వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ఆహార భద్రత, రక్షణ, పోషకాహారం పై కోవిడ్-19 ప్రభావం అనే అంశంపై జి-20 దేశాల వ్యవసాయ మంత్రుల అసాధారణ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న - శ్రీ నరేంద్ర సింఘ్ తోమర్.

సామాజిక దూరం నిబంధనను పాటిస్తూ అన్ని వ్యవసాయ కార్యకలాపాలనూ లాక్ డౌన్ నుండి మినహాయించాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేసిన - శ్రీ తోమర్.

జి-20 దేశాల వ్యవసాయ మంత్రుల డిక్లరేషన్ ఆమోదం; అంతర్జాతీయ సహకారానికి పిలుపు, ఆహార వ్యర్ధాలను నివారించాలి, సరిహద్దుల వెంబడి ఆహార సరఫరా విలువలను కొనసాగించాలి.

Posted On: 21 APR 2020 9:18PM by PIB Hyderabad

ఆహార భద్రత, రక్షణ, పోషకాహారం పై కోవిడ్-19 ప్రభావం అనే అంశంపై జి-20 దేశాల వ్యవసాయ మంత్రుల అసాధారణ సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.  అవసరమైన వ్యవసాయ ఉత్పత్తుల లభ్యత, సరఫరా కొనసాగడానికి వీలుగా, ఆరోగ్యం, పరిశుభ్రత, సామాజిక దూరం నిబంధనలను పాటిస్తూ అన్ని వ్యవసాయ కార్యకలాపాలనూ లాక్ డౌన్ నుండి మినహాయించాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తెలియజేశారు.   ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు వివిధ రకాలుగా కృషి చేస్తున్న దేశాలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ముందంజలో ఉన్నారన్న విషయాన్ని శ్రీ తోమర్ నొక్కి చెప్పారు. పౌరుల అవసరానికి అనుగుణంగా వ్యవసాయం రంగం వెనకబడి ఉండకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. 

రైతుల జీవనోపాధితో సహా ఆహార సరఫరా వేల్యూ చైన్ కొనసాగించడానికి తీసుకోవలసిన మార్గాలపై చర్చించడానికి వీలుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జి-20 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశాన్ని సౌదీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  ఈ సమావేశంలో జి-20 సభ్యదేశాల వ్యవసాయ మంత్రులతో పాటు కొన్ని అతిధి దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.   జి-20 దేశాలను ఏక తాటిపైకి తీసుకురావాలన్న సౌదీ అరేబియా ప్రతిపాదనను శ్రీ తోమర్ స్వాగతించారు. 

అనంతరం, జి-20 దేశాల వ్యవసాయ మంత్రుల డిక్లరేషన్ ను ఆమోదించారు.  కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆహార వ్యర్ధాలను, నష్టాలను నివారించి, సరిహద్దు వెంబడి ఆహార సరఫరా వేల్యూ చెయిన్ కొనసాగించడంలో అంతర్జాతీయ సహకారాన్ని కలిగి ఉండాలని జి-20 దేశాలు తీర్మానించాయి.  ఆహార భద్రతా, పౌష్టికాహారం కోసం కలిసి పనిచేయాలనీ,   వ్యసాయం, ఆహార విధానాల్లో స్థిరత్వాన్ని పెంపొందించుకోడానికి అవసరమైన ఆవిష్కరణలుసంస్కరణలతో పాటు, ఉత్తమ పద్ధతులు, అనుభవాలను పంచుకోవాలనీ, పరిశోధన పెంపొందించుకోవాలనీ, బాధ్యతాయుతమైన పెట్టుబడులు పెట్టాలనీ, కూడా వారు తీర్మానించారు.   పెంపుడు జంతువుల నుండి సంక్రమించే అంటు వ్యాధిని నియంత్రించటానికి తీసుకోవలసిన కఠినమైన భద్రతాపరిశుభ్రతా చర్యలపై శాస్త్ర ఆధారిత అంతర్జాతీయ మార్గదర్శకాలను అభివృద్ధి చేయాలని కూడా జి-20 దేశాలు అంగీకరించాయి

*****



(Release ID: 1616950) Visitor Counter : 270