PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
11 MAY 2020 6:15PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- ఇప్పటిదాకా 67,152 కోవిడ్-19 కేసులకుగాను 20,917 మందికి నయంకాగా- కోలుకున్నవారి శాతం 31.15కు చేరింది.
- నిన్నటినుంచి దేశవ్యాప్తంగా 4,213 కొత్త కేసులు నమోదయ్యాయి.
- వైద్యనిపుణులు, పారామెడికల్ సిబ్బంది ప్రయాణానికి ఆటంకాలు ఉండరాదని, అన్ని ప్రైవేట్ క్లినిక్‌లు, నర్సింగ్‌హోమ్‌లు, లేబొరేటరీలు తెరిచేలా చూడాలని రాష్ట్రాలన్నిటికీ దేశీయాంగ శాఖ సూచన.
- వలస కార్మికులను సత్వరం తరలించేలా మరిన్ని “శ్రామిక్ స్పెషల్” రైళ్లను నడపం కోసం రైల్వేశాఖకు రాష్ట్రాలు సహకరించాలని కోరిన కేంద్రం; ఇప్పటిదాకా పలు రాష్ట్రాల నుంచి నడిచిన 468 రైళ్లు.
- రేపటినుంచి క్రమక్రమంగా ప్రయాణికుల రైళ్లను నడపనున్న రైల్వేశాఖ
కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తాజా సమాచారం
దేశంలో మొత్తం 20,917మందికి వ్యాధి నయంకాగా, కోలుకున్నవారి శాతం 31.15కు చేరింది. ఇక దేశంలో మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 67,152కు పెరిగి నేపథ్యంలో నిన్నటి నుంచి 4,213 కేసులు కొత్తగా నమోదయ్యాయి. కాగా, వివిధ రకాల వైద్య నిపుణులు అందిస్తున్న సేవలను డాక్టర్ హర్షవర్ధన్ ప్రశంసించారు. కోవిడ్-19పై పోరాటంలో... ప్రత్యేకించి గడచిన మూడు నెలలుగా వారి అకుంఠిత దీక్ష నిరుపమానమని కొనియాడారు. ఈ సేవలందిస్తున్న డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు తదితరులను అంటరానివారిలా చూడవద్దని మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు వారందిస్తున్న సేవలు అమూల్యమని, వారి కృషిని గౌరవించాలని ఉద్బోధించారు. కోవిడ్-19పై పోరాటంలో డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలందరినీ మనం గౌరవించడంతోపాటు అన్నివిధాలా మద్దతిస్తూ సహకరించాలని సూచించారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623078
ప్రతినిరోధకాన్ని గుర్తించేందుకు శక్తిమంతమైన దేశీయ ఐజిజి ఎలిసా పరీక్ష పద్ధతిని రూపొందించిన ఐసీఎంఆర్-ఎన్‌ఐవి, పుణె; కోవిడ్-19పై నిఘాలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది: డాక్టర్ హర్షవర్ధన్
కోవిడ్-19కు ప్రతినిరోధకం కనుగొనే దిశగా భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) పరిధిలోని పుణెలోగల నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్(ఎన్‌ఐవి) ముందంజ వేసింది. ఈ మేరకు “కోవిడ్ కవచ ఎలిసా” పేరిట దేశీయ ‘ఐజిజి ఎలిసా’ పరీక్ష పద్ధతిని రూపొందించడమేగాక ఇది ప్రామాణికమని ప్రకటించింది. ఈ మేరకు దేశంలోని ప్రయోగశాల నిర్ధారిత కోవిడ్ రోగులనుంచి ఈ వ్యాధికారకమైన ‘సార్స్-కరోనావైరస్-2’(SARS-CoV-2)ను ఎన్‌ఐవిలోని శాస్త్రవేత్తల బృందం విజయవంతంగా వేరుపరచింది. దీంతో ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించే పరీక్ష పద్ధతిని దేశీయంగా అభివృద్ధి చేసుకునే అవకాశం లభించింది. ఈ వైరస్ సోకడాన్ని వైద్యపరంగా నిర్ధారించే ‘ఆర్టీ-పీసీఆర్’ ముందువరుస విధానం అయినప్పటికీ, వ్యాధి సంక్రమణకు గురయ్యే జనాభా నిష్పత్తిని అర్థం చేసుకోవడానికి, వైరస్‌పై నిఘా కోసం శక్తిమంతమైన ప్రతినిరోధకాల గుర్తింపు పరీక్షలు కీలకం.
కోవిడ్-19 నిర్వహణపై పరిస్థితులను సమీక్షించేందుకు మండోలి కోవిడ్ సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన డాక్టర్ హర్షవర్ధన్
న్యూఢిల్లీలోని మండోలి జైలులోగల కోవిడ్ సంరక్షణ కేంద్రాన్ని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సందర్శించి, కోవిడ్-19 నిర్వహణ స్థితిగతులను సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్పత్రుల సన్నద్ధత అవసరాలు పెరుగుతున్న దృష్ట్యా మండోలిలోని పోలీసు నివాస ప్రాంగణాన్ని కోవిడ్ సంరక్షణ కేంద్రంగా మార్చారు. ఇక్కడ స్వల్ప/అతిస్వల్ప లక్షణాలున్న కోవిడ్-19 రోగుల కోసం తగినన్ని ఏకాంత గదులు, పడకలు ఉన్నాయి. కాగా- వ్యక్తిగత పరిశుభ్రత, శ్వాస సంబంధ పద్ధతులతోపాటు సామాజిక దూరం పాటింపు వంటివి కోవిడ్-19పై పోరాటంలో మనకు శ్రీరామరక్షగా నిలుస్తాయని డాక్టర్ హర్షవర్ధన్ ఈ సందర్భంగా అన్నారు.
వైద్యనిపుణులు, పారామెడికల్ సిబ్బంది రాకపోకలకు ఆటంకాలుండరాదు; ప్రైవేట్ క్లినిక్‌లు, నర్సింగ్‌హోమ్‌లు, లేబొరేటరీలు తెరిపించాలి; కోవిడ్-కోవిడేతర అత్యవసర పరిస్థితుల నిర్వహణకు ఇది తప్పనిసరి: రాష్ట్రాలకు దేశీయాంగ శాఖ సూచన.
కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి 2020 మే 10వ తేదీన సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో వైద్య నిపుణులు, పారామెడికల్ సిబ్బంది రాకపోకలపై ఆంక్షలు విధించిన అంశం ప్రస్తావనకొచ్చింది. ఈ నేపథ్యంలో అమూల్యమైన మానవ ప్రాణరక్షణ, ప్రజారోగ్య అవసరాల దృష్ట్యా వైద్య నిపుణులు, సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు ఉండరాదని దేశీయాంగ శాఖ అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలి ప్రాంతాల ప్రభుత్వాలకు సూచించింది. వారి రాకపోకలకు ఆటంకాలు కల్పిస్తే కోవిడ్, కోవిడేతర వ్యాధులకు వైద్యసేవల్లో తీవ్ర అంతరాయం తప్పదని స్పష్టం చేసింది.
వలస కార్మికులను సత్వరం స్వస్థలాలకు తరలించేలా మరిన్ని “శ్రామిక్ స్పెషల్” రైళ్లను నడపడంకోసం రైల్వేశాఖకు సహకరించాలని రాష్ట్రాలను కోరిన కేంద్రం
కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి 2020 మే 10వ తేదీన దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా వలస కార్మికులను బస్సులు, ప్రత్యేక రైళ్లలో తరలించేందుకు ఆయా రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల సహకారంపై సమీక్షించారు. ఈ నేపథ్యంలో వలసకార్మికులు రోడ్లపైన, రైలుపట్టాల మీదుగా స్వస్థలాలు నడిచి వెళ్లే దుస్థితిని తప్పించాలని దేశీయాంగ శాఖ అన్ని రాష్ట్రాలనూ కోరింది. వారి ప్రయాణం కోసం ‘శ్రామిక్ ప్రత్యేక’ రైళ్లను, బస్సులను అనుమతించిన సంగతిని గుర్తుచేసింది. అందువల్ల వారంతా సదరు రైళ్లు, బస్సులలో ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేయాలని, అప్పటిదాకా వారికి సమీపంలోని సహాయ శిబిరాల్లో ఆశ్రయం కల్పించాలని సూచించింది.
ప్రయాణిక రైళ్లను 2020 మే 12నుంచి పాక్షికంగా పునరుద్ధరించనున్న రైల్వేశాఖ
భారత రైల్వేశాఖ 2020 మే 12నుంచి ప్రయాణికుల రైళ్లను పాక్షికంగా దశలవారీగా పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు తొలుత 15 జతల (30 తిరుగు ప్రయాణాలతో) రైళ్లు నడుస్తాయి. వలసకార్మికులుసహా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని తరలించేందుకు మే 1 నుంచి నడుపుతున్న ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లకు అదనంగా వీటిని నడుపుతారు. అయితే, అన్ని మెయిల్/ఎక్స్‌ప్రెస్, పాసింజర్, సబర్బన్ రైళ్లసేవల నిలిపివేత తదుపరి నిర్ణయం ప్రకటించేదాకా కొనసాగుతుంది. కాగా, ప్రస్తుతం పునరుద్ధరించబోయేవన్నీ కేవలం ఏసీ ప్రత్యేక రైళ్లు మాత్రమే. వీటిలో ప్రయాణం కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ద్వారా టికెట్లు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ రైల్వే స్టేషన్‌లోనూ బుకింగ్ కౌంటర్లవద్ద టికెట్లు పొందే అవకాశం లేదు. అలాగే ఏజెంట్లద్వారా టికెట్ల బుకింగ్‌కు అనుమతి లేదు. ప్రయాణానికి ముందు రిజర్వేషన్ గరిష్ఠ వ్యవధి 7 రోజులు మాత్రమే. రిజర్వేషన్‌రహిత టికెట్లు ఇవ్వబడవు. చార్జీలలో కేటరింగ్ రుసుములేవీ ఉండవు. ప్రయాణించే ప్రతి ఒక్కరికీ కోవిడ్ పరీక్ష తప్పనిసరిగా నిర్వహించి, ఏ లక్షణాలూ లేనివారినే మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.
15 జతల ప్రత్యేక రైళ్ల సమయాలను ప్రకటించిన రైల్వేశాఖ
దేశంలో రైళ్ల రాకపోకలను 2020 మే 12 నుంచి పాక్షికంగా, దశలవారీగా పునరుద్ధరించాలని రైల్వే మంత్రిత్వశాఖ నిర్ణయించింది. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ, దేశీయాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖతో సంప్రదింపుల అనంతరం ఈ మేరకు ప్రకటించింది.
దేశవ్యాప్తంగా 2020 మే 11దాకా 468 ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లను నడిపిన రైల్వేశాఖ
భారత రైల్వేశాఖ 2020 మే 11నాటికి దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య 468 ‘శ్రామిక్ ప్రత్యేక’ రైళ్లను నడిపింది. వీటిలో 363 రైళ్లు ఇప్పటికే గమ్యస్థానాలు చేరగా, మరో 105 రైళ్లు మార్గమధ్యంలో ఉన్నాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు చేరిన రైళ్ల సంఖ్య ఇలా ఉంది... ఆంధ్రప్రదేశ్ (1), బీహార్ (100), హిమాచల్ ప్రదేశ్ (1), జార్ఖండ్ (22), మధ్యప్రదేశ్ (30), మహారాష్ట్ర (3), ఒడిశా (25), రాజస్థాన్ (4), తెలంగాణ (2), ఉత్తర ప్రదేశ్ (172), పశ్చిమ బెంగాల్ (2), తమిళనాడు (1) వంతున ఉన్నాయి. ఈ శ్రామిక్ స్పెషల్ రైళ్లలో గరిష్ఠంగా 1200మంది సామాజిక దూరం నిబంధనను పాటిస్తూ ప్రయాణించవచ్చు. రైలు ఎక్కే ముందు ప్రయాణికులకు సముచిత ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. ప్రయాణ సమయంలో వారికి ఉచిత భోజనం, నీరు అందజేస్తారు.
వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు ఉద్దేశించిన ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్ల నిర్వహణపై రాష్ట్రాల నోడల్ అధికారులతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా దేశీయాంగ, రైల్వేశాఖల సమీక్ష
దేశవ్యాప్తంగా నడుపుతున్న ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లకు సంబంధించి దేశీయాంగ, రైల్వేశాఖలు ఇవాళ దృశ్య౦-శ్రవణ మాధ్యమంద్వారా ఆయా రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాయి. ఈ మేరకు పలు రాష్ట్రాలనుంచి నిన్న బయల్దేరిన 101 రైళ్లుసహా 450కిపైగా ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలు చర్చకు రాగా, వాటికి పరిష్కారాన్వేషణ సాగింది. అలాగే వలసకార్మికుల తరలింపు నిమిత్తం తగిన సంఖ్యలో రైళ్లు నడుస్తాయని, ఈ మేరకు వారికి భరోసా ఇవ్వాలని నోడల్ అధికారులకు దేశీయాంగ, రైల్వేశాఖల అధికారులు సూచించారు. తదనుగుణంగా రాబోయే కొద్ది వారాలపాటు రోజూ 100కుపైగా రైళ్లను నడిపించే అవకాశం ఉందని తెలిపారు.
రైళ్లలో వ్యక్తుల ప్రయాణంపై ప్రామాణిక నిర్వహణ విధివిధానాలను ప్రకటించిన దేశీయాంగ శాఖ
రైళ్లలో వ్యక్తుల ప్రయాణానికి సంబంధించి దేశీయాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రామాణిక నిర్వహణ విధివిధానాలను ప్రకటించింది. ఈ మేరకు ప్రయాణికుల రాకపోకలకోసం నిర్ధారిత టికెట్ ఉన్న వారిని మాత్రమే స్టేషన్లలోకి అనుమతిస్తారు. అలాగే ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్ష తప్పనిసరి. ఆ తర్వాత ఏ లక్షణాలూ లేనివారిని మాత్రమే రైలు ఎక్కనిస్తారు. ప్రయాణ సమయంలో మార్గమధ్యంలోని రైల్వే స్టేషన్లవద్ద నిర్దేశిత ఆరోగ్య/పరిశుభ్రత నిబంధనలను, సామాజిక దూరాన్ని తప్పక పాటించాలి.
దిగ్బంధం తర్వాత తయారీరంగ పరిశ్రమల పునఃప్రారంభంపై ‘జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ’ (దేశీయాంగ శాఖ) మార్గదర్శకాలు
దిగ్బంధం ముగిసిన తర్వాత తయారీరంగ పరిశ్రమల పునఃప్రారంభంపై ‘విపత్తుల నిర్వహణ చట్టం-2005’ కింద దేశీయాంగ మంత్రిత్వశాఖ సమగ్ర మార్గదర్శకాలను జారీచేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంబంధిత ప్రధాన ప్రమాద ముప్పు విభాగాల విపత్తు నిర్వహణ ప్రణాళిక సిద్ధం చేసుకోవడమేగాక దాని అమలు సన్నద్ధతను కూడా నిర్ధారించుకోవాలని సూచించింది. దీంతోపాటు అన్ని జిల్లాల్లోనూ పారిశ్రామిక యూనిట్ల సురక్షిత పునఃప్రారంభం కోసం విపత్తు నిర్వహణ ప్రణాళికలు ప్రామాణిక నిర్వహణ ప్రక్రియలకు అనుగుణంగా ఉండేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని తెలిపింది.
విశాఖ గ్యాస్ లీక్ ఉదంతంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పాటు దిశగా అత్యవసర రసాయనాలను రవాణా చేసిన భారత వాయుసేన విమానాలు
విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలోగల స్టైరిన్ మోనోమర్ స్టోరేజ్ ట్యాంకునుంచి విషవాయువు లీకేజీ పరిణామాలను ప్రభావవంతంగా నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోంది. దీంతోపాటు కోవిడ్ ప్రపంచ మహమ్మారి అత్యవసర నియంత్రణ చర్యల దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామిక-వాణిజ్యశాఖ విజ్ఞప్తి మేరకు భారత వాయుసేనకు చెందిన విమానాలు 8.3 టన్నుల అత్యవసర రసాయనాలను విశాఖకు చేరవేశాయి. కాగా, కోవిడ్-19 నిరోధం, నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు, తోడ్పాటునిస్తున్న ఇతర సంస్థలకు భారత వాయుసేన అత్యవసర సరఫరాలను చేరవేస్తూ తనవంతు పాత్రను అద్వితీయంగా పోషిస్తోంది. ఈ మేరకు 2020 మార్చి 25న ప్రారంభించిన కార్యకలాపాల్లో ఇప్పటిదాకా 703 టన్నుల సామగ్రిని రవాణా చేసింది.
భారత నావికాదళ యుద్ధనౌక ‘జలాశ్వ’లో మాల్దీవ్స్ నుంచి కోచ్చి చేరిన భారతీయులు
‘ఆపరేషన్ సముద్ర సేతు’ కోసం నియుక్తమైన భారత నావికాదళ యుద్ధనౌక ‘జలాశ్వ’ మాల్దీవ్స్ నుంచి 698మంది భారతీయులతో మే 10వ తేదీన ఉదయం 10 గంటలకు కేరళలోని కోచ్చి రేవుకు చేరింది. వీరిలో వృద్ధులు, మహిళలు, పిల్లలు ఉన్నారు.
ఆపరేషన్ సముద్ర సేతు–మాలేనుంచి భారతీయుతో బయల్దేరిన ఐఎన్‌ఎస్ మగర్
మాల్దీవ్స్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు ఆ దేశ రాజధాని మాలే వెళ్లిన భారత నావికాదళ నౌక ఐఎన్‌ఎస్ మగర్, వారిని ఎక్కించుకుని తిరిగి బయల్దేరింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే 'వందే భారత్ మిషన్'లో భాగంగా భారత నావికాదళం 'ఆపరేషన్ సముద్ర సేతు'ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలి విడతగా 698 మంది భారతీయులను ఐఎన్‌ఎస్ జలాశ్వ 2020 మే 10న స్వదేశం చేర్చింది.
వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ వేదిక ఈ-నామ్‌తో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 177 కొత్త మండీల అనుసంధానం
దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలను బలోపేతం చేయడంతోపాటు రైతులు తమ పంటను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా విక్రయించే వీలు కల్పిస్తూ కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమశాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఇవాళ 177 కొత్త మండీలను జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్)తో అనుసంధానించారు. ఈ మేరకు గుజరాత్ (17), హర్యానా (26), జమ్ముకశ్మీర్ (1), కేరళ (5), మహారాష్ట్ర (54), ఒడిసా (15), పంజాబ్ (17), రాజస్థాన్ (25), తమిళనాడు (13), పశ్చిమ బెంగాల్ (1) రాష్ట్రాలకు చెందిన మండీలు విలీనమయ్యాయి. దీంతో దేశంలోని ఈ-నామ్ మండీల సంఖ్య 962కు చేరింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622976
దిగ్బంధం ఉన్నా స్థిరంగా పప్పుదినుసులు, నూనెగింజల కొనుగోళ్లు
దేశంలోని 9 రాష్ట్రాల నుంచి 2.74 లక్షల టన్నుల శనగపప్పును ఇప్పటిదాకా ప్రభుత్వం సేకరించింది. అలాగే 5 రాష్ట్రాల నుంచి 3.40 లక్షల టన్నుల ఆవాలను కొనుగోలు చేయగా, తెలంగాణలో 1,700 టన్నుల పొద్దుతిరుగుడు పంటను సేకరించారు. మరో 8 రాష్ట్రాల నుంచి 1.71 లక్షల టన్నుల కందిపప్పు సేకరణ పూర్తయింది. ఇక వేసవి పంటల సాగుకు సంబంధించి... 34.87 లక్షల హెక్టార్లలో వరి వేయగా, నిరుడు వరి విస్తీర్ణం 25.29 లక్షల హెక్టార్లు మాత్రమే కావడం గమనార్హం. అలాగే నిరుడు 5.92 లక్షల హెక్టార్లకు పరిమితమైన పప్పుదినుసుల సాగు ఈసారి 10.35 లక్షల హెక్టార్లకు పెరిగింది. అదేవిధంగా పోయిన సంవత్సరం ముతకధాన్యాల సాగును 6.20 లక్షల హెక్టార్లలో ప్రారంభించగా, ఈ ఏడాది సదరు విస్తీర్ణం 9.57 లక్షల హెక్టార్లుగా నమోదైంది. ఇక నూనెగింజల సాగుకు సంబంధించి నిరుడు 7.09 లక్షల హెక్టార్ల వేయగా, ఈసారి 9.17 లక్షల హెక్టార్లలో వేశారు. కాగా, 2020-21 రబీ మార్కెట్ సీజన్‌లో 241.36 లక్షల టన్నుల గోధుమలు భారత ఆహార సంస్థ గిడ్డంగులకు రాగా, ఇందులో 233.51 లక్షల టన్నులు స్వయంగా కొనుగోలు చేసినవే.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622738
జాతీయ సాంకేతికవిజ్ఞాన దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలకు ప్రధాని నివాళి
జనజీవనంలో సానుకూల వైవిధ్యం దిశగా శాస్త్ర-సాంకేతిక విజ్ఞానాలను సద్వినియోగం చేస్తున్న దేశంలోని శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. ఇవాళ జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ద్వారా సందేశమిచ్చారు. “కోవిడ్-19 నుంచి ప్రపంచాన్ని విముక్తం చేసేందుకు సాగుతున్న కృషికి నేడు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో తోడ్పడుతోంది. తదనుగుణంగా కరోనా వైరస్ నిర్మూలన కోసం అహర్నిశలూ పరిశోధనలు-ఆవిష్కరణలో నిమగ్నమైన అందరికీ వందనం చేస్తున్నాను. మెరుగైన, ఆరోగ్యకర భూగోళం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మన కృషికి మేళవిద్దాం” అని అందులో పేర్కొన్నారు.
జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవం సందర్భంగా డీఆర్‌డీవోలో వేడుకలు; సాంకేతికత నికర ఎగుమతిదారుగా భారత్ ఎదగాలని రక్షణమంత్రి పిలుపు
జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవం సందర్భంగా రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) నిర్వహించిన వేడుకలలో భాగంగా రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ శాస్త్రవేత్తలనుద్దేశించి ప్రసంగించారు. భారతదేశాన్ని సాంకేతిక పరిజ్ఞానశక్తిగా తీర్చిదిద్దడానికి కృషిచేయాల్సిందిగా దేశంలోని నిపుణుల సమూహానికి ఆయన విజ్ఞప్తి చేశారు. కోవిడ్-19 విసిరిన సవాలును డీఆర్‌డీవో అత్యాధునిక సాంకేతికతతో ఎదుర్కొంటున్నదని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ అదృశ్య శత్రువుతో పోరాటంపై పరిష్కారాల దిశగా భారత రక్షణ బలగాలు, పరిశోధన-అభివృద్ధి సంస్థల కృషి ఎనలేనిదని ఆయన కొనియాడారు.
శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానాలతో ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం దిశగా పురోగమిస్తున్న భారత్: డాక్టర్ హర్షవర్ధన్
కోవిడ్-19పై భారత్ పోరాటం కృతనిశ్చయంతో, స్థిరంగా వేగంతో సాగుతున్నదని కేంద్ర శాస్త్ర-సాంకేతిక-భూవిజ్ఞానశాస్త్రాల, ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవం సందర్భంగా “రీ స్టార్ట్-రీబూట్ ది ఎకానమీ త్రూ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ట్రాన్స్‌లేషన్స్” పేరిట నిర్వహించిన డిజిటల్ సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు.
కోవిడ్-19 నేపథ్యంలో విద్యార్థులు, బోధకులు, సంస్థలకుగల సందేహాలు, సమస్యలు, ఇతర విద్యాసంబంధ అంశాల పర్యవేక్షణకు యూజీసీ చర్యలు
దేశంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా పరీక్షలు, విద్యా కేలండర్‌కు సంబంధించి విశ్వవిద్యాలయ అనుమతుల సంఘం (యూజీసీ) 2020 ఏప్రిల్ 29న మార్గదర్శకాలు జారీచేసింది. వాటికి అనుగుణంగా తమతమ భాగస్వాముల భద్రత, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విద్యా కార్యకలాపాల ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించింది. అదే సమయంలో సంబంధితులందరి ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే పరీక్షలు, ఇతర విద్యాసంబంధ అంశాలపై విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అన్ని విశ్వవిద్యాలయాలూ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చింది.
‘కాగ్నిటివ్ ఎమోషనల్ రిహాబిలిటేషన్ సర్వీసెస్’ కింద ఒడిసా విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం ఒడిసా కేంద్రీయ విశ్వవిద్యాలయం ‘భరోసా’ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించిన హెచ్‌ఆర్‌డి
కోవిడ్-19 మహమ్మారి ప్రభావంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థి లోకం కోసం కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ ఇవాళ ఒడిసా కేంద్రీయ విశ్వవిద్యాలయం ‘భరోసా’ పేరిట ప్రవేశపెట్టిన సహాయకేంద్రం నంబరు 08046801010ను దృశ్యమాధ్యమ మార్గంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోవిడ్-19 విజృంభణ నేపథ్యంలో దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నదని గుర్తుచేశారు.
వ్యాక్సిన్లు, పరీక్షలు, చికిత్స విధానాలు, ఇతర సాంకేతికతల సంబంధిత 70 ప్రతిపాదనలకు నిధులపై డీబీటీ-బిఐఆర్ఏసీ కోవిడ్ -19 రీసెర్చ్ కన్సార్షియం సిఫారసు
‘సార్స్-కరోనా వైరస్-2’ (SARS-CoV-2) నిర్మూలన కోసం సత్వర, సురక్షిత, ప్రభావవంతమైన జీవవైవిధ్య పరిష్కారాలు సూచించాలంటూ బయో టెక్నాలజీ విభాగం, బయో టెక్నాలజీ పరిశ్రామిక పరిశోధనల సహాయ మండలి (BIRAC) దేశంలోని వివిధ పరిశోధన సంస్థలను, శాస్త్రవేత్తలను కోరింది. ఈ మేరకు కోవిడ్-19 కన్సార్షియానికి దరఖాస్తులు పంపాలని కోరింది. తదనుగుణంగా అందిన పరిష్కారాలపై బహుళదశల పరిశీలన తర్వాత పరీక్షలు, వ్యాక్సిన్లు, విశిష్ట చికిత్స విధానాలు, మందులకు సంబంధించి 70 ప్రతిపాదనలను డీబీటీ-బిరాక్ ఎంపికచేశాయి. ఈ ప్రతిపాదనల సంబంధిత పరిశోధనలకు ఆర్థిక సహాయం అందించవచ్చునని సిఫారసు చేశాయి. ఈ ప్రతిపాదనలలో వ్యాక్సిన్లపై 10, పరీక్షలపై 34, చికిత్సలపై 10, మందుల భిన్న వినియోగానికి సంబంధించి 2 వంతున అందగా, మరో 14 ప్రతిపాదనలను వైరస్ నిరోధంపై ముందు జాగ్రత్తలకు సంబంధించినవిగా వర్గీకరించారు.
కరోనా వైరస్ నిరోధంపై ప్రచారంలో కేవీఐసీ కుంభకారుల వినూత్న విధానం
కోవిడ్-19పై పోరాటంలో ప్రస్తుతం ప్రతి స్వల్పస్థాయి చొరవ కూడా ప్రశంసనీయమే. ఆ మేరకు రాజస్థాన్‌లోని బరన్ జిల్లా కిషన్‌గంజ్ వాసులైన కేవీఐసీ కుంభకారులు (కుమ్మరులు) అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. తదనుగుణంగా కరోనా వైరస్ నిరోధంపై తాము తయారుచేసే మట్టిపాత్రలు... ప్రత్యేకించి కుండలపై ఒక సందేశాన్ని ఇమిడ్చి అందర్నీ ఆకట్టుకుంటున్నారు.
‘దేఖో అప్నాదేశ్’ సిరీస్‌లో భాగంగా “ఎక్స్‌ప్లోరింగ్ రివర్ నీల” పేరిట 17వ వెబినార్ నిర్వహించిన భారత పర్యాటక మంత్రిత్వ శాఖ
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622831
కోవిడ్-19పై పోరు దిశగా సమీకృత కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, సీసీటీవీల ఏర్పాటుద్వారా పటిష్ఠ చర్యలు తీసుకున్న డెహ్రాడూన్ స్మార్ట్ సిటీ
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622953
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- హిమాచల్ ప్రదేశ్: దేశంలోని ఇతర ప్రాంతాల్లో చిక్కుకుని రాష్ట్రానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న హిమాచల్ ప్రదేశ్ ప్రజలందరూ పూర్తి వైద్యపరీక్షల తర్వాతే తమ స్వస్థలాలకు అనుమతించబడతారు. ఆ మేరకు వారంతా నిర్బంధ వైద్యపర్యవేక్షణలో ఉండటం తప్పనిసరి. ఈ నేపథ్యంలో హిమాచల్ వాసులను త్వరగా తిరిగి తీసుకురావడంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నోడల్ అధికారులతో సన్నిహిత సంబంధాలు నెరపాల్సిందిగా ముఖ్యమంత్రి తమ నోడల్ అధికారులను కోరారు. కాగా, అత్యంత దుర్బలవర్గాలైన విద్యార్థులను ముందుగా తీసుకురావడానికి ప్రాధాన్యమిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
- పంజాబ్: రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రభుత్వ విధుల నిర్వహణలో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబసభ్యులు/చట్టబద్ధ వారసులకు రూ.50 లక్షల వంతున నష్టపరిహారం మంజూరుకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ సమగ్ర మార్గదర్శకాలను జారీచేసింది. ఈ పరిహారం కోవిడ్-19 పరిస్థితులకు మాత్రమే... 2020 ఏప్రిల్ 1నుంచి 31 జూలై వరకు ఇది అమలులో ఉంటుందని, ఆ తరువాత సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.
- హర్యానా: రాష్ట్రంలోని కూరగాయల విక్రేతలు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసు-మీడియా సిబ్బంది, ఫార్మసిస్ట్‌లు, డిపోల నిర్వాహకులు, పారిశుద్ధ్య కార్మికులకు యాదృచ్ఛిక కోవిడ్ నమూనా పరీక్షల నిర్వహణకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. కాగా, కోవిడ్ సంరక్షణ కేంద్రాలు, ప్రత్యేక ఆస్పత్రులలో 8,751 ఏకాంత చికిత్స పడకలు అందుబాటులో ఉన్నాయి.
- కేరళ: కేరళ-న్యూఢిల్లీ మధ్య ఆరు రాజధాని రైళ్లను మంగళవారం నుంచి వారంలోగా రైల్వేశాఖ నడపనుంది. ఈ రైళ్లు కేవలం కోళికోడ్, ఎర్నాకుళం స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి. అంతేగాక ఇవి కొంకణ్ మార్గం ద్వారా నడుస్తాయి. కాగా, పాస్ పొందకుండా కేరళకు వచ్చేవారిని తమిళనాడు సరిహద్దులో నిలిపివేసే విధంగా రెండు రాష్ట్రాల డీజీపీల మధ్య అంగీకారం కుదిరింది. ఇక వందే భారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి కోచ్చికి, బహ్రెయిన్ నుంచి కోళికోడ్‌కు రెండు విమానాలు ఈ రాత్రి చేరుకోనున్నాయి. మరోవైపు దిగ్బంధం తర్వాత మద్యం దుకాణాలను తెరిస్తే రద్దీ నియంత్రణ కోసం ఆన్‌లైన్ క్యూ సదుపాయం ఏర్పాటుకు కేరళ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సిద్ధమవుతోంది.
- తమిళనాడు: ఇతర రాష్ట్రాల వలస కార్మికులందరినీ వారంలోగా స్వస్థలాలకు పంపుతామని తమిళనాడు ముఖ్యమంత్రి ప్రకటించారు. కాగా, ఇప్పటివరకూ 9,000 మందికిపైగా కార్మికులను ప్రత్యేక రైళ్లలో పంపారు. రాష్ట్రంలో 47 రోజుల తర్వాత చిల్లర దుకాణాలు అధిక సంఖ్యలో తెరవడంతో రోడ్లపై వాహనాల రద్దీ పెరిగింది. కోవిడ్-19పై సమర్థ చికిత్స కోసం అంతర్జాతీయ కృషి దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సాయంతో చేపట్టిన వినూత్న ‘సంఘీభావ ప్రయోగం’ కోసం చెన్నైలోని రెండు ప్రభుత్వ ఆసుపత్రులు ఎంపికయ్యాయి. కోవిడ్ వ్యాప్తి కారణంగా కోయంబేడు మార్కెట్ మూసివేసిన నేపథ్యంలో తిరుమళిసైలో కొత్త టోకు కూరగాయల-పండ్ల మార్కెట్ ఇవాళ ప్రారంభమైంది. కాగా, రాష్ట్రంలో మొత్తం కేసులు: 7,204, యాక్టివ్ కేసులు: 5,195, మరణాలు: 47, డిశ్చార్జ్ అయినవారు: 1,959 మంది. చెన్నైలో యాక్టివ్ కేసులు 3,839.
- కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ 10 కొత్త కేసులు నమోదవగా, వీటిలో దావణగేరె 3, బీదర్, బాగల్‌కోట్‌లలో రెండేసి, కల్బుర్గి, హవేరి, విజయపురలలో ఒక్కొక్కటి వంతున ఉన్నాయి. మొత్తం కేసులు: 858, మరణాలు: 31; కోలుకున్నవారు: 422 మంది. కాగా, వందే భారత్ మిషన్‌లో భాగంగా లండన్‌లో చిక్కుకుపోయిన 200 మంది కన్నడిగులు ఈ ఉదయం ఎయిరిండియా ప్రత్యేక విమానంలో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. వీరందర్నీ ప్రభుత్వం వెంటనే నిర్బంధ వైద్య పర్యవేక్షణ కేంద్రాలకు తరలించింది. మరోవైపు కోవిడ్ సంక్షోభం నడుమ పెట్టుబడులను ఆకర్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసింది.
- ఆంధ్రప్రదేశ్: కోవిడ్-19 నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం విక్రయంపై దాఖలైన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు ఇవాళ దృశ్య-మాధ్యమంద్వారా విచారించింది; అనంతరం విచారణను శుక్రవారానికి వాయిదావేసింది. మరోవైపు నిర్ధారిత కేసులు అధికంగా ఉన్న కర్నూలు జిల్లాలో కేంద్ర బృందం రెండోరోజున కూడా పర్యటించింది. రాష్ట్రంలో ఇవాళ 38 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 7,409 నమూనాలను పరీక్షించిన నేపథ్యంలో గడచిన 24 గంటల్లో 73 మంది డిశ్చార్జ్ కాగా, మరణాలేవీ నమోదు కాకపోవడం గమనార్హం. ప్రస్తుతం మొత్తం కేసులు 2,018కి పెరిగాయి. కేసుల సంఖ్యరీత్యా కర్నూలు (575), గుంటూరు (387), కృష్ణా (342) జిల్లాలు ఎప్పటిలాగానే అగ్రస్థానంలో ఉన్నాయి.
- తెలంగాణ: వందే భారత్ మిషన్‌లో భాగంగా అమెరికాలో చిక్కుకున్న 118 మంది భారతీయులు ఇవాళ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. కాగా అబుధాబి నుంచి ఎయిరిండియా విమానంలో మరో బృందం ఈ రాత్రి 9.30 గంటలకు చేరుకుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చే వలస కార్మికుల్లో చాలామందికి కోవిడ్-19 నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో పరీక్షల స్థాయిని ప్రభుత్వం విస్తరించింది. కాగా, దిగ్బంధం ముగిశాక దుకాణాలు, వ్యాపార సంస్థలను అనుమతించిన వ్యవధికన్నా ఎక్కువ సమయం తెరచి ఉంచేందుకు అనుమతించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. కాగా, నిన్నటివరకూ మొత్తం కేసుల సంఖ్య 1,196, యాక్టివ్ కేసులు 415, డిశ్చార్జ్ అయినవారు 751మంది, మరణాలు 30.
- అరుణాచల్ ప్రదేశ్: భారత వైద్యసంఘం అరుణాచల్ శాఖ తోడ్పాటుతో రాష్ట్ర కోవిడ్-19 పరీక్ష సామర్థ్యాన్ని పెంచడంపై ముఖ్యమంత్రి ఇవాళ చర్చించారు.
- అసోం: రాష్ట్ర రాజధాని గువహటిలోని సారుసజై స్టేడియం తరహాలో జోర్హట్‌లోని కజిరంగా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తున్న నిర్బంధ వైద్య పర్యవేక్షణ సదుపాయాలను సమీక్షించడానికి ఆరోగ్య మంత్రి ఆ ప్రదేశాన్ని ఇవాళ సందర్శించారు.
- మణిపూర్: రైళ్లలో రాష్ట్రానికి తిరిగి వచ్చేవారి కోసం హోంశాఖ ప్రామాణిక విధాన ప్రక్రియను జారీచేసింది. తదనుగుణంగా వైద్య పరీక్షల అనంతరం ఆరోగ్యంగా ఉన్నవారికి మాత్రమే ప్రయాణ అనుమతి ఉంటుంది.
- మణిపూర్: మణిపూర్‌లోని జిరిబామ్ స్టేషన్‌కు చేరుకుంటున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రభుత్వ బస్సులద్వారా నిర్బంధ వైద్య పర్యవేక్షణ కేంద్రాలకు తరలిస్తారు.
- మిజోరాం: రాష్ట్రం కోవిడ్-19 రహితం కావడంలో కీలక పాత్ర ప్రజల క్రమశిక్షణదేనని ముఖ్యమంత్రి జొరామ్‌తంగా ఇవాళ ప్రశంసించారు.
- నాగాలాండ్: రాష్ట్రంలోని మోన్ జిల్లాలో, పరిసర ప్రాంతాల్లో ఉద్యానశాఖ సహకారంతో ముమ్మర వ్యవసాయ కార్యకలాపాలు చేపట్టేందుకు డీఆర్‌డీఏ ప్రయత్నాలు చేస్తోంది. కాగా, రాష్ట్రానికి తిరిగివచ్చే వారికోసం మెరీమా గ్రామంలో 545 పడకలు, కె.బాడ్జే కోహిమా గ్రామంలో 254 పడకలతో నిర్బంధ వైద్య పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
- సిక్కిం: రాష్ట్రంలో సిక్కిం ప్రజారోగ్య-భద్రత (కోవిడ్-19) నిబంధనలు-2020 తక్షణ అమలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీని ప్రకారం.. బహిరంగ, పని ప్రదేశాల్లో మాస్కు ధరించనివారికి రూ.300 వంతున జరిమానా విధించే అధికారం అధికారులకు, పోలీసులకు దఖలుపడుతుంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం, సామాజిక దూరం నిబంధన పాటించకపోవడంపైనా కఠినచర్యలుంటాయి.
- త్రిపుర: మహారాష్ట్రలో చిక్కుకుపోయిన త్రిపుర వాసులను తీసుకొచ్చేందుకు ముంబై నుంచి అగర్తలకు ‘శ్రామిక్ స్పెషల్’ రైలు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది; ఇందుకోసం covid19.tripura.gov.inలో ప్రయాణికులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది.
- మహారాష్ట్ర: మహారాష్ట్రలో ఆదివారం 1,278 తాజా కేసులు నమోదయ్యాయి, దీంతో కేసుల సంఖ్య 22,171కి చేరింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 53 వైరస్ సంబంధిత మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 832కు పెరిగింది. రాష్ట్ర రాజధాని ముంబైలో నిన్న మరో 875 మందికి కోవిడ్ -19 నిర్ధారణ కావడంతో మొత్తం కేసులు 13,564కు చేరాయి. అలాగే మరో 19 మంది మరణించడంతో మృతుల సంఖ్య 508కి పెరిగింది. రాష్ట్రంలోని గ్రీన్, ఆరెంజ్ జోన్‌లో దాదాపు 25వేల కంపెనీలు పునఃప్రారంభమయ్యాయని మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ సుభాష్ దేశాయ్ చెప్పారు. ఈ కంపెనీల్లో 6 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. కాగా, ముంబై- థానె-పింప్రి-చించివాడ్ -పుణెలలోని అధికశాతం పరిశ్రమలు రెడ్‌జోన్ పరిధిలో ఉండటంతో తెరుచుకోలేదు.
- గుజరాత్: గుజరాత్‌లో ఇవాళ 398 కొత్త కేసులు, రావడంతో మొత్తం కేసులు 8,195కి చేరాయి. నిన్న 21 మంది మరణించడంతో మృతుల సంఖ్య 493కి పెరిగింది. అందులో 18 ఒక్క అహ్మదాబాద్‌లో సంభవించాయి. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల నుంచి కోలుకున్న 454 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో కోలుకున్న మొత్తం రోగుల సంఖ్య 2545కు చేరింది.
- రాజస్థాన్: రాజస్థాన్‌లో ఇప్పటివరకు నమోదైన 3,940 కేసులలో 2,264 మంది కోలుకోగా 110 మంది మరణించారు. ఈ మధ్యాహ్నం 1 గంటవరకూ 126 కొత్త కేసులు నమోదు కాగా, వీటిలో 46 ఉదయపూర్ నుంచి నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో 22 లక్షలమందికిపైగా కార్మికులు ఉపాధి హామీ పనుల్లో నిమగ్నమై ఉన్నారని ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తెలిపారు.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 172 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 3,650కి చేరింది. ఇండోర్‌లో 77, భోపాల్‌లో 30 కొత్త కేసులు నమోదయ్యాయి, వీరిలో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర డాగాతోపాటు నలుగురు జూనియర్ వైద్యులు కూడా ఉన్నారు.
- గోవా: విదేశాల్లో చిక్కుకుపోయి గోవాకు తిరిగి వచ్చేవారికి వైద్య పరీక్షల్లో కోవిడ్ సోకలేదని నిర్ధారణ అయినప్పటికీ నిర్బంధ వైద్యపర్యవేక్షణను తప్పనిసరి చేసినట్లు ఉత్తర గోవా జిల్లా పాలన యంత్రాంగం ఆదేశించింది. కాగా, నౌకల సిబ్బంది విషయంలో వారి యాజమాన్యాలు ఈ ఖర్చును భరించాల్సి ఉంటుంది. ఇతరులైతే సొంత ఖర్చుతో ఈ పర్యవేక్షణ శిబిరాల్లో ఉండాల్సి ఉంటుంది. కాగా, గోవాకు చెందిన 100 మంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తిరిగి వచ్చేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు.
FACT CHECK



*******
(Release ID: 1623166)
|