మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19కు సంబంధించి విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యా సంస్థల సందేహాలు, ఫిర్యాదులు మరియు ఇతర విద్యా విషయాల పర్యవేక్ష‌ణ‌కు యూజీసీ వివిధ చర్యలు

Posted On: 11 MAY 2020 12:14PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని యూజీసీ ఏప్రిల్ 29న పరీక్షలు మరియు అక‌డ‌మిక్‌ క్యాలెండర్‌కు సంబంధించిన‌ ప‌లు మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం అన్ని విశ్వవిద్యాలయాలు తమ విద్యా కార్యకలాపాల్లోని భాగ‌స్వామ్య ప‌క్షాల‌ భద్రత మరియు ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత ప్రజలందరి ఆరోగ్యానికి గ‌రిష్ఠ ప్రాధాన్యత ఇస్తూ ఆయా మార్గదర్శకాలను అవ‌లంభించ‌డం మ‌రియు అమలు చేయాల‌ని సూచించింది. దేశంలో కోవిడ్ -19 మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో నెల‌కొన్న ప‌రిస్థితుల కార‌ణంగా పరీక్షలు మరియు ఇతర విద్యా కార్యకలాపాలకు సంబంధించి విద్యార్థుల‌లో ఏర్ప‌డే మనో వేదనలను పరిష్కరించేందుకు గాను ఒక సెల్‌ ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేయాలని విశ్వవిద్యాలయాలను యూజీసీ కోరింది. ప్ర‌త్యేక‌ సెల్ ఏర్పాటు గురించి విద్యార్థుల‌కు తెలియ‌జేయాల‌ని కూడా సూచించింది. దీనికి తోడు కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యా సంస్థలలో త‌లెత్తే సందేహాలు, ఇత‌ర మనోవేదనలు మరియు ఇతర విద్యా విషయాలను పర్యవేక్షించడానికి యూజీసీ ఈ క్రింది చర్యలను చేపట్టింది:
(1) ప్రత్యేక‌మైన హెల్ప్‌లైన్ నంబర్: 011-23236374 ఏర్పాటు చేయబడింది.
(2) ఒక ప్ర‌త్యేక ఈ-మెయిల్: covid19help.ugc[at]gmail[dot]com సృష్టించబడింది.
(3) విద్యార్థులు తమ ఫిర్యాదులను యూజీసీ యొక్క ప్రస్తుత ఆన్‌లైన్ విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కార పోర్టల్‌ https://www.ugc.ac.in/grievance/student_reg.aspx లో కూడా తెలియ‌జేసే ఏర్పాట్లు చేసింది.
(4) విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యా సంస్థల ఆందోళనలు / మనోవేదనలను పర్యవేక్షించడానికి మరియు తదనుగుణంగా వాటిని పరిష్కరించడానికి గాను యూజీసీ ఒక ప్ర‌త్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
(5) అన్ని విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు ఈ పబ్లిక్ నోటీసు కాపీని తమ అధికారిక వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయాలని సూచించింది. ఈ-మెయిల్ మరియు ఇతర డిజిటల్ మీడియా ద్వారా బోధన సిబ్బంది మరియు విద్యార్థి విభాగాల వారితో ఈ స‌మాచారాన్ని పంచుకోవాలని కూడా కోరింది.

 



(Release ID: 1622940) Visitor Counter : 214