ఆర్థిక మంత్రిత్వ శాఖ

న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ గవర్నర్ల బోర్డు 5వ వార్షిక సమావేశంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్న శ్రీమతి నిర్మలా సీతారామన్

Posted On: 20 APR 2020 9:20PM by PIB Hyderabad


ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ గవర్నర్ల బోర్డు 5వ వార్షిక సమావేశంలో పాల్గొన్నారు.

బ్రిక్స్ దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) 2014 సంవత్సరంలో ఎన్ డిబి ఏర్పాటు చేశాయి. బ్రిక్స్ దేశాలు, వర్థమాన దేశాలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఉన్న ఇతర వర్థమాన దేశాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులు, స్థిర అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన వనరుల సమీకరణ ఈ బ్యాంకు లక్ష్యం. అంతర్జాతీయ వృద్ధి, అభివృద్ధికి బహుముఖీన, ప్రాంతీయ ఆర్థిక సంస్థలు అందిస్తున్న చేయూతకు అదనంగా మరింత సహకారం ఎన్ డిబి అందిస్తుంది. భారత్ లో 418.3 కోట్ల డాలర్ల విలువ గల 14 ప్రాజెక్టులను ఎన్ డిబి ఇంతవరకు ఆమోదించింది.

విశ్వసనీయత గల ఒక ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థగా ఎదగడంలోను, మరింత స్థిరమైన, సమ్మిళిత వైఖరి అనుసరించడం ద్వారా తనకు అప్పగించిన పని నెరవేర్చడంలోను ఎన్ డిబి కృషిని ఆర్థికమంత్రి ప్రారంభోపన్యాసంలో ప్రశంసించారు.

కోవిడ్-19 మహమ్మారిపై పోరాటం కోసం 100 కోట్ల డాలర్ల అత్యవసర సహాయంతో పాటు బ్రిక్స్ దేశాలకు 500 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం అందించడాన్ని శ్రీమతి సీతారామన్ ఈ సమావేశంలో  కోవిడ్-19పై చర్చ సందర్భంగా ప్రశంసించారు. ఈ విభాగం కింద సహాయాన్ని వెయ్యి కోట్ల డాలర్లకు పెంచాలని కూడా ఆమె సూచించారు. కోవిడ్-19 ఎమర్జెన్సీ నిధి ఏర్పాటుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ తీసుకున్న చొరవను, కోవిడ్-19ని సమర్థవంతంగా అదుపు చేసేందుకు అవసరంలో ఉన్న దేశాలకు అత్యంత కీలకమైన ఔషధాలను పంపేందుకు భారత్ తీసుకున్న చొరవను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్ సరైన సమయానికి స్పందించి  చికిత్సలో అత్యంత కీలకమైన ఔషధాలను సరఫరా చేసినందుకు బ్రెజిల్ ఆర్థికమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన కల్లోల బాధితులను, బాధిత రంగాలను ఆదుకునేందుకు ప్రభుత్వం సత్వరం స్పందిస్తూ అత్యంత కీలకమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పటిష్ఠం చేయడం కోసం 200 కోట్ల డాలర్లు (రూ.15 వేల కోట్లు) కేటాయింపు;  సంక్షోభంలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు సామాజిక పథకాలకు 2500 కోట్ల డాలర్ల కేటాయింపు;  క్షేత్రస్థాయిలో ముందువరుసలో నిలిచి పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు 67 వేల కోట్ల డాలర్లు (రూ.50 లక్షల కోట్లు) బీమా ప్రయోజనం అందించడం;  చట్టబద్ధంగా, నియంత్రణా సంస్థల నిర్దేశకత్వాలకు లోబడి పని చేసే సంస్థలకు ఉద్దీపనలు అందించడం;  ఆర్ బిఐ ద్రవ్యవిధానంలో చేసిన మార్పులు వంటి పలు చర్యలను పలు ఆమె సవివరంగా వివరించారు.

బహుముఖీన అభివృద్ధి బ్ఆయంకులు (ఎండిబి), ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో (ఐఎఫ్ ఐ) పాటుగా కోవిడ్ పై గట్టిగా పోరాటం చేస్తున్న వివిధ సంస్థలతో పాటుగా జి-20లో చేరేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆమె ఎన్ డిబిని ప్రోత్సహించారు. స్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో బ్రిక్స్ దేశాలకు మద్దతు ఇచ్చేందుకు మరింత అధునాత్మక విధానాలు అనుసరించాలని ఆమె ఎన్ డిబిని కోరారు.

***


(Release ID: 1616647) Visitor Counter : 171