మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా #మైబుక్ మై ఫ్రెండ్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన‌

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్
- పలువురు కేంద్ర మంత్రులను సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి #మైబుక్ మై ఫ్రెండ్ చొరవలో చేరాలని కోరిన మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్

Posted On: 23 APR 2020 7:20PM by PIB Hyderabad

ప్రపంచ పుస్తక దినోత్సవం పుర‌స్క‌రించుకొని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయ‌న సోషల్ మీడియా వేదిక‌గా #మైబుక్ మై ఫ్రెండ్ ప్రచారాన్ని ప్రారంభించారు. మంత్రి శ్రీ పోఖ్రియాల్ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి ఒక వీడియో సందేశాన్ని పంచారు. మీరు ఒక పుస్తకాన్ని తెరిచినప్పుడు, మీరు క్రొత్త ప్రపంచాన్ని తెరుస్తున్న‌ట్టే అని తెలిపారు. పుస్తకాలు వ్యక్తికి మంచి స్నేహితుల‌ వంటివ‌ని అన్నారు. పుస్తకాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిని ఇస్తాయ‌ని, కొత్త ఆలోచనా విధానాన్ని అందిస్తాయ‌ని అన్నారు. జీవితంలోని క్లిష్ట సమయాల్లో పుస్తకాలు మార్గదర్శకంగా పని చేస్తాయని శ్రీ నిశాంక్ తెలిపారు. దేశంలో క్లిష్ట‌మైన లాక్‌డౌన్ అమ‌లవుతున్న వేళ ఈ ఏడాది ప్ర‌పంచ పుస్త‌క దినోత్సవం జరుపుకుంటున్నామని కేంద్ర మంత్రి తెలిపారు.
కోర్సు పుస్త‌కాల‌తో పాటు ఇత‌ర పుస్త‌కాలు చ‌ద‌వాలి..
లాక్‌డౌన్ సమయంలో విద్యార్థులు వారి కోర్సు పుస్తకాలతో పాటు ఆసక్తి ఉన్న కొన్ని పుస్తకాలను తప్పక చదవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. పుస్త‌కాల వ‌ల్ల కొత్త విష‌యాల‌ను నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంద‌ని అన్నారు. ప్రస్తుత స‌మ‌యంలో విద్యార్థులు ఒక పుస్త‌క‌మైనా చ‌దివి ఆ పుస్తకం గురించిన‌ అంశాన్ని సోషల్ మీడియాలో #మైబుక్ మై ఫ్రెండ్ ద్వారా పంచుకోవాలని ఆయన విద్యార్థులందరినీ కోరారు. #మైబుక్ మై ఫ్రెండ్ ప్రచారంలో పాల్గొనాల‌ని కోరుతూ శ్రీ పోఖ్రియాల్ ప‌లువురు కేంద్ర మంత్రులకూ విజ్ఞప్తి చేస్తూ #మైబుక్ మై ఫ్రెండ్‌ ట్యాగ్‌ను చేశారు.
స్ఫూర్తినిచ్చేలా ప్ర‌ముఖ వ్య‌క్తులూ పాల్గొనాలి..
దేశంలోని ప్రజలందరికీ స్ఫూర్తినిచ్చే విధంగా ఈ ప్రచారంలో పాల్గొనాలని కేంద్ర మంత్రి భారత దేశంలోని వివిధ ప్రాంతాల ప్రముఖ వ్యక్తులకు విజ్ఞప్తి చేశారు. రాబోయే 7 రోజుల పాటు #మైబుక్ మై ఫ్రెండ్ ప్రచారం కొన‌సాగుతుంద‌ని మంత్రి వివ‌రించారు. ప్రజలందరూ ఈ ప్రచారంలో చేరాలని శ్రీ పోఖ్రియాల్ త‌న సందేశంలో విజ్ఞ‌ప్తి చేశారు.



(Release ID: 1617660) Visitor Counter : 240