ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

పర్యావరణాన్ని కాపాడుకునేందుకు, పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన ధరిత్రి నిర్మాణానికి పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి
· స్వచ్ఛమైన పర్యావరణాన్ని యధావిధిగా ముందు తరాలకు అందించాలి

· ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలి

· పునరుత్వాదక ఇంధనం, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్, క్లీన్ టెక్నాలజీ మరియు ఎలక్ట్రిక్ వాహనాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

· ఏప్రిల్ 22న ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సందేశం

Posted On: 21 APR 2020 6:15PM by PIB Hyderabad

పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరం కంకణబద్ధులు కావాలని భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన తన సందేశాన్ని విడుదల చేశారు. ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం ద్వారానే మనిషి మనుగడ సరైన మార్గంలో ముందుకు సాగుతుందని విశ్వసిస్తానన్న ఆయన, మన జీవితాలను మార్చేందుకు అదే విధంగా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మన జీవన విధానంలో మార్పులు రావలసిన అవసరం ఉందని, దీన్ని ఒకటి రెండు రోజులకు పరిమితం చేయకుండా జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రభుత్వాల బాధ్యత ఎంత ఉందో, ప్రతి మనిషి బాధ్యత కూడా అంతే ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించగలిగితే, ధరిత్రి దినోత్సవం గురించి భవిష్యత్తులో ఇలా మాట్లాడుకోవలసిన అవసరం రాదని భావిస్తున్నట్లు ఆయన సందేశంలో పేర్కొన్నారు.

ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సందేశం

ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈ నేలను, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరం కంకణబద్ధులం కావాలి. మన పెద్దలు మనకు అందించిన స్వచ్ఛమైన పర్యావరణాన్ని, యధావిధిగా మన ముందు తరాలకు అందించేందుకు ప్రతిన బూనాల్సిన అవసరం ఉంది.

నేల తల్లి అనే మాట వినపడగానే మా తాతగారు గుర్తుకు వస్తారు. చిన్నతనంలో ఆయన దగ్గరే పెరగడం వల్ల నా జీవితం మీద, నా వ్యక్తిత్వం మీద ఆయన ప్రభావం చాలానే ఉంది. నేల గురించి ఆయన చెప్పిన కొన్ని మాటలు నాకు ఇప్పటికీ గుర్తే. నేల... తల్లి లాంటిది. మనల్ని పెంచి పోషించడానికి అమ్మ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో, అమ్మను జాగ్రత్తగా చూసుకోవడానికి మనం కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి. అమ్మ లేని మనిషే కాదు, అన్నం తినని మనిషి కూడా ఉండడు. అందుకే ప్రతి మనిషి నేలను అమ్మలాగే చూసుకోవాలి అని ఆయన ఎప్పుడూ చెబుతుండే వారు. అందుకే నేను పర్యావరణ పరిరక్షణ గురించి చెబుతూ ఉంటాను. ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం ద్వారానే మనిషి మనుగడ సరైన మార్గంలో ముందుకు సాగుతుందని విశ్వసిస్తుంటాను.

విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి శిఖరాల్ని చూస్తున్న తరుణంలో భూ పరిరక్షణ గురించి మాట్లాడుకోవలసి రావడం ఒక్కోసారి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. మన పూర్వికులు మనకు ఎంతో స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించారు. అయితే దాన్ని మనం ఎంత వరకూ కాపాడుకుంటున్నామని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. నేల బాగుంటే మనమూ బాగుంటాం. అలాంటి తల్లి  అనాలోచిత మానవ చర్యల వల్ల కలుషితం అవుతూనే ఉంది. ప్రకృతి విరుద్ధంగా చేస్తున్న చర్యల వల్ల భూమి వేడెక్కుతోంది. ఇంధనాల విచ్చలవిడి వాడకం వల్ల వాయు కాలుష్యం పెచ్చు మీరుతోంది. నగరాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతున్నాయి. చివరకు నేలను అమ్మకన్నా మిన్నగా చూసుకునే అన్నదాతలు సైతం రసాయనాల వాడకంతో నేలతల్లి పట్ల చేస్తున్న అపచారాన్ని గుర్తించడం లేదు.

1970లో ప్రారంభమైన ఈ ధరిత్రి దినోత్సవం 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ ఏడాది పర్యావరణ చర్యలు (climate action) నేపథ్యంతో జరుపుకుంటున్నాం. వాతావరణ మార్పులు ప్రస్తుతం ప్రపంచానికి సవాలు విసురుతున్నాయి. అందుకే ఈ ఏడాది ఈ అంశాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో మన జీవితాలను మార్చేందుకు అదే విధంగా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మన జీవన విధానంలో మార్పులు రావలసిన అవసరం ఉంది. ఇది ఒక రోజుకు కాదు మన జీవితానికి అన్వయించుకోవలసిన అవసరం ఉంది.

ఇందు కోసం మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. తరిగిపోయే వనరులకు బదులు, పునర్వినియోగించుకోగలిగే వనరుల మీద దృష్టి పెట్టాలి. పర్యావరణ పరిరక్షణతో పాటు హరిత ఆర్థికాభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించాలి. చౌకైన, సమర్థవంతమైన సౌర విద్యుత్ లాంటి వాటి మీద దృష్టి కేంద్రీకరించాలి. గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించగలిగే సాంకేతిక పరిజ్ఞానం మీద దృష్టి పెట్టాలి. అడవుల పెంపకం, జీవ వైవిధ్య సంరక్షణ కోసం ప్రతిన బూనాలి. వ్యక్తిగత రవాణా స్థానంలో సమర్థవంతమైన ప్రజారవాణాను వినియోగించుకోవాలి. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్, క్లీన్ టెక్నాలజీస్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది. సహజ వనరులను పరిరక్షించడానికి  వినియోగం తగ్గించడం, పునర్వినియోగం మరియు రీసైకిల్ అనే మంత్రాన్ని అవలంబించాలి.  వీటితో పాటు ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. రసాయనాలు వాడని వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం అందించాలి. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రభుత్వాల బాధ్యత ఎంత ఉందో, ప్రతి మనిషి బాధ్యత కూడా అంతే ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించగలిగితే, ధరిత్రి దినోత్సవం గురించి భవిష్యత్తులో ఇలా మాట్లాడుకోవలసిన అవసరం రాదని భావిస్తున్నాను.

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మన మధ్య దూరం ఉండాలని చెబుతుందే తప్ప, పర్యావణాన్ని కాపాడుకునే దిశగా మనం వేసే అడుగులను అది ఆపలేదు. అంతే కాదు భయపడి పారిపోతుంది కూడా. ప్రస్తుత పరిస్థితి ఇలానే కొనసాగితే భూతాపం మరింత పెరిగి, 2100 కల్లా భూమి మీద మానవుడు బ్రతికే పరిస్థితి ఉండబోదని పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి. సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం, సస్యశ్యామలాం మాతరం వందే మాతరం... అని నిత్యం నినదించే మనం భవిష్యత్ తరాలకు ఎలాంటి భూమిని అందించబోతున్నాం. వందేమాతరం గీతం స్ఫూర్తిని ప్రతి మదిలోనూ నింపుకుని మన నేలతల్లిని మనమే కాపాడుకునేందుకు సిద్ధం కావాలి. మన పూర్వీకులు అందించిన స్వచ్ఛమైన గాలి, నీరు, నేలను యధావిధిగా ముందు తరాలకు అందించడం తమ బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. పరిశుభ్రత, పచ్చదనంతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను.(Release ID: 1616861) Visitor Counter : 2050