ప్రధాన మంత్రి కార్యాలయం
కరోనా మహమ్మారినుంచి నేర్చుకున్న అతిపెద్ద పాఠం స్వావలంబన, స్వయంసమృద్ధి తో ఉండడం : ప‌్రధానమంత్రి
కోవిడ్ -19 పై పోరాటంలో గ్రామీణ భారతదేశ మంత్రం 'దో గజ్ దూరి’ కావాలన్న ప్రధానమంత్రి
ఈ- గ్రామ స్వరాజ్య యాప్, స్వమిత్వ పథకాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
Posted On:
24 APR 2020 2:57PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు పంచాయతీరాజ్ దినోత్సవం 2020 సందర్భంగా దేశవ్యాప్తంగా గల గ్రామపంచాయతీ సర్పంచ్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏకీకృత ఈ - గ్రామ స్వరాజ్ పోర్టల్, మొబైల్ అప్లికేషన్, స్వమిత్వ పథకాన్ని ప్రారంభించారు.
ఈ- గ్రామ స్వరాజ్య , గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి, అమలు చేయడానికి పనికి వస్తుంది. ఇది రియల్ టైమ్ మానిటరింగ్, జవాబుదారిత్వం ఉండేలా చూస్తుంది. గ్రామ పంచాయతీ స్థాయి వరకు డిజిటైజేషన్ దిశగా పడిన ముందడుగుగా ఈ పోర్టల్ ను చెప్పుకోవచ్చు.
స్వమిత్వ పథకాన్ని పైలట్ కార్యక్రమంగా ఆరు రాష్ట్రాలలో ప్రారంభించారు. ఇది గ్రామీణ భారతదేశంలో ఆవాస భూములను డ్రోన్ల సహాయంతో అధునాతన సర్వే పద్ధతులలో మ్యాప్ చేయడానికి పనికి వస్తుంది.
ఈ పథకం ప్రణాళికలు ఒక పద్ధతి ప్రకారం ఉండేలా, రెవిన్యూ వసూళ్లు సక్రమంగా జరిగేలా, గ్రామీణప్రాంతాలలో ఆస్థి హక్కులు సరిగా ఉండేలా చూస్తుంది, ఇది ఆయా భూముల యజమానులు ఆర్థిక సంస్థల వద్ద రుణానికి దరఖాస్తు చేసుకునేందుకువీలు కల్పిస్తుంది. ఆస్థికి సంబంధించిన వివాదాలను ఈ పథకం కింద జారీచేసే టైటిల్ డీడ్స్ ప్రకారం పరిష్కరించవచ్చు.
దేశవ్యాప్తంగా గల సర్పంచ్ లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, కరోనా మహమ్మారి ప్రజలు పనిచేసే విధానాన్ని మార్చిందని, మనకు మంచి పాఠం నేర్పందని అన్నారు. ఎవరైనా ఎల్లప్పుడూ స్వావలంబనతో ఉండాలని ఈ మహమ్మారి మనకు నేర్పిందని చెప్పారు.
“ఈ మహమ్మారి మనకు కొత్త సవాళ్లు విసిరింది, మనం ఎన్నడూ ఊహించని సమస్యలు మనముందుంచింది. అయినా అది మనకు ఒక గట్టి సందేశంతో మనకు పాఠమూ నేర్పింది అని ఆయన అన్నారు. మనం స్వావలంబన, స్వయం సమృద్ధి కలిగి ఉండాలని మనకు నేర్పింది. మనం పరిష్కారాల కోసం దేశం వెలుపల చూడకూడదని నేర్పింది. ఇది మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం” అని ఆయన అన్నారు.
“ ప్రతి గ్రామం దాని మౌలిక అవసరాలకు తగిన విధంగా స్వయం సమృద్ధంగా ఉండాలి. అలాగే, ప్రతిజిల్లా దాని స్థాయిలో స్వావలంబన సాధించాలి . అలాగే దేశం మొత్తం అన్ని స్థాయిలలో స్వావలంబన కలిగి ఉండాలి” అని ప్రధానమంత్రి అన్నారు.
గ్రామాలకు స్వయం సమృద్ధత కల్పించేందుకు , గ్రామ పంచాయతి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
“ ఇంతకు ముందు 100 పంచాయతీలకు బ్రాడ్ బ్యాండ్ సదుపాయం ఉన్నస్థాయి నుంచి, గడచిన ఐదు సంవత్సరాలలో 1.25 లక్షల పంచాయతీలను బ్రాడ్ బ్యాండ్ ద్వారా అనుసంధానం చేయడం జరిగింది. అలాగే ఉమ్మడి సేవా కేంద్రాల సంఖ్య 3 లక్షలు దాటింది” అని ఆయన చెప్పారు.
దేశంలో మొబైల్ ఫోన్లు తయారౌతున్నందువల్ల స్మార్ట్ ఫోన్ల ఖరీదు తగ్గిందన్నారు. తక్కువ ధరలో లభ్యమయ్యే స్మార్ట్ ఫోన్లు ప్రతి గ్రామానికి అందుబాటులోకి వచ్యాయని ప్రధానమంత్రి చెప్పారు. ఇది భవిష్యత్తులో గ్రామ స్థాయిలో డిజిటల్ మౌలిక సదుపాయాన్ని మరింత బలోపేతం చేయనున్నదని చెప్పారు.
“పంచాయతీల ప్రగతి దేశ ప్రగతికి , ప్రజాస్వామ్య అభివృద్ధికి పూచీపడుతుంద”ని ప్రధానమంత్రి అన్నారు.
ఈరోజు గ్రామ పంచాయతీ ప్రతినిధులకు, ప్రధానమంత్రికి మధ్య నేరుగా సంబంధం నెలకొనే అవకాశం లభించింది.
సర్పంచ్ లతో సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి , సామాజిక దూరాన్ని సులభంగా అర్థమయ్యేరీతిలో చెప్పేవిధంగా, గ్రామాలు 'దో గజ్ దూరి' మంత్రాన్ని అందించాయని ప్రశంసించారు.
గ్రామీణ భారతదేశం అందించిన ,దో గజ్ దేహ్ కి దూరి - నినాదం ప్రజల విజ్ఞతను తెలియజేస్తుందన్నారు. ప్రధానమంత్రి ఈ నినాదాన్ని అభినందించారు.ఇది సామాజిక దూరం పాటించడానికి ప్రజలకు ప్రేరణనిస్తుందన్నారు.
పరిమిత వనరులు ఉన్నప్పటికీ, భారతదేశం సవాలును సానుకూలంగా తీసుకుందని, కొత్త శక్తి తో, కొత్త పంథాలో ముందుకు సాగడంలో తన సంకల్పాన్నిచూపిందని ప్రధానమంత్రి అన్నారు.
గ్రామాల సమష్ఠి శక్తి , దేశం ముందుకు సాగడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.
ఈ కృషి ఇలా కొనసాగిస్తూనే ఉండాలని అయితే, ఏ ఒక్కరి నిర్లక్ష్యమైనా సరే మొత్తం గ్రామానికే దెబ్బ అని అందువల్ల ఎలాంటి మినహాయింపునకు అవకాశం లేదన్నారు..
గ్రామాలలో స్వచ్చత ప్రచారం కోసం పనిచేయాల్సిందిగా ప్రధానమంత్రి సర్పంచ్‌లను కోరారు.అలాగే వయోధికులు, దివ్యాంగులు, గ్రామంలో ఇతర సహాయం అవసరమైన వారి సంక్షేమం గురించి పట్టించుకోవాలన్నారు. క్వారంటైన్, సామాజిక దూరం, ముఖానికి మాస్క్ ధరించడం వంటివి పాటించేలాచూడాలని ప్రధానమంత్రి కోరారు.
కోవిడ్ -19 కు సంబంధించిన వివిధ అంశాలపై ప్రతి కుటుంబానికి సరైన సమాచారం అందించాల్సిందిగా ప్రధానమంత్రి సర్పంచ్‌లకు సూచించారు.
ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని గ్రామీణ దేశంలోని ప్రజలందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు .వారి వారి పంచాయతీలోని ప్రతి వ్యక్తి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా చూడాలని పంచాయతీ ప్రతినిధులను ప్రధానమంత్రి కోరారు.
గ్రామంలోని పేద ప్రజలకు ఉత్తమ ఆరోగ్య సంరక్షణ లభించేలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని ప్రధానమంత్రి అన్నారు. ఆయుష్మాన్ భారత్ యోజన, గ్రామంలోని పేదలకు పెద్ద ఉపశమనం కలిగించిందని, ఈ పథకం కింద దాదాపు కోటి మంది పేద రోగులు ఆసుపత్రిలో ఉచిత చికిత్స పొందారని ఆయన అన్నారు.
గ్రామీణ ఉత్పత్తులకు మెరుగైన ధరలు పొందడం కోసం పెద్ద మార్కెట్లకు చేరుకోవడానికి ఇ-నామ్, జిఇఎం పోర్టల్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
జమ్మూ-కాశ్మీర్, కర్ణాటక, బీహార్, యుపి, మహారాష్ట్ర, పంజాబ్ & అస్సాం నుండి సర్పంచ్‌లతో ప్రధాని సంభాషించారు.
మహాత్మా గాంధీ స్వరాజ్ భావన, గ్రామ స్వరాజ్ ఆధారంగా రూపొందినదని ఆయన గుర్తు చేసుకున్నారు. శాస్త్రాలను ఉటంకిస్తూ ప్రధానమంత్రి, అన్నిరకాల బలాలకి మూలం ఐక్యత అని ఆయన ప్రజలకు గుర్తు చేశారు.
పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి సర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.
సర్పంచ్‌ల సమిష్టి కృషి, సంఘీభావం సంకల్పంతో కరోనాను ఓడించగలమన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.
(Release ID: 1617823)
Visitor Counter : 348
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam