రైల్వే మంత్రిత్వ శాఖ

భారతీయ రైల్వేలలో 2020, మే 12వ తేదీనుంచి శ్రేణులవారీగా ప్రయాణీకులకు పాక్షిక సేవలను పునరుద్ధరిస్తారు

15 జతల ప్రత్యేక రైళ్లను (30 రైళ్లు) నడుపుతారు

శ్రామిక్ స్పెషల్స్ కు అదనంగా వీటిని నడుపుతారు

ఇప్పుడు నడుపనున్న ప్రత్యేక రైళ్లలో కేవలం ఎయిర్ కండిషన్డ్ తరగతులు ఉంటాయి. అంటే మొదటి, రెండవ మరియు మూడవ తరగతి ఏసి బోగీలు ఉంటాయి.

ఐ ఆర్ సి టి సి వెబ్ సైట్ ద్వారా కేవలం ఆన్ లైన్ లో ఈ- టికెట్లు ఇస్తారు

గరిష్టంగా 7 రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకోవచ్చు

ప్రయాణీకులు తమ సొంత ఆహరం, మంచి నీరు తెచ్చుకోవడం ప్రోత్సహిస్తారు.

ఉష్ణోగ్రత తదితర పరీక్షల కోసం ప్రయాణీకులు రైల్వే స్టేషన్ కు కనీసం 90 నిముషాల ముందుగా చేరుకోవాలి.

ప్రయాణీకులకు రైలులో ఎలాంటి పక్కబట్టలు, దుప్పట్లు, కర్టెన్లు ఇవ్వబడవు. ప్రయాణీకులు సొంత వాటిని తెచ్చుకోవాలని సూచన

రూఢి అయిన ఈ-టికెట్ ఉన్న ప్రయాణీకులను, వారిని వాహనంలో రైల్వే స్టేషన్ కు తీసుకువచ్చే డ్రైవర్ స్టేషన్ కు వచ్చిపోయేందుకు అనుమతిస్తారు

Posted On: 11 MAY 2020 4:25PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య,  కుటుంబ సంక్షేమ శాఖ మరియు  హోమ్ మంత్రిత్వ శాఖ  రైల్వే  మంత్రిత్వ శాఖ సహకారంతో   భారతీయ రైల్వేలలో 2020, మే 12వ తేదీనుంచి శ్రేణులవారీగా ప్రయాణీకులకు పాక్షిక  సేవలను పునరుద్ధరించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.   15 జతల ప్రత్యేక రైళ్లను  (30 రైళ్లు) నడుపుతారు  రైళ్ల వివరాలను దిగువ ఇచ్చిన లింక్ ద్వారా అనుబంధంలో చూడవచ్చు.  

వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కూలీల కోసం 2020, మే 1వ తేదీ నుంచి నడుపుతున్న
శ్రామిక్ స్పెషల్స్ కు అదనంగా వీటిని నడుపుతారు. మెయిల్ / ఎక్స్ ప్రెస్ రైళ్లు,  సబర్బన్ సర్వీసులతో సహా అన్ని ప్రయాణీకుల రైళ్లు తెఇరిగి ప్రకటించే వరకు  రద్దవుతాయి.  

ఇప్పుడు ప్రారంభిస్తున్న ప్రత్యేక రైళ్లలో కేవలం  ఏ.సి క్లాసులు అంటే మొదటి, రెండవ మరియు మూడవ తరగతి ఏసి బోగీలు ఉంటాయి.  ప్రత్యేక రైళ్ల చార్జీలు సాధారణ కాలపట్టిక ప్రకారం  నడిపే రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్ల మాదిరిగా (క్యాటరింగ్ చార్జీలు లేకుండా) ఉంటాయి.  

కేవలం ఆన్ లైన్  ఈ-టికెటింగ్ ద్వారా ఐ ఆర్ సి టి సి  వెబ్ సైట్ లేక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే టికెట్లను కొనవచ్చు.  ఏ రైల్వే స్టేషన్ లో కూడా రిజర్వేషన్ కౌంటర్లలో  టికెట్లను బుక్ చేయరు.   ఏజెంట్ల ( ఐ ఆర్ సి టి సి ఏజెంట్లు మరియు రైల్వే ఏజెంట్లు) ద్వారా టికెట్ల బుకింగ్ అనుమతించరు.    గరిష్టంగా 7 రోజుల ముందుగా  రిజర్వేషన్ చేసుకోవచ్చు.

కేవలం  రూఢి (కన్ఫర్మ్) అయిన  ఈ-టికెట్లు మాత్రమే బుక్ చేయాలి.  ఆర్ ఏ సి / వెయిటింగ్ లిస్ట్ టికెట్లు మరియు  రైలులో టికెట్ చెకింగ్ సిబ్బంది బుక్ చేయడాన్ని కూడా అనుమతించరు.   కరెంట్ బుకింగ్,  తత్కాల్, ప్రీమియం తత్కాల్ బుకింగ్ కూడా అనుమతించరు.   రిజర్వ్ చేయని టికెట్లు అసలు ఉండవు.  

రైలు చార్జీలో  క్యాటరింగ్ చార్జీలు  కలపడం ఉండదు.    ముందుగా డబ్బు చెల్లించి భోజనం బుక్ చేసుకోవడం,  ఈ-క్యాటరింగ్ కు డబ్బు చెల్లించే వ్యవస్థ పనిచేయదు. అయితే  ప్రయాణీకులు  డబ్బు చెల్లించి ఐ  ఆర్ సి టి సి  నుంచి  కొద్దిగా తినుబండారాలు మరియు  నీళ్ల సీసాలు కొనుక్కోవచ్చు.  ఇందుకు సంబంధించిన సమాచారం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణీకులకు తెలియజేస్తారు.  

ప్రయాణీకులు తమ సొంత ఆహరం, మంచి నీరు తెచ్చుకోవడం ప్రోత్సహిస్తారు.  రైలులో  పొడిగా ఉండే సిద్ధాన్నం మరియు నీళ్ల సీసాలను  ప్రయాణీకులు డబ్బు చెల్లించి కొనవచ్చు.      

ప్రణీకులందరినీ ముందుగా  పరీక్షించి చూసి వ్యాధి లక్షణాలులేని వారిని మాత్రమే రైలు ఎక్కడానికి అనుమతిస్తారు.  

ప్రత్యేక రైళ్లలో ప్రయాణించే వారు  ఈ కింది ముందు జాగ్రత్తలను పాటించాలి :  

ఏ)  కేవలం కన్ఫర్మ్ అయినా టికెట్లు ఉన్న వారిని మాత్రమే రైల్వే స్టేషన్ లోకి అనుమతిస్తారు.  
బి) స్టేషన్ లోకి ప్రవేశించేటప్పుడు మరియు ప్రయాణంలో  ప్రయాణీకులందరూ మాస్కులు ధరించాలి.  
సి)  ఉష్ణోగ్రత తదితర పరీక్షల కోసం  ప్రయాణీకులు రైల్వే స్టేషన్ కు  కనీసం 90 నిముషాల ముందుగా చేరుకోవాలి.
      పరీక్షల ఆరువాత వ్యాధి లక్షణాలులేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.  
డి)  స్టేషన్ లో ,  రైలు ప్రయాణంలో ప్రయాణీకులు భౌతిక దూరం పాటించాలి.
ఇ)   గమ్య స్థానం చేరుకున్న తరువాత ప్రయాణీకులు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం / కేంద్రపాలిత ప్రాంతం నిర్దేశించిన ఆరోగ్య
        మార్గదర్శకాలను తప్పక  పాటించాలి.  

రైలు బయలుదేరడానికి 24 గంటల ముందు ఆన్ లైనులో టికెట్ క్యాన్సల్ చేసుకోవచ్చు.   రైలు బయలుదేరడానికి  24 గంటల కన్నా తక్కువ సమయం ఉంటే  క్యాన్సల్ చేసుకోవడానికి అనుమతించరు.   టికెట్ చార్జీలో 50%  క్యాన్సలేషన్ చార్జీ కింద మినహాయించుకుంటారు.  

ప్రయాణీకులు ఒకరికొకరు ఎదురుపడకుండా రైల్వే స్టేషన్లలో  లోపలికి వెళ్లే,  బయటికి వచ్చే ద్వారాలను వేర్వేరుగా ఏర్పాటు చేయాలని జోనల్ రైల్వేలను ఆదేశించారు.   సామాజిక దూరం పాటించడంతో పాటు  రక్షణకు, భద్రతకు మరియు భద్రతకు సంబంధించిన నియమాలు ఆచరించాలి.  

ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని ప్రయాణీకులందరికీ సూచన.  

ప్రయాణీకులకు రైలులో ఎలాంటి పక్కబట్టలు,  దుప్పట్లు, కర్టెన్లు ఇవ్వబడవు.  ప్రయాణీకులు సొంత వాటిని తెచ్చుకోవాలని సూచన.  ఇందుకోసం ఏ సి కోచ్ లలో ఉష్ణోగ్రతను నియంత్రిస్తారు.  

రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫామ్ పైన ఎలాంటి అమ్మకాలను అనుమతించరు.  రైలు బోగీల వద్దకు వచ్చి అమ్మనివ్వరు.  ప్రయాణీకులు తక్కువ సామానుతో ప్రయాణించాలని సూచన.  

 కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం  రూఢి అయిన ఈ-టికెట్ ఉన్న ప్రయాణీకులను,  వారిని వాహనంలో రైల్వే స్టేషన్ కు తీసుకు వచ్చే డ్రైవర్ స్టేషన్ కు  వచ్చిపోయేందుకు  అనుమతిస్తారు

 



(Release ID: 1623116) Visitor Counter : 255