హోం మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీములను ఏర్పాటు చేసిన కేంద్రం
వైరస్ నిరోధానికి క్షేత్రస్థాయిలో అమలవుతున్న విధానాలను అంచనా వేయనున్న కేంద్ర బృందాలు
రాష్ట్రాలు చేస్తున్న పోరాటాన్ని మరింత బలోపేతం చేయడానికిగాను కృషి చేయనున్న కేంద్ర బృందాలు
Posted On:
24 APR 2020 5:10PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న తీరును పరిశీలిస్తే కొన్ని జిల్లాల్లో నియమ నిబంధనల ఉల్లంఘనలు నమోదవుతున్నాయి. దాంతో ఆయా జిల్లాల్లో ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయి. కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి జరగడానికి అవకాశాన్ని కల్పిస్తూ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వైరస్ పై పోరాటంలో ముందుండి నిలబడి సేవలందిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందిపై దాడులు, పోలీసులపై దాడులు, సామాజిక దూరం పాటించాలనే నియమాన్ని ఉల్లంఘించడం, క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లకుండా మొండికేయడం మొదలైన ఉల్లంఘనలు నమోదవుతున్నాయి.
ఈ నేపథ్యంలో వీటిని అదుపు చేయడానికిగాను కేంద్రం నాలుగు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీములను ( ఐఎంసిటిలు) ఏర్పాటు చేసింది. వీటిలో రెండు గుజరాత్ కోసం పని చేస్తాయి. ఒకటి తెలంగాణకోసం మరొకటి తమిళనాడు, మహారాష్ట్రలకోసం వేశారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఏం చేయాలనేదానిపై అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుంటాయి. అంతే కాదు నివేదికలను కేంద్రానికి సమర్పిస్తాయి.
గుజరాత్ రాష్ట్రంలో అహమ్మదాబాద్, సూరత్ లలో పరిస్థితి ప్రమాదకరంగావ ఉంది. ఇవి అక్కడ ప్రధానమైన హాట్ స్పాట్‌లు. మహారాష్ట్ర థానేలోను, తెలంగాణ హైదరాబాద్‌లోను, తమిళనాడుకు సంబంధించి చెన్నై నగరాల్లోను పరిస్థితి బాగా లేదు. ఇప్పుడు రంగంలోకి దిగే బృందాలు కేంద్రం దగ్గర వున్న నైపుణ్య పద్ధతులను, రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను కలిపి కరోనా వైరస్ నిరోధానికి కృషి చేస్తాయి.
ప్రకృతి విపత్తుల నిర్వహణ చట్టం 2005 ప్రకారం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఐఎంసిటిలు పలు అంశాలపై దృష్టి పెడతాయి. నిత్యావసర వస్తువుల సరఫరా, బైటకు వచ్చిన ప్రజలు సామాజిక దూరాన్ని ఎలా పాటిస్తున్నారు?, ఆరోగ్యపరంగా సౌకర్యాలు ఎలా వున్నాయి, జిల్లాలోని నమూనా గణాంకాలు, వైద్య ఆరోగ్య రంగ సిబ్బంది కి వున్న భద్రత, టెస్టు కిట్టులు, మాస్కులు, పిపిఇలు ఇంకా ఇతర భద్రతాపరమైన వస్తువుల లభ్యత ఎలా వంది, కార్మికులకోసం ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాల దగ్గర సౌకర్యాలు, తదితర అంశాలను ఐసిఎంటీ సభ్యులు తెలుసుకుంటారు.
పైన తెలియజేసిన ఉల్లంఘనలను అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోతే హాట్ స్పాట్ ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొంటాయి. ఇది మొత్తం దేశ ప్రజలకే హానికరంగా మారుతుంది.
ప్రకృతి విపత్తుల నిర్వహణ చట్టం 2005 ప్రకారం కేంద్రప్రభుత్వం ఈ కమిటీలను ఏర్పాటు చేసింది. అంతే కాదు ఆయా రాష్ట్ర, కేంద్ర పాలితప్రాంతాల్లోని ప్రభుత్వాలు హోం శాఖ చెప్పిన దానికంటే అధికంగా మార్గదర్శకాలకంటే అధికంగా అమలు చేస్తూ వుంటే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సడలించకుండా గట్టిగా అమలు చేసుకుంటూ పోవాలి.
ప్రజల భద్రతకోసం కేంద్ర ప్రభుత్వం చెప్పిన మార్గదర్శకాల ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ ప్రజలు నడుచుకోవాలని మార్చి 31న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది కూడా. కోవిడ్ -19 నిరోధానికి అమలు చేస్తున్న మార్గదర్శకాల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు గురించి కూడా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం గుర్తు చేసింది.
ఇక కేంద్రం తాజాగా ఏర్పాటు చేసిన ఈ ఐఎంసిటీలు అతి త్వరలోనే తమ పని ప్రారంభించనున్నాయి.
...............
(Release ID: 1617958)
Visitor Counter : 310
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam