మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పవిత్ర రమదాన్ సందర్భంగా లాక్ డౌన్, కర్ఫ్యూ,సామాజిక దూరం నిబంధనలను ఖచ్చితంగా, నిజాయితీగా అమలుచేయాలని 30 కి పైగా రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు చెందిన సీనియర్ అధికారులను ఆదేశించిన - ముఖ్తార్ అబ్బాస్ నక్వీ.
30 కి పైగా రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు చెందిన సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్.
దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డుల కింద నమోదైన 7 లక్షలకు పైగా మసీదులు, ఈద్గాలు, దర్గాలు, ఇతర మతపరమైన, సామాజిక పరమైన సంస్థలు.
క్వారంటైన్ మరియు ఐసోలేషన్ కేంద్రాలపై ప్రచారమౌతున్న పుకార్లు, అసత్య ప్రచారాలను తిప్పి కొట్టి,
అవగాహన కల్పించాలి - ముఖ్తార్ అబ్బాస్ నక్వీ.
"అన్ని రకాల పుకార్లు, అసత్య ప్రచారం, కుట్రల ను కలిసి పనిచేసి ఓడించడం ద్వారా కరోనా కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో విజయం సాధించాలి."
Posted On:
16 APR 2020 2:03PM by PIB Hyderabad
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి, కేంద్ర వక్ఫ్ మండలి చైర్మన్ శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నక్వీ ఈ రోజు దేశంలోని 30 కి పైగా రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు చెందిన సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున నేపథ్యంలో పవిత్ర రమదాన్ మాసం ఏప్రిల్ 24వ తేదీ నుండి ప్రారంభం కానున్న సందర్భంగా లాక్ డౌన్, కర్ఫ్యూ, సామాజిక దూరం నిబంధనలను ఖచ్చితంగా, నిజాయితీగా అమలుచేయాలని వారిని ఆదేశించారు.
పవిత్ర రంజాన్ మాసంలో తమ తమ ఇళ్లల్లోనే ఉండి, ప్రార్ధనలు, ఇతర మతపరమైన ఆచార వ్యవహారాలను నిర్వహించుకునేలా ప్రజల్లో అవగాహన కలిగించాలని శ్రీ నక్వీ ఈ సందర్భంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులను కోరారు.
దేశవ్యాప్తంగా 7 లక్షలకు పైగా మసీదులు, ఈద్గాలు, ఇమాంబాదాలు, దర్గాలు, ఇతర మతపరమైన, సామాజిక పరమైన సంస్థలు రాష్ట్ర వక్ఫ్ బోర్డుల కింద పనిచేస్తాయి. భారతదేశంలోని రాష్ట్ర వక్ఫ్ బోర్డులు కేంద్ర వక్ఫ్ మండలి నియంత్రణలో పనిచేస్తాయి.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మన భద్రతా, శ్రేయస్సు కోసం పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, భద్రతా దళాలు, పరిపాలనా అధికారులు, పారిశుధ్య కార్మికులకు సహకరించాలని శ్రీ నక్వీ ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేశారు. క్వారంటైన్ మరియు ఐసోలేషన్ కేంద్రాలపై ప్రసారమౌతున్న పుకార్లను, అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలనీ, అవి కరోనా నుండి ప్రజలను, వారి కుటుంబాలను రక్షించటానికి మాత్రమే ఏర్పాటు చేసినట్లు మనం ప్రజల్లో అవగాహన కల్పించాలనీ - ఆయన - కోరారు.
అసత్య సమాచారాన్ని సృష్టించాలనే ఉద్దేశ్యంతో నకిలీ వార్తలు, కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీ నక్వీ అన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డులకు, మతపరమైన సంస్థలు, సామాజిక సంస్థలకు సూచించారు. ఎటువంటి వివక్షకు అవకాశం లేకుండా అధికారులు దేశ పౌరుల రక్షణ, శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారు. కరోనా కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని బలహీన పరిచేందుకే, అటువంటి పుకార్లు, కుట్రలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. అందువల్ల, కరోనా కి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాన్ని విజయవంతం చేసేందుకు మనమంతా కలిసికట్టుగా ఈ పుకార్లు, అసత్య సమాచారాన్ని, కుట్రలను తిప్పికొట్టాలి.
పవిత్ర రమదాన్ మాసంలో మతపరమైన బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు, తమ తమ ఇళ్లలోనే ఉండి కేంద్ర హోం మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర వక్ఫ్ మండలి జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా, నిజాయితీగా అమలయ్యే విధంగా, అన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డులకు చెందిన అధికారులు తమ పాత్రను చురుకుగా, సమర్ధవంతంగా నిర్వహించాలని శ్రీ నక్వీ కోరారు.
కరోనా వల్ల ఎదురౌతున్న సవాళ్ల నేపథ్యంలో దేశంలోని అన్ని దేవాలయాలు, గురుద్వారాలు, చర్చిలు, ఇతర మతపరమైన, సామాజిక పరమైన ప్రదేశాలలో ఎటువంటి మతపరమైన, సామాజిక పరమైన కార్యకలాపాలు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలు నిర్వహించకుండా నిషేధించడమైనది. అదేవిధంగా, దేశంలో అన్ని మసీదులు, ఇతర ముస్లిం మతపరమైన ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలను నిషేధించడమైనది.
కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో, లాక్ డౌన్ సమయంలో, సామాజిక దూరం వంటి మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ, ప్రజలు తమ తమ ఇళ్లల్లోనే ఉండి, పవిత్ర రమదాన్ ప్రార్ధనలు, ఇతర మతపరమైన ఆచార వ్యవహారాలను నిర్వహించుకోవాలని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే మత పెద్దలు, మతపరమైన సంస్థలు, సామాజిక సంస్థలు విజ్ఞప్తి చేశాయి. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద, ఇతర మతపరమైన ప్రదేశాలలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడవద్దని, ప్రపంచంలోని చాలా ముస్లిం దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి.
అన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రజల రక్షణ, శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతో సమర్ధవంతంగా కృషి చేస్తున్నారని శ్రీ నక్వీ పేర్కొన్నారు. కరోనా కు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటంలో ప్రజలు అందిస్తున్న సహకారం భారతదేశానికి ఎంతో ఉపశమనం కలిగించింది. అయితే, దేశం ఇంకా పలు సవాళ్ళను ఎదుర్కొంటూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా, నిజాయితీగా అనుసరించడం ద్వారా మనం ఈ సవాళ్ళను అధిగమించవచ్చు.
లాక్ డౌన్ సమయంలో సామాజిక దూరం వంటి మార్గదర్శకాలను పాటించి, తమ తమ ఇళ్లల్లోనే ఉండి, రమదాన్ కు సంబధించిన అన్ని ప్రార్ధనలు, ఆచారాలు నిర్వహించుకోవాలని శ్రీ నక్వీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారతదేశంతో పాటు ప్రపంచమంతా ఈ కరోనా మహమ్మారి నుండి విముక్తి కావాలని మనందరం ప్రార్ధన చేయాలని ఆయన సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో - ఉత్తరప్రదేశ్ (షియా & సున్నీ); ఆంధ్రప్రదేశ్, బీహార్ (షియా & సున్నీ); దాద్రా & నాగర్ హవేలీ; హర్యాణా, కర్ణాటక, కేరళ, మధ్య ప్రదేశ్; పంజాబ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ & నికోబార్; అస్సాం; మణిపూర్, రాజస్థాన్, తెలంగాణ, ఢిల్లీ, ఛత్తీస్ గఢ్; గుజరాత్; హిమాచల్ ప్రదేశ్; జమ్మూ & కశ్మీర్; ఝార్ఖండ్; మహారాష్ట్ర; ఒడిశా; పుదుచ్చేరి; తమిళనాడు; త్రిపుర, ఉత్తరాఖండ్ మొదలైన రాష్ట్రాల వక్ఫ్ బోర్డులతో పాటు, ఇతరులు పాల్గొన్నారు.
*****
(Release ID: 1615150)
Visitor Counter : 260
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam