సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ప్రభుత్వం ఆమోదించిన ప్రాంతాల్లో తిరిగి పని ప్రారంభించే వారు అన్ని ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని పారిశ్రామిక వర్గాలకు పిలుపునిచ్చిన - శ్రీ గడ్కరీ.
Posted On:
23 APR 2020 7:02PM by PIB Hyderabad
ఎమ్.ఎస్.ఎమ్.ఈ., రోడ్డు రవాణా, రహదారుల శాఖల కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గురువారం భారత్ ఛాంబర్ అఫ్ కామర్స్, వివిధ రంగాలకు చెందిన సంస్థలు, మీడియా, ఇతర భాగస్వామ్య సంస్థల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా "కోవిడ్-19 తర్వాత భారతదేశంలో సవాళ్లు, కొత్త అవకాశాలు" అనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఎమ్.ఎస్.ఎమ్.ఈ. రంగం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్ల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్.ఎస్.ఎమ్ .ఈ. రంగం సజావుగా సాగడానికి కొన్ని సూచనలు తెలియజేస్తూ, ఈ రంగం అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వం కొన్ని పరిశ్రమ రంగాలు తమ పని ప్రారంభించుకోడానికి అనుమతినిచ్చిన నేపథ్యంలో, కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని శ్రీ గడ్కరీ పరిశ్రమల ప్రతినిధులను కోరారు. కార్యాలయాలు / వ్యాపార సంస్థలు ప్రారంభించే సమయంలో సామాజిక దూరాన్ని పాటించాలని సలహా ఇచ్చారు. పి.పి.ఈ. (మాస్కులు, సానిటైజర్లు, గ్లోవ్ లు మొదలైనవి) ఉపయోగించాలని ఆయన నొక్కి చెప్పారు. వ్యాపార కార్యకలాపాలతో పాటు, కార్మికులకు పనిచేసే ప్రదేశంలోనే వసతికి, ఆహారానికి ఏర్పాటు చేయాలనీ, వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై కూడా తగిన దృష్టి కేంద్రీకరించాలని పరిశ్రమ వర్గాలను కోరారు.
రహదారులు, నౌకాశ్రయాలు పనిచేయడం ప్రారంభించడంతో, అవి మరి కొంత కాలానికి క్రమంగా పూర్తి స్థాయికి చేరుకుంటాయని ఆయన అన్నారు. ఎమ్.ఎస్.ఎమ్.ఏ. రంగం పునరుద్ధరణకు సంబంధించి మంత్రి మాట్లాడుతూ, ఎగుమతులపై దృష్టి పెట్టాలనీ, ఇందుకోసం విద్యుత్ వ్యయం, రవాణా వ్యయం, ఉత్పత్తి వ్యయం తగ్గించి, ప్రపంచ మార్కెట్లో పోటీకి నిలవాలని పిలుపునిచ్చారు.
విదేశాల నుండి వచ్చే దిగుమతులకు ప్రత్యమ్నాయంగా దేశీయ ఉత్పత్తులపై దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ఆయన పారిశ్రామిక వర్గాలకు సూచించారు. పారిశ్రామికాభివృద్ధికి పరిశోధన, ఆవిష్కరణలు, నాణ్యత మెరుగుదల ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.
జపాన్ ప్రభుత్వం తమ దేశంలోని పారిశ్రామిక వర్గాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తూ, చైనా నుండి పెట్టుబడులు ఉపసంహరించి వేరే ఏ దేశంలోనైనా పెట్టాలని సూచించిన విషయాన్ని కేంద్ర మంత్రి తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని భారతదేశం వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ-ముంబయి ఎక్సప్రెస్ వే ఇప్పటికే ప్రారంభమైనందున, ఈ అవకాశాన్ని పరిశ్రమలు వినియోగించుకుని, పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక పార్కులు, స్మార్ట్ విలేజ్ లు, స్మార్ట్ నగరాలు (స్మార్ట్ విలేజ్ లకు దగ్గరగా) మొదలైన వాటిలో భవిష్యత్ పెట్టుబడులు పెట్టాలనీ, గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో పారిశ్రామిక వికేంద్రీకరణపై దృష్టి పెట్టాలనీ ఆయన వివరించారు. ఇటువంటి ప్రతిపాదనలను ఎన్.హెచ్.ఏ.ఐ. కి సమర్పించాలని మంత్రి సూచించారు.
ప్రతినిధులు సమర్పించిన సలహాలు, సూచనల్లో కొన్ని ఈ విధంగా ఉన్నాయి.
వడ్డీ ఉపసంహరణ పధకానికి ప్రాధాన్యత నివ్వాలి.
ఎమ్.ఎస్.ఎమ్.ఈ. ల నిర్వచనాన్ని ఖరారు చెయ్యాలి.
ఎమ్.ఎస్.ఎమ్.ఈ. లకు వర్కింగ్ కాపిటల్ రుణాన్ని పెంచాలి.
పరిశ్రమల కార్యకలాపాల ప్రారంభంతో పాటు మార్కెట్లను కూడా తెరవాలి.
పరిశ్రమలకు అదనపు లిక్విడిటీ కల్పనకు సంబంధించి ఆర్.బి.ఐ. మార్గదర్శకాలను సమర్ధవంతంగా అమలుచేయాలి.
ఈ.ఎస్.ఐ. కి చెందిన కార్పస్ నిధిని వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలి.
ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ గడ్కరీ స్పందిస్తూ, సలహాలను పంపించవలసిందిగా కోరారు. ప్రభుత్వం నుండి తగిన విధంగా సహాయం అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు. సంబంధిత విభాగాలు / భాగస్వాములతో ఈ సమస్యలపై చర్చించి సాధ్యమైనంత తొందరలో పరిష్కారాలకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కోవిడ్-19 సంక్షోభం ముగిసిన అనంతరం లభించే అవకాశాలను అందిపుచ్చుకోడానికి, కలిసి కట్టుగా కృషి చేయాలని శ్రీ గడ్కరీ సంబంధిత భాగస్వాములకు నొక్కి చెప్పారు.
*****
(Release ID: 1617668)
Visitor Counter : 195
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam