ఆర్థిక మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 విశ్వ మహమ్మారి వల్ల తలెత్తిన సంక్షోభం నేపధ్యంలో చేపట్టవలసిన నివారణ చర్యలు ఎలా ఉండాలనే విషయమై ప్రపంచ దృక్పథం గురించి చర్చించడానికి జరిగిన జి 20 దేశాల ఆర్ధిక మంత్రులు మరియు కేంద్ర బ్యాంకుల గవర్నర్ల 2వ అసాధారణ (చాక్షుష) సమావేశంలో పాల్గొన్న శ్రీమతి నిర్మలా సీతారామన్

Posted On: 15 APR 2020 8:37PM by PIB Hyderabad

కేంద్ర ఆర్ధిక & కార్పోరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ బుధవారం జి 20 దేశాల ఆర్ధిక మంత్రులు మరియు కేంద్ర బ్యాంకుల గవర్నర్ల 2వ అసాధారణ (చాక్షుష) సమావేశంలో పాల్గొన్నారు. కరోనా సంక్షోభం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో చేపట్టవలసిన నివారణ చర్యలు ఎలా ఉండాలనే విషయమై ప్రపంచ దృక్పథం గురించి చర్చించదానికి సౌదీ అరేబియా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.  ఈ విషయంలో సౌదీఅరేబియా చేస్తున్న అవిశ్రాంత కృషిని ఆర్ధిక మంత్రి ప్రశంసించారు. 

సంక్షోభం నేపధ్యంలో మార్చి31వ తీదీన జరిగిన 2వ అసాధారణ (చాక్షుష) సమావేశంలో శ్రీమతి సీతారామన్ ప్రాతినిధ్యం వహించారు.  వివిధ దేశాల ఆర్ధిక వ్యవస్థల మద్దతుతో ప్రపంచ ఆర్ధిక రంగం త్వరగా కోలుకొని నిలదొక్కుకునే విధంగా అంతర్జాతీయ సహకారం, సమన్వయ చర్యల ప్రాముఖ్యతను గురించి ఆమె ప్రసంగించారు. 

సహనీయ రీతిలో స్థూలఆర్ధిక సుస్థిరతను కాపాడటం ద్వారా ప్రజల జీవనాన్ని, జీవనోపాధిని సంరంక్షించడంలో ఆర్ధిక మంత్రలు మరియు కేంద్ర బ్యాంకు గవర్నర్ల పాత్రను గురించి ఈ రోజు తమ ప్రసంగంలో మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు.  దేశంలోని దుర్భల వర్గాలకు సత్వర, సమయోచిత, లక్షిత సహాయం అందజేయడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను గురించి ఆమె తమ సహచర జి20 దేశాల మంత్రులకు తెలియజేశారు. గత కొన్నివారాలలో ఇప్పటివరకు ఇండియా 32 కోట్ల మందికి 390 కోట్ల అమెరికా డాలర్లకు సమానమైన ఆర్ధిక సహాయాన్ని పంపిణీ చేశామని ఆమె తెలిపారు. పంపిణీ పూర్తిగా డిజిటల్ టెక్నాలజీ ద్వారా జరిగిందని,  సొమ్మును నేరుగా లబ్దిదారుల ఖాతాలలో వేయడం వల్ల వారు బహిరంగ స్థలాలలోకి రావడాన్ని బాగా తగ్గించగలిగామని ఆమె తెలిపారు. మన ప్రధాన మంత్రి చేపట్టిన సంస్కరణలలో భాగమైన సమీకృత ఆర్ధిక చర్యల ఫలితాలను ఇప్పుడు ఇండియా అనుభవిస్తోందని మంత్రి ఆర్ధిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో వెల్లడించారు. 

భారత ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ఇతర నియంత్రణ సంస్థలు అమలుపరుస్తున్న ద్రవ్య విధానం వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ఆమె అన్నారు.  

కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవడానికి కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలన్న జి 20 దేశాల నాయకుల ఆదేశం మేరకు జి20 సభ్య దేశాలు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి.  ప్రజల జీవితాలకు, జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారి ఉద్యోగాలను, ఆదాయాలను సంరక్షించి ఆర్ధిక సుస్థిరతకు దోహదం చేయడం కార్యాచరణ ప్రణాళిక లక్ష్యం. అదేవిధంగా సమన్వయంతో ప్రజారోగ్యాన్ని కాపాడాలని, సరఫరా శృంఖల కొనసాగేలా చూడాలని కూడా  జి20 ఉద్దేశం. ప్రపంచ దేశాలు త్వరలోనే ఈ సంక్షోభాన్ని అధిగమించి నిలువగలవన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. 



(Release ID: 1614878) Visitor Counter : 243