ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
స్వచ్ఛంద రక్తదాతలను సమీకరించడం ద్వారా , రక్తమార్పిడి కోసం తగినంత రక్త నిల్వను ఉంచాలి.
మొబైల్ రక్త సేకరణ వ్యాన్లు, రక్తదాతలకు పికప్- డ్రాప్ వంటి వివిధ సౌకర్యాలను అందించాలి.
కోవిడ్ -19 నుంచి కోలుకున్న పేషెంట్లు రక్తదానానికి ముందుకు వచ్చేందుకు ప్రోత్సహించాలి. వారినుంచి సేకరించే కన్వల్‌సెంట్ ప్లాస్మాను కరోనా బాధిత పేషెంట్లు త్వరగా కోలుకోవడానికి వారికి అందిచవచ్చు: డాక్టర్ హర్షవర్ధన్
Posted On:
21 APR 2020 9:14PM by PIB Hyderabad
కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్దన్, ఈరోజు నిర్మణ్‌భవన్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా అంకితభావంతో పనిచేస్తున్న రెడ్ క్రాస్ వారియర్లకు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా వారినుద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి , కోవిడ్ -19 ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి సంబంధించిన వివరాలను వారికి తెలియజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్‌సిఎస్)కి చెంఇన ఒడిషా, తమిళనాడు, హర్యానా, ఆంధ్రప్రదేశ్, అస్సాం, తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక విభాగాలు తమ తమ బ్రాంచ్‌లు చేపడుతున్న కార్యకలాపాలను మంత్రికి వివరించాయి. వీడియో కాన్ఫరెన్స్‌లో ఐఆర్‌సిఎస్ సె క్రటరీ జనరల్ శ్రీ ఆర్.కె.జైన్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, “ కోవిడ్ -19 సంక్షోభాన్ని ఎదుర్కొవడంలో ఏమాత్రం సమయం వృథా చేయకుండా స్పందించిన దేశాలలో ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం భారతదేశం అని నేను స్పష్టం చేస్తున్నాను. కరోనా వైరస్ గురించి చైనా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి వెల్లడించిన వెంటనే భారతదేశం తక్షణం స్పందించింది. ఆ మరుసటి రోజునే భారతదేశం పరిస్థితిని పర్యవేక్షించడానికి చర్యలు ప్రారంభించింది. మొదటి జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. నేను ఛైర్మన్ గా ఒక మంత్రుల బృందాన్ని కూడా గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఏర్పాటు చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకునేదానికి దీనిని ఏర్పాటు చేశారు. కోవిడ్ -19 ప్రాణాంతక వైరస్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అత్యంత ప్రేరణతోకూడిన సమరానికి సమాయత్తం చేయడానకి ఇది ఉపయోగపడింది.” అని అన్నారు.
కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటంలో ఇండియా ముందు వరుసలో ఉంది. రాగల పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనావేస్తూ భారతదేశం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఎయిర్ పోర్టులలో , నౌకా కేంద్రాలలో , ఇరుగుపొరుగు దేశాలతో గల భూతల సరిహద్దులలో ప్రయాణికులకు ఆరొగ్య పరీక్షలు నిర్వహించింది. నిఘాను పటిష్టం చేసింది. కాంటాక్ట్‌లను గుర్తించే ఏర్పాటు చేసింది. 2020 మార్చి 23 నుంచి దేశంలోని ఏ విమానాశ్రయంలోనూ దిగకుండా అన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలనూ ఆదేశించడం జరిగిందని డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు.
“ఇంతకుముందు కోవిడ్ -19 నమూనాలను పరీక్ష కోసం అమెరికాకి పంపేవారు, ఫలితాలు రావడం చాలా ఆలస్యమయ్యేది., కాని ప్రస్తుత సంక్షోభ సమయంలో భారతదేశం కోవిడ్ నమూనాలను పరీక్షించడానికి 200 ప్రయోగశాలలను ఏర్పాటు చేసిందని డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. దీనితోపాటు , ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సరైన సమయంలో లాక్‌డౌన్‌ను విధించిందన్నారు. అంతేకాదు, ప్రస్తుతం, ఇండియాలో కోవిడ్ -19 ప్రత్యేక ఆస్పత్రులు . పిపిఇలు, ఎన్ 95 మాస్క్‌లు, వెంటిలేటర్లు, మందులు ఎన్నో ఉన్నాయన్నారు.మిగిలిన ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం ఎంతో మెరుగైన స్థితిలో ఉన్నామని ఆయన చెప్పారు.
స్వచ్ఛంద రక్త దాతలను ప్రోత్సహించడం, వారిని రక్తదాన కేంద్రాలకు తీసుకురావడానికి, తిరిగి వదిలిపెట్డడానికి తగిన సదుపాయాలు కల్పించడం ద్వారా రక్తమార్పిడికి తగినంతగా రక్త నిల్వలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డాక్టర్ హర్ష వర్ధన్ సూచించారు. దీనికితోడు , క్రమంతప్పకుండా రక్తదానం చేసే వారి వద్దకు మొబైల్ రక్త సేకరణ వ్యాన్లను పంపి, ప్రస్తుత సంక్షోభ సమయలో రక్తదానానికి ముందుకు వచ్చేట్టు చేయాల్సిందిగా ఆయన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని కోరారు.స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిందిగా రాష్ట్రాల ఆరోగ్య మంత్రులకు లేఖ రాసినట్టు కూడా డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు.
కోవిడ్ -19 నుంచి కోలుకున్న పేషెంట్లను సంప్రదించి , రక్తదానానికి వారు ముందుకువచ్చేట్టు చేయాల్సిందిగా ఐఆర్‌సిఎస్‌ను డాక్టర్ హర్షవర్ధన్ కొరారు. వీరి నుంచి సేకరించే కన్వలిసెంట్ ప్లాస్మా ను కరోనా బాధిత పేషెంట్లకు ఎక్కించవచ్చునని, ఇది వారు త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ఐఆర్‌సిఎస్ దీనిని వీలైనంత త్వరగా చేపట్టాలని, వీరినుంచి సేకరించిన రక్తాన్ని కరోనా బారిన పడిన పేషెంట్లు త్వరగా కోలుకోవడానికి వాడవచ్చని అన్నారు.
కోవిడ్ -19 వ్యతిరేక పోరాటంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు అందిస్తున్న గొప్ప సేవలు ఎంతో విలువైనవి. పరికరాలు, శానిటైజర్లు, ఆహారం, పిపిఇ కిట్లు, ఎన్ -95 మాస్క్‌లు తదితరాలను ఆస్పత్రులకు అందించడంలో వారి సహాయం అభినందించదగినదని కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్దన్ రెడ్ క్రాస్ సభ్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అన్నారు. కోవిడ్ -19 పై పోరాటంలో మరింతమందిని భాగస్వాములను చేయడంలో భాగంగా ఆయన ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఐఆర్‌సిఎస్ సెక్రటరీ జనరల్ శ్రీ ఆర్.కె.జైన్ మాట్లాడుతూ, కోవిడ్ -19 సవాలును ఎదుర్కోవడంలో భారతప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తమ స్థిర సంకల్పాన్ని రెడ్ క్రాస్ సభ్యులు మరోసారి పునరుద్ఘాటిస్తున్నారని చెప్పారు. ప్రపంచంలోని 215 దేశాలను చుట్టుముట్టిన కోవిడ్ -19 మహమ్మారిని ఓడించేందుకు మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ ఒక స్వచ్ఛంద మానవతా సంస్థ. దీనికి దేశవ్యాప్తంగా 1100 శాఖలు ఉన్నాయి. ఇవి విపత్తులు, అత్యవసర సమయాలలో సహాయాన్ని అందించడంతోపాటు పేదల ఆరోగ్యం, సంరక్షణకు కృషి చేస్తుంది. ఇండియన్ రెడ్ క్రాస్ లక్ష్యం ప్రేరణనివ్వడం, ప్రోత్సహించడం, అన్ని సమయాలలో , అన్ని సందర్భాలలో మానవతా కార్యకలాపాలకు సహాయపడడం తద్వారా మానవాళి బాధలను తగ్గించడం అని ఆయన పేర్కొన్నారు.
చివరగా డాక్టర్ హర్షవర్థన్, వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ -19 పై అలుపెరుగని పోరాటం సాగించాలని అందుకు వారు తమ మంచి పనిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
***
(Release ID: 1616953)
Visitor Counter : 217