వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఆహార ధాన్యంను ర్యాక్‌ల‌లో లోడ్ చేయడంలో ఎఫ్‌సీఐ స‌రికొత్త బెంచ్‌మార్క్‌

- ఏప్రిల్ 15 తర్వాత వేగ‌వంతమైన‌ గోధుమల సేకరణ ప్ర్ర‌క్రియ..
- ప్రస్తుత సంక్షోభ సమయంలో అదనపు అవసరాలను తీర్చిన తర్వాత కూడా త్వరగా
తన ధాన్యాగారాలను తిరిగి నింపాలని భావిస్తోన్న ఎఫ్‌సీఐ

Posted On: 23 APR 2020 6:39PM by PIB Hyderabad

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఈనెల 22వ నాటికి 102 రైలు లోడ్‌లలో 2.8 లక్షల మెట్రిక్ టన్నుల (2.8 ఎల్‌ఎమ్‌టీ) ఆహార ధాన్యాలను తరలించి కొత్త బెంచ్‌మార్క్‌ను చేరుకుంది. ఎఫ్‌సీఐ గ‌రిష్ఠంగా పంజాబ్ నుండి 46 రైలు లోడ్లు, ఆ త‌రువాత అత్య‌ధికంగా తెలంగాణ నుంచి 18 లోడ్ల‌ను త‌ర‌లించింది. గోధుమ‌లు, ముడి బియ్యాన్ని పంజాబ్ మరియు హర్యానా నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. ఉడికించిన బియ్యాన్ని తెలంగాణ నుండి కేరళ, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్‌లకు తరలించారు. తాజా త‌ర‌లింపుల‌తో ఎఫ్‌సీఐ లాక్‌డౌన్ వేళ తరలించిన మొత్తం ఆహార ధాన్యాల నిల్వలు 5 ఎంఎంటీలు దాటింది. అంటే రోజుకు సగటున మొత్తం ఆహార ధాన్యాల త‌ర‌లింపు 1.65 లక్షల ఎంటీల‌కు చేరింది. ఇదే సమయంలో ఎఫ్‌సీఐ 4.6 ఎంఎంటీలు ఆహార ధాన్యాల‌ నిల్వ‌ల‌ను అన్‌లోడ్ చేసి, దాదాపు 9.8 ఎంఎంటీల ధాన్యాన్ని ప్రధాన్ మంత్రి గారిబ్ కల్యాణ్‌ యోజన (పీఎమ్‌జీకేవై) సహా పలు పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేసింది. కోవిడ్-19 వైర‌స్ కార‌ణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్,కంటైన్‌మెంట్‌ జోన్లను ప్ర‌క‌టించ‌డం వ‌ల్ల వివిధ ర‌కాల‌ స‌వాళ్లు ఎదుర‌వుతున్నా ఆహార ధాన్యాల పంపిణీ జ‌ర‌ప‌‌డం విశేషం. పీఎంజీకేవై కింద, ఎఫ్‌సీఐ ఇప్పటికే 80 కోట్ల మంది లబ్ధిదారులకు వ్య‌క్తి ఒక్క‌రికి 5 కిలోల చొప్పున దాదాపుగా 4.23 ఎంఎంటీల‌ ఆహార ధాన్యాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసింది.
జోరందుకున్న గోధుమ‌ల సేక‌ర‌ణ‌..
సమయానుసారంగా రాష్ట్రాల‌కు ఆహార ధాన్యాల‌ను తరలించడం, ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థకు (పీడీఎస్) క్రమం తప్పకుండా సరఫరా చేయడంపై దృష్టి సారించిన‌ వేళ‌లోనే ఈ నెల‌
15వ తేదీ నుంచి గోధుమల సేకరణ కూడా జోరందుకోవ‌డం విశేషం. ప్ర‌ధానంగా గోధుమ‌ల‌ను ఉత్ప‌త్తి చేసే రాష్ట్రాలు ధాన్యం సేక‌ర‌ణ ప‌నుల‌ను వేగ‌వంతం చేశాయి. దీంతో ఈ నెల 22వ‌
తేదీ వరకు 3.38 ఎంఎంటీల‌ గోధుమలను సెంట్రల్ పూల్ కోసం ఎఫ్‌సీఐ వ‌ర్గాలు సేకరించారు. ఇందులో ఒక్క పంజాబ్ నుంచే 2.15 ఎంఎంటీల గోధుమ‌ల‌ను సేక‌రించడం విశేషం. ఈ సీజన్లో గోధుమల సేకరణ లక్ష్యం 40 ఎంఎంటీగా నిర్ణ‌యించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజల అవసరాలను తీర్చడానికి ఆహార ధాన్యాల యొక్క అన్ని అదనపు అవసరాలను తీర్చిన తరువాత కూడా సెంట్రల్ పూల్‌లోకి భారీగా ధాన్యం వ‌స్తుండ‌డంతో ఎఫ్‌సీఐ తన ధాన్యాగారాలను తాజా స్టాక్‌లతో త్వరగా నింపగలుగుతోంది.  


 


(Release ID: 1617604) Visitor Counter : 230