నౌకారవాణా మంత్రిత్వ శాఖ

భారత నౌకాశ్రయాల వద్ద నావికుల ప్రవేశానికి, నిష్క్రమణ మరియు వారి కదలికలకు ఎస్.ఓ.పి. లు జారీ.

ఓడ రేవులలో సిబ్బంది మారడానికి ఇప్పుడు అవకాశం ఉంటుందని పేర్కొంటూ ఈ చర్యను స్వాగతించిన -శ్రీ మన్ సుఖ్ మాండవీయ.

Posted On: 22 APR 2020 1:28PM by PIB Hyderabad

భారత నౌకాశ్రయాల వద్ద నావికుల ప్రవేశానికి, నిష్క్రమణ మరియు వారి కదలికలకు ఎస్.ఓ.పి. లు జారీ చేయడం పట్ల కేంద్ర షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్)  శ్రీ మన్ సుఖ్ మాండవీయ హర్షం వెలిబుచ్చారు.  ఈ మేరకు అయన ఒక ట్వీట్ చేస్తూ, ఓడ రేవులలో సిబ్బంది మారడానికి ఇది అవకాశం కల్పిస్తుందని అన్నారు. వేలాదిమంది నావికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇది తీరుస్తుందని ఆయన చెప్పారు. 

 

వాణిజ్య నౌకల్లో సిబ్బంది (నావికులు) మారడం అనేది ఒక ముఖ్యమైన చర్య.  ఇందుకోసం హోంమంత్రిత్వశాఖ 2020 ఏప్రిల్ 21వ తేదీన ఒక నిర్దిష్టమైన పరిపాలనా పద్ధతి (ఎస్.ఓ.పి.) ని జారీ చేసింది. వాణిజ్య నౌకల కోసం భారతీయ నౌకాశ్రయాల్లో భారత నావికుల ప్రవేశం, నిష్క్రమణలను క్రమబద్దీకరించడం కోసం ఈ ఎస్.ఓ.పి. ని రూపొందించారు. 

ఇందుకోసం జారీ చేసిన మార్గదర్శకాలు ఈ విధంగా ఉన్నాయి :

I.          ప్రవేశించే సమయంలో :

i.   నౌకలోకి వెళ్లే భారత నావికులను ఓడ యజమానులు / నియామక సేవలు (ఆర్.పి.ఎస్.) అందించే సంస్థలు గుర్తిస్తాయి. 

ii.  నావికులు గత 28 రోజులు ఇక్కడెక్కడికి తిరిగారు, ఎక్కడ ఉన్నారనే వివరాలను డైరెక్టర్ జనరల్ అఫ్ షిప్పింగ్ (డి.జి.ఎస్.) నిర్దేశించిన విధానం ప్రకారం ఓడ యజమాని / ఆర్.పీఎస్. ఏజెన్సీ కి ఈ-మెయిలు  ద్వారా తెలియజేయాలి. 

iiiడి.జి.ఎస్. ఆమోదించిన వైద్య అధికారి చేత ఇందుకోసం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం నావికులకు పరీక్షలు నిర్వహిస్తారు.  అదే సమయంలో, నావికులకు స్క్రీనింగ్ చేస్తారు. గత 28 రోజుల్లో వారి ప్రయాణ, చిరునామా వివరాలను పరీక్షిస్తారు. కోవిడ్-19 లక్షణాలు ఉన్నాయా అని పరిశీలిస్తారు. నౌకలో ప్రయాణానికి అనువుగా ఉంటేనే ప్రవేశానికి అనుమతిస్తారు. 

iv.    నావికులు ఓడలో ప్రవేశించేందుకు అనుమతి గురించి స్థానిక అధికార యంత్రాంగానికి సమాచారం తెలియజేస్తూ, నావికులు నివసిస్తున్న ప్రదేశం నుండి ఓడ ఎక్కే ప్రదేశం వరకు ట్రాన్సిట్ పాస్ తీసుకోవాలి.  

v.    నావికునితో పాటు ఒక డ్రైవర్ కి కూడా రోడ్డు మార్గం గుండా ప్రయాణించడానికి నావికుడు నివసించే రాష్ట్ర ప్రభుత్వం / కేంద్ర పాలితప్రాంతం ట్రాన్సిట్ పాస్ జారీ చేయాలి. 

vi.    ముందుగా నిర్ణయించిన మార్గంలో, నిర్ణయించిన కాలంలో మాత్రమే ఖచ్చితంగా కట్టుబడి ఉండే విధంగా రాను పోను ట్రాన్సిట్ పాస్ జారీ చేస్తారు.  ఆ ట్రాన్సిట్ మార్గంలో ఉండే రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు మాత్రమే ఈ ట్రాన్సిట్ పాస్ ను అనుమతిస్తారు / ఆమోదిస్తారు. 

vii.   నావికులను వారి గమ్యస్థానాలకు తీసుకువెళ్లే వాహనాలు సామాజిక దూరం, ఇతర పరిశుభ్రత వంటి నిర్ణీత ఆరోగ్య నిబంధనలను తప్పకుండా పాటించాలి.  

viii.   ఓడ ఎక్కే ప్రదేశంలో నావికుడు కోవిడ్-19 పరీక్ష చేయించుకోవాలి.  నావికునికి కోవిడ్-19 పరీక్షలో నెగిటివ్ అని నిర్ధారణ అయితేనే, నౌకలో ప్రవేశానికి అనుమతి ఇస్తారు. లేని పక్షంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శాల ప్రకారం చర్య తీసుకుంటారు. 

II.            నిష్క్రమించే సమయంలో :

i.  నౌక ఏదైనా విదేశాలకు చెందిన నౌకాశ్రయం నుండి వచ్చినట్లైతే, భారత దేశంలోని నౌకాశ్రయానికి వచ్చిన వెంటనే నౌక లోని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి తెలియజేస్తూ వివరాలను నౌకాశ్రయానికి చెందిన ఆరోగ్య అధికారులకు, ఇతర అధికారులకు అందజేయాలి.  వీటితో పాటు, నౌకాశ్రయానికి చెందిన ఆరోగ్య అధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్య ధ్రువ పత్రాలను దాఖలు చేయాలి. అవసరమైన ఆరోగ్య పద్ధతుల ప్రకారం ఓడ ను నిలపడానికి ముందు నౌకాశ్రయ అధికారుల అనుమతి తీసుకోవాలి. 

ii.    నౌకలో  నుండి వచ్చే  ప్రతి భారత నావికుడు కోవిడ్-19 పరీక్ష చేయించుకోవాలి. నెగిటివ్ అని నిర్ధారణ కావాలి. లోడ్ ఒడ్డుకు చేరుకొని టెస్టింగ్ సౌకర్యం వరకు, నౌకాశ్రయ ఆవరణలో, నావికులు నిర్ణీత ఆరోగ్య పద్ధతులన్నింటినీ అమలుచేసేలా ఓడ యజమాని బాధ్యత తీసుకోవాలి. 

iii.   నావికుని పరీక్ష నివేదికలు వచ్చే సమయం వరకు నావికులు నావికాశ్రయం / రాష్ట్ర ఆరోగ్య అధికారులు ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో ఉండాలి. 

iv.   ఒకవేళ నావికునికి కోవిడ్-19 పోజిటివ్ వచ్చినట్లైతే, వారు ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. నియమాల ప్రకారం వ్యవహరించవలసి ఉంటుంది. 

v.    నావికునికి ఒకవేళ నెగిటివ్ వచ్చినట్లైతే, ఓడ దిగిన ప్రదేశంలోని స్థానిక అధికారులు అతనికి ఇంటి వరకు ట్రాన్సిట్ పాస్ ఇస్తారు. 

vi.   నావికునితో పాటు ఒక డ్రైవర్ కు రోడ్డు ద్వారా ప్రయాణించడానికి వీలుగా నావికుడు దిగిన ఓడ రేవు ఉన్న రాష్ట్ర / కేంద్ర పాలితప్రాంత ప్రభుత్వం ట్రాన్సిట్ పాస్ జారీ చేస్తుంది.   

vii.    ముందుగా నిర్ణయించిన మార్గంలో, నిర్ణయించిన కాలంలో మాత్రమే ఖచ్చితంగా కట్టుబడి ఉండే విధంగా రాను పోను ట్రాన్సిట్ పాస్ జారీ చేస్తారు.  ఆ ట్రాన్సిట్ మార్గంలో ఉండే రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు మాత్రమే ఈ ట్రాన్సిట్ పాస్ ను అనుమతిస్తారు / ఆమోదిస్తారు. 

viii.        నావికులను వారి గమ్యస్థానాలకు తీసుకువెళ్లే వాహనాలు సామాజిక దూరం, ఇతర పరిశుభ్రత వంటి నిర్ణీత ఆరోగ్య నిబంధనలను తప్పకుండా పాటించాలి.  

 

పైన పేర్కొన్న సందర్భాల్లో ప్రవేశం, నిష్క్రమణ కోసం అనుసరించవలసిన వివరణాత్మక ప్రోటోకాల్ నిబంధనలను డి.జి.(షిప్పింగ్) నిర్దేశిస్తారు. 

  

***



(Release ID: 1617153) Visitor Counter : 289