ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

“మనం సాధించగలం, వైరస్ ను ఓడించి తీరతాం” - డాక్టర్ హర్షవర్ధన్

కోవిడ్-19 పై పోరాటంలో ప్రపంచంతో పోల్చితే భారత్ మెరుగైన స్థితిలో ఉంది

Posted On: 15 APR 2020 8:20PM by PIB Hyderabad

భారతదేశంలో కోవిడ్-19 అదుపు తీసుకునే చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ అధికారులు, క్షేత్ర స్థాయి అధికారులతోను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య శాఖ కీలక అధికారులతోను కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో సంభాషించారు.

“మనం ఎంతో కల్లోలిత సమయంలో సమావేశమవుతున్నాం. పోలియో, మసూచి వ్యాధులను గతంలో నిర్మూలించిన తీరులోనే ఇప్పుడు ఈ వైరస్ ను నిర్మూలించడానికి మనందరం కలిసికట్టుగా పని చేయాలి” అని డాక్టర్ హర్షవర్ధన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ అన్నారు. “మనం సాధించగలం, మనం ఈ వైరస్ ను ఓడించి తీరతాం” అని ఆయన గట్టిగా చెప్పారు. 

కోవిడ్-19పై మరింతగా భాగస్వామ్యాల పటిష్ఠత, క్షేత్రస్థాయిలో సత్వరం తీసుకోవలసిన తక్షణ స్పందన చర్యలు వంటి అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. కోవిడ్-19పై పోరాటంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత ప్రధానమైన భాగస్వామి. “దేశవ్యాప్తంగా కోవిడ్-19 విస్తరణను అదుపు చేయడంలో సంస్థ మార్గదర్శకాలు, అందించిన సహకారానికి నేను ఎంతో విలువ ఇస్తున్నాను” అని డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు.

“పోలియో వ్యాధి నిర్మూలన కోసం ప్రభుత్వం లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన వైద్యులు ఎంత ఉత్సాహంగా పని చేశారో నాకు ఇంకా గుర్తుంది” అంటూ డాక్టర్ హర్షవర్ధన్ గుర్తు చేశారు. “వారి చిత్తశుద్ధితో కూడిన సహకారం లేకపోతే భారత్ సహా ఆగ్నేయాసియా మొత్తం మీద పోలియో నిర్మూలనకు ఇంకా ఎక్కువ సమయం పట్టేది” అని ఆయన అన్నారు. వైద్యులను కూడా మరింతగా చైతన్యవంతులను చేసేలా మాట్లాడుతూ వారి సామర్థ్యం, శక్తి యుక్తుల కారణంగానే పోలియో నుంచి భారత్ విజయం సాధించి బయటపడగలిగిందన్నారు.

“కరోనా పోరాటయోధులు ఎంతో నిజాయతీతో అందించిన విలువైన సేవల కారణంగానే కోవిడ్-19పై సత్వరం స్పందించడంలో భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది, ఆ తర్వాతే మిగతా ప్రపంచం ఉంది” అని ఆయన గుర్తు చేశారు. “శత్రువు మనకి తెలుసు, అది ఎక్కడ ఉన్నది మనకి తెలుసు. సామాజిక నిఘా, పలు నిర్దేశకాల జారీ, క్లస్టర్ విధానంలో అదుపు, వేగవంతమైన వ్యూహంతో మనం ఈ శత్రువుని నిలువరించగలిగాం” అని ఆయన చెప్పారు.

సంక్లిష్ట సమయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అందిస్తున్న సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ “ప్రధానమంత్రిలో మనకి గొప్ప నాయకుడు ఉన్నారు. ఎప్పటికప్పుడు నిపుణులందించే సలహాలకు స్పందించి, ఆ సలహాలను ఆచరణలోకి తేవడం పట్ల ప్రదర్శించిన సానుకూలత కారణంగానే కోవిడ్-19 గిత్తను దాని కొమ్ములు పట్టి అదుపు చేయడంలో భారత్ ముందువరుసలో నిలిచింది” అని చెప్పారు. అలాగే కరోనా యోధులు ఎన్నడూ వెన్ను చూపకుండా మానవాళికి సేవలందించడాన్ని కూడా డాక్టర్ హర్షవర్ధన్ ప్రశంసించారు. ప్రాణాంతకమైన వైరస్ పై పోరాటంలో వారు విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

కోవిడ్-19పై పోరాటానికి భారత స్పందనను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ ప్రశంసిస్తూ “అతి పెద్దవి, బహుముఖీనం అయిన సవాళ్లున్నప్పటికీ ఆ మహమ్మారిపై పోరాటంలో భారత్ అసమానమైన కట్టుబాటు ప్రదర్శించింది” అన్నారు. “కోవిడ్-19పై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని మా క్షేత్ర స్థాయి సిబ్బందిని మరోసారి ఆదేశించాం. భారతదేశాన్ని పోలియో రహితంగా భారత్ ను నిలపడానికి ప్రభుత్వం, భాగస్వామ్య సంస్థలు చేసిన పోరాటంలో అదే బృందం గతంలో అవిశ్రాంతంగా కృషి చేసింది. అలాగే మరోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం కోవిడ్-19పై  పోరాటంలో విజయం సాధించడానికి ప్రభుత్వంతో చేతులు కలుపుతుంది” అని భారతదేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ హెంక్ బెకెదామ్ చెప్పారు.

ఈ సంభాషణలోని ప్రధాన చర్చనీయాంశాలు...
- హాట్ స్పాట్ లు, క్లస్టర్ అదుపు చర్యలకు సూక్ష్మ ప్రణాళికల రూపకల్పనలో జిల్లా స్థాయిలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులతో సాంకేతిక సహకారం
- కోవిడ్ ఏ మార్గంలో వ్యాపిస్తోంది గుర్తించడానికి ప్రస్తుత కేసుల విశ్లేషణలో సహకారం
- జిల్లా స్థాయిలో ఇక వైరస్ ఏ మాత్రం విస్తరించే అవకాశం లేదని కచ్చితమైన ఆధారం లభించే వరకు జిల్లా స్థాయిలో నిఘాను కొనసాగించే వ్యూహాల రూపకల్పనలో సహకారం 

దేశంలోని మూడు రాష్ర్టాలు -బిహార్, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఎదురైన అనుభవాలు, వ్యూహాల గురించి కూడా ఈ సమావేశంలో వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ లో పాల్గొన్న వారిలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే, ఆరోగ్య శాఖ కార్యదర్శులు, రాష్ట్రప్రభుత్వాలు/  కేంద్రపాలిత ప్రాంతాల జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్లు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల సీనియర్ అధికారులు, ఆరగ్య సర్వీసుల డైరెక్టర్ జనరల్స్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్ సిడిసి), భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్, ఆగ్నేయాసియా ప్రాంతీయ కార్యాలయంలోని ఇతర సీనియర్ అధికారులు, నిపుణులు, దేశంలోని భిన్న ప్రాంతాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమించిన క్షేత్ర స్థాయి సిబ్బంది ఉన్నారు.  



(Release ID: 1614890) Visitor Counter : 264