రైల్వే మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలకు రోజూ 2.6 లక్షల భోజనాలు; రైల్వేమంత్రిత్వ శాఖ సంసిద్ధత
నామమాత్రపు ధర రూ.15; స్పందనను బట్టి సరఫరా పెంపు
అన్నార్తులకు నిత్యం ఉచిత ఆహార పంపిణీకి ఇది అదనం
కోవిడ్-19 నేపథ్యంలో దిగ్బంధం వేళ భారత రైల్వేల ఔదార్యం
Posted On:
22 APR 2020 12:57PM by PIB Hyderabad
జాతీయ దిగ్బంధాన్ని మే 3వరకూ పొడిగించిన నేపథ్యంలో దుర్బలవర్గాల సంరక్షణ, ఆహార సరఫరాకు భరోసా ఇవ్వడం తప్పనిసరి. ఈ మేరకు దిగ్బంధం మొదలైన నాటినుంచే భారత రైల్వేశాఖ అన్నివిధాలా అవిరళ కృషితోపాటు అనితరసాధ్యంగా వితరణశీలత ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా సరఫరా శృంఖలాన్ని, రవాణా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆహారం, మందులు తదితర నిత్యావసరాలను మారుమూల ప్రాంతాలకు రవాణా చేస్తోంది. దీంతోపాటు అన్నార్తులకు నిత్యం ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తోంది. దీనికి అదనంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లోగల తమ వంటశాలల నుంచి రూ.15 నామమాత్రపు ధరతో రాష్ట్రాలకు రోజూ 2.6 లక్షల భోజనాలు సరఫరా చేస్తామని సంసిద్ధత తెలిపింది. ఆయా జిల్లా యంత్రాంగాలు ఈ భోజనాలను తీసుకెళ్లి, పేదలకు పంపిణీ చేయవచ్చునని సూచిస్తూ సమాచారం పంపింది. రాష్ట్రాలనుంచి వచ్చే స్పందననుబట్టి ఆహార పొట్లాల సరఫరా పెంచుతామని ప్రకటించింది. దిగ్బంధం ప్రకటించాక 2020 మార్చి 28 నుంచి నిత్యం లక్ష వేడివేడి ఆహార ప్యాకెట్లను పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు గుర్తుచేసింది. ఈ మేరకు నిన్నటిదాకా 20.5 లక్షల ప్యాకెట్లను అన్నార్తులకు అందజేసినట్లు తెలిపింది. ఇందుకోసం వివిధ రైల్వే జోన్లలోని ఐఆర్‌సీటీసీ ప్రధాన వంటశాలల్లో సిబ్బంది శుచి-శుభ్రతలతోపాటు సామాజిక దూరం పాటిస్తూ నిర్విరామంగా శ్రమిస్తున్నారని వివరించింది.
*****
(Release ID: 1617004)
Visitor Counter : 264
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada