పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
గ్రామాల్లో కోవిడ్-19 వ్యాప్తి నిరోధానికి పంచాయతీల్లో చురుకైన చర్యలు
జిల్లా-గ్రామీణ స్థాయులలో నిత్యం బహిరంగ ప్రదేశాల పరిశుభ్రత
అనాథలు, వలసకార్మికుల కోసం ఆశ్రయాలు.. క్వారంటైన్ కేంద్రాలు
పేదలకు రక్షణ సామగ్రి.. ఆర్థిక సహాయం.. ఉచిత రేషన్.. అవగాహన పెంపు
Posted On:
16 APR 2020 11:14AM by PIB Hyderabad
దేశంలోని సుదూర ప్రాంతాల్లో కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు జిల్లా యంత్రాంగాలు, పంచాయతీలు అనేక చురుకైన చర్యలు తీసుకుంటున్నాయి. అదే సమయంలో దిగ్బంధం, సామాజిక దూరం నిబంధనలను కచ్చితంగా పాటించేలా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
సన్నిహితంగా పర్యవేక్షిస్తోంది. తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు, పంచాయతీలతో నిత్య సంబంధాలు నెరపుతోంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల పరిధిలోగల పంచాయతీలలో చేపట్టిన అనుసరణీయ ఉత్తమాచరణ పద్ధతుల గురించి తెలుసుకుందాం:
ఉత్తరప్రదేశ్:
సిద్ధార్థనగర్ జిల్లాలోగల ఒక పంచాయతీలో ప్రజలకు ఒక పోస్ట్‌మ్యాన్ సూక్ష్మ ఏటీఎంద్వారా నగదు అందుబాటులో ఉంచుతున్నారు. మీరట్ డివిజన్‌లో నిరుపేద కుటుంబాలకు రూ.1,000 వంతున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. వలస కార్మికులకు రేషన్/ఆహార ప్యాకెట్లు అందజేస్తున్నారు. మొత్తం 2,820 మంది పారిశుధ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామగ్రి అందజేశారు.
కేరళ:
వివిధ పంచాయతీలు, పురపాలికలలో 1,304 సామాజిక వంటశాలలు ఏర్పాటయ్యాయి. కుటుంబశ్రీ పథకం లబ్ధిదారులు 300 కుట్టుపని కేంద్రాల్లో 18 లక్షల కాటన్ మాస్కులు తయారుచేసి పంపిణీ చేశారు. మరో 21 సూక్ష్మ సంస్థలు 2,700 లీటర్ల పరిశుభ్రత ద్రవం తయారుచేసి అందించాయి. కుటుంబశ్రీ సహకారంతో స్థానిక సంస్థలు 1.9 లక్షల వాట్సాప్ గ్రూపులద్వారా 22లక్షల మందితో ఇరుగుపొరుగు బృందాలను తయారుచేసి, ప్రజల్లో అవగాహన కల్పనకు కృషిచేస్తున్నారు.
దాద్రా-నాగర్ హవేలీ:
పంచాయతీల్లో పరిశుభ్రతతోపాటు నిత్యం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.32 లక్షల హస్తపరిశుభ్రత ద్రావకాలు, 17,400 మాస్కులు ఉచితంగా పంపిణీ చేశారు. దుకాణాలకు నిర్ణీతవేళలు నిర్దేశించి, వాటివద్ద సామాజిక దూరం పాటించేలా చూస్తున్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా పేదలకే కాకుండా వీధి జంతువులకూ ఆహారం అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్:
భారత వైద్య పరిశోధన మండలి సూచనలకు అనుగుణంగా రాష్ట్రంలో కోవిడ్-19 పీడితుల గుర్తింపు నిమిత్తం ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టింది. ఇందులో మూడోవిడత పూర్తయ్యేసరికి 1.47కోట్ల కుటుంబాలకుగాను 1.43కోట్ల కుటుంబాలపై సర్వే ముగియగా ఇప్పటిదాకా 32,349 మందిని ఆస్పత్రులకు పంపారు. వీరిలో 9,107 మందికి పరీక్షలు నిర్వహించాలని వైద్యులు సిఫారసు చేశారు. మరోవైపు ప్రభుత్వం ప్రజలకు 16కోట్ల మాస్కులను పంపిణీ చేయనుంది.
*****
(Release ID: 1614998)
Visitor Counter : 264
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam