PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 24 APR 2020 7:05PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • కోవిడ్‌-19 బారినపడిన వారిలో నయమైన వారు 20.57 శాతం.. అంటే- 4,748 మంది.
  • దేశంలో నిన్నటినుంచి 1,684 కేసులు పెరిగిన నేపథ్యంలో మొత్తం కేసుల సంఖ్య 23,077కు చేరింది.
  • దేశంలో గత 28 రోజులుగా 15 జిల్లాల్లో; 14 రోజులుగా 80 జిల్లాల్లో కొత్త కేసు నమోదు కాలేదు.
  • ప్రపంచ మహమ్మారి మనకు స్వావలంబన పాఠం నేర్పింది: ప్రధానమంత్రి
  • ఉద్యోగులకు కోవిడ్‌-19 నిర్ధారణ అయితే కంపెనీ సీఈవోలదే చట్టబద్ధ బాధ్యత అన్నది  వదంతి మాత్రమేనని పారిశ్రామిక సంఘాలకు భరోసా ఇచ్చిన దేశీయాంగ శాఖ
  • కోవిడ్‌-19 వ్యాప్తిపై భారత్‌ ప్రతిస్పందన చురుకైనది... ముందుచూపు, ఉన్నతస్థాయి నిర్వహణతో కూడినది: డాక్టర్‌ హర్షవర్ధన్‌.
  • కోవిడ్‌-19 నియంత్రణ, పోరాటం దిశగా రాష్ట్రాల్లో పరిస్థితి అంచనా కోసం మరిన్ని కేంద్ర మంత్రివర్గ ఉపసంఘాల ఏర్పాటు

కోవిడ్‌-19పై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తాజా సమాచారం

దేశంలో కోవిడ్‌-19 బారినపడి కోలుకున్నవారి సంఖ్య 20.57శాతం.. అంటే 4,748కి చేరింది. కాగా, నిన్నటినుంచి 1,684 కొత్త కేసులు నమోదవగా నిర్ధారిత కేసుల సంఖ్య 23,077కి పెరిగింది. మరోవైపు కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయినవారిలో ఇప్పటిదాకా 718 మంది మరణించారు. ఇవాళ్టివరకూ అందిన సమాచారం మేరకు గడచిన 28 రోజులుగా 15 జిల్లాల్లో; అలాగే 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 80 జిల్లాల్లో గడచిన 14 రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదుకాలేదు. ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన @కోవిడ్‌ఇండియాసేవ ట్విట్టర్‌ హ్యాండిల్‌ కూడా పౌరుల ప్రశ్నలకు శిక్షణ పొందిన నిపుణులద్వారా తక్షణం కచ్చితమైన ఆరోగ్య, ప్రజా సమాచారాన్ని అందిస్తోంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617995

కరోనా మహమ్మారి మ‌న‌కు నేర్పిన అతి ముఖ్య‌మైన పాఠం... స్వావ‌లంబ‌న‌, స్వ‌యంస‌మృద్ధి: ప‌్ర‌ధాన‌మంత్రి

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్స‌వం-2020 సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశంలోని గ్రామ పంచాయతీలతో దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్య‌మంద్వారా ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా ఆయన ఏకీకృత ఈ-గ్రామస్వరాజ్ పోర్టల్‌తోపాటు మొబైల్ అప్లికేషన్‌ను, స్వా‌మిత్వ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. అనంత‌రం స‌ర్పంచుల‌నుద్దేశించి మాట్లాడుతూ- కరోనా మహమ్మారి ప్రజల పని విధానాన్ని మార్చివేయ‌డంతోపాటు మంచి పాఠం నేర్పింద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. మ‌న‌మంతా స్వావ‌లంబ‌న సాధించాల‌న్న ఒక మంచి పాఠాన్ని నేర్పింద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617823

ఉద్యోగికి కోవిడ్‌-19 నిర్ధారణ అయితే, కంపెనీ సీఈవో చట్టపరంగా బాధ్యత  వహించాలన్నది వదంతిమాత్రమేనని పారిశ్రామికవర్గాలకు దేశీయాంగ శాఖ భరోసా

దేశీయాంగ శాఖ జారీచేసిన మార్గదర్శకాల పొరపాటు అన్వయం కారణంగా కొన్ని మాధ్యమాలతోపాటు ఉత్పత్తి సదుపాయాలున్న కొన్ని కంపెనీలలో అనవసర భయాందోళనలు నెలకొన్నాయి.  దీనికి సంబంధించి మంత్రిత్వశాఖ వివరణనిచ్చింది. నియంత్రణ మండళ్ల పరిధిలో లేని పరిశ్రమలు పనిచేయడానికి 15.04.2020కి ముందు ఇచ్చిన అనుమతులు చాలునని, మళ్లీ తాజా అనుమతులు అవసరం లేదని దేశీయాంగ శాఖ స్పష్టం చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617713

కరోనా వైరస్‌ విసిరిన కఠిన సవాలును ఎదుర్కొనడానికి తగిన సామర్థ్యం, వనరులు భారత్‌కు ఉన్నాయి: డాక్టర్‌ హర్షవర్ధన్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులపై భారత్‌ ప్రతిస్పందన చురుకైనది... ముందుచూపు, ఉన్నతస్థాయి నిర్వహణతో కూడినదని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యదేశాల ఆరోగ్య మంత్రుల దృశ్యమాధ్యమ సమావేశంలో కోవిడ్‌-19 నియంత్రణకు తీసుకున్న చర్యల గురించి ఆయన ఇవాళ ప్రసంగించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617714

కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి కారణంగా టీబీ రోగుల సంరక్షణకు ఆటంకం కలగరాదు: రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచన

కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి చికిత్స పరిస్థితులతో నిమిత్తం లేకుండా జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమం కింద పనిచేసే దేశంలోని అన్ని చికిత్సాలయాలూ పూర్తిస్థాయిలో పనిచేయాలని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617946

కోవిడ్‌-19 సమర్థ నియంత్రణ, పోరాటం దిశగా రాష్ట్రాల్లో పరిస్థితి అంచనా కోసం మరిన్ని కేంద్ర మంత్రివర్గ ఉపసంఘాల ఏర్పాటు

దేశంలోని పలు జిల్లాల్లో ప్రజాహితానికి వ్యతిరేకంగా వివిధ రకాల దిగ్బంధం నిబంధనల ఉల్లంఘన, ఫలితంగా కోవిడ్‌-19 వ్యాప్తి ముప్పు పెరగడంపై సమాచారం అందుతోంది. ముందువరుసనగల కోవిడ్‌-19 పోరాట యోధులైన ఆరోగ్య సంరక్షణ నిపుణులు, పోలీసులపై హింస-దాడులసహా మార్కెట్లవద్ద సామాజిక దూరం పాటించకపోవడం, నిర్బంధ పరిశీలన కేంద్రాల ఏర్పాటుపై వ్యతిరేకత తదితర రూపాల్లో ఉల్లంఘన జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ ఉపసంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో రెండు గుజరాత్‌లో పర్యటించనుండగా తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలకు ఒక్కొక్కటి వంతున ఈ బృందాలు వెళ్లనున్నాయి. ఈ పరిశీలన పర్యటనలో భాగంగా పరిస్థితిని అక్కడికక్కడే అంచనా వేసి, రాష్ట్ర అధికార యంత్రాంగానికి తగు ఆదేశాలు జారీచేస్తాయి. అటుపైన దేశ పౌరుల విశాల హితందృష్ట్యా కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617958

పీఎంయూవై లబ్ధిదారులకు ఉచిత వంటగ్యాస్‌ సరఫరాను వేగిరపరాలని చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ ఆదేశం

దేశంలోని పీఎంయూవై లబ్ధిదారులకు ఉచిత వంటగ్యాస్‌ సరఫరాను వేగిరపరచాలని ఎల్పీజీ సరఫరా భాగస్వాములైన చమురు కంపెనీలను కేంద్ర పెట్రోలియం-సహజవాయువుశాఖల మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ ఆదేశించారు. ఈ మేరకు విజ్ఞతతో, క్రమపద్ధతిద్వారా వంటగ్యాస్‌ అందించాలని అధికారులకు సూచించారు. కాగా, కోవిడ్‌-19 సంబంధిత ఇబ్బందుల నుంచి పేదలను ఆదుకునేందుకు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన ప్యాకేజీ కింద దేశంలోని 8 కోట్లమందికిపైగా పీఎంయూవై లబ్ధిదారులకు 3 నెలలపాటు ఉచిత వంటగ్యాస్‌ అందుతుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617714

‘డేర్‌/ఐకార్‌’ల పనితీరుపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సమీక్ష

కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఇవాళ వ్యవసాయ విద్య-పరిశోధన విభాగం (DARE), భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) పనితీరును సమీక్షించారు. సాంకేతిక పరిజ్ఞాన ఫలితాలను రైతులకు చేర్చడంలో వేగం పెరగాలని, ఐకార్‌ కృషి విజ్ఞాన కేంద్రాలద్వారా గరిష్ఠ సంఖ్యలో రైతులకు చేరువ కావాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617721

దిగ్బంధం మొదలైన నాటినుంచీ పనిచేస్తున్న వ్యవసాయ మార్కెట్ల సంఖ్య దాదాపు రెట్టింపైంది

దేశంలోని మొత్తం 2587 ముఖ్య/ప్ర‌ధాన వ్య‌వ‌సాయ మార్కెట్లు ఉండ‌గా వాటిలో 1091 దిగ్బంధం మొదలయ్యేసరికి... అంటే- 26.03.2020 నాటికి ప‌నిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 21.04.2020కల్లా వీటి సంఖ్య 2069కి పెరిగింది. ఈ మార్కెట్లలోని మండీల‌కు 16.03.2020న వస్తున్న కూరగాయలతో పోలిస్తే 21.04.2020నాటికి ఉల్లి, బంగాళాదుంప, ట‌మోటా వంటివి రావడం వ‌రుస‌గా 622 శాతం, 187 శాతం, 210 శాతం వంతున పెరిగింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617717

గూడ్సు రైళ్లకు ఆహారధాన్యాల లోడింగ్‌లో భారత ఆహార సంస్థ-ఎఫ్‌సీఐ కొత్త రికార్డు

భారత ఆహార సంస్థ-ఎఫ్‌సీఐ 22.04.2020న కొత్త రికార్డు సృష్టించింది. ఈ మేరకు 102 గూడ్సు రైళ్లలో 2.8 లక్షల టన్నుల ఆహారధాన్యాలను నింపింది. దీంతో దిగ్బంధం మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా రోజుకు 1.65 లక్షల టన్నుల సగటుతో మొత్తం 5 మిలియన్‌ టన్నులకుపైగా ఆహారధాన్యాలను రవాణా చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617604

కోవిడ్‌-19పై సాయుధ బలగాల కార్యాచరణ, సన్నద్ధతలపై రక్షణ మంత్రి సమీక్ష

కోవిడ్-19తో పోరాటం దిశ‌గా సాయుధ బ‌ల‌గాల కార్యాచ‌ర‌ణ‌, స‌న్న‌ద్ధ‌త‌ల‌ను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్య‌మంద్వారా కమాండర్స్-ఇన్-చీఫ్‌తో స‌మీక్షంచారు. స్థానిక పౌరపాలక యంత్రాంగాల‌కు సాయుధ బ‌ల‌గాలు అందించిన స‌హాయ స‌హ‌కారాల‌ను ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌శంసించారు. కోవిడ్-19తో పోరాటంలో తమ శక్తియుక్తుల‌ను కార్యాచరణపై కేంద్రీక‌రించేలా స‌ర్వ‌స‌న్న‌ద్ధంగా ఉండాల‌ని,  ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయరాద‌ని ఆయ‌న సూచించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617827

ఓడరేవుల్లో ప్రవేశ/నిష్క్రమణలకు దేశీయాంగ శాఖ ప్రామాణిక విధాన ప్రక్రియ‌ల‌ జారీతో జ‌ర్మ‌నీ నౌక‌నుంచి ముంబైలో దిగిన 145మంది భారతీయ సిబ్బంది

ఓడరేవుల్లో భారత నావికుల ప్రవేశ/నిష్క్రమణల కోసం దేశీయాంగ శాఖ ప్రామాణిక విధాన ప్రక్రియలు జారీ చేయడంతో తొలిసారిగా జర్మనీ నౌకనుంచి 145 మంది భారత నావికులు ముంబై రేవులో దిగారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617678

సింగపూర్‌ ప్ర‌ధాని గౌరవనీయ లీ సెన్‌ లూంగ్‌తో ప్రధానమంత్రి టెలిఫోన్ సంభాష‌ణ‌

రెండు దేశాల్లో కోవిడ్-19 మ‌హ‌మ్మారి విసిరిన ప్రజారోగ్య, ఆర్థికపరమైన సవాళ్లపై దేశాధినేత‌లిద్ద‌రూ చ‌ర్చించారు. ఈ మ‌హ‌మ్మారి ప్ర‌భావిత సామాజిక- ఆర్థిక ప‌రిస్థితులను చక్కదిద్దడానికి త‌మ‌త‌మ దేశాల్లో తీసుకు‌న్న ‌చ‌ర్య‌లపైనా వారు చ‌ర్చించారు. కాగా, అత్యవసర మందులుసహా తగు పరిమాణంలో నిత్యావసరాల నిల్వ దిశగా భారత్‌ తరఫున అన్నివిధాలా సహాయం అందిస్తామని శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617798

కోవిడ్‌-19 సంక్షోభం సందర్భంగా ప్రశంసనీయంగా కృషిచేసిన విమానయాన నిపుణులు, భాగస్వాములకు శ్రీ హర్‌దీప్‌ సింగ్‌ పూరి అభినందనలు

కోవిడ్‌-19 సంక్షోభం సందర్భంగా ప్రశంసనీయంగా కృషిచేసిన విమానయాన నిపుణులు, భాగస్వాములకు పౌరవిమానయాన శాఖ సహాయ (స్వతంత్రబాధ్యతగల) మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా పౌరుల ప్రాణరక్షణ కోసం లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాలద్వారా అత్యవసర వైద్య సామగ్రిని, నిపుణులను చేరవేయడంలో వారు అద్భుతంగా పనిచేశారని ఒక ట్వీట్‌లో కొనియాడారు. ఈ మేరకు వారు ఇప్పటిదాకా 347 విమానాలను నడిపి 3,43,635 కిలోమీటర్లు ప్రయాణించడంతోపాటు 591.66 టన్నుల సామగ్రి రవాణా చేశారని శ్రీ పూరి సదరు ట్వీట్‌లో వెల్లడించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617954

వారణాసిలో ప్రత్యేక డ్రోన్లతో కోవిడ్‌ రోగకారకాల నిర్మూలన

వారణాసి నగరంలో డ్రోన్‌లద్వారా కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. సంబంధిత బృందం ఈ సేవలను త్వరలోనే దేశలోని మిగిలిన నగరాలకూ విస్తరించనుంది. ప్రభుత్వం-ఆవిష్కర్తల మధ్య సహకారంద్వారా కోవిడ్‌-19పై భారత అధికారుల పోరాటానికి వినూత్న సాంకేతికత వినియోగం దిశగా చేపట్టిన కృషిలో ఇదొక భాగం.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617626

ప్రపంచ పుస్తక-ప్రచురణ హక్కుల దినోత్సవం సందర్భంగా కోవిడ్‌-19 అనంతర ప్రచురణ నేపథ్యంపై వెబినార్‌లో పాల్గొన్న హెచ్‌ఆర్‌డి మంత్రి

ప్రపంచ పుస్తక-ప్రచురణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఇవాళ ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం మహా విజ్ఞానశక్తి అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రాచీన విశ్వవిద్యాలయాలు, విజ్ఞానం, గ్రంథ సంపద తదితరాలద్వారా గతం-భవిష్యత్తులకు సంధానకర్తగా, తరాలు-సంస్కృతులకు ఒక వారధిగా భారతదేశం పరిఢవిల్లుతున్నదని మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు...: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617672

ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా “మైబుక్‌-మైఫ్రెండ్‌” ప్రచారానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్‌ పోఖ్రియాల్‌ ‘నిషాంక్‌’ శ్రీకారం

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617660

ప్రభుత్వం అనుమతించి ప్రాంతాల్లో ఆరోగ్య సంబంధిత జాగ్రత్తలు తీసుకుంటూ కార్యకలాపాలు ప్రారంభించాలని పరిశ్రమలకు శ్రీ గడ్కరీ సూచన

కేంద్ర ఎంఎస్‌ఎంఈ-రోడ్డు రవాణా-జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా భారత్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చించారు. “కోవిడ్‌-19 అనంతర సవాళ్లు-భారత్‌లో కొత్త అవకాశాలు” ఇతివృత్తంగా సాగిన ఈ భేటీలో  పలు రంగాలకు చెందిన సంస్థల, మాధ్యమాలతోపాటు ఇతర భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి సృష్టించిన పరిస్థితుల నడుమ ‘ఎంఎస్‌ఎంఈ’లకు ఎదురుకాగల వివిధరకాల సమస్యలపై ఈ సందర్భంగా ప్రతినిధులు ఆందోళన వ్యక్తంచేశారు. అదే సమయంలో తమ సూచనలు అందజేయడంతోపాటు ఎంఎస్‌ఎంఈ రంగం సజావుగా పనిచేసేలా ప్రభుత్వ మద్దతు కోరారు.

మరిన్ని వివరాలకు...: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617668

డీవోపీటీ ద్వారా కరోనాపై 2,90,000కుపైగా ఆన్‌లైన్‌ శిక్షణ కోర్సులు; ప్రారంభించిన 2 వారాల్లోనే 1.83 లక్షల మందికిపైగా వినియోగదారులు: డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

ఇదొక వినూత్న ప్రయోగమని, బహుశా ఇలాంటివాటిలో మొదటిది కావచ్చునని కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ అన్నారు. ఈ మేరకు కరోనాపై ముందుండి పోరాడే యోధులను మరింత సాధికారం చేసేదిశగా https://igot.gov.in వేదికగా ఒక మాడ్యూల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ మీడియం ద్వారా శిక్షణ, తాజా వివరాల ప్రదానంతో కరోనా మహమ్మారిని ఎదుర్కొనే ముందువరుస వీరులను సన్నద్ధం చేయడం ప్రత్యేక విజయగాథగా  రుజువైందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇతరులు కూడా వివిధ రూపాల్లో దీన్ని అనుసరించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

మరిన్ని వివరాలకు...: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617679

జమ్ముకశ్మీర్‌లో కోవిడ్‌-19 పోరాట సన్నద్ధతను సమీక్షించిన సహాయమంత్రి (పీపీ) డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

కేంద్రమంత్రి (ఈశాన్య ప్రాంత అభివృద్ధి-స్వతంత్ర హోదా), ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయమంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ఇవాళ జమ్ముకశ్మీర్‌లో కోవిడ్‌-19 పోరాట సన్నద్ధతను సమీక్షించారు. దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా జరిగిన ఈ సమావేశంలో కేంద్రపాలిత ప్రాంత సీనియర్‌ అధికారులు, ప్రభుత్వ వైద్యకళాశాలల-సంస్థల అధిపతులు పాల్గొన్నారు.

మరిన్ని వివరాలకు...: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617790

పేరోల్‌ రిపోర్టింగ్‌ ఇన్‌ ఇండియా – ఎ ఫార్మల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ పర్స్‌పెక్టివ్‌

మరిన్ని వివరాలకు...: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617765

ఆయుష్‌ ఆరోగ్య సంరక్షణ కోర్సులద్వారా కోవిడ్‌-19కు పరిష్కారాన్వేషణ

కోవిడ్‌-19 రోగ నిరోధకత-వైద్యపరంగా నిర్వ‌హ‌ణ‌/ఔష‌ధ ప్రభావం అంచనాపై స్వల్పకాలిక పరిశోధన ప్రాజెక్టులకు మద్దతిచ్చే యంత్రాంగాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

మరిన్ని వివరాలకు...: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617773

కోవిడ్-19 సంక్షోభ సమయంలో ప్రజలకు సేవలందించే నిర్విరామ కృషిని కొనసాగించాలని తపాలా శాఖకు శ్రీ సంజయ్ ధోత్రే పిలుపు

దేశవ్యాప్త దిగ్బంధం నేపథ్యంలో 2020 ఏప్రిల్ 20వరకు తపాలాబ్యాంకు పొదుపు ఖాతాల్లో రూ.28,000 కోట్ల విలువైన 1.8కోట్ల లావాదేవీలను నిర్వహించారు. జరిగాయి. అలాగే రూ.2,100 కోట్ల మేర 84 లక్షల ఐపీపీబీ లావాదేవీలు సాగాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా రూ.135 కోట్లదాకా 4.3 లక్షల ఏటీఎం లావాదేవీలు చోటుచేసుకున్నాయి. వీటితోపాటు రూ.300 కోట్ల విలువైన 15 లక్షలకు పైగా ఏఈపీఎస్‌ లావాదేవీలు జరిగాయి. ఇక 52లక్షల ప్రత్యక్ష లబ్ధిబదిలీల ద్వారా రూ.480కోట్లు లబ్ధిదారు ఖాతాలకు జమయ్యాయి.

మరిన్ని వివరాలకు...: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617824

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగఢ్‌: ఈ కేంద్ర‌పాలిత ప్రాంతంలోని కూరగాయలు/పండ్లు, వార్తా పత్రికలు, రొట్టె, పాలు త‌దిత‌రాలు స‌ర‌ఫ‌రా చేసేవారంద‌రినీ వైద్యపరంగా పరీక్షించి అవసరమైన రక్షణ సామగ్రిని అంద‌జేశారు. ఇక పీఎంజీకేవై కింద గోధుమలు, పప్పుదినుసుల పంపిణీని క్రమబద్ధీక‌రించారు. ఈ మేర‌కు సామాజిక దూరం నిబంధ‌న‌ను క‌చ్చితంగా అమ‌లు చేస్తూ... పంపిణీ కార్య‌క్ర‌మం స‌జావుగా సాగేందుకు అధికారులు త‌గిన ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా లబ్ధిదారుల‌కు గోధుమ ధాన్యాల పంపిణీ సమయాన్ని సూచించే టోకెన్ ముందుగానే జారీచేయ‌నున్నారు.
  • పంజాబ్: కరోనా వైరస్ నియంత్ర‌ణ కృషిని మ‌రింత ముమ్మ‌రం చేసేదిశ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం ఇవాళ రైతుల‌కు సలహా ప‌త్రం జారీచేసింది. ప్ర‌పంచ మహమ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో సురక్షిత వ్యవసాయ పద్ధ‌తుల‌ను అనుస‌రించే దిశ‌గా ఆపరేటర్లను కూడా అప్ర‌మ‌త్తం చేసింది. రాష్ట్రంలోని అన్ని మండీల‌లో ఇబ్బందులు లేకుండా గోధుమల కొనుగోళ్లు సాఫీగా సాగేందుకు వీలుగా మండీ బోర్డుకు స‌హ‌క‌రించ‌డం కోసం 3,195 మంది మాజీ సైనికులను ప‌రిపాల‌నా ర‌క్ష‌కులుగా నియ‌మించింది.
  • హర్యానా: రాష్ట్రంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ ప‌విత్ర రంజాన్ మాసం వేడుక‌లు నిర్వ‌హించుకోవాల‌ని, ఇళ్ల‌నుంచే ప్రార్థ‌న‌లు నిర్వహించాలని ముఖ్య‌మంత్రి ముస్లింల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఇక ఈ నెల 15 నుంచి ఆవాల కొనుగోళ్లు ప్రారంభ‌మైన నేప‌థ్యంలో క్వింటాలు‌కు రూ.4,425 వంతున 5,618 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో హాఫెడ్, హర్యానా గిడ్డంగుల సంస్థ రూ.53.48 కోట్లు జమ చేశాయి.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్ర ఆసుపత్రులలో వ్య‌క్తిగ‌త ర‌క్ష‌ణ కిట్లు, మాస్కులు, వెంటిలేటర్లు లభ్యమయ్యేలా చూడాలని హిమాచల్ ప్రదేశ్ ముఖ్య‌మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకునే దిశ‌గా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ జారీచేసిన మార్గదర్శకాలను పాటించాలని, ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని రాష్ట్ర వాసులను ఆయ‌న కోరారు.
  • కేరళ: దేశవ్యాప్త దిగ్బంధం, కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్ర‌వాస భార‌తీయుల‌ను స్వ‌దేశం తీసుకురావాల‌ని కేంద్రానికి ఆదేశాలివ్వ‌లేమ‌ని కేరళ హైకోర్టు స్ప‌ష్టం చేసింది. కాగా, కోళికోడ్‌లోని మంజేరిలోగ‌ల వైద్య‌క‌ళాశాల ఆస్ప‌త్రిలో కోవిడ్-19కు చికిత్స పొందుతున్న 4 నెలల శిశువు  ఇవాళ తుదిశ్వాస విడిచింది. మ‌రోవైపు ఇవాళ తెల్లవారుజామున దుబాయ్‌లో కోవిడ్‌తో రాష్ట్రవాసి మ‌రొక‌రు మ‌ర‌ణించారు. రాష్ట్రంలో  నిన్న 10 కొత్త కేసులు రాగా, 8 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కేసులు 447కుగాను 316 మంది కోలుకుని ఇళ్ల‌కు వెళ్ల‌గా 128 మంది చికిత్స పొందుతున్నారు.
  • తమిళనాడు: చెన్నై, మదురై, కోయంబత్తూరు న‌గ‌రాల్లో నాలుగు రోజుల సంపూర్ణ దిగ్బంధం విధిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. అలాగే సేలం, తిరుప్పూర్‌ల‌లో 3 రోజులు దిగ్బంధం ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఇక మే 3న జాతీయ దిగ్బంధం ముగిసేదాకా ఉచిత ఆహారాన్ని అందించడానికి చెన్నైలోని అమ్మ క్యాంటీన్లు ప‌నిచేస్తాయి. ఇక . చెన్నై కార్పొరేషన్ 10వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను ప్రారంభిస్తుంది. ఇప్పటిదాకా రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కోవిడ్ కేసులు: 1683, మరణాలు: 20, డిశ్చార్జ్ అయిన‌వారు: 752.
  • కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ 18 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో బెంగళూరు 11, బాగల్‌కోట్ 2, బెళ‌గావి 2, విజయపుర 1, చిక్కబళ్లాపూర్ 1, తుమ్కూర్ 1 వంతున ఉన్నాయి. కాగా, బెంగళూరులో న‌మోదైన కేసుల‌న్నీ బాద‌రాయణపుర ప్రాంతానికి చెందినవే కావ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో మొత్తం కేసులు 463;  మ‌ర‌ణాలు: 18;  డిశ్చార్జ్ అయిన‌వారు: 150 మంది.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన‌ దాదాపు కోటి మంది మహిళల కోసం సున్నా వడ్డీ రుణ పథకాన్ని ముఖ్య‌మంత్రి ప్రారంభించారు. గడచిన‌ 24 గంటల్లో 62 కొత్త కేసులు న‌మోదు కాగా, వీటిలో కర్నూలు (27), కృష్ణా (14) జిల్లాల్లో అత్య‌ధికంగా ఉన్నాయి. ఇప్పటిదాకా న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసులు: 955, యాక్టివ్ కేసులు: 781, కోలుకున్నవి: 145, మరణాలు: 29. పాజిటివ్ కేసుల రీత్యా కర్నూలు (261), గుంటూరు (206), కృష్ణా (102) అగ్ర‌స్థానంలో ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలోని సాధారణ జనాభాలో కరోనా వైరస్ వ్యాప్తి అంచనా కోసందేశవ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో వ్యాధి సంక్రమణ నిరోధ‌క జీవ‌ద్ర‌వ్య ఉనికిని అంచనా వేసేందుకు స‌త్వ‌ర యాంటీబాడీస ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఐసిఎంఆర్ నిర్ణ‌యించింది. కాగా, కోవిడ్ -19 రోగులకు ఇమ్యునోగ్లోబులిన్ చికిత్స కోసం ఒక ఔష‌ధాన్ని రూపొందించడం కోసం హైదరాబాద్‌కు చెందిన ఒక సంస్థ పంపిన ప్ర‌తిపాద‌న‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. కోవిడ్ -19 నమూనాల‌ సేకరణ కోసం రాష్ట్రంలో అంబులెన్స్ సేవలు ప్రారంభ‌మ‌య్యాయి. ఇప్పటిదాకా న‌మోదైన మొత్తం కేసులు: 970 కాగా, నయమైన‌వారు: 262 మంది.
  • అసోం: కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో మాస్కులేకుండా బహిరంగ ప్రదేశంలో సంచ‌రిస్తున్న 22 మందిని హోజాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
  • మిజోరం: రాష్ట్రంలోని చాంపై, లాంగ్ట్‌లై జిల్లాల్లో ఉద్యానశాఖ రైతులకు ఉచితంగా కూరగాయల విత్తనాలను పంపిణీ చేసింది.
  • నాగాలాండ్: చుమౌకెడిమాలోని కోహిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్‌ను ప‌రిశీల‌న కేంద్రంగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇక్క‌డ నాగా విద్యార్థులు, వెలుప‌లి ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ప‌రిశీల‌న‌లో ఉంచాల‌ని నిర్ణ‌యించింది. వీరిలో అధిక‌శాతం త్వరలో రాష్ట్రానికి తిరిగి రానున్నారు. మ‌రోవైపు స‌హాయ ప్యాకేజీ కింద ల‌బ్ధిదారుల‌ను గుర్తించేందుకు దిమాపూర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఒక క‌మిటీని ఏర్పాటు చేశారు. దీనికి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నేతృత్వం వ‌హిస్తారు.
  • సిక్కిం: రాష్ట్రంలో దిగ్బంధం సంద‌ర్భంగా ప‌శ్చిమ సిక్కిం జిల్లా రైతులు 150 టన్నుల తాజా కూరగాయలను సరఫరా చేశారు.
  • త్రిపుర: రాష్ట్రాన్ని కరోనారహితం చేసినందుకుగాను కోవిడ్‌-19 పోరాట యోధుల‌తోపాటు ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ మ‌హ‌మ్మారిపై పోరులో భాగంగా సామాజిక దూరం నిబంధ‌న‌ను తూచా త‌ప్ప‌కుండా పాటించాల్సిన ప్రాముఖ్యాన్ని ఆయ‌న గుర్తుచేశారు.
  • మహారాష్ట్ర: ముంబైలో అత్య‌ధికంగా 522 కేసులు నమోదైన నేప‌థ్యంలో- రోగుల‌తో సంబంధాలు గ‌ల‌వారి అన్వేష‌ణ ముమ్మ‌రం చేయ‌డం, స‌‌త్వ‌ర ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, అధిక ముప్పున్న వ్యక్తుల నిర్బంధం వంటి చ‌ర్య‌లు చేప‌ట్టిన కార‌ణంగానే అత్య‌ధిక కేసులు న‌మోదైన‌ట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కాగాఏప్రిల్ 23 నాటికి ప్ర‌భుత్వం 96,369 న‌మూనాల‌ను ప‌రీక్షించింది. వీటిలో 55,000 (57.07%) ముంబైలోనివే కావ‌డం గ‌మ‌నార్హం. ఇది దేశంలోని ఏ నగరంతో పోల్చినా అత్యధికం.
  • గుజరాత్: రాష్ట్రంలో న‌మూనాల పరీక్ష సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రోజుకు 3000కుపైగా నమూనాలను పరీక్షిస్తుండ‌గా ఈ సంఖ్య‌ను మ‌రింత పెంచ‌నున్నారు. కోవిడ్-19 నమూనాల పరీక్ష కోసం గాంధీనగర్‌లోని మరో ప్రయోగశాలకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో ఇప్పుడు 15 ప్రభుత్వ, 5 ప్రైవేటు ప్రయోగశాలలు నమూనాలను పరీక్షిస్తుండ‌గా మొత్తం 2,624 పాజిటివ్ కేసులు ఉన్నాయి.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ 36 కొత్త కేసులు న‌మోద‌వ‌డంతో మొత్తం కేసుల సంఖ్య 2000కు పెరిగింది. కాగాజైపూర్‌ ఈ రోజు మరో 13 మందికి కోవిడ్‌-19 నిర్ధార‌ణ కావ‌డంతో న‌గ‌రంలో వ్యాధి సోకిన‌వారి సంఖ్య 753కు చేరింది. కాగా, కోట ప్రాంతం నుంచి 18, భ‌ర‌త్‌పూర్ నుంచి 1 వంతున‌ కొత్త కేసులు నమోదయ్యాయి.

***



(Release ID: 1618023) Visitor Counter : 190