ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 నేపథ్యంలో టీబీ రోగుల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ
టీబీ రోగులకు సేవల్లో అవాంతరం రాకూడదన్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ

ఒకేసారి నెలకు సరిపడా ఔషధాలు ఇవ్వాలని రాష్ట్రాలు, యూటీలకు ఆదేశం

అత్యవసర సమయాల్లో రోగుల ఇంటికే మందులు పంపాలని ఆదేశం

Posted On: 24 APR 2020 5:13PM by PIB Hyderabad

కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో టీబీ రోగుల విషయంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మరింత శ్రద్ధ పెట్టింది. ప్రజారోగ్యం దృష్ట్యా జాతీయ టీబీ నిర్మూలన పథకం (NTEP) నిరంతరాయంగా సాగాలని అన్ని  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. టీబీ నిర్ధరణ, రోగులకు చికిత్స సేవల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. 

సరిపడినన్ని ఔషధ నిల్వలు ఉండేలా చూసుకోవాలి
    టీబీ రోగులకు ఒక నెలకు సరిపడా మందులు ఒకేసారి ఇవ్వాలని తన ఆదేశాల్లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది. కొత్తగా రోగ నిర్ధరణ జరిగినా, ఇప్పటికే చికిత్స తీసుకుంటున్నా అందరికీ నెలకు సరిపడా మందులు ఇవ్వాలని చెప్పింది. ఔషధ-నిరోధక రోగులు సహా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారందరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. చికిత్స విషయంలో రోగులకు ఇబ్బందులు రాకుండా చూసేందుకు, గుర్తింపు కార్డు ఉన్నా, లేకున్నా, వారికి అందుబాటులో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లోనే మందులు పంపిణీ చేయాలని చెప్పింది. ఒకవేళ మందులు తీసుకునేందుకు రాలేని పరిస్థితిలో రోగి ఉంటే, సమీప ఆరోగ్య కేంద్రమే సదరు రోగి ఇంటికి మందులు అందించేలా సాధ్యమైనంత వరకు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. కొవిడ్‌-19 పరిస్థితులు, లాక్‌డౌన్‌ నేపథ్యంలో, సరిపడినన్ని ఔషధ నిల్వలు ఉండేలా చూసుకోవాలని, వాటి పంపిణీ సక్రమంగా జరగాలని  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

    టిబి నిర్ధరణ, చికిత్స సేవలు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పూర్తిగా సాగుతున్నాయి. టీబీ రోగులు కొవిడ్‌-19 సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యులు సూచించిన విధంగా ఔషధాల వాడకం కొనసాగించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది. కొవిడ్‌-19 విజృంభిస్తున్న తరుణంలో, రోగులు, వైద్య సిబ్బంది ఆరోగ్యం అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే సంప్రదించేందుకు టీబీ రోగులందరికీ టోల్‌ ఫ్రీ నంబర్‌ (1800-11-6666) ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

    కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు/సూచనలను www.tbcindia.gov.in వెబ్‌సైట్‌లోని “News and Highlights” విభాగంలో చూడవచ్చు.(Release ID: 1617946) Visitor Counter : 129