సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

రిటైలర్లు మరియు భవన నిర్మాణ వృత్తినిపుణులను ఎం ఎస్ ఎం ఇలుగా నమోదుపై పరిశీలన: గడ్కరీ

దిగుమతి ప్రత్యామ్నాయాలు కనుగొనడానికి, నగరాలలో జనసమ్మర్ధాన్ని తగ్గించడానికి రిటైలర్ల సంఘాలు,
వృత్తిపనిలో ఉన్న ఇంజనీర్లు, వాస్తుశిల్పులు మరియు టౌన్ ప్లానర్లు కృషిచేయాలని పిలుపు

Posted On: 09 MAY 2020 6:47PM by PIB Hyderabad

భారతీయ రిటైలర్ల సంఘం, వృత్తిపని ఇంజనీర్లు,  వాస్తు శిల్పులు, టౌన్ ప్లానర్ల సంఘం కోరిన విధంగా వారిని ఎం ఎస్ ఎం ఇలుగా
నమోదు చేసుకోవడంపై సత్వరం పరిశీలన చేయగలమని  కేంద్ర ఎం ఎస్ ఎం ఇ మరియు రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి  శ్రీ నితిన్ గడ్కరీ  తెలిపారు.  ఈ సంఘాలు ఉపాధి సృష్టికి  దోహదం చేస్తున్నందున వారి వద్ద పనిచేస్తున్న శ్రామికులకు  బీమా,  వైద్య సహాయం,  పింఛను మొదలగు సౌకర్యాలను కల్పించే విషయాన్ని అన్వేషించవలసిన అవసరం ఉందని  ఆయన అభిప్రాయపడ్డారు.  

రిటైలర్లు సరుకులను ఇళ్ల వద్దకు పంపడం ద్వారా భౌతిక దూరం పాటించేందుకు  చూడాలని,  అన్ని రిటైల్ దుకాణాల వద్ద  కస్టమర్లకు / ఉద్యోగులకు శానిటైజర్లు, మాస్కులు  అందుబాటులో ఉంచాలని  అయన అన్నారు.  

ఆయా రంగాలలో కోవిడ్ -19  ప్రభావంపై  భారత రిటైలర్ల సంఘం, వృత్తిపనిలో ఉన్న ఇంజనీర్లు, వాస్తుశిల్పులు మరియు టౌన్ ప్లానర్ల సంఘం ప్రతినిధులతో మంత్రి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.    కోవిడ్ -19  మహమ్మారి కారణంగా తమ రంగం ఎదుర్కొంటున్న  ఇబ్బందులను గురించి వారు మంత్రికి వివరించారు.  కొన్ని సూచనలతో పాటు తమ రంగం  మనుగడకోసం  ప్రభుత్వ సహాయాన్ని వారు అర్ధించారు.  

నగరాల్లో జన సమ్మర్ధం తగ్గించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆయన వారికి పిలుపు ఇచ్చారు.   గ్రామీణ, గిరిజన మరియు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని,   ఢిల్లీ - ముంబై గ్రీన్ ఎక్ష్ప్రెస్స్ వేల వెంట అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.  ఈ దారుల వెంట అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందని,  ఎన్నో బృహత్తర ప్రాజెక్టుల ద్వారా  అవకాశాలు బాగా పెరుగుతాయని  ఆయన అన్నారు.  

రిటైలర్లను,  రెస్టారెంట్లను, అర్చిటెక్ట్ సంస్థలను ఎం ఎస్ ఎం ఇలుగా నమోదు చేయాలని,  కోవిడ్ -19  భద్రత పాటించే మాల్స్ ను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని,  ఈ- కామర్స్ కంపెనీల కార్యకలాపాలకు అనుమతి ,  మారటోరియం 9 నెలలకు పొడిగింపు,  బ్యాంకు వడ్డీ రేటు 10% నుంచి 4. 5 శాతానికి తగ్గింపు,  ప్రయివేటు బ్యాంకులు కూడా ఆర్ బి ఐ మార్గదర్శకాలను పాటించడం,  రేరా చట్టం కింద నమోదైన బిల్డర్లను ఎం ఎస్ ఎం ఇలుగా నమోదు చేయడం వంటి తమ సమస్యలను వారు మంత్రికి నివేదించారు.  

కోవిడ్ -19 వ్యాప్తి చెందకుండా పరిశ్రమ వర్గాలు  అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని  గడ్కరీ పిలుపు ఇచ్చారు.   వ్యాపార సమయంలో  సంరక్షణ సాధనాలను ఉపయోగించడంతో పాటు  భౌతిక దూరం పాటించడాని గురించి మంత్రి ఉద్ఘాటించారు.  

ఈ సంక్షోభం  నుంచి బయట పడేందుకు ఇందుకు సంబందించిన వారంతా సమీకృత కృషి జరిపినప్పుడే ప్రజల జీవితాలకు, జీవనోపాధికి ఇబ్బంది ఉండబోదని మంత్రి అన్నారు.  

ఎగుమతులను పెంచడంపై  దృష్టిని కేంద్రీకరించడం ద్వారా ప్రపంచ మార్కెట్ లో పోటీని ఎదుర్కోవాలని  కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు.  అంతేకాక దిగుమతి ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు.  

గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే వెంట పెట్టుబడులు పెట్టడంపై దృష్టిపెట్టాలని ,   కోవిడ్ -19  సంక్షోభం ముగిసిన తరువాత వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పరిశ్రమ వర్గాలు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని  శ్రీ గడ్కరీ అన్నారు.     సంఘాల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ  ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయం అందిస్తామని అన్నారు.   వారి సమస్యలపై సంబంధిత శాఖలతో సంప్రదిస్తానని అన్నారు.   


(Release ID: 1622582) Visitor Counter : 255