సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
జమ్ముకశ్మీర్‌లో కొవిడ్ పరిస్థితులపై కేంద్రమంత్రి శ్రీ డా.జితేంద్ర సింగ్ వీడియో కాన్ఫరెన్స్ వైరస్ నియంత్రణకు జమ్ముకశ్మీర్ చేస్తున్న ప్రయత్నాలపై అభినందన
రోగులకు సోదరభావంతో చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందిని ప్రశంసించిన మంత్రి
జమ్ముకశ్మీర్‌కు వ్యక్తిగత భద్రత కిట్లు, టెస్టింగ్ కిట్లు ప్రతిరోజూ పంపిస్తామని భరోసా
Posted On:
24 APR 2020 12:51PM by PIB Hyderabad
జమ్ముకశ్మీర్‌లో కొవిడ్ నియంత్రణకు అధికారుల సమాయత్తతపై, కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి శ్రీ డా.జితేంద్ర సింగ్ (స్వతంత్ర హోదా ) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కొవిడ్ వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత అధికారులు, ప్రభుత్వ వైద్య సంస్థలు, కళాశాలల ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు.
జమ్ముకశ్మీర్‌లో కొవిడ్ రోగుల పట్ల సోదరభావంతో మెలుగుతున్న వైద్య సిబ్బందిని మంత్రి శ్రీ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. కొవిడ్ రోగులకు నేరుగా చికిత్స చేస్తున్న జూనియర్ రెసిడెంట్ వైద్యులు, వైద్య అధికారులను అభినందించారు. కొవిడ్-19 నియంత్రణలో ముందున్న ప్రపంచ దేశాల్లో భారత్ కూడా ఒకటిగా మారిందని మంత్రి చెప్పారు. కరోనా మహమ్మారిపై కేరళ తరహాలోనే జమ్ముకశ్మీర్ కూడా అద్భుత పోరాటం చేస్తోందన్నారు. వైరస్‌పై పోరాటంలో ఆరోగ్య సేతు యాప్ ప్రయోజనాన్ని ఆయన పునరుద్ఘాటించారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది భద్రతను కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణిస్తోందని, అందుకే వైద్య, ఆరోగ్య సిబ్బంది రక్షణ కోసం ఆర్డినెన్స్ తెచ్చామన్నారు. నాణ్యత కలిగిన PPE కిట్ల లభ్యత పెంచాలని UT అధికారులు మంత్రికి విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీ డా.జితేంద్ర సింగ్, జమ్ముకశ్మీర్‌కు నిరంతరంగా PPE, టెస్టింగ్ కిట్లు సరఫరా చేస్తామన్నారు.
కొవిడ్ నియంత్రణ చర్యల విషయంలో జమ్ముకశ్మీర్ సమాయత్తతపై, ఆరోగ్య శాఖ ఆర్థిక కమిషనర్ శ్రీ అటల్ డుల్లూ కేంద్ర మంత్రికి ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఇప్పటివరకు 434 కొవిడ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. వీరిలో 57 మంది జమ్ము వాసులు, 377 మంది కశ్మీర్ వాసులు. దేశం మొత్తమ్మీద, దిల్లీ తర్వాత, ప్రతి 10 లక్షల మందిలో ఎక్కువ మందికి వైరస్ నిర్ధరణ పరీక్షలు చేస్తున్నది జమ్ముకశ్మీరేనని మంత్రి వెల్లడించారు. ప్రతి 10 లక్షల మందిలో 818 మందికి జమ్ముకశ్మీర్ వైరస్ నిర్ధరణ పరీక్షలు చేస్తోందని చెప్పారు. కశ్మీర్‌లో 960, జమ్ములో 180 ప్రాంతాలను కంటెయిన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. జమ్ముకశ్మీర్ అన్ని రకాల కేసులకు వైద్యం చేయడానికి డెడికేటెడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేసినట్లు శ్రీ డుల్లూ చెప్పారు. 126 మంది పదవీ విరమణ వైద్యులను మళ్లీ విధుల్లోకి తీసుకున్నామని, ఆస్పత్రుల్లో వైరస్ సంహార టన్నెల్స్ పెట్టామని, సంచార నమూనా సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. కొవిడ్ విధుల్లో ఉన్నవారందరికీ మాస్కులు, రక్షణ కిట్లు ఇచ్చినట్లు కేంద్రమంత్రికి తెలిపారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి ప్రార్థనలు చేసుకునేలా మతాధికారులతో సమావేశాలు నిర్వహించామని, ఇదే విషయాన్ని వివరిస్తూ ప్రజలకు కూడా వీడియోలు పంపించామని తెలిపారు. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఆయుష్ ఔషధాలను కొవిడ్ విధుల్లో ఉన్న సిబ్బందికి, ప్రజలకు పంపిణీ చేశామన్నారు.
(Release ID: 1617790)
Visitor Counter : 248