వ్యవసాయ మంత్రిత్వ శాఖ

డేర్/ ఐసిఏఆర్ పనితీరును సమీక్షించిన కేంద్ర వ్యవసాయ మంత్రి

ఐసిఏఆర్-కెవికె నెట్ వర్క్ ద్వారా రైతుల కోసం సాంకేతిక పరిజ్ఞానాలను పెంచాలని శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ పిలుపు

Posted On: 23 APR 2020 8:55PM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ (డేర్), భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఏఆర్) రెండింటితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐసిఏఆర్, కృషి విజ్ఞాన్కేంద్రాల (కెవికె) నెట్ వర్క్ ద్వారా రైతులకు గరిష్ఠ సంఖ్యలో సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులో ఉంచాలని ఆయన నొక్కి చెప్పారు.

2014-19 సంవత్సరాల మధ్య కాలంలో ఐసిఏఆర్ 1234 పంట రకాలను, 345 ఉద్యానవన పంటలను అభివృద్ధి చేసింది. ఐసిఏఆర్ అభివృద్ధి చేసిన పలు సాంకేతిక పరిజ్ఞానాలు విదేశీ మారక ద్రవ్యం ఆర్జించి పెట్టడంతో పాటు దేశానికి ఆహార భద్రత దిశగా ఎంతో తోడ్పాటు అందిస్తున్నాయి. కేంద్రప్రభుత్వ నిర్వహణలోని కృషి కల్యాణ్ అభియాన్, జలశక్తి అభియాన్, మూడు రకాల పంటల ప్రచారం, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు సంబంధించిన ప్రత్యేక ప్రచారోద్యమాల అమలుకు ఐసిఏఆర్, కెవికెలు దోహదకారి అవుతున్నాయి.

దేశంలోని 112 ఆశావహ జిల్లాల్లో కృషి కల్యాణ్ అభియాన్ (కెకెఏ) అమలు జరుగుతోంది. ఇప్పటి వరకు రెండు దశలుగా జరిగిన కృషి కల్యాన్ అభియాన్ ప్రచారంలో 11.05 లక్షల మంది రైతులను శిక్షణ ఇవ్వడంతో పాటు వ్యవసాయ క్షేత్రాల్లో రైతుల సమక్షంలో 5 వేలకు పైగా ప్రదర్శనలు నిర్వహించారు. మూడో దశ కెకెఏలో 17 లక్షల మంది రైతులకు ఆదాయం రెట్టింపు కావడానికి దోహదపడే వైవిధ్యభరితమైన వ్యవసాయ విధానాలపై శిక్షణ ఇస్తారు. అలాగే జలశక్తి అభియాన్ ద్వారా 243 కెవికెలు 466 మేళాలు నిర్వహించి జల సంరక్షణ చర్యలపై చైతన్యం కల్పిస్తున్నారు. రెండు దశలుగా సాగిన ఈ మేళాల్లో 3.14 లక్షల మంది రైతులు, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే మూడు దశలుగా సాగిన మొక్కల పెంపకం ప్రచారంలో 34 మంది ఎంపిలు, 50 మంది ఎంఎల్ఏలు, 2 వేల మంది ప్రముఖులు, అధికారులను భాగస్వాములను చేస్తూ 7.1 లక్షల మొక్కలు నాటారు.

కొత్త టెక్నాలజీల అభివృద్ధి ఐసిఏఆర్ వ్యవస్థలో నిరంతరం సాగే ప్రక్రియ, ప్రాధాన్యతాంశం. నాణ్యమైన పంట రకాలు, మత్స్యజాతులు, దేశీయ పశుజాతులకు చెందిన నాణ్యమైన వీర్యకణాలు సహా మరింతగా మెరుగుపరిచిన విత్తనాల సహాయంతో అధిక సంఖ్యలో రైతులను చేరేందుకు గట్టిగా కృషి జరుగుతోంది. కెవికెలు 14 లక్షల క్వింటాళ్లకు పైబడిన విత్తనాలు, 2425 నాణ్యమైన పంట రకాలు ఉత్పత్తి చేశాయి. ఇవి కాకుండా అదనంగా 512 పళ్లు, కూరగాయల పంటలకు చెందిన మొక్క రకాలు కూడా ఇతర సంస్థలు ఉత్పత్తి చేశాయి. ఈ విత్తనాలు, పంట రకాలు అతి తక్కువ ధరకు రైతులకు అందించారు. 2014-19 కాలంలో కెవికెలు 26.85 కోట్ల మొబైల్ వ్యవసాయ సలహాలు అందించాయి.

2014-19 సంవత్సరాల మధ్య కాలంలో ఐసిఏఆర్ పశువుల్లో వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే  66 రకాల వ్యాక్సిన్లు, డయాగ్నస్టిక్ లను అభివృద్ధి చేసింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా దేశీయంగా నమోదు చేసిన 184 మొక్క, పశు జాతులతో 2019లో గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. అంతే కాదు, తూర్పు, పశ్చిమ కోస్తా ప్రాంతాల్లో గత 5 సంవత్సరాల కాలంలో 2500 కుంటల్లో చేప జాతులు, అత్యంత ప్రాముఖ్యత గల చేపజాతుల కోసం 22 రకాల చౌకైన ఆహారాలు ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుంటలు, ప్రదేశాల్లో ఉత్పత్తి చేశారు. అలాగే పంట వ్యర్థాల నిర్వహణ కోసం రైతులకు రాష్ర్ట ప్రభుత్వాలు, వ్యవసాయ- సహకార-వ్యవసాయదారుల సంక్షేమ శాఖ సహాయంతో యంత్రాలు పంపిణీ చేశారు. ఫలితంగా పంట వ్యర్థాలను వ్యవసాయ క్షేత్రాల్లోనే కాల్చే సంఘటనలు 2016 సంవత్సరంతో పోల్చితే 2019లో 52 శాతం తగ్గాయి.

కోవిడ్-19 ప్రభావంతో వ్యవసాయదారుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు ఐసిఏఆర్ ఎంతో ఉత్సాహంగా కృషి చేసింది. 15 ప్రాంతీయ భాషల్లో దేశంలోని భిన్న ప్రాంతాలకు చెందిన 5.48 కోట్ల మంది రైతులకు సలహాలు కూడా అందించారు. కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి తయారుచేసిన ఆరోగ్యసేతు మొబైల్ అప్లికేషన్ పై 42.7 లక్షల మంది రైతుల్లో అవగాహన కల్పించారు. 4.33 లక్షల మంది రైతులు ఈ అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఐసిఏఆర్ కు చెందిన  నిషాద్ భోపాల్, ఐవిఆర్ఐ ఇజ్జత్ నగర్, ఎన్ఆర్ సి హిస్సార్ మూడు ఇన్ స్టిట్యూట్లలో కొందరు మనుషులు, జంతు సంరక్షక కేంద్రాల్లోని పశుసంతతికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు మూడు ఇన్ స్టిట్యూట్లలోనూ 1561 శాంపిల్స్ టెస్ట్ చేశారు.

కేంద్ర మంత్రి ఐసిఏఆర్ నిర్వహించిన కార్యకలాపాలన్నింటినీ ప్రశంసిస్తూ వాటిని మరింత పటిష్ఠం చేయడంతో పాటు వ్యవసాయ పరిశోధన, విస్తరణ కార్యకలాపాలను మరింత అధిక శాతం మంది రైతులకు అందించేందుకు, వారి వ్యవసాయ సమస్యలకు పరిష్కారం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.విభిన్న కమోడిటీలపై దృష్టి కేంద్రీకరించడంతో పాటు  జల శాస్ర్తాలు, సాంకేతిక పరిజ్ఞానాలపై మరింత లోతైన పరిశోధన చేపట్టాలని, ఎగుమతికి అవసరం అయ్యే బంగాళాదుంప రకాలు అభివృద్ధి చేయాలని, అలాగే వ్యవసాయ రంగానికి చెందిన విభిన్న అంశాలపై కృషి చేస్తున్న స్టార్టప్ లలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసేందుకు వ్యవసాయ స్టార్టప్ సదస్సు నిర్వహించాలని, ముద్రణ/  సామాజిక మాధ్యమాల ద్వారా కెవికె-ఎస్ హెచ్ జిలను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు, దాని పరిధిని విస్తరించేందుకు అవసరమైన చైతన్య ప్రచారం చేయాలని ఆయన ప్రత్యేకంగా సూచించారు. ఐటి టూల్స్ గరిష్ఠంగా వినియోగంలోకి తీసుకురావడం ద్వారా వ్యవసాయ రంగంలో ఉన్నత విద్యను ప్రోత్సహించడంతో పాటు ఇ-పబ్లికేషన్లు ప్రోత్సహించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నొక్కి చెప్పారు. భూసారం, భూసార పరీక్షలపై రైతుల్లో చైతన్యం పెంచేందుకు కెవికెల బలాన్ని ఉపయోగించుకోవాలని కూడా శ్రీ తోమర్ గట్టిగా సూచించారు. వ్యవసాయానికి విత్తనాలే ప్రధాన వనరు గనుక విత్తనాలు అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని ఆయన కోరారు.

 

***



(Release ID: 1617721) Visitor Counter : 167