PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
16 APR 2020 7:02PM by PIB Hyderabad
(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 12,380కి చేరగా, మరణాల సంఖ్య 414గా ఉంది. కాగా, 325 జిల్లాల్లో ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
- ఆరోగ్య, వాహన (తృతీయపక్ష) బీమా నవీకరణ గడువు దిగ్బంధ కాలంలో ముగిసేట్లయితే పాలసీదారులకు మే 15దాకా రుసుము చెల్లించే వెసులుబాటు ఉంటుంది.
- దేశంలో 32 కోట్లమంది ప్రజలకు రెండు వారాల వ్యవధిలో 3900 కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక సహాయం అందించామని జి20 సమావేశంలో పాల్గొన్న సందర్భంగా శ్రీమతి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
- మందుల తయారీకి వినియోగించే ముడి ఔషధాల అందుబాటు/స్వల్ప వ్యవధి తయారీని వేగిరపరచే దిశగా పర్యావరణ ప్రభావ అంచనా ప్రకటన-2006కు కీలక సవరణ
- పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా దిగ్బంధం నిబంధనలు కఠినంగా పాటించేలా చూడాలని రాష్ట్రాల వక్ఫ్ బోర్డులను కోరిన కేంద్ర ప్రభుత్వం
కోవిడ్-19పై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తాజా సమాచారం
దేశంలో నేటివరకూ నమోదైన కోవిడ్-19 కేసుల సంఖ్య 12,380కి చేరగా, మరణాల సంఖ్య 414గా ఉంది. వైరస్ బారినపడి కోలుకున్న/పూర్తిగా నయమైన 1,489 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. భారతదేశంలో కోవిడ్-19 ప్రాణాంతక కేసుల శాతం (CFR) 3.3గా ఉంది. అదే సమయంలో ఇప్పటిదాకా కోలుకున్నవారి శాతం 12.02గా నమోదైంది. ఇప్పటిదాకా 325 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వ్యాధి విస్తరణ ఫలితంగా ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై అనూహ్యంగా ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో డిమాండ్‌ను తట్టుకుంటూ ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడంపై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సమగ్ర మార్గదర్శకాలను జారీచేసింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615172
ఆరోగ్య, వాహన (తృతీయపక్ష) బీమా నవీకరణ గడువు దిగ్బంధ కాలంలో ముగిసేట్లయితే పాలసీదారులకు మే 15దాకా రుసుము చెల్లించే వెసులుబాటు
ఆరోగ్య, వాహన (తృతీయపక్ష) బీమా నవీకరణ గడువు కోవిడ్-19 దిగ్బంధ కాలంలో ముగిసేట్లయితే పాలసీదారులకు ఇబ్బంది కలగకుండా రుసుము చెల్లింపు గడువును మే 15దాకా పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీచేసింది. ఈ కారుణ్య గడువుతో బీమా రక్షణ కొనసాగడంతోపాటు పాలసీదారుల నుంచి అభ్యర్థనల పరిష్కారానికి వెసులుబాటు ఉంటుంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615001
జి20 దేశాల ఆర్థిక మంత్రుల/కేంద్ర బ్యాంకు గవర్నర్ల రెండో సమావేశంలో పాల్గొన్న శ్రీమతి నిర్మలా సీతారామన్
దేశంలో స్థూల ఆర్థిక సుస్థిరతను నిలకడగా ఉంచడంతోపాటు ప్రజాజీవనం, జీవనోపాధి సంరక్షణలో ఆర్థికశాఖ మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల పాత్రను వివరించడంపై నేటి తన ప్రసంగంలో భారత ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ దృష్టి సారించారు. ఈ మేరకు దుర్బలవర్గాలకు వేగంగా, సకాలంలో నిర్దిష్ట సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను జి20 సమావేశంలో పాల్గొన్న ఇతర దేశాల ఆర్థిక మంత్రులకు ఆమె విశదీకరించారు. ఇప్పటిదాకా... అంటే- రెండువారాల వ్యవధిలో 32 కోట్లమందికిపైగా ప్రజలకు 3900 కోట్ల అమెరికా డాలర్ల విలువైన ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా డిజిటల్ సాంకేతిక మార్గంలో నిర్దేశిత వర్గాలకు ప్రత్యక్షంగా లబ్ధి బదిలీ కావడంపై శ్రద్ధ పెట్టినట్లు వివరించారు. దీనివల్ల వారు బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడే అవకాశాలను కనీస స్థాయికి తగ్గించామని చెప్పారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1614878
మందుల తయారీకి వినియోగించే ముడి ఔషధాల అందుబాటు/స్వల్ప వ్యవధి తయారీని వేగిరపరచే దిశగా పర్యావరణ ప్రభావ అంచనా ప్రకటన-2006కు కీలక సవరణ
ప్రపంచం మహమ్మారి నవ్య కరోనా వైరస్ (కోవిడ్-19)వల్ల తలెత్తిన అనూహ్య సంక్షోభ పరిష్కారంలో భాగంగా, స్వల్ప వ్యవధిలో వివిధ మందుల తయారీ/లభ్యతను పెంచడం కోసం కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ 2020 మార్చి 27న పర్యావరణ ప్రభావ అంచనా ప్రకటన-2006లో ఒక సవరణ చేసింది. ఈ సవరణ మేరకు... వివిధ వ్యాధులు-రుగ్మతలను నయం చేసేందుకు రూపొందించే ముడి, ప్రేరక ఔషధాల తయారీలోగల అన్ని ప్రాజెక్టులు, కార్యకలాపాలు ఇప్పుడున్న ‘ఎ’ కేటగిరీ నుంచి ‘బి2’ కేటగిరీకి మారుతాయి.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1614834
“మనం సాధించగలం... ఈ వైరస్‌పై మన విజయం తథ్యం” – డాక్టర్ హర్షవర్ధన్
భారత దేశంలో కోవిడ్-19 నియంత్రణకు తీసుకున్న చర్యలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సీనియర్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితోపాటు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల కీలక అధికారులతో ఇష్టాగోష్ఠి సమావేశంలో చర్చించారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1614890
వేతన చెల్లింపు మాసం 2020 మార్చికి సంబంధించి ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్ (ఈసీఆర్) దాఖలు గడువు 15.05.2020 వరకు పొడిగింపు
కోవిడ్-19 విజృంభణ... వైరస్ వ్యాప్తి నియంత్రణకు 24.03.2020న అర్ధరాత్రి నుంచి జాతీయ దిగ్బంధం ప్రకటించిన నేపథ్యంలో తలెత్తిన అనూహ్య పరిస్థితులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు 2020 మార్చినెలకుగాను ఉద్యోగుల వేతనాలు చెల్లించిన యాజమాన్యాలు ఈసీఆర్ దాఖలు చేయాల్సిన గడువును 15.05.2020వరకూ పొడిగించింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1614814
కోవిడ్-19పై పోరులో సైనికావాస (కంటోన్మెంట్) బోర్డుల కృషిని సమీక్షించిన రక్షణశాఖ మంత్రి
దేశంలోని 62 సైనికావాస (కంటోన్మెంట్) బోర్డుల పరిధిలో కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి నివారణకు చేపట్టిన చర్యలను రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ సమీక్షించారు. సైనికావాస బోర్డులు ప్రత్యేకించి పౌర జనాభా అధికంగాగల ప్రదేశాల్లో పారిశుధ్య, ఆరోగ్య, ఔషధ ధూపనం తదితర చర్యలు చేపట్టడంలో అత్యున్నత ప్రమాణాలు అనుసరించాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టీకరించారు. వలస కార్మికులు/రోజు కూలీలవంటి దుర్బల వర్గాలకు ఆశ్రయం, ఆహారం సమకూర్చడంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని నొక్కిచెప్పారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615156
ఖరీఫ్-2020 పంటల సీజన్‌పై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అధ్యక్షతన జాతీయ స్థాయి సమావేశం
ఖరీఫ్ పంటల దిగుబడి-రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యాల సాధనపై అన్ని రాష్ట్రాలూ ఉద్యమ స్థాయిలో శ్రద్ధ పెట్టాలని కేంద్ర వ్యవసాయం-రైతు సంక్షేమశాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. ఖరీఫ్-2020 పంటల సీజన్‌పై ఇవాళ నిర్వహించిన జాతీయస్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. నిర్దేశిత లక్ష్యసాధనలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించడంలో రాష్ట్రాలకు అవసరమైన సహాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. దిగ్బంధం పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు సంసిద్ధతసహా వివిధ సమస్యలపై రాష్ట్రాలతో చర్చద్వారా పరిష్కారాన్వేషణే ఖరీఫ్‌పై ఈ జాతీయ సమావేశం ప్రధానోద్దేశమని తోమర్ పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615054
దిగ్బంధం వేళ వ్యవసాయం-అనుబంధ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు వ్యవసాయ-సహకార-రైతుసంక్షేమ శాఖ తీసుకున్న చర్యల తాజా వివరాలు
అఖిల భారత వ్యవసాయ రవాణా సహాయ కేంద్రం ప్రారంభం; పీఎంబీఎఫ్‌వై కింద 12 రాష్ట్రాల్లో రైతులకు రూ.2,424 కోట్లు పంపిణీ; కేసీసీ కింద 18.26 లక్షల దరఖాస్తులపై రూ.17,800 కోట్ల రుణాలు మంజూరు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1614959
దేశంలో ఎరువుల ఉత్పత్తి, లభ్యత, రవాణాను నిశితంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర రసాయనాలు-ఎరువుల మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పరిస్థితుల నియంత్రణపై కేంద్ర రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ, సహాయమంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ, ఆ శాఖ కార్యదర్శి శ్రీ ఛాబిలేంద్ర రౌల్ దృష్టి సారించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఎరువుల ఉత్పత్తి, పంపిణీ కార్యకలాపాలను సమీక్షిస్తూ నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. తదనుగుణంగా దేశంలోని రైతులందరికీ ఎరువులు అందుబాటులో ఉంచేలా అత్యున్నత స్థాయిలో చర్యలు చేపట్టారు. ఎరువుల ఉత్పత్తి, సరఫరా క్రమంలో ఏదైనా సమస్య తలెత్తితే తక్షణం పరిష్కరించేందుకు ఈ నిత్య పర్యవేక్షణ తోడ్పడుతుంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615147
కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా దిగ్బంధం, కర్ఫ్యూ, సామాజిక దూరం నిబంధనలను కఠినంగా, చిత్తశుద్ధితో పాటించేలా చూడాలని వక్ఫ్ బోర్డులకు శ్రీ ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆదేశం
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి, కేంద్రీయ వక్ఫ్ కౌన్సిల్ చైర్మన్ హోదాలో శ్రీ ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఇవాళ 30కిపైగా రాష్ట్రాలకు చెందిన వక్ఫ్ బోర్డుల సీనియర్ అధికారులతో చర్చాగోష్ఠి నిర్వహించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం కానున్న పవిత్ర రంజాన్ మాసంలో దిగ్బంధం, కర్ఫ్యూ, సామాజిక దూరం నిబంధనలను కఠినంగా, చిత్తశుద్ధితో పాటించేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాగా, దేశంలోని వివిధ రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల పరిధిలో నమోదైన మసీదు, ఈద్గా, ఇమంబరా, దర్గా తదితర ముస్లిం మత-సామాజిక సంస్థలు 7 లక్షలకుపైగా ఉన్నాయి. ఈ వక్ఫ్ బోర్డులన్నిటిపైనా కేంద్రీయ వక్ఫ్ కౌన్సిల్‌కు నియంత్రణాధికారం ఉంటుంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615150
‘పూసా కాలుష్య నిర్మూలన-పరిశుభ్రత మార్గాన్ని’ ప్రారంభించిన కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి శ్రీ కైలాస్ చౌదరి
న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ICAR)కు చెందిన పూసాలోని వ్యవసాయ ఇంజనీరింగ్ డివిజన్ రూపొందించిన ‘కాలుష్య నిర్మూలన-పరిశుభ్రత మార్గాన్ని’ కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీ కైలాస్ చౌదరి ప్రారంభించారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615135
పాఠశాలల కోసం ఎన్‌సీఈఆర్‌టీ ప్రత్యామ్నాయ విద్యా కేలండర్‌ను విడుదల చేసిన కేంద్ర హెచ్‌ఆర్‌డి శాఖ మంత్రి
కోవిడ్-19 కారణంగా ఇళ్లలో ఉండిపోయిన విద్యార్థులను వారి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో అర్థవంతంగా విద్యాభ్యాసంలో నిమగ్నం చేసేందుకు హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ నడుం బిగించింది. ఈ మేరకు మంత్రిత్వశాఖ మార్గనిర్దేశంలో ఎన్‌సీఈఆర్‌టీ ప్రత్యామ్నాయ విద్యా కేలండర్‌ను రూపొందించింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615159
విద్యార్థుల భద్రత, విద్యా సంక్షేమానికి భరోసా ఇచ్చేలా కళాశాలలకు/విద్యా సంస్థలకు ఏఐసీటీఈ మార్గదర్శకాలు
కోవిడ్-19 ముప్పు నేపథ్యంలో విద్యార్థుల భద్రత, విద్యా సంక్షేమానికి భరోసా ఇవ్వడం పౌరులందరి ప్రాథమిక బాధ్యతని ఏఐసీటీఈ పేర్కొంది. ఈ మేరకు ప్రస్తుత సంక్షోభ సమయంలో కళాశాలలు/విద్యా సంస్థలకు మార్గదర్శకాలు జారీచేసింది. ఈ జాతీయ దిగ్బంధం ఇక్కట్లు తొలగి, సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తేవద్దని సూచించింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615159
పరీక్షల నిర్వహణ క్రమంపై స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సి) ప్రకటన
ప్రస్తుతం అమలులో ఉన్న సామాజిక దూరం నిబంధనసహా దిగ్బంధం ఆంక్షల దష్ట్యా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు ప్రయాణించాల్సిన అవసరమున్న అన్ని పరీక్షల తేదీలనూ ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఎస్ఎస్‌సి నిర్ణయించింది. ఆయా పరీక్షలు తిరిగి నిర్వహించే తేదీలను కమిషన్ వెబ్‌సైట్‌సహా ప్రాంతీయ/ఉప ప్రాంతీయ కార్యాలయాల వెబ్‌సైట్లలో ప్రకటిస్తామని తెలిపింది. అలాగే ఇతర పరీక్షల నిర్వహణ తేదీలకు అనుగుణంగా కమిషన్ ప్రకటించిన వార్షిక పరీక్షల కేలండర్‌ను కూడా సమీక్షిస్తామని పేర్కొంది. అంతేకాకుండా ‘పీఎం కేర్స్’ నిధికి కమిషన్ అధికారులు, ఉద్యోగులు ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇవ్వాలని తీర్మానించింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1614968
కోవిడ్-19వల్ల దిగ్బంధం విధించిన నేపథ్యంలో వృద్ధపౌరులు, వారి సంరక్షకులకు సూచనపత్రం
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615154
గ్రామాల్లో కోవిడ్-19 వ్యాప్తి నిరోధానికి పంచాయతీల్లో చురుకైన చర్యలు
జిల్లా-గ్రామీణ స్థాయులలో నిత్యం బహిరంగ ప్రదేశాల పరిశుభ్రత; అనాథలు, వలసకార్మికుల కోసం ఆశ్రయాలు.. క్వారంటైన్ కేంద్రాలు; పేదలకు రక్షణ సామగ్రి.. ఆర్థిక సహాయం.. ఉచిత రేషన్.. వ్యాధి వ్యాప్తిపై అవగాహన పెంపునకు కృషి.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1614998
కోవిడ్-19 వ్యాప్తి నియంత్రణలో ప్రాంతీయ ప్రాధాన్య వ్యూహాలు-నిర్ణయాల్లో సాయం చేసేందుకు సమీకృత భౌగోళిక ప్రదేశ వేదిక
కోవిడ్-19 వ్యాప్తి నియంత్రణలో ప్రాంతీయ ప్రాధాన్య వ్యూహాలు-నిర్ణయాల్లో సాయపడటం కోసం అందుబాటులోగల సంబంధిత గణాంకాలు, ప్రమాణాధారిత సేవలు, విశ్లేషణ ఉపకరణాలతో సమీకృత భౌగోళిక ప్రదేశ వేదిక (ఇంటిగ్రేటెడ్ జియోస్పేషియల్ ప్లాట్‌ఫామ్)ను కేంద్ర శాస్త్ర-సాంకేతిక శాఖ సృష్టించింది. దీంతోపాటు ఈ వైపరీత్యం నుంచి కోలుకోవడంలో సామాజిక-ఆర్థిక ప్రభావాలను నియంత్రించడంలోనూ ఆయా ప్రాదేశిక వ్యూహాల రూపకల్పనకు ఈ వేదిక సాయపడుతుంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615225
గ్వాలియర్‌లోని డీఆర్‌డీఈలోగల పీపీఈ పరీక్ష సదుపాయాన్ని ఢిల్లీలోని ‘ఇన్‌మాస్’ (INMAS)కు తరలించిన డీఆర్‌డీవో
వ్యక్తిగత రక్షణ సామగ్రి, మాస్కులు తదితరాల సత్వర సరఫరాతోపాటు పరీక్షల్లో జాప్యం నివారణ దిశగా రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) తాజాగా చర్యలు తీసుకుంది. ఈ మేరకు గ్వాలియర్‌లోని డీఆర్‌డీఈ ప్రాంగణంలోగల పరీక్ష సదుపాయాలను న్యూఢిల్లీలోని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్’ (INMAS)కు తరలించింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615152
‘దేఖో అప్నాదేశ్’ వెబినార్ సిరీస్ కింద ఇవాళ రెండో కార్యక్రమం నిర్వహించిన కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ
ప్రస్తుత దిగ్బంధ సమయంలో కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ‘దేఖో అప్నాదేశ్’ పేరిట వెబినార్ సిరీస్‌ను నిర్వహిస్తోంది. స్వదేశంలో సందర్శనీయ స్థలాలపై ప్రజల్లో ఆసక్తి రగిలించడంతోపాటు, పర్యాటక రంగంలోని వివిధ అంశాలపై పరిశ్రమ భాగస్వాములకు, విద్యార్థులకు పరిజ్ఞానాభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615227
కోవిడ్-19 రోగుల సేవలో కేంద్ర ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీకి చెందిన మొత్తం 45 ఆస్పత్రులు/ఆరోగ్య విభాగాలు
కోవిడ్ రోగుల కోసం ఢిల్లీ, ఒడిషా రాష్ట్రాలకు చెరో ఆస్పత్రి అప్పగింత; 168 ఏకాంత పడకల సృష్టి; త్వరలో మరో 122 అందుబాటు; మహమ్మారిపై పోరులో ఊరట దిశగా ‘మహారత్న’ సంస్థ విస్తృత కృషి.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615013
‘జూమ్’ సమావేశ వేదిక సురక్షిత వినియోగంపై దేశీయాంగ శాఖ సలహా పత్రం
‘జూమ్’ ఆన్‌లైన్ సమావేశ వేదికను ప్రైవేటు వ్యక్తులు సురక్షితంగా వినియోగించుకోవడంపై కేంద్ర దేశీయాంగ శాఖ (MHA) పరిధిలోని ‘ది సైబర్ కో-ఆర్డినేషన్ సెంటర్ () సలహాపత్రం జారీచేసింది. దీన్ని ప్రభుత్వంగానీ, ప్రభుత్వాధికారులుగానీ అధికారిక కార్యకలాపాల కోసం వినియోగించరాదని హెచ్చరించింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615162
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పంపిణీ చేయడం కోసం 12,361 టన్నుల బియ్యం అందాయి.
- అసోం: దిగ్బంధం కారణంగా గువహటి విశ్వవిద్యాలయంతోపాటు అనుబంధ విద్యా సంస్థల్లో తరగతులు నష్టపోయిన నేపథ్యంలో వచ్చే వేసవి సెలవులను రద్దుచేయాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది.
- మణిపూర్: రాష్ట్రం వెలుపల చిక్కుకుపోయిన 3,771 రాష్ట్ర పౌరులకు రూ.2,000 వంతున ప్రత్యక్ష నగదు బదిలీ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మరో 11,000 మందికి రెండుమూడు రోజుల్లో నగదు అందుతుందని ప్రకటించారు.
- నాగాలాండ్: రాష్ట్రవ్యాప్తంగా పని ప్రదేశాల్లో థర్మల్ స్క్రీనింగ్‌తోపాటు పరిశుభ్రత పరికరాల లభ్యతను తప్పనిసరి చేసిన ప్రభుత్వం.
- త్రిపుర: రాష్ట్రంలో రెండో కోవిడ్ రోగితో సంబంధాలున్న 16 మంది తీవ్ర ముప్పున్న వ్యక్తులకు పరీక్షలో ప్రమాదం లేదని తేలింది.
- మహారాష్ట్ర: దేశంలో కోవిడ్-19 కేసులు 3,000 దాటిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డులకెక్కింది. ఇవాళ 165 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,081కి చేరింది. కొత్త కేసులలో 107 ముంబైలోనూ 19 పుణెలోనూ నమోదయ్యాయి. మరొకవైపు కరోనా వైరస్ సవాలును ఎదుర్కొనే దిశగా ప్రభుత్వం ఆరోగ్యం, వలస ప్రజలు, ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, దైనందిన పాలన ప్రధానాంశాలుగా పంచముఖ కార్యాచరణను ప్రారంభించింది.
- గుజరాత్: రాష్ట్రంలో 105 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 871కి చేరింది. కొత్త కేసులలో 42 అహ్మదాబాద్‌లోనూ, 35 సూరత్‌లోనూ నమోదవగా, మరణాల సంఖ్య 36గా ఉంది.
- రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ 18 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,023కు చేరింది. దీంతో దేశంలో అత్యధిక కేసులరీత్యా మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు తర్వాత రాజస్థాన్ నాలుగో స్థానంలో ఉంది.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో ఇవాళ 42 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 980కి పెరిగింది. కాగా, ఈ నగరంలో మొత్తం నమోదిత కేసుల సంఖ్య 586కు పెరగడం గమనార్హం.
- గోవా: ఈ నెల 4వ తేదీనుంచి గోవాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఈ పశ్చిమ తీర రాష్ట్రం త్వరలో కరోనా రహితం కానుంది. రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో దక్షిణ గోవాను ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఇప్పటికే ‘హరిత మండలం’గా ప్రకటించింది. ఇక ఉత్తర గోవాలో నమోదైన 7 కేసులకుగాను ఐదుగురు కోలుకుని ఇళ్లకు వెళ్లగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
- కేరళ: రాష్ట్రంలో వ్యవసాయ రంగంలోపాటు పీచు, జీడిమామిడి, హస్తకళా-బీడీ తదితర సంప్రదాయ పరిశ్రమలలకు దిగ్బంధం నిబంధనలను ప్రభుత్వం సడలించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో జోన్ల ప్రకటనను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనుంది. ఈ మేరకు ‘రెడ్‌జోన్’ కింద కాసరగోడ్, కన్నూర్, మళప్పురం, కోళికోడ్‌లను చేర్చాలని; వయనాడ్, కోట్టయంలను ‘గ్రీన్‌జోన్’లో చేర్చాలని; మిగిలిన 8 జిల్లాలను ‘ఆరెంజ్’ జోన్‌లో చేర్చాలని కోరనుంది. రాష్ట్రంలో నిన్న ఒక్క కేసు మాత్రమే నమోదవగా మొత్తం 387 కేసులకుగాను 218 మంది కోలుకున్నారు.
- తమిళనాడు: రాష్ట్రంలోని తిరుచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 32మందికి వ్యాధి నయమైనట్లు తేలడంతో ఇళ్లకు పంపారు. కాగా, రాష్ట్రంలోని 22 జిల్లాలు 170 హాట్‌స్పాట్ ప్రాంతాల జాబితాలోకెక్కడం గమనార్హం. మొత్తం కేసుల సంఖ్య 1,242 కాగా, ఒక్క ఢిల్లీతో సంబంధమున్నవే 1.113 కాగా- 12 మరణాలు నమోదయ్యాయి. మరో 118 మంది డిశ్చార్జి అయ్యారు.
- కర్ణాటక: బెంగళూరు నగరంలో ‘బీబీఎంపీ’ ఆరోగ్య సర్వే నిర్వహించనుంది. రాష్ట్రంలో ఇవాళ 34 కొత్త కేసులు నమోదు కాగా, ఒక మరణం సంభవించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాగా, ఇవాళ నమోదైన కేసులలో సగం... 17 ఒక్క బెళగావి ప్రాంతానికి చెందినవే. రాష్ట్రంలో మొత్తం కేసులు 313 కాగా, మరణాలు 13; యాక్టివ్ కేసులు 187 కాగా, నయమైన కేసులు 80.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో 9 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 534కు చేరాయి. డిశ్చార్జి అయినవారు 20 మంది; మరణాలు 14; యాక్టివ్ కేసులు 500; గుంటూరు జిల్లాలో అత్యధికంగా 122 కేసులు నమోదు కాగా, 113 కేసులతో కర్నూలు జిల్లా రెండో స్థానంలో ఉంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రత్యేక నియామకాల కింద డాక్టర్లను కాంట్రాక్టు విధానంలో నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు వినియోగదారులకు నిత్యావసరాల లభ్యత, రైతుల ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వం 471 తాత్కాలిక రైతు బజార్లను ఏర్పాటు చేసింది.
- తెలంగాణ: రాష్ట్రంలో ఆకలితో అలమటిస్తున్న లక్షలాది పేదలకు ఆహారం, నగదు, ఇతర నిత్యావసరాలు అందించగలిగే పరిస్థితి ఉన్నదో/లేదో ఐదు రోజుల్లోగా తెలపాలని హైకోర్టు ఇవాళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే వైద్య సిబ్బందిపై దాడి చేసినవారిని తక్షణం శిక్షించాలని కోరింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 650 కాగా, యాక్టివ్ కేసులు 514; మరణాలు 18గా ఉన్నాయి. మరో 118 మంది డిశ్చార్జి అయ్యారు.
- జమ్ముకశ్మీర్: ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఇవాళ 14 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 314కు చేరింది.
# కోవిడ్-19 లో వాస్తవ తనిఖీ
****
(Release ID: 1615232)
Visitor Counter : 356
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam