మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో ఈ-లెర్నింగ్ కంటెంట్ సహకారాన్ని ఆహ్వానించడానికి
విద్యాదాన్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మానవ వనరుల అభవృద్ధి శాఖ మంత్రి
- ఈ-లెర్నింగ్ కంటెంట్‌ను అభివృద్ధి చేయడానికి, అందించడానికి విద్యాదాన్ ఒక సాధారణ జాతీయ కార్యక్రమం, దేశ వ్యాప్తంగా మేటి గుర్తింపు పొందేందుకు ఒక చక్కని అవకాశం - కేంద్ర హెచ్‌ఆర్‌డీ మంత్రి పోఖ్రియాల్
- దీక్ష యాప్‌లో అందించే సమాచారం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు ఎప్పుడైనా, ఎక్కడైనా వారి అభ్యాసాన్ని కొనసాగించడానికి సహాయపడుతుంది- శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్
Posted On:
22 APR 2020 5:08PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో ఈ-లెర్నింగ్ కంటెంట్ రచనలను ఆహ్వానించడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్ఆర్‌డీ) మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ "విద్యాదన్ 2.0 " అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. హెచ్ఆర్‌డీ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ-లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాలతో పాటుగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల నుంచి ఈ-లెర్నింగ్ కంటెంట్ కోసం పెరుగుతున్న అవసరం ఆసక్తి నేపథ్యంలో సర్కారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం విశేషం. ముఖ్యంగా కోవిడ్-19 వ్యాప్తి వల్ల ఉత్పన్నమవుతున్న పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులలో అభ్యాసాన్ని పెంచడానికి, డిజిటల్ విద్యను పాఠశాల విద్యతో అనుసంధానించాల్సిన అవసరం ఎంతోగానో ఏర్పడింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఆర్‌డీ) దీక్ష వేదిక 2017 సెప్టెంబరు నుంచి తన డిజిటల్ లెర్నింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 30కి పైగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో బోధన మరియు అభ్యాస ప్రక్రియలను పెంచడానికి గాను దీక్ష ఎంతగానో దోహదం చేస్తోంది. నవ్య కోవిడ్-19 వ్యాప్తి కారణంగా ఏర్పడిన అనూహ్య సంక్షభ పరిస్థితులు పాఠశాల, ఉన్నత విద్యపై వివిధ రకాలుగా ప్రభావం చూపుతోంది. దీంతో ఈ యాప్ వాడుతున్న రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు పాఠశాల, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల కోసం ఈ-లెర్నింగ్ కంటెంట్‌ను బలోపేతం చేయడానికి ఇది సరైన సమయం, మంచి అవకాశం కూడాను. దేశ వ్యాప్తంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు దీక్ష ద్వారా సంభావ్య వినియోగం పెంచేలా దీనిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. దీక్ష యొక్క స్థాయి మరియు సామర్థ్యాన్ని గ్రహించిన బహుళ సంస్థలు, విద్యా సంస్థలు మరియు విద్యా ప్రముఖులు వ్యక్తులు దీక్షపై డిజిటల్ వనరులను అందించడానికి ఎంతగానో ఆసక్తి కనబరుస్తూ వస్తున్నారు. భారత ప్రభుత్వం ఇటీవల జరిపిన దీక్ష సమీక్ష సమావేశాలలో, నిపుణులైన ఉపాధ్యాయులు / వ్యక్తులు మరియు సంస్థల నుండి విద్యాదాన్ కార్యక్రమం కింద అధిక నాణ్యత గల కంటెంట్‌ను పొందడానికి క్రౌడ్‌సోర్సింగ్ సాధనాలను ఉపయోగించుకోవాల్సిన అవశ్యకత నొక్కి చెప్పబడింది.
జాతీయ కార్యక్రమంగా రూపకల్పన..
ఈ సందర్భంగా మంత్రి రమేష్ పోఖ్రియాల్ మాట్లాడుతూ విద్యార్థులకు, విద్యా సంస్థలకు విద్యాదాన్ ఒక జాతీయ కార్యక్రమంగా రూపొందించబడిందని అన్నారు. దేశంలో విద్యా సంస్థలు నాణ్యమైన అభ్యాసనం కొనసాగింపు నిర్ధారించడానికి పాఠశాల మరియు ఉన్నత విద్యలు రెండింటిని ఈ-లెర్నింగ్ వనరులను విరాళంగా ఇవ్వడానికి / అందించడానికి సాధారణ జాతీయ కార్యక్రమంగా విద్యాదాన్ ను రూపొందించినట్టుగా తెలిపారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు ఎప్పుడైనా మరియు ఎక్కడైనా తమ అభ్యాసాన్ని కొనసాగించడానికి దీక్ష యాప్‌లో పొందుపరిచిన కంటెంట్ ఎంతగానో ఉపయోగించబడుతుందని ఆయన అన్నారు.
ఆసక్తి గలవారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
కంటెంట్ సహకారం అందించాలనుకునే వారి కోసం విద్యాదాన్‌లో ప్రత్యేక టూల్ అందుబాటులో ఉందని మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. ఇందులో నిర్మాణాత్మక ఇంటర్‌ఫేస్ ఉంటుందని తెలిపారు. దీని ద్వారా కంటెంట్ అందించే వారు తమ పేర్లను నమోదు చేసుకొనేందుకు వివిధ రకాలైన కంటెంట్‌ను (వివరణాత్మక వీడియోలు, ప్రెజెంటేషన్లు, సమర్థత-ఆధారిత అంశాలు, క్విజ్‌లు మొదలైనవి) నమోదు చేయడానికి వీలుంటుందని మంత్రి తెలియజేశారు. ఆయా రాష్ట్రాలు / యుటీలలో నిర్ధేశించిన ఏ గ్రేడ్ వారికైనా (గ్రేడ్ 1 నుండి 12 వరకు) కంటెంట్‌ను అందించేలా ఏర్పాట్లు ఉన్నట్టుగా మంత్రి తెలిపారు. విద్యావేత్తలు, విషయ నిపుణులు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సంస్థలు, ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులు మొదలైన వారు కంటెంట్‌ను అందించవచ్చని ఆయన తెలియజేశారు. ఈ-లెర్నింగ్ కంటెంట్ అందించాలని భావించే వారందరికి దీక్ష వేదిక గర్వకారణంగా మరియు జాతీయ గుర్తింపుగా నిలుస్తుందని శ్రీ పోఖ్రియాల్ అన్నారు. కంటెంట్‌ను ఆహ్వానించడానికి రాష్ట్రాలు / యుటీలు తమదైన ప్రత్యేకమైన వర్గీకరణను కలిగి ఉంటాయని అన్నారు. విద్యాదాన్ కార్యక్రమం త్వరలో ఉపాధ్యాయ శిక్షణా సామగ్రి కోసం సహకారాన్ని కూడా ఆహ్వానించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ మేరకు ఆసక్తిగల వారి నుంచి కంటెంట్ తీసుకొని వాటిని నాణ్యత మేరకు తగు విధంగా అనుమతించి అభ్యాసన కంటెంట్‌లో జోడించడం జరుగుతుందని అన్నారు. విద్యాదాన్ ద్వారా నామినేషన్, సహకారంతో పాటు మరింత సమాచారం కోసం https://vdn. diksha.gov.in/ ని సందర్శించవచ్చు లేదా https://diksha.gov.in/ వెబ్‌సైట్ కు వెళ్లి విద్యాదాన్ పై క్లిక్ చేయవచ్చు.
***
(Release ID: 1617243)
Visitor Counter : 308