ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఈ-మెయిళ్లను వేధింపులుగా పొరబడరాదు: సీబీడీటీ

అవి ఆదాయపు పన్ను వాపసును వేగిరం చేసేవి మాత్రమే

Posted On: 21 APR 2020 11:45AM by PIB Hyderabad

దాయపు పన్ను వాపసులో భాగంగా అధికారులు అంకుర సంస్థల బకాయిలను సర్దుబాటు చేయడంవంటి అనుచిత పద్ధతులకు పాల్పడుతున్నట్లు సామాజిక మాధ్యమాలలో వస్తున్న కథనాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు-సీబీడీటీ ఖండించింది. పన్ను వాపసు పొందే అర్హతతోపాటు బకాయిలు కూడా ఉన్నవారినుంచి స్పష్టత కోసం పంపుతున్న ఈ-మెయిళ్లను వేధింపులుగా పొరబడరాదని సూచించింది. ఇలా అంకుర సంస్థలుసహా అన్ని తరగతులకూ చెందిన 1.72 లక్షలమంది పన్ను చెల్లింపుదారులకు వెళ్లాయని వివరించింది. వాస్తవం ఇదేనని, ప్రత్యేకించి అంకుర సంస్థలను లక్ష్యం చేసుకున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవాలని స్పష్టం చేసింది. పన్ను బకాయిలు చెల్లించి ఉంటే ఆ విషయాన్ని నిర్ధారించుకుని, వాపసు మొత్తం పూర్తిగా పంపడానికే వారినుంచి సమాచారం కోరుతూ మెయిళ్లు పంపటం సాధారణంగా జరిగేదనని పేర్కొంది. అందువల్ల తమ మెయిళ్లకు తప్పక వివరణ ఇవ్వాలని సూచించింది. కాగా, 2020 ఏప్రిల్‌ 8నాటి ప్రభుత్వ ప్రకటనకు అనుగుణంగా ఇప్పటివరకూ అన్ని కేటగిరీల పన్ను చెల్లింపుదారులకు చెందిన రమారమి 14 లక్షల అభ్యర్థనలను పరిష్కరించి రూ.9,000 కోట్లు వాపసు చేసినట్లు సీబీడీటీ వెల్లడించింది. అయితే, కొందరినుంచి మెయిళ్లకు ప్రతిస్పందన లేనందువల్ల వాపసులు పెండింగ్‌లో ఉన్నాయని, వారు తమ సమాచారాన్ని నవీకరించుకోగానే అభ్యర్థన పరిష్కారం కాగలదని తెలిపింది.

*****



(Release ID: 1616642) Visitor Counter : 196