PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 22 APR 2020 6:45PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  •  దేశంలో కోవిడ్‌-19 కేసుల ప్రస్తుత సంఖ్య 19,984; వీరిలో దాదాపు 20 శాతం కోలుకున్నారు.
  • రాష్ట్రాల్లో ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్టుల నిర్వహణపై విధివిధానాలు జారీచేసిన ఐసీఎంఆర్‌.
  • కోవిడ్‌-19 సమాచార సేకరణ కోసం 1921 నంబరునుంచి ఫోన్‌ సర్వే నిర్వహించనున్న ప్రభుత్వం.
  • “భారత కోవిడ్‌-19 అత్యవసర ప్రతిస్పందన-ఆరోగ్య సంసిద్ధత ప్యాకేజీ”కి రూ.15వేల కోట్లు; మంత్రివర్గం ఆమోదం.
  • మరిన్ని వ్యవసాయ-అటవీ ఉత్పత్తులు, పాఠ్యపుస్తకాల-ఫ్యాన్ల షాపులకు దిగ్బంధం మినహాయింపు
  • పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లలో వయోజనుల సంరక్షకులు, ప్రీపెయిడ్‌ మొబైల్‌ రీచార్జి సేవాప్రదాతలు, ఆహార ఉత్పత్తిదారులకూ మినహాయింపు
  • కోవిడ్‌-19పై పోరాటంలో డాక్టర్లకు పూర్తి భద్రతపై దేశీయాంగ శాఖ మంత్రి హామీ
  • కోవిడ్‌-19 వార్తా సేకరణలో జాగ్రత్తలపై పాత్రికేయులకు సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ సూచన 

కోవిడ్‌-19పై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తాజా సమాచారం

దేశంలో కోవిడ్‌-19 బారినపడి కోలుకున్నవారి సంఖ్య 19.36 శాతం.. అంటే 3,870కి చేరింది. కాగా, నిన్నటినుంచి 1,383 కొత్త కేసులు రావడంతో కోవిడ్‌ నిర్ధారిత కేసుల సంఖ్య 19,984కు పెరిగింది. గడచిన 24 గంటల్లో 50 మంది మరణించారు. దేశంలోని డాక్టర్లకు భద్రత దిశగా అంటువ్యాధుల చట్టం-1897 కింద ఆర్డినెన్స్‌ జారీకి కేంద్ర మంత్రిమండలి సిఫారసు చేసింది. అన్ని రాష్ట్రాల్లో ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్టుల నిర్వహణకు ఐసీఎంర్‌ విధివిధానాలను జారీచేసింది. ఆ మేరకు సదరు పరీక్షలను నిఘా కోసం ఉపకరణంగా మాత్రమే వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. కాగా, కోవిడ్‌-19పై దేశపౌరుల నుంచి సమాచార సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం 1921 నంబరుతో ఎన్‌ఐసీద్వారా మొబైల్‌ఫోన్‌ సర్వే చేయనుంది. ఇది పూర్తిగా అధికారిక సర్వే కాబట్టి అందరూ తప్పనిసరిగా ఇందులో పాల్గొని వ్యాధి లక్షణాలు, స్థితిగతులపై సరైన సమాచారం అందించాలని సూచించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616674

మరిన్ని వ్యవసాయ-అటవీ ఉత్పత్తులు, పాఠ్యాంశ పుస్తకాల-ఫ్యాన్ల దుకాణాలకు కోవిడ్‌-19 దిగ్బంధం నుంచి మినహాయింపు

కోవిడ్-19 దిగ్బంధంపై అమ‌లులోగ‌ల ఏకీకృత స‌వ‌రించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌నుంచి కొన్ని కార్య‌కలాపాల‌కు మిన‌హాయింపు ఇస్తూ దేశీయాంగ శాఖ ఒక ఉత్త‌ర్వు విడుద‌ల చేసింది. అయితే, పైన పేర్కొన్న అంశాల‌కు సంబంధించి ఇచ్చిన మిన‌హాయింపులు హాట్‌స్పాట్‌/నియంత్ర‌ణ మండ‌ల ప్రాంతాల్లో వ‌ర్తించ‌వ‌ని స్ప‌ష్టం చేసింది. స‌ద‌రు మండ‌ళ్ల ప‌రిధిలో స‌ద‌రు కార్య‌క‌లాపాలకు అనుమ‌తి ఉండ‌ద‌ని వివ‌రించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616973

కోవిడ్‌-19పై పోరులో భాగంగా పట్టణప్రాంత ఇళ్లలో వయోజనుల సంరక్షకులు, ప్రీపెయిడ్‌ మొబైల్‌ రీచార్జి సేవాప్రదాతలు, ఆహార ఉత్పత్తిదారులకూ మినహాయింపు

కోవిడ్-19 దిగ్బంధంపై అమ‌లులోగ‌ల ఏకీకృత స‌వ‌రించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌నుంచి కొన్ని కార్య‌కలాపాల‌కు మిన‌హాయింపు ఇస్తూ దేశీయాంగ శాఖ ఒక ఉత్త‌ర్వు విడుద‌ల చేసింది. ప్రస్తుత మార్గదర్శకాల కింద ఇప్పటికే కొన్ని నిర్దిష్ట సేవలు/కార్యకలాపాలకు ఇచ్చిన మినహాయింపులపై కొన్ని సందేహాలు తలెత్తడంతో దేశీయాంగ శాఖ ఇప్పుడు వివరణ ఇస్తూ మినహాయింపు కేటగిరీలో మరికొన్ని సేవలను చేర్చింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616951

ఐఎంఏ సీనియర్‌ ప్ర‌తినిధుల‌తో, వైద్యుల‌తో దేశీయాంగ శాఖ మంత్రి చ‌ర్చ‌; కోవిడ్‌-19పై పోరులో భాగంగా వారికి పూర్తి భద్రత కల్పిస్తామని హామీ

దేశంలో వైద్యుల సేవలను... ప్రత్యేకించి కోవిడ్‌-19పై పోరాటంలో వారు పోషిస్తున్న పాత్రను దేశీయాంగ శాఖ మంత్రి కొనియాడారు. ఈ యుద్ధంలో ఇప్పటిదాకా ఎంతో అంకితభావంతో సేవలందిస్తున్న నేపథ్యంలో ఇదే స్ఫూర్తిని కొనసాగించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. కోవిడ్-19వంటి అత్యంత ప్ర‌మాద‌క‌ర వ్యాధినుంచి ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ‌కు వారు చేస్తున్న త్యాగాలు నిరుప‌మానమ‌ని, వారికి వందనం చేస్తున్నానని ప్రకటించారు.

మరిన్ని వివరాలకు...: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617009

ఆరోగ్య సంర‌క్ష‌ణ నిపుణులు, వైద్య సిబ్బందితోపాటు ముందువ‌రుస‌న సేవ‌లందించే కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల నిరోధం దిశ‌గా తగిన భద్రత కల్పించండి: ‌దేశీయాంగ శాఖ మంత్రి

కోవిడ్‌-19పై పోరులోగ‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణ నిపుణులు, వైద్య సిబ్బంది, ముందు వ‌రుస‌న‌గ‌ల కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల నిరోధం దిశ‌గా వారికి త‌గిన భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కల్పించాలని అన్ని రాష్ట్రాలు/‌కేంద్ర‌పాలిత ప్రాంతాల ప్ర‌భుత్వాల‌ను దేశీయాంగ శాఖ మ‌రోసారి ఆదేశించింది. అలాగే కోవిడ్-19 రోగులకు సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన వైద్య నిపుణులు లేదా ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల మృత‌దేహాల‌కు అంత్యక్రియలను అడ్డుకునే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాల‌ని కోరింది.

మరిన్ని వివరాలకు...: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617244

కొవిడ్ -19పై పోరులో భాగంగా “భార‌త కోవిడ్‌-19 అత్యవసర స్పందన-ఆరోగ్య వ్యవస్థ సంసిద్ధ‌త ప్యాకేజీ” రూ.15,000 కోట్ల కేటాయింపున‌కు కేంద్ర మంత్రిమండ‌లి ఆమోదం

దేశంలో కొవిడ్‌పై పోరు కోసం భారీస్థాయిలో నిధుల విడుదలకు కేంద్ర మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు “భారత కోవిడ్-19 అత్యవసర స్పందన-ఆరోగ్య వ్యవస్థ సంసిద్ధ‌త ప్యాకేజీ”కి రూ.15,000 కోట్లు కేటాయించాల‌ని తీర్మానించింది. ఈ నిధుల‌ను మూడు దశల్లో ఖర్చు చేయ‌నుండ‌గా- కోవిడ్‌-19 అత్యవసర సన్నద్ధతకు రూ.7,774 కోట్లు వెచ్చిస్తారు. మిగిలిన మొత్తాన్ని నిర్దిష్ట అవ‌స‌రాల కోసం 1 నుంచి నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో మధ్యకాలిక మద్దతుగా వినియోగిస్తారు.

మరిన్ని వివరాలకు...: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617230

స్వచ్ఛంద రక్తదాతలను సంప్రదించి రక్తమార్పిడి కోసం తగినంత రక్తనిల్వలు నిర్వహించేలా చూడాలని రెడ్‌క్రాస్‌ సంస్థకు ఆరోగ్యశాఖ మంత్రి వినతి

దేశంలో రెడ్‌క్రాస్‌ సంస్థ యోధులు అంకితభావంతో సేవలందిస్తున్నారని వారితో దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛంద రక్తదాతలను సంప్రదించడంతోపాటు సంచార రక్తసేకరణ వంటి ఏర్పాట్లతో వారికి వెసులబాటు కల్పించాలని సూచించారు. అలాదే కోవిడ్‌-19 నుంచి కోలుకున్న రోగులు రక్తదానం చేసేలా ప్రోత్సహించాలని భారత రెడ్‌క్రాస్‌ సొసైటీకి పిలుపునిచ్చారు. తద్వారా వారి రక్తంలోని జీవద్రవ్యాన్ని కరోనా పీడితులకు ఎక్కించి, వారు త్వరగా కోలుకునేలా చూడవచ్చునని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616953

భూమాతకు ప్ర‌ధానమంత్రి కృత‌జ్ఞత‌లు

అంతర్జాతీయ ధరిత్రీ దినోత్స‌వం సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ భూమాత‌కు కృత‌జ్ఞతలు ప్ర‌క‌టించారు.  “ఈ అంత‌ర్జాతీయ ధ‌రిత్రీ దినోత్స‌వం సంద‌ర్భంగా భూమాత మ‌న‌పై ప్ర‌ద‌ర్శిస్తున్న అపార క‌రుణ‌, ప్రేమాద‌ర‌ణ‌ల‌కు విన‌మ్రంగా కృత‌జ్ఞ‌త ప్ర‌క‌టించాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంది. ఈ దిశ‌గా ప‌రిశుభ్ర‌, ఆరోగ్య‌క‌ర‌, సౌభాగ్య‌వంత‌మైన భూగోళం కోసం కృషిచేస్తామ‌ని మ‌న‌మంతా ప్ర‌తిన‌బూనుదాం. ఈ కృషిలో భాగంగా కోవిడ్‌-19ను త‌రిమికొట్టేందుకు ముందువ‌రుస‌న నిలిచి శ్ర‌మిస్తున్న వారంద‌రికీ జేజేలు ప‌లుకుదాం” అని పిలుపునిచ్చారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616986

కోవిడ్‌ ప్రపంచ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సరుకుల రవాణాకు పలు ప్రోత్సాహకాలు ప్రకటించిన భారత రైల్వేశాఖ

దేశంలో 24.03.2020 నుంచి 30.04.2020 దాకా ఖాళీ కంటెయినర్లు, ఖాళీ వ్యాగన్ల కదలికపై హాలేజీ చార్జిని రద్దుచేసింది. ఈ మేరకు మరింత మంది ఖాతాదారులు తమ డిమాండ్ల మేరకు నమోదు చేసుకోవచ్చు. తదనుగుణంగా ప్రత్యక్షంగా గూడ్సు షెడ్లకు వచ్చే అవసరం లేకుండా ఎలక్ట్రానిక్‌ రూపంలో రసీదులు పొందవచ్చు. అలాగే రైల్వే ఇన్‌వాయిస్‌లు సమర్పించే అవసరం లేకుండా ప్రత్యామ్నాయ పద్ధతిలో సరుకులు తీసుకెళ్లవచ్చు. రైలు లోడ్ రేట్లు పొందటానికి బీసీఎన్‌హెచ్‌ఎల్‌ కనీస సంఖ్యలో లోడ్ చేయాలన్న నిబంధనను ఇప్పుడు 57 నుండి 42 వ్యాగన్ల స్థాయికి పరిమితం చేశారు. పరిశ్రమలను ప్రోత్సహించడానికి మినీ రేక్, రెండు పాయింట్ల రేక్ మొదలైన వాటిని నియంత్రించే దూర సంబంధిత పరిస్థితులు కూడా సడలించబడ్డాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617312

రాష్ట్రాలకు రోజూ 2.6 లక్షల భోజనాలు; రైల్వేమంత్రిత్వ శాఖ సంసిద్ధత

దేశంలోని వివిధ ప్రాంతాల్లోగల తమ వంటశాలల నుంచి రూ.15 నామమాత్రపు ధరతో రాష్ట్రాలకు రోజూ 2.6 లక్షల భోజనాలు సరఫరా చేస్తామని సంసిద్ధత తెలిపింది. ఆయా జిల్లా యంత్రాంగాలు ఈ భోజనాలను తీసుకెళ్లి, పేదలకు పంపిణీ చేయవచ్చునని సూచిస్తూ సమాచారం పంపింది. ఆయా వంటశాలల సామర్థ్యాన్నిబట్టి రోజుకు 2.6 లక్షల భోజనాల సరఫరాకు హామీ ఇస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రాలనుంచి వచ్చే స్పందననుబట్టి అవసరమైతే ఆహార పొట్లాల సరఫరా పెంచుతామని ప్రకటించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617004

భారత నౌకాశ్రయాల వద్ద నావికుల ప్రవేశానికి, నిష్క్రమణ మరియు వారి కదలికలకు ఎస్.ఓ.పి. లు జారీ

భారత నౌకాశ్రయాల వద్ద నావికుల ప్రవేశ-నిష్క్రమణలతోపాటు వారి సంచారానికి వీలుగా ఎస్.ఓ.పి.లు జారీ చేయడంపై కేంద్ర షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకుగాను ఒక ట్వీట్‌ద్వారా దేశీయాంగ శాఖ మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఓడరేవులలో సిబ్బంది మారడానికి ఇది వీలు కల్పిస్తుందని, దీంతో వేలాది నావికుల ఇబ్బందులు తీరిపోతాయని చెప్పారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617153

ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మ సంస్థ‌ల‌కు సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ సూచన

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న పాత్రికేయులు కోవిడ్‌-19 బారినపడుతున్న నేపథ్యంలో కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ ఇవాళ ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మ సంస్థలకు కొన్ని సూచనలు చేసింది. ఈ మేర‌కు దేశ‌వ్యాప్తంగా కోవిడ్‌-19 సంబంధిత వార్తా సేక‌ర‌ణ విధుల్లోగ‌ల రిపోర్టర్లు, కెమెరామ‌న్లు, ఫొటోగ్రాఫర్లుసహా ఇత‌ర ప్ర‌తినిధులంద‌రూ తగు జాగ్రత్తలు వ‌హించాల‌ని సూచించింది. ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి, నియంత్ర‌ణ మండ‌ళ్లు, హాట్‌స్పాట్లు, కోవిడ్‌ కేసులు నిర్ధార‌ణ అయిన ప్ర‌దేశాల‌కు వెళ్లినప్పుడు ఆరోగ్యపరంగా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని తెలిపింది. అలాగే కార్యాలయాల్లో ప‌నిచేసే సిబ్బంది విషయంలో తగిన శ్రద్ధ చూపాలని యాజ‌మాన్యాల‌కు విజ్ఞప్తి చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617062

కోవిడ్ -19 నేపథ్యంలో పరిష్కరించిన 6.06 లక్షల అభ్య‌ర్థ‌న‌లుస‌హా 15 పనిదినాల్లో 10.02 లక్షల అభ్య‌ర్థ‌న‌లు పరిష్కరించిన ఉద్యోగుల భ‌విష్య‌నిధి సంస్థ‌

ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న ప్యాకేజీ మేర‌కు కోవిడ్‌-19 అభ్య‌ర్థ‌న‌ల కింద రూ.1954 కోట్లుస‌హా మొత్తం రూ.3,600.85 కోట్ల మొత్తం పంపిణీ చేయ‌బ‌డింది. దిగ్బంధం కార‌ణంగా మూడోవంతు సిబ్బంది మాత్ర‌మే ప‌నిచేస్తున్న నేప‌థ్యంలో కోవిడ్‌-19 అభ్య‌ర్థ‌న‌ల‌లో 90 శాతం కేవ‌లం 3 ప‌నిదినాల్లో ప‌రిష్క‌రించారు. అభ్య‌ర్థ‌న‌ల‌ను వేగంగా ప‌రిష్క‌రించ‌డం కోసం రూపొందించిన ప్ర‌త్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో ఈ మేర‌కు కొత్త రికార్డును సృష్టించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617062

మంత్రిత్వ శాఖల మూసివేతకు ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని, అది అవాస్తవ కథనమని ధ్రువీకరించిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్; అలాగే ‘సే నమస్తే’ పేరిట ఎలాంటి దృశ్య-శ్రవణ మాధ్యమ యాప్ ఆవిష్కరించలేదు/అనుమతించలేదు: ప్రభుత్వం

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616952

దేశంలోని వంట‌గ్యాస్ పంపిణీదారుల‌తో దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్య‌మంద్వారా చ‌ర్చించిన శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌; పేదలకు ఉజ్వల సిలిండర్ల సరఫరా పెంచాలని సూచన

కేంద్ర పెట్రోలియం-సహజవాయువు-ఉక్కు శాఖల మంత్రి శ్రీ ధర్మేంద్రప్రధాన్ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వెయ్యి మందికిపైగా వంట‌గ్యాస్ పంపిణీదారులతో దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్య‌మంద్వారా చర్చించారు. దిగ్బంధం స‌మ‌యంలో వినియోగ‌దారుల‌కు ప్ర‌శంస‌నీయ సేవ‌లందిస్తున్నార‌ని వారిని ప్ర‌శంసించారు. పీఎంయూవై లబ్ధిదారులకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్‌ యోజన కింద మూడు ఉచిత సిలిండర్లు అందించడానికి గరిష్ఠంగా కొనసాగించాలని వారికి సూచించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616674

రాష్ట్రపతి భవన ప్రాంగణంలో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసు కనుగొనడంపై సమాచారం

రాష్ట్రపతి భవన ప్రాంగణంలో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసు కనుగొన్నట్లు పత్రికా-ప్రసార మాధ్యమాలలో వచ్చిన వదంతులపై వాస్తవాలను వివరిస్తూ ప్రకటన విడుదల.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616970

ఈ-లెర్నింగ్ కంటెంట్ సహకారం ఆహ్వానిస్తూ విద్యాదాన్ 2.0 కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభి‌వృద్ధి శాఖ మంత్రి

న్యూఢిల్లీలో ఈ-లెర్నింగ్ కంటెంట్ రచనలను ఆహ్వానించడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ  మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ *నిశాంక్* "విద్యాదాన్ 2.0" కార్యక్రమాన్ని ప్రారంభించారు. (పాఠశాల, ఉన్నత స్థాయి విద్యను అభ్య‌సిస్తున్న) విద్యార్థుల నుంచి ఈ-లెర్నింగ్ కంటెంట్ కోసం డిమాండ్ పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. ప్ర‌త్యేకించి కోవిడ్‌-19 ప‌రిస్థితుల నేప‌థ్యంస‌హా విద్యాభ్యాసం దిశ‌గా డిజిట‌ల్ విద్య‌ను స‌మీకృతం చేయాల్సిన అత్య‌వ‌స‌రం దృష్ట్యా ప్ర‌భుత్వం ఈ మేర‌కు చొర‌వ చూపింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617243

పచ్చదనం, పరిశుభ్రత నిండిన భూగోళంకోసం కృషిచేద్దాం: ఉప రాష్ట్రపతి పిలుపు

పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన భూగోళం కోసం సమష్టిగా కృషిచేద్దామని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశ పౌరులకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి పవిత్ర పౌర బాధ్యతని అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశంలో పేర్కొన్నారు. “ప్రకృతిమాతను రక్షించుకోవడానికే మనం ప్రాధాన్యమిద్దాం. ప్రగతి నమూనాలను, వినియోగతత్వ చోదిత జీవనశైలిని పునశ్చరణ చేసుకుందాం” అని పేర్కొన్నారు. కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి నేపథ్యంలో మన అభివృద్ధి, ఆర్థిక వ్యూహాలను పునరన్వేషించుకోవాలని చెప్పారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616861

‘ఆహార భద్రత, రక్షణ, పోషకాహారంపై కోవిడ్-19 ప్రభావం’పై దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్య‌మం ద్వారా జి-20 కూట‌మి వ్యవసాయ మంత్రుల అసాధారణ సమావేశంలో పాల్గొన్న శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్

“ఆహార భద్రత, రక్షణ, పోషకాహారంపై కోవిడ్-19 ప్రభావం”పై జి-20 దేశాల వ్యవసాయ మంత్రుల అసాధారణ సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఇవాళ దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్యమంద్వారా పాల్గొన్నారు. అవసరమైన వ్యవసాయ ఉత్పత్తుల లభ్యత, సరఫరా కొనసాగడానికి వీలుగా ఆరోగ్యం, పరిశుభ్రత, సామాజిక దూరం నిబంధనలను పాటిస్తూ అన్ని వ్యవసాయ కార్యకలాపాలనూ దిగ్బంధం నుంచి మినహాయిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయించింద‌ని ఈ సంద‌ర్భంగా ఆయన తెలిపారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616950

కోవిడ్-19 దిగ్బంధ స‌మ‌యంలో ప్రభుత్వ స‌కాల జోక్యంతో నిత్యావసరాల సరఫరా

కోవిడ్-19 దిగ్బంధం నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా సరఫరా శృంఖలం నిరంతరం సాగేలా, టోకు మార్కెట్లలో రద్దీ తగ్గింపు నిమిత్తం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ  శాఖ అనేక చర్యలు తీసుకుంది. ఈ మేర‌కు జాతీయ వ్యవసాయ మార్కెట్ పోర్టల్ ఈ-నామ్‌ను పునర్న‌వీక‌రించి (ఎ) గోదాముల ఆధారిత వ్యాపార న‌మూనా (2) రైతు ఉత్ప‌త్తి సంస్థ‌లు పేరిట‌ రెండు కొత్త విభాగాల‌ను జోడించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616903

కోవిడ్-19 దిగ్బంధం నేప‌థ్యంలో ఎరువులు, ఔషధాల లభ్యత మెరుగుకు కేంద్ర ర‌సాయ‌నాలు-ఎరువుల మంత్రిత్వ శాఖ కృషి: గౌడ

కోవిడ్-19 మహమ్మారి విసిరిన సవాళ్ల‌ను అధిగమించేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్న‌ట్లు కేంద్ర ర‌సాయ‌నాలు-ఎరువులశాఖ మంత్రి డి.వి.స‌దానంద గౌడ చెప్పారు. ఈ మేర‌కు రైతుల‌కు ఎరువులు, క్రిమి సంహారకాల కొర‌త లేకుండా చర్యలు చేప‌ట్టామన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616903

భారత ప్లంబింగ్ వర్క్ ఫోర్స్ కోసం ఆరోగ్య-భద్రతా మార్గదర్శకాల విడుదల

కోవిడ్-19 సంక్షోభం నేప‌థ్యంలో ప్లంబింగ్ వంటి సేవల అవసరాన్ని గుర్తించి‌, స్కిల్ ఇండియా కార్యక్రమ అనుసంధానిత ఇండియన్ ప్లంబింగ్ స్కిల్స్ కౌన్సిల్ (ఐపిఎస్‌సి), నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ దిగ్బంధం సమయంలో సేవలందించగల 900 మందికి పైగా ప్లంబర్ల జాబితాను  సిద్ధం చేసింది. మరోవైపు పేదలకు ఆహారం, నిత్యావసరాల పంపిణీ కోసం చొరవ తీసుకోవాలని తమ శిక్షణ కార్యక్రమ భాగస్వాములను ఐపీఎస్‌సీ విజ్ఞప్తి చేసింది. అలాగే ఆహార తయారీ, పంపిణీ కార్యకలాపాలకు సహకరిస్తామని సంసిద్ధత తెలిపింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616953

కరోనా వైరస్ నేప‌థ్యంలో అక్టోబరు 15 వరకు హోటళ్లు/రెస్టారెంట్ల మూసివేత‌కు ఆదేశించ‌లేదు: ప‌ర్యాట‌క‌ మంత్రిత్వ శాఖ

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617045

కోవిడ్‌-19 నేపథ్యంలో ట్రైఫెడ్‌ క్రియాశీల చర్యలు

కోవిడ్‌-19 దిగ్బంధం నేపథ్యంలో గిరిజన ప్రయోజనాల పరిరక్షణ కోసం గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ పలు చర్యలు తీసుకుంది. ఈ మేరకు ‘ట్రైఫెడ్‌’ ప్రచార-అవగాహన కల్పన, వ్యక్తిగత రక్షణాత్మక ఆరోగ్య సంరక్షణ, కలపేతర అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు వంటి చర్యలకు శ్రీకారం చుట్టింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617112

శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వ‌శాఖ మ‌ద్ద‌తుతో  కోవిడ్‌-19 నివార‌ణ దిశ‌గా శాస్త్ర-సాంకేతిక ప‌రిష్కారాల‌తో కృషి చేసిన స్వ‌చ్ఛంద సంస్థ‌ల నెట్‌వ‌ర్క్‌

దేశంలోని 22 రాష్ట్రాల్లో విస్తరించిన శాస్త్ర-సాంకేతిక సామర్థ్యంగల స్వచ్ఛంద సంస్థల నెట్‌వర్క్‌ కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖలోని సైన్స్‌ ఫర్‌ ఈక్విటీ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం మద్దతుతో కోవిడ్‌-19 నియంత్రణలో తనకుగల సామర్థ్యాలను నిరూపించుకుంది. ఈ మేరకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు శాస్త్ర-సాంకేతిక పరిష్కారాలను జోడించి వివిధ స్థాయులలో తనవంతు తోడ్పాటునిచ్చింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617176

కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సిబ్బంది భద్రతకు సమగ్ర చర్యలు చేపట్టిన ఉత్తర ఢిల్లీ పురపాలక సంస్థ

కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరీక్షా సమయంలో తమ సిబ్బందికి పూర్తిస్థాయి భద్రత దిశగా ఉత్తర ఢిల్లీ పురపాలక సంస్థ సమగ్ర చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రతి నియంత్రణ మండలం వెలుపల ఒక డాకింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. పురపాలికలోని ఏ విభాగానికి చెందిన సిబ్బంది అయినా, ప్రతి ఒక్కరూ ఈ డాకింగ్‌ స్టేషన్‌ వద్దనుంచే విధులకు హాజరుకావాలని నిర్దేశించింది. ఈ మేరకు వారు అక్కడికి చేరుకోగానే వ్యక్తిగత రక్షణ సామగ్రి కిట్లు అందజేస్తోంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617084

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • మహారాష్ట్ర: రాష్ట్రంలో ఇవాళ 552 కొత్త కేసుల న‌మోదుతో కోవిడ్-19 కేసుల సంఖ్య 5,218కి చేరింది. ఈ మేర‌కు ఒక్క ముంబైలోనే 355 కొత్త కేసులు నమోదవ‌గా మొత్తం 3,445కు పెరిగాయి. దేశంలో ఏ న‌గ‌రంలో పోల్చినా అత్య‌ధిక కేసులున్న ముంబైలోనే కావ‌డం గ‌మ‌నార్హం. కాగా, ఇప్పటివరకూ 779 మంది కోలుకున్నారు. ముంబైలో 53 మంది జర్నలిస్టులు వ్యాధిబారిన ప‌డిన నేప‌థ్యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందిగా కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మాల యాజ‌మాన్యాలకు, పాత్రికేయుల‌కు సలహాప‌త్రం జారీచేసింది. ఈ మేర‌కు క్షేత్ర‌స్థాయిలోని వారితోపాటు కార్యాల‌యాల్లో ప‌నిచేసేవారి ప‌ట్ల కూడా జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని కోరింది. కాగా, అదనపు కార్యదర్శి మనోజ్ జోషి నేతృత్వంలోని మంత్రివ‌ర్గ ఉప‌సంఘం బృందం ఇవాళ ధార‌వి ప్రాంతాన్ని సందర్శించి మార్గ‌మ‌ధ్య శిబిరం, దిగ్బంధం చికిత్స స‌దుపాయాలు త‌దిత‌రాల‌ను పరిశీలించింది. ఈ బృందం వెంట రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే కూడా ప‌రిశీల‌న‌లో పాల్గొన్నారు. అటుపైన ఐఎంసిటి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి, న‌గ‌ర‌పాల‌క సంస్థ‌ కమిషనర్, పోలీసు కమిషనర్ త‌దిత‌ర సీనియ‌ర్ ప్ర‌భుత్వాధికారుల‌తో విస్తృతంగా చర్చించింది.
  • గుజరాత్: రాష్ట్రంలో 112 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 2,178కి చేరింది. ఇప్ప‌టివ‌ర‌కూ వ్యాధిబారిన ప‌డినవారిలో 139 మంది కోలుకోగా, 90 మంది మరణించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే కేసుల సంఖ్యరీత్యా మ‌హారాష్ట్ర త‌ర్వాత గుజరాత్ రెండో స్థానంలో ఉంది.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ 64 కొత్త కేసులు నమోదవ‌గా మొత్తం కేసుల సంఖ్య 1,799కి పెరిగింది. అదనపు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (ఆరోగ్య‌) రోహిత్ కుమార్ సింగ్ క‌థ‌నం ప్ర‌కారం... ఢిల్లీలోని ప్రైవేటు లేబొరేట‌రీకి పంపిన 4,000 నమూనాల పరీక్ష ఫలితాలు అందుతున్నాయి. దీంతో కొత్త‌గా న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది.
  • చండీగ‌ఢ్‌: కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో మూసివేసిన నిర్దిష్ట ప్రాంతాల‌కు కూరగాయలు, రేషన్‌ను ఇళ్ల ముంగిట అంద‌జేయాల‌ని న‌గ‌ర పాల‌నాధికారి ఆదేశించారు. ఆ మేర‌కు ప్ర‌జ‌లు ఇళ్ల‌నుంచి బయటకు రావాల్సిన అవ‌స‌రం లేకుండా చూడ‌వ‌చ్చున‌ని పేర్కొన్నారు. కాగా, ఆయా ప్రాంత నివాసుల అవ‌స‌రాల కోసం  ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఏసీ మెకానిక్‌ల‌ జాబితాను రూపొందించి, ప్రజ‌ల‌కు అందుబాటులో ఉంచారు.
  • పంజాబ్: ‌కోవిడ్‌-19 ఆంక్ష‌ల న‌డుమ గోధుమల కొనుగోళ్ల‌కు స‌మ‌స్య‌లు రాకుండా  పంజాబ్ మండీ బోర్డు రబీ మార్కెటింగ్ సీజన్ 2020-21కి సంబంధించిన 409 అదనపు బియ్యం షెల్లర్లను సబ్ మండీ యార్డులుగా మార్చింది. మ‌రోవైపు ప్ర‌తికూల పరిస్థితుల మ‌ధ్య సమర్ధంగా ఏర్పాట్లు చేయ‌డంతో ఇప్పటిదాకా 8.95 ల‌క్ష‌ల ట‌న్నుల గోధుమలు కొనుగోలు కేంద్రాల‌కు చేరాయి. వీటిలో 7.54 ల‌క్ష‌ల ట‌న్నుల‌ను వివిధ ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేశాయి. ఇక గత వారం కేంద్ర దేశీయాంగ శాఖ‌, పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేర‌కు ప్రామాణిక నిర్వ‌హ‌ణ ప్ర‌క్రియ‌ల‌కు లోబ‌డి కార్యకలాపాలను ప్రారంభించే పారిశ్రామిక యూనిట్లు, పరిశ్రమలు ఇత‌ర వాణిజ్య సంస్థ‌లు వాణిజ్య‌-ప‌రిశ్ర‌మ‌లశాఖ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చున‌ని ప్ర‌భుత్వం తెలిపింది.
  • హర్యానా: రాష్ట్రంలో దిగ్బంధం నుంచి స‌డ‌లింపు ఇచ్చిన నేప‌థ్యంలో పరిశ్రమలు, ఇత‌ర సంస్థ‌లు పాసుల కోసం “saralharyana.gov.in” పోర్ట్పల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చున‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అలాగే రాష్ట్రాల మ‌ధ్య వాహనాల రాక‌పోక‌లకు ఇ-పాస్ కోసం “covidpass.egovernments.org/requester-dashboard” ద్వారా ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో ప్ర‌స్తుత కర్ఫ్యూ 2020 మే 3 వర‌కూ కొనసాగుతుందని ముఖ్యమంత్రి ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం కరోనా వైరస్ బారిన‌ప‌డ‌ని ప్రాంతాల‌కు అది వ్యాపించ‌కుండా చూసేందుకే క‌ర్ఫ్యూను క‌ఠినంగా అమ‌లు చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. కాగా, రాష్ట్రానికి ఎన్ -95 సర్జికల్ మాస్క్‌లు అంద‌జేయ‌డంపై గౌరవనీయులైన రాష్ట్రపతికి ఆయ‌న కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రప‌తి చూపిన విత‌ర‌ణ‌తో  రాష్ట్రంలోని క‌రోనా పోరాట యోధుల‌లో విశ్వాసాన్ని మ‌రింత పెంచుతుందని పేర్కొన్నారు.
  • జ‌మ్ముక‌శ్మీర్: ఈ కేంద్ర‌పాలిత ప్రాంతంలోని క‌శ్మీర్ డివిజ‌న్‌లో ఇవాళ 27 కొత్త కేసులు రావ‌డంతో మొత్తం కేసుల సంఖ్య 407కు చేరింది. ఈ మేర‌కు జమ్మూ-56, క‌శ్మీర్-351 వంతున‌ కేసులు న‌మోద‌వ‌గా ఈ రెండు ప్రాంతాల్లో ఒక్కొక్క‌టి వంతున ఆర్మీ రెండు కోవిడ్‌-19 ఆస్ప‌త్రులను ఏర్పాటు చేస్తోంది. కోవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కొన‌డంలో పౌర యంత్రాంగానికి పూర్తి సహకారం ఇస్తామ‌న్న హామీ మేర‌కు సైన్యం ఈ ఆస్పత్రులను చేస్తోంది.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో ఇప్పటిదాకా 12,366 మంది వినియోగదారులకు ఉచిత వంట‌గ్యాస్ సిలిండర్లు స‌ర‌ఫ‌రా అయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్ జిల్లాలోగ‌ల మారుమూల ప్రాంతాలకు అవసరమైన వస్తువులు, వైద్య పరికరాలను సరఫరా చేయడం కోసం భార‌త వాయుసేన ఇప్ప‌టిదాకా 4 ద‌ఫాలుగా హెలికాప్ట‌ర్ల‌ను న‌డిపింది.
  • అస్సాం: రాష్ట్రంలో కోవిడ్‌-19 దిగ్బంధం న‌డుమ తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించే దిశ‌గా ప్రైవేట్ పాఠశాలలు ఏప్రిల్ నెలలో 50% ఫీజులను మాఫీ చేయాలని ఆరోగ్యశాఖ‌ మంత్రి హిమంత బిశ్వశర్మ సామాజిక మాధ్య‌మం ట్విట్ట‌ర్ ద్వారా సూచించారు. కాగా, రాష్ట్ర పంచాయతీ-గ్రామీణాభివృద్ధి శాఖ ప్ర‌ధాన‌మంత్రి గరీబ్ క‌ల్యాణ్ యోజ‌న కింద ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీద్వారా 8,51,642 మంది లబ్ధిదారుల‌కు త‌లా రూ.500 వంతున ఆర్థిక సహాయం విడుదల చేసింది.
  • మిజోరాం: మిజోరం-త్రిపుర సరిహద్దులోని మామిట్ జిల్లాలో సరిహద్దు దిగ్బంధ విధుల్లోగ‌ల ఇద్ద‌రు పోలీసుల‌పై దాడిచేసిన వ్యక్తుల బృందంపై కేసు న‌మోదు చేసి, విచారణ చేప‌ట్టాల‌ని రాష్ట్ర డీజీపీ ఆదేశించారు.
  • నాగాలాండ్: రాష్ట్రంలో పీపీఈల కొనుగోలు-నాణ్యత నియంత్రణ కోసం రెండు కమిటీలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ‌ మంత్రి చెప్పారు.
  • సిక్కిం: ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న కింద 2020 ఏప్రిల్ 23 నుంచి బియ్యం, ప‌ప్పు దినుసుల‌ను నిబంధనల ప్రకారం రేష‌న్ దుకాణాల ద్వారా పంపిణీ చేయ‌నున్న‌ట్లు ఉత్త‌ర‌ సిక్కిం జిల్లా పాల‌న యంత్రాంగం తెలిపింది.
  • త్రిపుర: వలస కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్-19 ప్యాకేజీలో భాగంగా త్రిపురలోని ఖోవాయ్ జిల్లా పాల‌న యంత్రాంగం ఇటుక బట్టీ కార్మికులకు త‌లా రూ.1000 వంతున అంద‌జేసింది. దీంతో  157 మంది వలస కార్మికులు లబ్ధి పొందారు.
  • కేరళ: రాష్ట్రంలోని పతనంతిట్ట‌లో 62 ఏళ్ల మ‌హిళ‌కు 43 రోజుల తర్వాత కోవిడ్ ప‌రీక్ష‌ల్లో వ్యాధిలేద‌ని తేలింది. కాగా, కోళికోడ్ వైద్య క‌ళాశాల‌లో ఇద్ద‌రు హౌస్ సర్జన్లకు వ్యాధి నిర్ధార‌ణ అయింది. వీరు ఢిల్లీ త‌బ్లిఘీ-జ‌మాత్‌కు హాజ‌రైన‌వారితో క‌ల‌సి రైలులో ప్ర‌యాణించిన‌ట్లు భావిస్తున్నారు. మ‌రోవైపు ఒక రోగితో సంబంధంగ‌ల‌వారు కొళ్లం స‌రిహ‌ద్దు గ్రామంలో ఉన్న‌ట్లు తేల‌డంతో ఆ ప్రాంతంలో నిఘా పెంచారు. త‌మిళ‌నాడులో స‌రిహ‌ద్దు ప్రాంతాల్లోనూ త‌నిఖీ కేంద్రాల‌ను కేర‌ళ ప్ర‌భుత్వం బ‌లోపేతం చేసింది. కాగా, ముఖ్య‌మంత్రి విప‌త్తు స‌హాయ నిధి కోసం ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాల్లో 5 నెలలపాటు 6 రోజుల జీతం తగ్గించాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. రాష్ట్రంలో మొత్తం న‌మోదిత కేసుల సంఖ్య‌ 426 కాగా వీటిలో 117 యాక్టివ్ కేసులున్నాయి.
  • తమిళనాడు: రాష్ట్రంలో కోవిడ్‌-19 పోరులో ముందువ‌రుస‌లోగ‌ల వారు మ‌ర‌ణిస్తే వారి బంధువులకు రూ.50 లక్షల ప‌రిహారంతోపాటు ఉద్యోగం ఇస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కాగా, కోవిడ్‌తో మరణించిన వైద్యుడి అంత్యక్రియల వద్ద సిబ్బందిపై దాడి చేసిన‌వారిలో మరో 69 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
  • పుదుచ్చేరి: ముఖ్య‌మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ముందు జాగ్ర‌త్త‌లో భాగంగా కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష చేయించుకోనున్నారు. కాగా, త‌మిళ‌నాడులో ఇప్ప‌టిదాకా 1,596  కేసులు న‌మోదుకాగా, వాటిలో యాక్టివ్ కేసులు: 940గానూ, మరణాలు: 18గానూ, డిశ్చార్జ్ అయిన‌వారి సంఖ్య‌: 635గానూ ఉంది. కాగా, అత్య‌ధికంగా  చెన్నైలో 358, కోయంబత్తూర్‌లో 134 కేసులు న‌మోద‌య్యాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలో 7 కొత్త కేసులు రాగా, మొత్తం కేసుల సంఖ్య‌ 425కు చేరింది. కొత్త కేసుల‌లో కల్బుర్గి 5, బెంగళూరు 2 న‌మోద‌య్యాయి. ఇప్పటిదాకా 129 మంది డిశ్చార్జి అయ్యారు.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో గడ‌చిన 24 గంటల్లో 56 కొత్త కేసులు రాగా మొత్తం కేసుల సంఖ్య 813కు చేరింది. కాగా, మరణాలు: 24, డిశ్చార్జి అయిన‌వారు: 120 మంది, యాక్టివ్ కేసులు: 669గా ఉన్నాయి. ప్రతి రెడ్ జోన్‌లో ప్ర‌భుత్వం ప్రత్యేక అధికారులను నియమిస్తోంది. మ‌రోవైపు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో గృహ హింస హెల్ప్‌లైన్ నంబర్లను ప్రారంభించింది. ఇక పాజిటివ్ కేసుల‌లో కర్నూలు 203, గుంటూరు 177, కృష్ణ 86, నెల్లూరు 67, చిత్తూరు 59, కడ‌ప 51 వంతున అగ్ర‌స్థానంలో ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్ర రాజ‌ధాని హైదరాబాద్‌కు 135 కిలోమీటర్ల దూరంలోగ‌ల సూర్యాపేటలో కోవిడ్ వ్యాధి వేగంగా  వ్యాప్తి చెంద‌డంపై ఆరోగ్యశాఖ‌ అధికారులు ఆందోళన చెందుతున్నారు, ఈ మేర‌కు ఇవాళ అక్క‌డ‌ 26 కొత్త కేసులు నమోదవ‌డంతో మొత్తం కేసుల సంఖ్య 56 కేసులకు చేర‌గా, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 928కి పెరిగింది.

Fact Check on #Covid19

 

 

******


(Release ID: 1617334) Visitor Counter : 497