ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

పౌర చర్చావేదిక ‘కోవిడ్‌ ఇండియా సేవ’కు డాక్టర్‌ హర్షవర్ధన్‌ శ్రీకారం

Posted On: 21 APR 2020 3:02PM by PIB Hyderabad

   ప్రపంచ మహమ్మారి కోవిడ్‌-19పై ప్రత్యక్ష సంబంధాల దిశగా ‘కోవిడ్‌ ఇండియా సేవ’ పేరిట పౌర చర్చవేదికను కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఇవాళ ప్రారంభించారు. ప్రజలకు పారదర్శక ఎలక్ట్రానిక్‌ పాలనను ప్రత్యక్షంగా అందించడం, ప్రత్యేకించి ప్రస్తుత సంక్షోభం నడుమ పౌరుల ప్రశ్నలకు తక్షణం, సవివరంగా జవాబివ్వడం లక్ష్యంగా దీనికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ట్విట్టర్‌లో @CovidIndiaSeva హ్యాండిల్‌ద్వారా డాక్టర్‌ హర్షవర్ధన్‌ ట్వీట్‌ చేశారు. కాలక్రమంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ట్విట్టర్‌ ఒక ప్రత్యక్ష నిత్యవసర సేవల వారధిగా మారిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఒక సుశిక్షిత ప్రత్యేక నిపుణుల బృందం ఈ హ్యాండిల్‌ను నిర్వహిస్తుందని, ప్రతి ప్రశ్నకూ తగురీతిలో స్పందిస్తుందని పేర్కొన్నారు. పౌరులు తమ వ్యక్తిగత వివరాలను పంచుకోవాల్సిన అవసరం లేదని, విస్తృత ప్రజారోగ్య సమాచారాన్ని వారు పొందవచ్చునని తెలిపారు. కాగా, కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా మూడు నెలల నుంచీ ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ పలు చర్యలు చేపట్టింది. ఈ చర్యల ఫలితంగా వైరస్‌బారిన పడకుండా తోడ్పడే సామాజిక దూరం, హస్త పరిశుభ్రత, శ్వాస సంబంధిత పద్ధతులు వంటివాటిపై ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది.

*****



(Release ID: 1616699) Visitor Counter : 173