పర్యటక మంత్రిత్వ శాఖ

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అక్టోబర్ 15 వరకు హోటళ్ళు/ రెస్టారెంట్లు మూసివేయాలంటూ పర్యాటక మంత్రిత్వ శాఖ ఎలాంటి లేఖను విడుదల చేయలేదు

Posted On: 22 APR 2020 2:01PM by PIB Hyderabad

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అక్టోబర్ 15, 2020 వరకు హోటళ్ళు/ రెస్టారెంట్లు మూసివేసి ఉంటాయ‌ని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ పేరుతో ఒక న‌కిలీ లేఖ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ లేఖ మొత్తం పర్యాటక రంగంలో భయాందోళనలు సృష్టిస్తుండ‌డంతో ప్ర‌భుత్వం దీనిపై స్పందించింది. హోటళ్ళు/ రెస్టారెంట్లు మూసివేత‌కు సంబంధించి ఒక న‌కిలీ లేఖ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌డం త‌మ ప‌రిశీల‌న‌కొ‌చ్చింద‌ని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. హోటళ్ళు/ రెస్టారెంట్లు మూసివేత‌కు సంబంధించి "పర్యాటక మంత్రిత్వ శాఖ ఎటువంటి లేఖ జారీ చేయలేదు" అని స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి అవాస్త‌వ‌ వార్తల్ని నమ్మకూడద‌ని కోరింది. ఇదే విష‌యాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో https://twitter.com/PIBFactCheck /status/1247754535818293248?s=20 పూర్తి వివ‌ర‌ణ‌ను ఇచ్చింది.

ఈ వార్త‌పై తాము ఖండ‌న‌ను జారీ చేసిన‌ట్టుగా కూడా ప‌ర్యాట‌క మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి తోడు ఈ న‌కిలీ లేఖ‌కు సంబంధించి ముంబ‌యి పోలీస్‌కు చెందిన సైబ‌ర్ క్రైమ్ యూనిట్ వారికి తాము ఫిర్యాదు కూడా చేసిన‌ట్టుగా ప‌ర్యా‌ట‌క శాఖ వెల్ల‌డించింది. కోవిడ్ కార‌ణంగా హోటళ్ళు/ రెస్టారెంట్లు మూసివేత‌కు సంబంధించిన వార్త‌ల‌ను పీఐబీ ఫాక్ట్ చెక్ యూనిట్ కూడా కొన్ని రోజుల క్రిత‌మే ఖండించింది. అయినా ఈ న‌కిలీ స‌మాచారం తిరిగి చ‌క్క‌ర్లు కొడుతూనే వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో న‌కిలీ వార్త‌ల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌వద్ద‌ని వాటిని విస్మ‌రించాల‌ని స‌ర్కారు కోరింది. అధికారికంగా విడుద‌ల చేసే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ప‌ర్యా‌ట‌క శాఖ కోరింది. (Release ID: 1617045) Visitor Counter : 236