కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 సంక్షోభం సమయంలో ప్రజలకు సేవ చేయడం కోసం తన నిర్విరామ కృషిని కొనసాగించాలని తపాలా శాఖను కోరిన - శ్రీ సంజయ్ ధోత్రే.

లాక్ డౌన్ సమయంలో 300 కోట్ల రూపాయల విలువైన 15 లక్షలకు పైగా ఏ.ఈ.పి.ఎస్. లావాదేవీలు జరిగాయి.

Posted On: 24 APR 2020 12:19PM by PIB Hyderabad

కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో తపాలా శాఖ చేపట్టిన చర్యలను కేంద్ర కమ్యూనికేషన్లు మరియు హెచ్.ఆర్.డి. శాఖల సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.  సామాజిక దూరం వంటి అన్ని నిబంధనలను పాటిస్తూ దేశ సేవలో నిమగ్నమై తపాలా శాఖ అందించిన వివిధ సేవల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు 

తపాలా శాఖ యొక్క పటిష్టమైన బట్వాడా వ్యవస్థను వివిధ ప్రభుత్వ శాఖలు ఉపయోగించుకునే అవకాశం ఉంది. వివిధ శాఖల మధ్య సమన్వయం తపాలా శాఖ కు కొత్త అవకాశాలను కల్పించవచ్చు.  తపాలా శాఖ ఏ.ఈ.పి.ఎస్. సేవలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని మంత్రి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.  తపాలా డివిజన్ల అధిపతులు సంబంధిత జిల్లా కలెక్టర్లురాష్ట్ర పరిపాలనా విభాగాలతో సంప్రదించి నగదు ఇంటి దగ్గర చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలని కోరారు

కంటైన్మెంట్ జోన్లు మినహా దేశవ్యాప్తంగా మిగిలిన అన్ని ప్రాంతాల్లో తపాలా కార్యాలయాలు పనిచేస్తూ, సేవలందిస్తున్నాయని అధికారులు మంత్రికి తెలిపారుమందులు, కోవిడ్ -19 కిట్లుమాస్కులు, సాని టైజర్లు, పి.పి.ఈ.లతో పాటు వెంటిలేటర్లు వంటి అవసరమైన వైద్య పరికరాల బట్వాడాకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలియజేసారు. 

లాక్ డౌన్ సమయంలో 2020 ఏప్రిల్ 20వ తేదీ వరకు, పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంకు ఖాతాల్లో 28,000 కోట్ల రూపాయల మేర 1.8 కోట్ల లావాదేవీలు జరిగాయి. అదేవిధంగా 2100 కోట్ల రూపాయల మేర 84 లక్షల ఐ.పి.పి.బి. లావాదేవీలు జరిగాయి.  దీనికి తోడు, దేశవ్యాప్తంగా 135 కోట్ల రూపాయల మేర 4.3 లక్షల ఏ.టి.ఎం. లావాదేవీలు జరిగాయి

భారత పోస్ట్ పేమెంట్ బ్యాంకు కు చెందిన ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానం (ఏ.ఈ.పి.ఎస్.) ద్వారా ఏ షెడ్యూల్డ్ బ్యాంకు లో ఉన్న ఖాతా నుండి అయినా నగదు తీసుకోదానికి వీలుంది.  ఈ సమయంలో 300 కోట్ల రూపాయల విలువైన 15 లక్షల ఏ.ఈ.పి.ఎస్. లావాదేవీలు జరిగాయి.  లాక్ డౌన్ సమయంలో 480 కోట్ల రూపాయల విలువైన సుమారు 52లక్షల ప్రత్యక్ష ప్రయోజన బదిలీ చెల్లింపులు జరిగాయి.  ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలతో పాటు ఎక్కువగా వయోవృద్దులకు, దివ్యంగులకు, పింఛన్లదారులకు ఉపయోగపడుతోంది. 

రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్న వినియోగదారులకు అత్యవసర వస్తువులు బట్వాడా చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు శ్రీ సంజయ్ ధోత్రే కి తెలియజేశారు.  ఇండియా పోస్ట్ శాఖ అత్యవసర వస్తువులు సకాలంలో అందజేయడం కోసం తన స్వంత వాహనాలైన రెడ్ మెయిల్ మోటార్ వ్యాన్లు, రోడ్డు రవాణా నెట్ వర్క్స్ తో పాటు కార్గో విమానాలు, పార్శిల్ రైళ్లను ఉపయోగించుకుంటోంది.  లాక్ డౌన్ లో మందులు పంపడానికి గానీ, తీసుకోవటానికి గానీ ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూడాలని తపాలా శాఖ ఉద్యోగులందరికీ  తెలియజేయడమైనది. ఇండియన్ డ్రగ్స్ తయారీదారుల అసోసియేషన్, ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ తో పాటు ఆన్ లైన్  ఫార్మాస్యూటికల్ కంపెనీలతోనూ, కోవిడ్-19 టెస్ట్ కిట్లు సరఫరాదారులతోనూ గుజరాత్, ఉత్తరప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి పలు రాష్ట్రాలలోని తపాలా విభాగాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 

దేశంలోని వివిధ ప్రాంతాల్లో అవసరమైన మేరకు తపాలా సేవలు అందించడం కోసం మొబైల్ పోస్ట్ ఆఫీసులు కూడా పనిచేస్తున్నట్లు మంత్రికి తెలియజేశారు.  ప్రభుత్వేతర సంస్థలు, జిల్లా పాలనా యంత్రాంగాలతో కలిసి స్వచ్చంద విరాళాల ద్వారా తపాలా శాఖ పేదవారికి ఆహారం, ఆహార పదార్ధాలను పంపిణీ చేసింది.  కొన్ని విభాగాలు మాస్కులు తయారుచేసి తపాలా ఉద్యోగులకు, పారిశుధ్య కార్మికులకు, సాధారణ ప్రజానీకానికీ పంపిణీ చేశాయి

కొన్ని సర్కిళ్లు స్వతంత్రంగా చేపట్టిన కార్యక్రమాల గురించి కూడా మంత్రికి వివరించారు.   ఉదాహరణకు, రత్నగిరిలో తపాలా శాఖ మామిడి రైతులకు రవాణా సేవలు అందిస్తోంది.  రైతుల తోటల నుండి మామిడి కాయలు సేకరించి, బండిలో ఎక్కించిరవాణాతో పాటు గమ్యస్థానాల వద్ద దింపేవరకు వివిధ రకాల సేవలను అందిస్తున్నారు.  కర్ణాటకలో బెంగుళూరు జి.పి.ఓ. నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు మామిడి బాక్స్ లను రవాణా చేస్తున్నారు.  ఈ సేవలు అన్నీ కూడా సకాలంలో జరిగేలా శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది.  లాక్ డౌన్ కారణంగా ఇళ్ళనుండి బయటకు రాలేనివారి సౌకర్యం కోసం, ఇండియా పోస్టు కర్ణాటక సర్కిల్ 2020 ఏప్రిల్ 17వ తేదీన "అంచే మిత్ర" అనే రెండు భాషల్లో ఉండే వెబ్ అప్లికేషన్ను ప్రారంభించింది.   హర్యానా ప్రభుత్వ పోర్టల్ తో అనుసంధానమయ్యే విధంగా, హర్యాణా సర్కిల్ కు చెందిన ఐ.టి. బృందం అభివృద్ధి చేసిన "డాక్ మిత్ర" యాప్ ను హర్యానా ముఖ్యమంత్రి ఏప్రిల్ 21వ తేదీన ప్రారంభించారు. బ్యాంకుల్లో రద్దీని తగ్గించే ఉద్దేశ్యంతో రూపొందించిన ఈ యాప్ ద్వారా ప్రజలు తమ సొమ్మును ఏ.ఈ.పి.ఎస్. ద్వారా పోస్ట్ ఆఫీసుల నుండి పొందవచ్చు  ఈ పోర్టల్ ద్వారా ఇంతవరకు ఈ యాప్ కు 310 విజ్ఞప్తులు అందాయి

తపాలా సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకునేందుకు వీలుగా హెల్ప్ లైన్ నంబర్లను బహుళ ప్రచారంలోకి తీసుకురావాలని మంత్రి వివిధ సర్కిళ్లు / రాష్ట్ర యూనిట్లను కోరారు.  ఉద్యోగులందరూ, ముఖ్యంగా, క్షేత్ర స్థాయి సిబ్బంది మాస్కులు, సానిటైజర్లు ఉపయోగించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలను తప్పకుండా అనుసరించాలనీ, సీనియర్ అధికారులు క్షేత్రస్థాయి ఉద్యోగుల విషయంలో శ్రద్ధ తీసుకుని వారిని ప్రోత్సహించాలని మంత్రి కోరారు. 

****



(Release ID: 1617824) Visitor Counter : 184