ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కరోనా వైరస్ విసిరిన క్రూరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి భారతదేశం తగిన శక్తిని, వనరులను సంపాదించుకుంది : డాక్టర్ హర్షవర్ధన్
ఇతరులతో పోలిస్తే కోవిడ్ -19 పై భారతదేశం అత్యంత శక్తివంతంగా పోరాటం చేస్తోంది
కోవిడ్ -19 మహమ్మారిని అరికట్టడానికిగాను భారతదేశం శక్తివంతంగా, ముందుచూపుతో, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వ్యూహాత్మకంగా, అన్నిస్థాయిల్లో పోరాటం చేస్తోందన్న కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్
వైరస్ పై మేం తప్పకుండా విజయం సాధిస్తాం: డాక్టర్ హర్షవర్ధన్
Posted On:
23 APR 2020 9:10PM by PIB Hyderabad
కోవిడ్ -19 వైరస్ మహమ్మారిని అరికట్టడానికిగాను భారతదేశం ఎంతో ముందుచూపుతో, శక్తివంతంగా, వ్యూహాత్మక జాగ్రత్తలు తీసుకుంటూ పలు స్థాయిల్లో ముందడుగు వేస్తూ పరిస్థితిని అదుపులో పెడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో సభ్యత్వ దేశాల ఆరోగ్య శాఖ మంత్రుల విర్చువల్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన డాక్టర్ హర్షవర్ధన్ భారతదేశం తీసుకుంటున్న పలు చర్యలు, నిర్ణయాల గురించి వివరంగా మాట్లాడారు.
కోవిడ్ -19 వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని ఈ విపత్కర పరిస్థితినుంచి బైటపడాలంటే, మరణాల సంఖ్య తగ్గించాలంటే ప్రత్యేకమైన చర్యలు అవసరమని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారుల్లో తగిన దీమా కల్పిస్తూ డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడారు. క్లిష్ట పరిస్థితుల్లో ఈ సమావేశం జరుగుతోందని, అందరమూ సమైక్యంగా నిలిచి, ఉత్తమమైన విధానాలను పంచుకుంటూ కోవిడ్ -19 వైరస్ ను అంతం చేయాలని ఆయన అన్నారు.
వైరస్ ను నియంత్రించడానికిగాను కరోనా వారియర్స్ అందిస్తున్న విలువైన, చిత్తశుద్ధితో కూడిన సేవల కారణంగా ఈ పోరాటంలో భారతదేశం పటిష్టమైన స్థితిలో వుందని, అంతే కాదు వైరస్ విషయంలో భారత్ మొదటగా స్పందించిందని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. దేశంలో నిఘా వ్యవస్థ పకడ్బందీగా పని చేయడంతో వైరస్ క్యారియర్లను గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని దాంతో ఈ యుద్ధంలో పటిష్టమైన స్థితిలో వుండగలిగామని ఆయన అన్నారు. శత్రువు ఎక్కడ వుందో దాని పూర్వాపరాలు ఏంటో మాకు తెలుసు. దాంతో కమ్యూనిటీ నిఘా ఏర్పరచి, పలు సూచనలు సలహాలు విడుదల చేసి, క్లస్టర్ కంటెయిన్మెంట్ ద్వారా, శక్తివంతమైన వ్యూహాలద్వారా వైరస్ పై పోరాటం చేస్తున్నామని డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు.
కోవిడ్ -19 కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని ఒక అవకాశంగా భావించి తద్వారా అనేక నిర్ణయాలు తీసుకుంటూ భారతదేశంలోని ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేశామని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ప్రారంభంలో తమ దగ్గర ఒకే ల్యాబ్ వుండేదని అది పుణేలోని వైరాలజీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ( ఎన్ ఐవి)లో వుండేదని ఈ మూడు నెలల్లో ప్రభుత్వ ల్యాబుల సంఖ్య 230కు చేరుకుందని ఆయన అన్నారు. వీటికి తోడుగా 87 ప్రైవేటు ల్యాబులు పని చేస్తున్నాయని వివరించారు. ఇక పరీక్షల నమూనాలను సేకరించడానికిగాను దేశవ్యాప్తంగా 16 వేల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఇంతవరకూ ఐదు లక్షలకు పైగా పరీక్షలు చేశామని స్పష్టం చేశారు. ఈ ఏడాది మే 31 నాటికి దేశంలో ప్రభుత్వ ల్యాబుల సంఖ్య మూడువందలకు పెంచాలని అలాగే ప్రతి రోజూ చేపట్టే పరీక్షల సంఖ్య 55 వేలనుంచి ఒక లక్షకు చేరుకునేలా చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు.
కోవిడ్ -19 వైరస్ బారిన పడిన రోగులకు చికిత్సలు అందించడానికి ఆయా స్థాయిల్లో చేసిన మార్పుల గురించి మంత్రి వివరించారు. రోగుల సంఖ్య పెరిగినా సరే వారికి తగిన చికిత్సలు అందించడానికి సిద్ధంగా వున్నామని అన్నారు. రోగ తీవ్రతను బట్టి కోవిడ్ -19 ఆసుపత్రులను మూడు రకాలుగా వర్గీకరించామని అన్నారు. ప్రాధమిక స్థాయిలో లక్షణాలున్నవారిని కోవిడ్ సంరక్షణా కేంద్రాల్లో వుంచి చికిత్స అందిస్తామని అన్నారు. మధ్యస్థాయిలో లక్షణాలున్నవారిని కోవిడ్ ఆరోగ్య సంరక్షణా కేంద్రాల్లో వుంచి చికిత్స అందిస్తామని, ఇక తీవ్రస్థాయి లక్షణాలున్నవారిని (డెడికేటెడ్) పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రులకు తరలిస్తామని అన్నారు. దేశ వ్యాప్తంగా డెడికేటెడ్ సదుపాయాలు 2, 033 వున్నాయని, ఒక లక్షా 90 వేల ఐసోలేషన్ పడకలున్నాయని వివరించారు. అంతే కాదు 24 వేల ఐసియు పడకలు సిద్ధంగా వున్నాయని, 12 వేల వెంటిలేటర్లు అందుబాటులో వున్నాయని చెప్పారు. ఈ సదుపాయాలన్నిటినీ ఈ మూడు నెలల్లోనే సిద్ధం చేశామని అన్నారు.
ప్రజలకు సరైన అవగాహన పెంచడానికిగాను ఆరోగ్యసేతు మొబైల్ అప్లికేషన్ రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని దీని ద్వారా కోవిడ్ -19కు సంబంధించిన అన్ని విషయాలు ప్రజలకు తెలుస్తున్నాయని డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. ఈ యాప్ ద్వారా అత్యవసర ఆరోగ్య సేవల గురించి ప్రజలు తెలుసుకోగలుగుతున్నారని ఇంతవరకూ ఈ యాప్ ను 7.2 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారని అన్నారు.
ఇక చివరగా మాట్లాడుతూ ఈ పోరాటానికి పటిష్ట నాయకత్వాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అందిస్తున్నారని ఆయన ఎప్పటికప్పుడు పలువురు నిపుణులతో మాట్లాడుతూ, సమీక్షలు చేస్తున్నారని అన్నారు. సమయానుకూలంగా ప్రధాని అనేక నిర్ణయాలను తీసుకుంటూ వాటిని చాలా ప్రతిభావంతంగా అమలు చేయడంవల్ల ప్రస్తుతం తాము ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నామని స్పష్టం చేశారు. అంతేకాదు ప్రజలు కూడా చక్కటి సహకారం అందిస్తూ లాక్ డౌన్ విజయవంతం చేస్తున్నారని ప్రశంసించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా వున్నామని ప్రతి రోగికి సరైన చికిత్స అందిస్తామని డాక్టర్ హర్షవర్ధన్ దీమా వ్యక్తం చేశారు.
*****
(Release ID: 1617714)
Visitor Counter : 239