రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

విశాఖ స్టైరిన్‌ లీక్‌ నియంత్రణలో ఆంధ్రప్రదేశ్‌కు ఐఏఎఫ్‌ సాయం

స్టైరిన్‌ నియంత్రణ రసాయనాలు అత్యవసరంగా విశాఖకు తరలింపు

Posted On: 11 MAY 2020 5:37PM by PIB Hyderabad

మానవతా సాయం, విపత్తు ఉపశమన చర్యల్లో భాగంగా, భారత వైమానిక దళం మే 9, 2020న మరో ఆపరేషన్‌ చేపట్టింది. విశాఖలో జరిగిన స్టైరిన్‌ లీక్‌ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న నియంత్రణ చర్యలకు మద్దతుగా నిలిచింది. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లోని ట్యాంకుల నుంచి స్టైరిన్‌ లీక్‌ కాకుండా ఆపేందుకు 8.3 టన్నుల రసాయనాలను వాయుమార్గంలో అత్యవసరంగా విశాఖకు తరలించింది. ఏపీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ విజ్ఞప్తి మేరకు ఈ ఆపరేషన్‌ చేపట్టింది. 

    గుజరాత్‌లోని ముండ్ర నుంచి దాదాపు 1100 కిలోల టెర్టియరీ బ్యూటైల్ క్యాటెకాల్, 7.2 టన్నుల పాలిమరైజేషన్‌ ఇన్‌హిబిటర్స్‌, గ్రీన్ రిటార్డర్స్‌ను భారత వైమానిక దళానికి చెందిన రెండు An-32 రవాణా విమానాలు విశాఖకు తరలించాయి. ట్యాంకుల నుంచి విడుదలవుతున్న గ్యాస్‌ విషప్రభావాన్ని ఈ రసాయనాలు తగ్గిస్తాయి. ఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం సంస్థ డైరెక్టర్‌ను‌, ముంబయిలో ఉన్న స్టైరిన్‌కు సంబంధించిన నిపుణుడిని కూడా భారత వైమానిక దళం విశాఖకు తరలించింది. స్టైరిన్‌ లీక్‌ నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు వీరిద్దరూ అవసరం.

    కొవిడ్‌పై పోరాటాన్ని మరింత బలోపేతం చేసేలా వివిధ రాష్ట్రాలు, సంస్థలకు అత్యవసర సామగ్రిని భారత వైమానిక దళం తరలిస్తోంది.  మార్చి 25, 2020 నుంచి ఇప్పటివరకు, భారత ప్రభుత్వానికి మద్దతుగా 703 టన్నుల సరుకును వాయుమార్గంలో తరలించింది. మొత్తం 30 భారీ, మధ్యతరహా ఆపరేషన్లను చేపట్టింది. 

***



(Release ID: 1623081) Visitor Counter : 254