విద్యుత్తు మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 రోగుల సేవలో కేంద్ర ప్రభుత్వరంగ విద్యుత్‌ సంస్థ ఎన్టీపీసీకి చెందిన మొత్తం 45 ఆస్పత్రులు/ఆరోగ్య విభాగాలు

168 ఏకాంత పడకల సృష్టి; త్వరలో మరో 122 అందుబాటు
మహమ్మారిపై పోరులో ఊరట దిశగా ‘మహారత్న’ సంస్థ విస్తృత కృషి
కోవిడ్‌ రోగుల కోసం ఢిల్లీ, ఒడిషా రాష్ట్రాలకు చెరో ఆస్పత్రి అప్పగింత

Posted On: 16 APR 2020 3:27PM by PIB Hyderabad

   కరోనా వైరస్‌పై పోరు దిశగా కేంద్ర విద్యుత్‌, నవ్య-పునరుత్పాదక ఇంధన మంత్రి శ్రీ ఆర్‌.కె.సింగ్‌ పిలుపు మేరకు ఆ శాఖ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ (NTPC) లిమిటెడ్‌ అన్నివిధాలా చేయూతనిస్తోంది. ఒకవైపు నిరంతర విద్యుత్‌ సరఫరా సేవలందిస్తూ- మరోవైపు తన అధీనంలోని మౌలిక వసతులను మానవతావాద చర్యలకోసం వినియోగిస్తోంది. అంతేగాక కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధుల నుంచి రూ.250 కోట్లు, ఉద్యోగులు ప్రకటించిన రూ.7.5 కోట్లను ‘పీఎం కేర్స్‌’ నిధికి విరాళంగా ఇచ్చింది. తన పరిధిలోని 45 ఆస్పత్రులు/ ఆరోగ్య విభాగాలతోపాటు అంబులెన్స్‌లనుకూడా కోవిడ్‌-19 రోగుల చికిత్సకు అంకితం చేసింది. ఆస్పత్రులలో రెండింటిని ఢిల్లీ, ఒడిసా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. మొత్తం 168 ఏకాంత చికిత్స పడకలను, ప్రాణవాయు నిల్వలను అందించింది. అవసరాన్నిబట్టి త్వరలో మరో 122 పడకలను అందుబాటులోకి తేనుంది. ఆరోగ్య రక్షణ ఉపకరణాలకు రూ.3కోట్లు కేటాయించింది. అలాగే 1,200 పీపీఈ కిట్లు, 1.2 లక్షల సర్జికల్‌ మాస్కులు, 33వేలకుపైగా గ్లోవ్స్‌, 8వేల పాద రక్షకాలు, 535 లీటర్ల పరిశుభ్రత ద్రవం తదితరాలను ఆస్పత్రులకు పంపింది. ఒడిసాలోని భద్రక్‌లో 120 పడకల సలాంది ఆస్పత్రికి అద్దెకోసం ప్రభుత్వానికి నెలకు రూ.35 లక్షల వంతున 3 నెలలు అందజేస్తుంది. జిల్లా యంత్రాంగాలు/స్థానిక ప్రభుత్వాలకు రూ.6.36 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. ఇవేగాక పేదలను ఆదుకునేందుకు రిహాండ్‌, వింధ్యాచల్‌ యూనిట్లు రూ.42 లక్షల విలువైన ఆహారధాన్యాలు, భోజన ప్యాకెట్లను సమకూర్చాయి.

 

*****


(Release ID: 1615013) Visitor Counter : 237