్‌ నమూనాల, తయారీదారుల జాబితా అమలు తేదీని 30.09.2020 దాకా పొడిగిస్తున్నట్లు కేంద్ర నవ్య-పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఒక కార్యాలయ ప్రకటనలో తెలిపింది. మునుపటి నిర్ణయం ప్రకారం ఈ గడువు కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి ముప్పు కారణంగా 31.03.2020తో ముగిసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616750

కోవిడ్‌-19 దిగ్బంధం కార‌ణంగా ఆటంకాలు ఏర్ప‌డిన నేప‌థ్యంలో పున‌రుత్పాద‌క ఇంధ‌న ప్రాజెక్టుల గ‌డువును 30 రోజులు పొడిగించిన ఎంఎన్ఆర్ఈ

కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో దిగ్బంధం విధించినందువ‌ల్ల పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల ప్రాజెక్టుల ప‌నులు ఆగిపోయాయి. దీంతో దిగ్బంధం స‌మ‌యంతో స‌మాన‌మైన వ్య‌వ‌ధితోపాటు అద‌నంగా 30 రోజుల గ‌డువిస్తున్న‌ట్లు కేంద్ర న‌వ్య‌-పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల మంత్రిత్వ‌శాఖ ప్ర‌క‌టించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616742

కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ పరిధిలోని వివిధ ధర్మాసనాల విధుల తాత్కాలిక నిలిపివేత 03.05.2020దాకా కొనసాగింపు

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616701

కోవిడ్‌-19పై పోరాటానికి మ‌ద్ద‌తుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు 541 ట‌న్నుల అత్యవసర వైద్య సామగ్రి రవాణా చేసిన ‘లైఫ్‌లైన్ ఉడాన్ విమానాలు’

కోవిడ్‌-19పై జాతి పోరాటానికి మ‌ద్ద‌తుగా దేశంలోని మారుమూల ప్రాంతాల‌కు అత్య‌వ‌స‌ర వైద్య సామ‌గ్రి ర‌వాణా కోసం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ‌శాఖ *లైఫ్‌లైన్ ఉడాన్‌* విమానాల‌ను న‌డుపుతోంది. ఇందులో భాగంగా దిగ్బంధం స‌మ‌యంలో ఎయిరిండియా, అలయన్స్ ఎయిర్, ఐఏఎఫ్‌తోపాటు ప్రైవేటు సంస్థలు 316 విమానాల‌ను న‌డిపించాయి. ఈ మేర‌కు స‌ద‌రు విమానాలు 3,14,965 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి 541.33 ట‌న్నుల సామ‌గ్రిని చేర‌వేశాయి. దీంతోపాటు ప‌వ‌న్‌హ‌న్స్ లిమిటెడ్ సంస్థ‌స‌హా ఇత‌ర సంస్థ‌లు జ‌మ్ముక‌శ్మీర్‌, ల‌ద్దాఖ్‌, ద్వీప ప్రాదేశికాలు, ఈశాన్య భార‌త ప్రాంతానికి హెలికాప్ట‌ర్లద్వారా కీల‌క వైద్య‌సామ‌గ్రిని ర‌వాణా చేశాయి. ఇందులో భాగంగా 2020 ఏప్రిల్ 20దాకా 6,537 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి 1.90 ట‌న్నుల సామ‌గ్రిని మోసుకెళ్లాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616747

ఈ-మెయిళ్లను వేధింపులుగా పొరబడరాదు: సీబీడీటీ అవి ఆదాయపు పన్ను వాపసును వేగిరం చేసేవి మాత్రమే

ఆదాయపు పన్ను వాపసులో భాగంగా అధికారులు అంకుర సంస్థల బకాయిలను సర్దుబాటు చేయడంవంటి అనుచిత పద్ధతులకు పాల్పడుతున్నట్లు సామాజిక మాధ్యమాలలో వస్తున్న కథనాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు-సీబీడీటీ ఖండించింది. పన్ను వాపసు పొందే అర్హతతోపాటు బకాయిలు కూడా ఉన్నవారినుంచి స్పష్టత కోసం పంపుతున్న ఈ-మెయిళ్లను వేధింపులుగా పొరబడరాదని సూచించింది. వాటిపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవాలని స్పష్టం చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616642

దేశంలో కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి నిరోధం దిశగా జిల్లా, గ్రామీణ స్థాయులలో పలు చర్యలు తీసుకుంటున్న స్థానిక పాలన యంత్రాంగాలు

ప్రజలకు ప్రాథమిక పరీక్షల నిర్వహణ, ప్రవేశ-నిష్క్రమణ ప్రదేశాల్లో వచ్చే/వెళ్లే వ్యక్తులకు వైద్య పరీక్షల నిమిత్తం తనిఖీ కేంద్రాల ఏర్పాటు, బహిరంగ ప్రదేశాల్లో నిత్య పరిశుభ్రత నిర్వహణ, క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటు, కొనుగోళ్ల ప్రాంతాల్లో క్రమబద్ధంగా తనిఖీవంటి పలు చర్యలను స్థానిక పాలన యంత్రాంగాలు చేపడుతున్నాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616709

దిగ్బంధ స‌మ‌యంలో నిల్వ‌ల నిర్వ‌హ‌ణ‌కు వీలుగా అండమాన్-నికోబార్ దీవులకు 2 ఓడ‌లు, లక్షదీవులకు 7 చిన్న నౌకల్లో ఆహార ధాన్యాలు రవాణా చేసిన ఎఫ్‌సీఐ

కోవిడ్‌-19 దిగ్బంధం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో అండ‌మాన్‌-నికోబార్ దీవులు, ల‌క్ష‌దీవుల‌లో ఆహారధాన్యాల స‌ర‌ఫ‌రా కుంటుప‌డ‌కుండా భార‌త ఆహార సంస్థ‌-ఎఫ్‌సీఐ గ‌డ‌చిన 27 రోజులుగా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంది. ఈ మేర‌కు అండ‌మాన్‌-నికోబార్ దీవుల‌కు 6,500 ట‌న్నులు, ల‌క్ష‌దీవుల‌కు 1,750 ట‌న్నుల వంతున ఆహార‌ధాన్యాల‌ను త‌ర‌లించింది. నెల‌వారీ స‌గ‌టుతో పోలిస్తే ఈ త‌ర‌లింపు దాదాపు మూడు రెట్లు అధికం కావ‌డం గ‌మ‌నార్హం.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616813

కోవిడ్‌-19 నేపథ్యంలో గిరిజన వ్యవహారాల శాఖ క్రియాశీలత

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ‌ప్రభావంతోపాటు దిగ్బంధం కింద రాకపోకలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో గిరిజనుల సంక్షేమానికి, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఉద్దేశించిన కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ క్రియాశీల చర్యలు చేపట్టింది.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616673

కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి అధ్యక్షతన ‘స్వయం, స్వయంప్రభ’పై సమీక్ష సమావేశం

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ ఫోఖ్రియాల్ *నిషాంక్* ఇవాళ జాతీయ ఆన్‌లైన్‌ విద్యా వేదికలు ‘స్వయం, 32 డీటీహెచ్ చాన‌ళ్ల‌తో కూడిన స్వయంప్రభ’ల వినియోగంపై స‌మ‌గ్ర సమీక్ష నిర్వ‌హించారు. కాగా, ‘స్వయం’లో ప్రస్తుతం 1902 కోర్సులు ఉండ‌గా, ఇవి ప్రారంభ‌మైన నాటినుంచి ఇప్పటిదాకా 1.56 కోట్ల మంది విద్యార్థులు ఉపయోగించుకున్నారు. అలాగే 32 డీటీహెచ్ చాన‌ళ్ల‌తో కూడిన స్వయంప్రభ’ జీశాట్‌-15 ఉపగ్రహ తోడ్పాటుతో 24 గంటల అత్యున్నత నాణ్యతగల విద్యా కార్యక్రమాలను అందిస్తోంది.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616520

ఐదు అంశాల‌పై అధికారిక స‌మాచారం ట్వీట్ చేసిన ‘పీఐబీఫ్యాక్ట్‌చెక్‌’

సుప్రీంకోర్టు నిర్దేశం మేరకు సామాజిక మాధ్యమాల్లో వదంతులు, నిరాధార వార్తల వ్యాప్తి నిరోధానికి ప‌త్రికా స‌మాచార సంస్థ-పీఐబీ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. సామాజిక మాధ్యమాల్లో అమితవేగంగా వ్యాపించే వదంతుల వెనుక వాస్త‌వాల‌ను ఈ విభాగం వెలికితీస్తుంది. ఈ మేర‌కు “పీఐబీఫ్యాక్ట్‌చెక్‌”  పేరిట ట్విట్టర్‌లో ఏర్పాటైన హ్యాండిల్ సామాజిక మాధ్యమాల్లో వ‌చ్చే కొత్త‌కొత్త సందేశాలను నిరంతరం క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ అవాస్త‌వ ప్ర‌చారంలోని బండారాన్ని బ‌య‌ట‌పెడుతుంది.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616650

కోవిడ్ -19 పోరాటంలో అధిక ప్ర‌జా భాగస్వామ్యం సాధ‌న కోసం రోటేరియ‌న్లు ముందుకు రండి: డాక్టర్ హర్షవర్ధ‌న్ పిలుపు

“కోవిడ్-19పై పోరాటంలో రోటేరియ‌న్లు త‌మ‌వంతు స‌హ‌కారం అందించ‌డం ప్ర‌శంస‌నీయం. వాస్త‌వానికి వారి సహ‌కారం అమూల్యం... ఆ మేర‌కు ‘పీఎం కేర్స్‌’ నిధికి విరాళాలు, ఆస్ప‌త్రుల‌కు వైద్య సామ‌గ్రి, ప‌రిశుభ్ర‌త ద్ర‌వాలు, ఆహారం, వ్య‌క్తిగ‌త ర‌క్ష‌ణ సామ‌గ్రి, ఎన్‌-95 మాస్కులు త‌దిత‌రాల రూపంలో వారెంతో స‌హ‌క‌రించారు” అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హర్షవర్ధ‌న్ అభినందించారు. దేశ‌వ్యాప్తంగాగ‌ల రొటేరియ‌న్ల‌తో ఆయ‌న దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్య‌మంద్వారా ముచ్చ‌టించారు. కోవిడ్-19పై పోరులో మరింత ప్ర‌జా భాగ‌స్వామ్యం దిశ‌గా రోటేరియ‌న్లు ముందుకు రావాల‌ని ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616815

ఏప్రిల్ 1 నుంచి 20 రోజుల్లో  పోర్టల్ ద్వారా స్వీకరించిన 25,000కుపైగా కోవిడ్-19 సంబంధిత ఫిర్యాదుల ప‌రిష్కారం: డాక్టర్ జితేంద్ర సింగ్

ప్ర‌జా ఫిర్యాదుల పోర్ట‌ల్‌లోని నేషనల్ మానిటరింగ్ డాష్ బోర్డు (https://darpg.gov.in)లో కోవిడ్ సంబంధిత ఫిర్యాదుల కోసం ఒక ప్ర‌త్యేక గ‌వాక్షాన్ని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. దీంతో కోవిడ్ సంబంధిత ఫిర్యాదు నేరుగా న‌మోదు కావ‌డంతోపాటు సంబంధిత ప్ర‌భుత్వ విభాగం దాన్ని త‌గువిధంగా ప‌రిశీలించి ప‌రిష్క‌రిస్తుంది.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616561

ఢిల్లీ పోలీసులకు రైల్వేల చేయూత; కోవిడ్‌ విధుల్లోగల సిబ్బంది కోసం రోజుకు 10,000 నీళ్ల సీసాల సరఫరా

వేసవి ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్‌-19 విధుల్లోగల ఢిల్లీ పోలీసు సిబ్బందికి భారత రైల్వేశాఖ చేయూతనిస్తోంది. ఈ మేరకు తన పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థ ఐఆర్‌సీటీసీ ద్వారా వారికి నిత్యం 10,000 ‘రైల్‌ నీర్‌’ సీసాలను అందజేస్తోంది. ఈ మేరకు ఇప్పటిదాకా 50,000 సీసాలకుపైగా సరఫరా చేయగా, మే 3వతేదీదాకా ఈ ఉదార సాయం కొనసాగనుంది.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616751

గృహ క్వారంటైన్‌లో ఉన్న పౌరుల జాడ పసిగడుతున్న పుణె మొబైల్‌ యాప్‌ ‘సయ్యమ్‌’

గృహ క్వారంటైన్‌లోగల పౌరుల జాడ పసిగట్టేందుకు, వారు వాస్తవంగా ఇల్లు కదలకుండా ఉన్నదీ/లేనిదీ గమనించేందుకు పుణె నగరపాలక సంస్థ ‘సయ్యమ్‌’ పేరిట ఒక మొబైల్‌ యాప్‌ను రూపొందించింది.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616807

కోవిడ్‌-19 దిగ్బంధం నేపథ్యంలో సహాయ కార్యక్రమాలకు చేయూతనిస్తున్న కేంద్ర విద్యుత్ ప్రభుత్వరంగ సంస్థ ఆర్ఈసీ

కేంద్ర ప్రభుత్వరంగ ‘నవరత్న’ సంస్థ ‘ఆర్ఈసీ లిమిటెడ్‌’ పేదలకు ఆహారధాన్యాలతోపాటు మాస్కులు, ప‌రిశుభ్ర‌త ద్ర‌వాలు త‌దిత‌ర వస్తువులు పంపిణీ చేస్తోంది. ఈ మేరకు ఇప్పటిదాకా 76,000 మంది రోజుకూలీలకు, వారి కుటుంబాలకు ప్రయోజనం కలిగింది. కాగా, ఆర్‌ఈసీ ఫౌండేషన్‌ ఈ సేవా కార్యక్రమాల కోసం ఇప్పటికే రూ.7 కోట్లు మంజూరు చేసింది. అదే సమయంలో మరిన్ని నిధులను కూడా సిద్ధంగా ఉంచింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616674

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగఢ్‌: దిగ్బంధ స‌మ‌యంలో ఉపాధి కోల్పోయిన భ‌వ‌న నిర్మాణ కార్మికుల ద‌య‌నీయ స్థితి దృష్ట్యా 6,670 మంది నమోదిత కార్మికులకు రూ.3000 వంతున ప్రత్యేక సాయం కింద అందించాల‌ని చండీగఢ్ కేంద్ర‌పాలిత పాల‌క సంస్థ నిర్ణయించింది. కాగా, భ‌వ‌న నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి నుంచి ఇంతకుముందు మంజూరైన మొత్తానికి ఇది అద‌నం. ఈ మొత్తాన్ని నేరుగా కార్మికుల ఖాతాలకు బదిలీ చేస్తారు. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధం దిశ‌గా మీడియా సిబ్బందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించాలని పాల‌నాధికారి ఆదేశాలు జారీచేశారు.
  • పంజాబ్‌: కోవిడ్-19 సంబంధిత సమ‌గ్ర సమాచారం ప్రజలకు తెలిసేలా రాష్ట్ర సమాచార-పౌర‌సంబంధాల శాఖ ఫేస్‌బుక్ సామాజిక మాధ్య‌మం‌లో వాట్సాప్ బాట్, చాట్‌బాట్‌ల‌ను ప్రారంభించింది. దిగ్బంధం స‌డ‌లింపున‌కు కేంద్రం అనుమతించినా రాష్ట్రంలో కొన‌సాగించాల‌న్నదే త‌మ నిర్ణ‌యమ‌ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. త‌ద‌నుగుణంగా నియంత్ర‌ణేత‌ర ప్రాంతాల్లో ప‌నిచేసేందుకు అనుమ‌తిగ‌ల‌  పారిశ్రామిక యూనిట్లు రాష్ట్ర ప్రభుత్వ మునుపటి ఆదేశాలతోపాటు దేశీయాంగ శాఖ మార్గదర్శకాలను కూడా అనుస‌రించాలని ప్ర‌క‌టించారు.
  • హర్యానా: రాష్ట్రంలో అర్హతగ‌ల ప్ర‌తి లబ్ధిదారుకూ ప్రభుత్వ సంక్షేమ విధానాలు-కార్యక్రమాల ప్రయోజనాలు అందేలా చూడటం ప్రభుత్వ లక్ష్యమ‌ని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ స్ప‌ష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో పంట‌ల సేకర‌ణ కోసం ఏర్పాటు చేసిన 163 కొనుగోలు కేంద్రాల్లో 8,693 మంది ఆవాలు పండించిన రైతులు9,729 మంది గోధుమ రైతులు పేర్లు న‌మోదు చేసుకున్నార‌ని తెలిపారు.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్ర ప్రభుత్వం “‌ఈసంజీవ‌నిఓపీడీ” (eSanjeevaniOPD) పేరిట ప్రత్యేక  కార్య‌క్ర‌మం ప్రారంభించింది. ఈ మేర‌కు ప్రజలు తమ ఇళ్ల‌నుంచే వైద్యులను సంప్ర‌దించి వైద్య స‌ల‌హాలు పొంద‌వ‌చ్చు. అలాగే “esanjeevaniopd.in”లోనూ ఈ పోర్ట‌ల్ అందుబాటులో ఉంటుంది.
  • కేరళ: రహదారుల‌పై వాహ‌న రాక‌పోక‌లు పెర‌గ‌డంతో *రెడ్‌జోన్‌*లోగ‌ల క‌న్నూర్‌లో నేటినుంచి మూడంచెల దిగ్బంధం అమ‌లు చేస్తున్నారు. కాగా, గ్రీన్‌జోన్‌లోని కోట్ట‌యం, ఇడుక్కి జిల్లాల్లో స‌డ‌లింపులు తిరిగి అమ‌లులోకి వ‌చ్చాయి. మ‌రోవైపు పతనమ్‌తిట్ట‌లో క‌రోనా వైర‌స్ సోకిన 62 ఏళ్ల మహిళకు 42 రోజుల తర్వాత కూడా వ్యాధి నయం కాలేదు; ఇక ఇప్పటివరకు 19 సార్లు చేసిన‌ పరీక్షల్లో వ్యాధి నిర్ధార‌ణ అవుతూనే ఉంది.
  • తమిళనాడు: చెన్నైలో కోవిడ్ సోకి మరణించిన వైద్యుడి అంత్య‌క్రియ‌లను స్థానికులు తీవ్రంగా అడ్డుకున్న నేప‌థ్యంలో ప్ర‌పంచ‌ మహమ్మారిపై పోరులో అగ్ర‌స్థానంలో ఉన్న సిబ్బందికి అన్నివిధాలా ప్రభుత్వ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి ఒక ప్ర‌క‌ట‌న‌లో హామీ ఇచ్చారు. కాగా, ఓ క‌రోనా వైర‌స్‌బారిన ప‌డిన ఒక‌ తమిళ టీవీ చాన‌ల్ జ‌ర్న‌లిస్టుతోపాటు అత‌డి స‌హోద్యోగులు 26 మందికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా వ్యాధి నిర్ధార‌ణ అయింది. రాష్ట్రంలో నిన్నటి వరకు మొత్తం కేసుల సంఖ్య‌: 1,520, మరణాలు: 17, డిశ్చార్జ్ అయిన‌వారు: 457 మంది, యాక్టివ్ కేసులు: 1,043 కాగా, చెన్నై 290, కోయంబత్తూర్ 133 వంతు కేసుల సంఖ్య గ‌రిష్ఠంగా ఉంది.
  • కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ 7 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో విజయపుర 3, కల్బుర్గి 3, దక్షిణ కన్నడ 1 వంతున నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 415కు చేరింది. మరణాలు: 17, వ్యాధి నయమై వెళ్లినవారి సంఖ్య 117గా ఉంది.
  • ఆంధ్రప్రదేశ్: ‌రాష్ట్రంలో గడ‌చిన 24 గంటల్లో 35 కొత్త కేసులు రాగా మొత్తం కేసుల సంఖ్య 757కి చేరింది.  మరణాలు: 22, నయమైనవారు: 96మంది కాగా, క్రియాశీల కేసులు: 639గా ఉన్నాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో కేసులు వేగంగా పెరగడంతో ప్ర‌భుత్వం మ‌రింత అప్ర‌మ‌త్త‌మైంది. ఆలయ పూజారులు, ఇమామ్‌లు, పాస్టర్లకు త‌లా రూ.5000 చొప్పున ముఖ్య‌మంత్రి ఆర్థిక సహాయం ప్రకటించారు. వ్యాధిగ్ర‌స్థులు అధికంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు 184, గుంటూరు 158, కృష్ణా 83, నెల్లూరు 67, చిత్తూరు 53 కేసుల వంతున న‌మోద‌య్యాయి.
  • తెలంగాణ: ఢిల్లీలో త‌బ్లిఘీ-జ‌‌మాత్ స‌మావేశాల‌కు హాజ‌రైన తెలంగాణకు చెందిన ఇద్దరు రోహింగ్యా శరణార్థులకు కోవిడ్-19 వ్యాధి నిర్ధార‌ణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 874కు చేరింది. కాగాకోవిడ్ -19వ‌ల్ల‌ మరణించినట్లు అనుమానిస్తున్న మృతదేహాల నమూనాలను తీయ‌రాద‌ని రాష్ట్ర ఆరోగ్యశాఖ నిర్ణ‌యించింది. మ‌రోవైపు కరోనా వైరస్‌పై ఉష్ణోగ్రత, తేమ ప్రభావంమీద అధ్యయనానికి  వరంగల్‌లోని ఎన్ఐటీకి చెందిన విద్యావేత్త ప్ర‌తిపాదించ‌గా, అది వైరస్‌ను అవ‌గ‌తం చేసుకుని టీకా రూపొందించేందుకు వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ (OSTP) నేతృత్వంలో సాగుతున్న ప్రభుత్వ-ప్రైవేట్ ప్రాజెక్టుకు చేరింది.  
  • అరుణాచల్‌ ప్రదేశ్‌: రాష్ట్రంలోని రెండ్, ఆరెంజ్‌ జోన్ల నుంచి తెచ్చిన కూరగాయలను ఇటానగర్‌లో విక్రయించరాదని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు.
  • అసోం: రాష్ట్ర రాజధాని గువహటిలోని నియంత్రణ జోన్‌ ‘స్పానిష్‌ గార్డెన్‌’ పరిధిలో ఏప్రిల్‌ 22 నుంచి ప్రభుత్వం సత్వర యాంటీబాడీ పరీక్షలు నిర్వహించనుందని ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు.
  • మణిపూర్‌: రాష్ట్రంలో అండర్‌ సెక్రెటరీ హోదావరకూ ప్రతి కార్యాలయంలో ఉద్యోగుల హాజరు గరిష్ఠంగా 33 శాతం ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.  
  • మిజోరం: రాష్ట్రంలోని భవన-ఇతర నిర్మాణ సంక్షేమ సంస్థలకు చెందిన 40,000 మంది కార్మికులకు రూ.3,000 వంతున ప్రత్యక్ష లబ్ధిబదిలీ కింద బ్యాంకు ఖాతాలలో నేరుగా జమచేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
  • నాగాలాండ్‌: రాష్ట్రంలోని వోఖా జిల్లా డోయాంగ్‌ గ్రామంలో డీహెచ్‌ఈపీకి చెందిన సీఐఎస్‌ఎఫ్‌ నిరుపేదలకు రేషన్‌తోపాటు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
  • సిక్కిం: దిగ్బంధం నేపథ్యంలో గ్యాంగ్‌టక్‌లోని ప్రతి ఇంటికీ నిత్యావసరాలను సరఫరా చేయడానికి రాష్ట్ర సహకార సరఫరా-మార్కెటింగ్‌ సమాఖ్య లిమిటెడ్‌ సంచార రేషన్‌ వాహనాన్ని ప్రారంభించింది.
  • త్రిపుర: రాష్ట్రంలో 10, 12 తరగతి పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ఏప్రిల్‌ 24 నుంచి ప్రారంభం కానుంది.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో 472 కొత్త కేసులు న‌మోదు కావ‌డంతో మొత్తం కేసుల సంఖ్య 4,676కు చేరింది.  పరిస్థితిని అక్కడికక్కడే అంచనా వేసి, పరిష్కార సూచ‌న‌లు చేసేందుకు రెండు కేంద్ర మంత్రివ‌ర్గ ఉప‌సంఘాలు రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నాయి. ఈ సంఘాలు అవ‌స‌ర‌మైతే రాష్ట్ర అధికారులకు ఆదేశాలు కూడా ఇస్తాయి. మ‌రోవైపు ముంబైలో వ్యాధి నిర్ధార‌ణ అయిన 53 మంది పాత్రికేయుల‌ను న‌గ‌ర శివారులోని ఒక హోట‌ల్‌లో ఏకాంత చికిత్స‌కు త‌ర‌లించారు.  
  • గుజరాత్: రాష్ట్రంలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి ర‌క్త జీవ ద్ర‌వ్యం వినియోగించి ప్ర‌యోగాత్మ‌క చికిత్స చేప‌ట్ట‌డంపై అధ్యయనానికి అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి-ఐసీఎంఆర్‌తో అవ‌గాహ‌న ఒప్పందంకుదుర్చుకుంది.
  • రాజస్థాన్: రాష్ట్రంలో కోవిడ్‌-19 నిర్ధార‌ణ కోసం చైనాలో త‌యారైన స‌త్వ‌ర ప‌రీక్ష సామగ్రి క‌చ్చిత‌మైన ఫ‌లితాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో వాటి వినియోగాన్ని ప్ర‌భుత్వం నిలిపివేసింది. కిట్లు 90 శాతం క‌చ్చిత‌త్వంతో ఫ‌లితాలు ఇవ్వాల్సి ఉండ‌గా, కేవ‌లం 5.4 శాతం క‌చ్చిత‌త్వం మాత్ర‌మే న‌మోదైన‌ట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ‌ మంత్రి రఘు శర్మ వెల్ల‌డించారు. కాగా, రాష్ట్రంలో ఇవాళ 83 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 1,659కి చేరింది.

 

# కోవిడ్‌-19 లో వాస్తవ తనిఖీ

 

****


(Release ID: 1616910) Visitor Counter : 275