గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 నేపథ్యంలో గిరిజన వ్యవహారాల శాఖ క్రియాశీలత

Posted On: 21 APR 2020 12:34PM by PIB Hyderabad

ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ‌ప్రభావంతోపాటు దిగ్బంధం నేపథ్యంలో గిరిజనుల సంక్షేమానికి ఉద్దేశించిన కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ క్రియాశీల చర్యలు చేపట్టింది. ఈ మేరకు కనీస మద్దతు ధరతో సూక్ష అటవీ ఉత్పత్తుల కొనుగోలుకు రాష్ట్రస్థాయి నోడల్‌ ఏజెన్సీలను అప్రమత్తం చేయాల్సిందిగా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి రెండు తెలుగు రాష్ట్రాలుసహా 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. అలాగే ఆర్థిక వ్యవస్థలో వృద్ధికి ఉద్దేశించిన చర్యలపై మార్గ ప్రణాళిక రూపకల్పన కోసం తమశాఖ అధికారులతో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇక గిరిజన ‌ప్రాంతాల్లోని ఏకలవ్య ఆదర్శ సాధారణ-ఆశ్రమ పాఠశాలలను 25.05.2020దాకా మూసివేయాల్సిందిగా మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశించింది. ఆయా పాఠశాలల్లో రోగకారకాల నిర్మూలన చర్యలు చేపట్టాలని సూచించింది. దీంతోపాటు గిరిజన వ్యవహారాల శాఖ తీసుకున్న మరికొన్ని చర్యలు కిందివిధంగా ఉన్నాయి:

  1. ఈ ఏడాది మార్చి 31నాటికి ఇవ్వలేకపోయిన నేషనల్‌ ఫెలోషిప్‌, నేషనల్‌ టాప్‌క్లాస్‌ స్కాలర్‌షిప్‌ల నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.
  2. ప్రీ-మెట్రిక్‌, పోస్ట్‌-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ మొత్తాలను తక్షణం విడుదలచేయాలని రాష్ట్రాలకు సూచించింది. నిధుల కొరత ఉన్నట్లయితే సత్వరం ప్రతిపాదనలు పంపాలని కోరింది.
  3. నేషనల్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌కు సంబంధించి హైకమిషన్ల ద్వారా అందిన విదేశీ విద్యార్థుల అభ్యర్థనలను ప్రాధాన్యం ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశాలు జారీ
  4. యూనిసెఫ్‌ సహకారంతో ట్రైఫెడ్‌ (TRIFED) నిర్వహించిన వెబినార్‌లో వన్‌ధన్‌ వికాస్‌ కేంద్రాల సభ్యులకు కోవిడ్‌-19, ఇతర ఆరోగ్య సమస్యలమీద అవగాహన కల్పించారు.
  5. గిరిజన వ్యవహారాలశాఖ ఆర్థిక సహాయం పొందిన అనేక స్వచ్ఛంద సంస్థలు ఉపశమన చర్యలలో పాలుపంచుకుంటున్నాయి. ఈ మేరకు గిరిజనులకు రేషన్‌, ఆహారం పంపిణీతోపాటు సంచార వైద్యశాలలద్వారా ఆరోగ్య సంరక్షణ సేవలు కూడా అందిస్తున్నాయి. ఈ సేవల గురించి మంత్రిత్వశాఖ స్వచ్ఛంద సంస్థల విభాగం ఫేస్‌బుక్‌ పేజీలో వివరాలు నమోదు చేస్తోంది.
  6. మంత్రిత్వశాఖలో నమోదైన అన్ని స్వచ్ఛంద సంస్థలకూ 2019-20 ఆర్థిక సంవత్సర నిధులు విడుదలయ్యాయి. ఏవైనా సమస్యలుంటే స్వచ్ఛంద సంస్థల పోర్టల్‌ద్వారా పరిష్కారం కోరే అవకాశం కల్పించింది.

*****


(Release ID: 1616673) Visitor Counter : 251