PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
06 MAY 2020 6:44PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- మొత్తం 49,391 కోవిడ్-19 కేసులకుగాను 14,183మందికి నయంకాగా- కోలుకున్నవారి శాతం 28.72గా ఉంది.
- నిన్నటినుంచి 2,958 కొత్త కేసులు నమోదయ్యాయి.
- వ్యాక్సిన్ అభివృద్ధి, ఔషధ అన్వేషణ, నిర్ధారణ-పరీక్షలకు సంబంధించి భారత్ కృషిపై ప్రధానమంత్రి సమీక్ష
- ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనకింద ఇప్పటిదాకా 39 కోట్లమంది పేదలకు రూ.34,800 కోట్ల ఆర్థిక సహాయం.
- దిగ్బంధం నేపథ్యంలో అదనపు అవసరాలు తీర్చినప్పటికీ భారత ఆహార సంస్థ-ఎఫ్‌సీఐ వద్ద సంతృప్తికర నిల్వలు.
- విదేశాల్లో చిక్కుబడిన భారతీయుల రాకకు, విదేశీ పయనం చేయదలచేవారికి ప్రామాణిక నిర్వహణ ప్రక్రియను నిర్దేశించిన దేశీయాంగ శాఖ; విదేశాల నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు ‘సముద్ర సేతు’ కార్యక్రమం చేపట్టిన భారత నావికాదళం
- సాధారణ, ల్యాండ్‌లైన్ ఫోన్లుగల వారికోసం ‘ఆరోగ్య సేతు’ ఐవీఆర్‌ఎస్ సేవలు ప్రారంభం.
కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం
దేశంలో ఇప్పటిదాకా కోవిడ్-19 బారినపడి నయమైనవారి సంఖ్య 14,143కు చేరగా, వీరిలో నిన్న ఒక్కరోజునే 1,457 మంది ఉండటంతో కోలుకున్నవారి శాతం 28.72కు పెరిగింది. దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్-19 నిర్ధారిత కేసుల సంఖ్య 49,391కాగా, నిన్నటినుంచి 2,958 కొత్త కేసులు నమోదయ్యాయి.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621551
గుజరాత్, మహారాష్ట్రలలో కోవిడ్-19 నియంత్రణ చర్యలు, తదుపరి సన్నద్ధతపై డాక్టర్ హర్షవర్ధన్ సమీక్ష
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో ఇప్పటిదాకా తీసుకున్న కోవిడ్-19 నియంత్రణ చర్యలు, తదుపరి సన్నద్ధతలపై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ ఆ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో సమీక్షించారు. ఈ రెండు రాష్ట్రాల్లోని కొన్న జిల్లాల్లో మరణాల సంఖ్య అధికంగా నమోదు కావడంపై ఈ సందర్భంగా ఆయన విచారం వ్యక్తం చేశారు. “అత్యధిక మరణాల శాతాన్ని తగ్గించే దిశగా సంబంధిత జిల్లాలపై రాష్ట్ర ప్రభుత్వాలు నిశితంగా దృష్టి సారించాలి. ఆ మేరకు నిశిత నిఘా, రోగులతో సంబంధాలున్నవారి అన్వేషణ, సకాలంలో నిర్ధారణలపై ప్రధానంగా శ్రద్ధపెట్టాలి” అని డాక్టర్ హర్షవర్ధన్ సూచించారు.
ప్రధానమంత్రి అధ్యక్షతన కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, ఔషధ అన్వేషణ, రోగనిర్ధారణ-పరీక్షల సంబంధిత కార్యాచరణ బృందం సమావేశం
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, ఔషధ అన్వేషణ, రోగనిర్ధారణ-పరీక్షలకు సంబంధించి దేశంలో సాగుతున్న కృషిని ప్రధానమంత్రి సమగ్రంగా సమీక్షించారు. కాగా, కరోనా వ్యాక్సిన్ రూపకల్పనకు సంబంధించి ప్రస్తుతం 30దాకా భారతీయ వ్యాక్సిన్ల అభివృద్ధి వివిధ దశల్లో ఉండగా, కొన్ని ప్రయోగ దశకు చేరడం గమనార్హం. విద్యావేత్తలు, పరిశ్రమలు, ప్రభుత్వం అపూర్వరీతిలో- సమష్టి కృషితో నియంత్రిత ప్రక్రియమేరకే అయినా వేగంగా ముందడుగు వేస్తుండటంపై ఈ సమీక్ష సందర్భంగా ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విధమైన సమన్వయం, వేగం ఒక ప్రామాణిక నిర్వహణ ప్రక్రియగా రూపుదిద్దుకోవాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఒక సంక్షోభం ఎదురైనప్పుడు ప్రదర్శించగలిగే పట్టుదల, దీక్షవంటి లక్షణాలు మామూలు సమయంలో నిర్వర్తించే సాధారణ శాస్త్రవిజ్ఞాన విధుల్లోనూ భాగం కావాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ప్యాకేజీ: ఇప్పటిదాకా సాధించిన ప్రగతి
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ప్యాకేజీ కింద 2020 మే 5వ తేదీదాకా దేశంలోని సుమారు 39 కోట్ల పేదలకు డిజిటల్ చెల్లింపుల మౌలిక వసతులద్వారా రూ.34,800 కోట్ల మేర ఆర్థిక సహాయం అందింది. ఈ మేరకు ప్యాకేజీ అమలులో ప్రగతి ఇలా ఉంది:
· పీఎం-కిసాన్ తొలివిడత చెల్లింపు కింద 8.19 కోట్ల లబ్ధిదారులకు రూ.16,394 కోట్లు విడుదల.
· దేశంలోని 20.05 కోట్ల మహిళా జన్‌ధన్ ఖాతాలలో తొలివిడత సాయం కింద రూ 10,025 కోట్లు జమ; అలాగే మే 5వ తేదీనాటికి 5.57 కోట్ల మహిళా జన్‌ధన్ ఖాతాలలో రెండోవిడత సాయం కింద రూ 2,785 కోట్లు జమ.
· దేశంలోని 2.82 కోట్లమంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రూ.1,405 కోట్లు పంపిణీ.
· భవన-ఇతర నిర్మాణ కార్మికులు 2.20 కోట్ల మందికి రూ.3,492.57 కోట్ల మేర ఆర్థిక సహాయం పంపిణీ.
· పీఎంయూవై లబ్ధిదారులు 5.09 కోట్లమంది ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకోగా, ఇప్పటిదాకా 4.82 కోట్ల మందికి సరఫరా.
· ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాల నుంచి రూ.2,985కోట్లు వాపసు తీసుకున్న 9.6 లక్షల మంది ఈపీఎఫ్‌వో చందాదారులు.
· దేశవ్యాప్తంగా 44.97 లక్షల మంది ఉద్యోగుల ఖాతాలకు 24శాతం భవిష్యనిధి చందా కింద రూ.698 కోట్లు జమ.
విదేశాల్లో చిక్కుబడిన భారతీయుల రాకకు, భారత్‌నుంచి విదేశాలకు వెళ్లదలచే వారి ప్రయాణం కోసం ప్రామాణిక విధాన ప్రక్రియలు జారీ
దేశంలో దిగ్బంధం విధించేనాటికి భారతీయులు అనేకమంది ఉద్యోగం, విద్య/శిక్షణ, పర్యటన, వ్యాపారం వగైరాల కోసం విదేశాలకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయారు. సుదీర్ఘకాలం అలా చిక్కుబడిన నేపథ్యంలో వారు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ త్వరగా స్వదేశం చేరాలని ఆదుర్దా పడుతున్నారు. ఇలాంటివారే కాకుండా వైద్యపరమైన అత్యవసరాల కోసం లేదా ఆప్తులు మరణంవంటి కారణాలవల్ల మరికొందరు స్వదేశం రావాలని భావిస్తున్నారు. అలాగే వివిధ అత్యవసర పనుల నిమిత్తం భారత్ నుంచి పలువురు విదేశాలకు వెళ్లాలని కోరుతున్నారు. ఇటివంటివారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, తదనుగుణమైన ప్రామాణిక విధాన ప్రక్రియలపై దేశీయాంగ శాఖ విధివిధానాలను నిర్దేశిస్తూ ఆదేశాలు జారీచేసింది.
‘సముద్ర సేతు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన భారత నావికాదళం
“సముద్ర సేతు” ఆపరేషన్‌ను ప్రారంభించిన భారత నావికా దళం
భారత నావికాదళం "సముద్ర సేతు" అంటే- "సముద్ర వారధి" పేరిట విదేశాల నుంచి భారత పౌరులను స్వదేశం తీసుకొచ్చే జాతీయ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా తొలిదశ కింద 2020 మే 8 నుంచి భారతీయుల తరలింపు ప్రారంభిస్తుంది. ముందుగా భారత నావికా దళానికి చెందిన ‘జలాశ్వ, మాగర్’ నౌకలు ప్రస్తుతం మాల్దీవ్స్ రిపబ్లిక్‌లోని మాలే రేవునుంచి తరలింపును మొదలుపెడతాయి.
కోవిడ్ -19వల్ల భారతదేశంలో చిక్కుకున్న విదేశీ పౌరులకు, అంతర్జాతీయ విమాన ప్రయాణాలమీద నిషేధం తొలగింపు నాటినుంచి 30 రోజులపాటు కొన్ని కాన్సులర్ సేవలను మంజూరుకు ప్రభుత్వం అనుమతి
భారత్ నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణాలను 2020 ఫిబ్రవరి 1 అర్థరాత్రి నుంచి నిషేధించిన తర్వాత... ఈ నిషేధం తొలగింపు తేదీ నాటికి వీసాల గడువు ముగిసిన లేక ముగిసేదశకు చేరిన విదేశీ పౌరుల రెగ్యులర్ వీసా, ఈ-వీసా లేదా బస పొడిగింపు తదితరాలను వారినుంచి ఆన్‌లైన్ దరఖాస్తు అందిన తర్వాత ‘కారుణ్య’ కారణాల ప్రాతిపదికన ప్రభుత్వం అనుమతిస్తుంది. తదనుగుణంగా ఎక్కువ కాలం ఉన్నందుకు జరిమానా విధించకుండా భారత్ నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణానికి నిషేధం తొలగించిన తేదీ నుంచి 30 రోజులదాకా ఇలాంటి పొడిగింపు మంజూరు చేయబడుతుంది.
భారత్ నుంచి/భారత్‌కు అంతర్జాతీయ విమాన ప్రయాణంపై నిషేధం తొలగించేదాకా కొన్ని కేటగిరీలు మినహా విదేశీయులకు మంజూరు చేసిన ప్రస్తుత వీసాలపై తాత్కాలిక నిషేధం కొనసాగింపు
భారత్ నుంచి/భారత్‌కు అంతర్జాతీయ విమాన ప్రయాణంపై విధించిన నిషేధం తొలగించేదాకా దౌత్య, అధికారిక, ఐక్యరాజ్యసమితి/అంతర్జాతీయ సంస్థల, ఉద్యోగ/ప్రాజెక్టు కేటగిరీల్లోని వారు మినహా విదేశీయులకు జారీచేసిన ప్రస్తుత వీసాలపై తాత్కాలిక నిషేధం కొనసాగించాలని దేశీయాంగ శాఖ నిర్ణయించింది.
అంతర్జాతీయ విమాన ప్రయాణంపై నిషేధం తొలగించేదాకా ఓసీఐ కార్డుదారులకు భారత్ సందర్శనకోసంగల బహుళప్రవేశ జీవితకాల వీసా సదుపాయం నిలిపివేత కొనసాగుతుంది
భారత్ నుంచి/భారత్‌కు అంతర్జాతీయ విమాన ప్రయాణంపై నిషేధం తొలగించేదాకా ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓ.సి.ఐ) కార్డుదారులుగా నమోదు చేసుకున్న వ్యక్తులకు ఏ కారణంతోనైనా భారత్‌ను సందర్శించేలా మంజూరు చేసిన బహుళ ప్రవేశ జీవితకాల వీసా సదుపాయ హక్కు నిలిపివేతను కొనసాగిస్తూ దేశీయాంగ శాఖ ఒక ఉత్తర్వు జారీచేసింది
దిగ్బంధం సమయాన దేశవ్యాప్తంగా అదనపు అవసరాలను తీర్చినప్పటికీ భారత ఆహార సంస్థ-ఎఫ్‌సీఐ వద్ద నిల్వలు సంతృప్తికరం: రామ్‌విలాస్ పాశ్వాన్
భారత ఆహార సంస్థ-ఎఫ్‌సీఐ వద్ద... 2020 మే 4నాటి నివేదిక ప్రకారం- ప్రస్తుతం 276.61 లక్షల టన్నుల బియ్యం, 353.49 లక్షల టన్నుల గోధుమలు నిల్వ ఉన్నట్లు మంత్రి ప్రకటించారు. కాగా, జాతీయ ఆహార భద్రత చట్టం కింద, ఇతర సంక్షేమ పథకాల కోసం నెలకు సుమారు 60 లక్షల టన్నుల ఆహారధాన్యాలు అవసరమని ఆయన తెలిపారు. కాగా, దిగ్బంధం సమయంలో దాదాపు 69.52 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను సేకరించి, 2,483 గూడ్సు రైళ్లద్వారా రవాణా చేసినట్లు మంత్రి చెప్పారు. రైలు మార్గంతోపాటు రోడ్డు, సముద్ర మార్గాల్లోనూ ఆహార ధాన్యాలను రవాణా చేశామని, మొత్తంమీద 137.62 లక్షల టన్నులు రవాణా అయ్యాయని ఆయన వివరించారు.
దేశంలో రబీ 2020-21కింద పూర్తిస్థాయిలో పప్పుదినుసులు, నూనె గింజలు, గోధుమల సేకరణ
దేశవ్యాప్తంగా 2020-21 రబీ సీజన్ కింద 2020 మే 2 వరకు 2,61,565 టన్నుల పప్పుదినుసులతోపాటు 3,17,473 టన్నుల నూనె గింజలను కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరతో సేకరించింది. వీటి విలువ రూ.2,682 కోట్లు కాగా, 3,25,565 మంది రైతులకు లబ్ధి చేకూరింది. కాగా, ఈ కొనుగోళ్లలో భాగంగా 2020 మే 1, 2 తేదీల్లో 14,859 టన్నుల పప్పులు, 6,706 టన్నుల నూనె గింజలను మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలలో నిర్వహించినవి కావడం గమనార్హం. అంతేకాకుండా 2020-21 రబీ మార్కెటింగ్ సీజన్‌లో 1,87,97,767 టన్నుల గోధుమలు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గిడ్డంగులకు చేరగా, ఇందులో 1,81,36,180 టన్నులు కొనుగోళ్లకు సంబంధించినదే.
సాధారణ, ల్యాండ్‌లైన్ ఫోన్లుగల వారికోసం ‘ఆరోగ్య సేతు’ ఐవీఆర్‌ఎస్ సేవలు ప్రారంభం
సాధారణ, ల్యాండ్‌లైన్ ఫోన్లున్నవారికీ ‘ఆరోగ్య సేతు’ కింద రక్షణ దిశగా “ఆరోగ్య సేతు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్” (ఐవీఆర్‌ఎస్)ను ప్రభుత్వం అమలుచేయడం ప్రారంభించింది. ఈ ఉచిత ఫోన్ సదుపాయం దేశవ్యాప్తంగా లభిస్తుంది... ఈ మేరకు 1921 నంబరుకు ‘మిస్డ్’ కాల్ చేస్తే, వారి ఆరోగ్య వివరాలు తెలపాల్సిందిగా స్పందన లభిస్తుంది. ఈ ప్రశ్నలకు వారిచ్చే సమాధానాలనుబట్టి ఆరోగ్యసేతు యాప్‌కు అనుగుణంగా ఉంటాయి. అలాగే వారి ఆరోగ్య స్థితి గురించి పౌరులకు ఎస్‌ఎంఎస్ కూడా అందుతుంది. ఆ తర్వాత కూడా వారి ఆరోగ్యంపై క్రమంగా హెచ్చరికలు అందుతూంటాయి. మొబైల్ అప్లికేషన్ తరహాలోనే ఈ సేవలను 11 ప్రాంతీయ భాషల్లో పౌరులు పొందవచ్చు.
భారత, పోర్చుగల్ ప్రధానమంత్రుల మధ్య టెలిఫోన్ సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పోర్చుగల్ ప్రధానమంత్రి గౌరవనీయులైన ఆంటోనియో కోస్టాతో టెలిఫోన్‌ద్వారా సంభాషించారు. కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి ప్రస్తుత పరిస్థితి, తమతమ దేశాల్లో ప్రజారోగ్యం, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావాన్ని ఉపశమింప చేయడానికి తీసుకున్న చర్యలపై దేశాధినేతలిద్దరూ చర్చించుకున్నారు. ఈ సంక్షోభాన్ని సమర్థంగా కట్టడి చేయడంపై పోర్చుగల్ ప్రధానమంత్రి కోస్టాను ప్రధాని అభినందించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి జాతీయస్థాయిలో తీసుకునే క్రియాశీల చర్యలు ఉపయోగపడతాయని వారిద్దరూ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు పరస్పరం సహకరించుకోవాలని వారు నిర్ణయించారు. కోవిడ్-19 కట్టడిపై సంయుక్త పరిశోధన-ఆవిష్కరణలు చేపట్టాలని అంగీకారానికి వచ్చారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621362 ‘గరుడ్’ పోర్టల్‌ద్వారా కోవిడ్-19 సంబంధిత డ్రోన్/ఆర్‌పీఏఎస్ కార్యకలాపాలు చేపట్టే ప్రభుత్వ సంస్థలకు షరతులతో అనుమతి
కోవిడ్-19 సంబంధిత డ్రోన్/ఆర్‌పీఏఎస్ (రిమోట్లీ పైలెటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్) కార్యకలాపాల కోసం ప్రభుత్వం సంస్థలకు షరతులతో కూడిన సత్వర అనుమతులిచ్చేందుకు పౌర విమానయాన మంత్రిత్వశాఖ ‘గరుడ్’ పేరిట ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. కాగా, ‘గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్’కు సంక్షిప్త నామమే ‘గరుడ్’.
ఆర్థిక మందగమనం నుంచి బయటపడటంలో బస్సులు, కార్ల నిర్వహకులకు పూర్తిమద్దతుపై శ్రీ గడ్కరీ హామీ
కేంద్ర మంత్రి శ్రీ గడ్కరీ భారత బస్సులు-కార్ల నిర్వాహక సమాఖ్య ప్రతినిధులతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా వివిధ అంశాలపై చర్చించారు. ప్రజల్లో విశ్వాసం కలిగించడంలో రవాణా, రహదారుల పునరుద్ధరణ తొలి అడుగు కాగలదని ఆయన అన్నారు. కొన్ని మార్గదర్శకాలతో ప్రజారవాణా త్వరలో ప్రారంభమౌతుందని తెలిపారు. లండన్ తరహా ప్రజారవాణా వ్యవస్థను ప్రవేశపెట్టడంపై తమశాఖ యోచిస్తున్నదని మంత్రి తెలిపారు. ఈ విధానంలో ప్రభుత్వ వాటా కనీసస్థాయిలో ఉంటుందని, ప్రైవేటు పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు.
దేశవ్యాప్తంగా ‘లైఫ్‌లైన్ ఉడాన్’ కింద 465 విమానాలద్వారా కీలక మందుల సరఫరా
‘లైఫ్‌లైన్ ఉడాన్’ కింద ఎయిరిండియా, అలయెన్స్ ఎయిర్, ఐఏఎఫ్, ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు ఇప్పటిదాకా 465 విమానాలను నడిపాయి. ఈ విమానాలు దేశవ్యాప్తంగా 4,51,038 కిలోమీటర్లు ప్రయాణించి, 835.94 టన్నుల సామగ్రిని రవాణా చేశాయి. జమ్ముకశ్మీర్, లద్దాఖ్, ద్వీప ప్రాదేశికాలు, ఈశాన్య భారత ప్రాంతంలోని మారుమూల ప్రదేశాలకు పవన్‌హన్స్ లిమిటెడ్ సంస్థసహా పలు హెలికాప్టర్ సర్వీసులు కీలక వైద్య సామగ్రితోపాటు కోవిడ్-19 రోగులను కూడా తీసుకెళ్లాయి. ఇందులో భాగంగా పవన్‌హన్స్ సంస్థ హెలికాప్టర్లు 2020 మే 5వ తేదీదాకా 7,729 కిలోమీటర్లు ప్రయాణించి 2.27 టన్నుల వస్తుసామగ్రిని చేరవేశాయి.
దిగ్బంధం సందర్భంగా డిజిటల్/ ఆధార్ ఆధారిత ఈ-సంతకం స్వీకరణకు యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నదృష్ట్యా ఈపీఎఫ్ వర్తింపు ప్రక్రియ సౌలభ్యం కోసం ఈ-మెయిల్‌ద్వారా ఈ-సంతకం పొందే వీలుకల్పించిన ఈపీఎఫ్‌వో
దృశ్య-శ్రవణ మాధ్యమం లేదా ఓఏవీఎం ద్వారా కంపెనీల వార్షిక సర్వసభ్య సమావేశాలకు అనుమతి
సామాజిక దూరం నిబంధనలకు కట్టుబాటుసహా వ్యక్తుల కదలికలపై ఆంక్షలున్న దృష్ట్యా కంపెనీలు ప్రస్తుత 2020 కేలండర్ సంవత్సరంలో తమ వార్షిక సర్వసభ్య సమావేశాలను దృశ్య-శ్రవణ మాధ్యమం లేదా ఓఏవీఎం ద్వారా నిర్వహించుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు నం.20/2020తో సాధారణ సర్క్యులర్‌ను జారీచేసింది.
ఢిల్లీలో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వ్యాధుల నిరోధం, నియంత్రణపై డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం
కోవిడ్-19 నేపథ్యంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా రోగవాహకాల వల్ల వ్యాపించే అంటువ్యాధులపై సంబంధిత భాగస్వామ్య సంస్థలన్నీ సామాజిక భాగస్వామం, వినూత్న అవగాహన కార్యక్రమాలు వంటివి చేపట్టాల్సిన ప్రాముఖ్యాన్ని మంత్రి నొక్కిచెప్పారు.
దిగ్బంధం సమయంలో పార్శిల్ రైళ్లద్వారా 54,292 టన్నుల సరకులు రవాణా చేసిన రైల్వేశాఖ; 2000 దాటిన పార్శిల్ రైళ్ల సంఖ్య
రాష్ట్రప్రభుత్వాలుసహా ఈ-కామర్స్ సంస్థలు, ఖాతాదారుల కోసం సత్వర వస్తు రవాణా వీలుగా రైల్వేశాఖ పార్శిల్ రైళ్లను అందుబాటులో ఉంచింది. ఆ మేరకు నిర్దిష్ట సమయాల్లో ప్రత్యేక పార్శిల్ రైళ్లను ఎంపిక చేసిన మార్గాల్లో నడిపింది. తద్వారా నిత్యావసరాల సరఫరాలో అంతరాయం కలగకుండా చేయూతనిచ్చింది. ఇలాంటి పార్శిల్ రైళ్లను నడిపే మార్గాలను జోనల్ రైల్వేలు క్రమం తప్పకుండా గుర్తించి ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి 82 మార్గాల్లో పార్శిల్ రైళ్లు నడుస్తున్నాయి.
కోవిడ్-19ను సత్వరం, కచ్చితంగా నిర్ధారించే కిట్ రూపకల్పన పరిజ్ఞానం లైసెన్సింగ్స్‌పై సిఎస్ఐఆర్-ఐజిఐబి, టాటా సన్స్ మధ్య అవగాహన ఒప్పందం
ఇది పూర్తిగా స్వదేశీ శాస్త్రీయ ఆవిష్కరణ కావడమేగాక ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల ప్రభావ ఉపశమనానికి వీలుగా సామూహిక పరీక్షల నిర్వహణ కోసం ఫెలుడా (FELUDA) విధానం రూపొందించబడింది. దీని ప్రధాన ప్రయోజనాలు, అందుబాటు, వినియోగంలో సాపేక్ష సౌలభ్యంతోపాటు ఖరీదైన Q-PCR యంత్రాలపై ఆధారపడాల్సిన అవసరం లేకపోవడం ఇందులోని ప్రయోజనాలుగా పేర్కొనవచ్చు.
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- చండీగఢ్: కోవిడ్-19 సంక్రమణ నిరోధం కోసం నగరంలోని నియంత్రణ జోన్లలో రోగనిర్ధారణ పరీక్షలు ముమ్మరంగా నిర్వహించాలని పాలనాధికారి ఆదేశించారు. కాగా, నగరంలోని PGIMERకి అదనంగా పరీక్ష కిట్లను అందజేసేందుకు భారత వైద్య పరిశోధన మండలి-ఐసీఎంఆర్ అంగీకరించింది. తదనుగుణంగా నగరంలోని పరీక్ష కేంద్రాలన్నీ రోగనిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. చండీగఢ్‌లోని నిరుపేదలకు సుమారు 1.55 లక్షల ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. మరోవైపు నగరంలో 2,42,000 మంది ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
- పంజాబ్: కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప‌్రభుత్వ అధికారులు, సిబ్బంది భద్రత దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాల సురక్షిత నిర్వహణ కోసం పంజాబ్ ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలు, విధివిధానాలను జారీచేసింది, ఆ మేరకు ప్రతి విభాగంలో సిబ్బంది ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి నోడల్ అధికారులను నియమించింది. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థలు, వ్యాపారులు ఇవాళ 20వ రోజున రాష్ట్రవ్యాప్తంగా 3,89,478 టన్నుల గోధుమలను సేకరించారు. ఈ మేరకు ప్రభుత్వ సంస్థలు 3,87,688 టన్నులు కొనుగోలు చేయగా, వ్యాపారులు 1,790 టన్నులు కొన్నారు.
- హర్యానా: డయాలసిస్ అవసరమయ్యే కోవిడ్-19 రోగులకు రాష్ట్రంలోని అన్ని జిల్లా-వైద్య కళాశాల ఆస్పత్రులలో రెండు డయాలసిస్ యంత్రాలను ప్రత్యేకంగా కేటాయించాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా మొత్తం 11 ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులలో ఆ రోగుల కోసం 100-150 పడకలను కేటాయిస్తారు. మిగిలిన పడకలతో OPDలు, వార్డులు తమ సాధారణ చికిత్స విధులను నిర్వర్తిస్తాయి.
- హిమాచల్ ప్రదేశ్: దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే హిమాచల్ వాసుల కుటుంబసభ్యులకు సామాజిక దూరం పాటించడంపై అవగాహన కల్పించడానికి ప్రభుత్వం *నిఘా* పేరిట కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి ఇళ్లకు ఆశా, ఆరోగ్య, అంగన్‌వాడీ కార్యకర్తలు వెళ్లి సామాజిక దూరం ప్రాముఖ్యాన్ని వారికి వివరిస్తారు. తద్వారా వారికి వ్యాధి సంక్రమణ ముప్పు తప్పుతుంది. కాగా, కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి వ్యాప్తి నిరోధం దిశగా అనుసరించిన *హిమాచల్ నమూనా* విధానం సత్ఫలితాలిచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు.
- కేరళ: విదేశాల నుండి తిరిగి వచ్చే కేరళీయులకు వ్యవస్థాగత నిర్బంధ వ్యవధిని 7 నుంచి 14 రోజులకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వందే భారత్ కార్యక్రమంలో భాగంగా రేపు తొలి రెండు ప్రత్యేక విమానాలు యూఏఈలోని కేరళీయులను తీసుకువస్తాయి. వీటిలో మొదటి విమానం గురువారం రాత్రి నెడుంబసేరి విమానాశ్రయానికి వస్తుంది. కాగా, నౌకలకు ప్రవేశ అనుమతి లేనందువల్ల యూఏఈలో చిక్కుబడినవారు సముద్ర మార్గంలో రావడం ఆలస్యం కావచ్చునని అంచనా. రాష్ట్రంలోని మద్యం దుకాణాలను ఇప్పట్లో తెరవరాదని ప్రభుత్వ నిర్ణయం. కాగా, వలస కార్మికుల కోసం ఇవాళ రాష్ట్రం నుంచి మూడు రైళ్లు నడుస్తాయి.
- తమిళనాడు: చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో వంటశాల కార్మికుడికి కోవిడ్-19 కోసం నిర్ధారణ అయింది. కోయంబేడులోని టోకు మార్కెట్ మూసివేతతో చెన్నైవాసులకు కూరగాయల కొరత. ప్రస్తుతానికి మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతించరాదని ప్రభుత్వ నిర్ణయం. దిగ్బంధం ముగిసేసరికి తమిళనాడులోని చిల్లర వ్యాపారులలో 20-25 శాతం ఆ వ్యాపారం నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందని వ్యాపారుల సంఘం వెల్లడి. నిన్నటిదాకా మొత్తం కేసులు: 4,058, యాక్టివ్ కేసులు: 2,537, మరణాలు: 33.
- కర్ణాటక: రాష్ట్రంలోని బాగల్‌కోట్‌లో ఇవాళ 13 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 692కు పెరిగింది. రాష్ట్రం రూ.1,610 కోట్ల ఉపశమన ప్యాకేజీని ప్రకటించింది. మరోవైపు కోవిడ్-19 ఉపశమన చర్యల నిమిత్తం మద్యంపై పన్నును ప్రభుత్వం 17 శాతం పెంచింది. ఇక వలస కార్మికులను రాష్ట్రం వదలి వెళ్లవద్దని కోరుతూ, వారికి ఉద్యోగాలు, వేతనాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంతర్జాతీయ తరలింపు నిమిత్తం 10,823 మందికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రామాణిక విధాన ప్రక్రియను నిర్దేశించింది.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో మూడు నెలలపాటు వృత్తినష్టానికి గురయ్యే 1,09,231 మంది మత్స్యకారులకు తలా రూ.10,000 వంతున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, దిగ్బంధం నేపథ్యంలో ముంబైలో చిక్కుకున్న 1,100 మంది అనంతపురం జిల్లావాసులు నేడు గుంతకల్లు పట్టణానికి చేరుకున్నారు. రాష్ట్రంలో ఇవాళ 7,782 నమూనాలను పరీక్షించగా, 24 గంటల్లో 60 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 140 మంది డిశ్చార్జ్ కాగా, ఇద్దరు మరణించారు. మొత్తం కేసులు: 1,777, యాక్టివ్ కేసులు: 1,012, మరణాలు: 36గా ఉన్నాయి.
- తెలంగాణ: హైదరాబాద్ శివార్లలోని వివిధ రైల్వే స్టేషన్ల నుంచి వలస కార్మికుల ప్రత్యేక రైళ్లు ఇవాళ బయలుదేరాయి. కాగా, రాష్ట్రంలో 42 రోజుల తర్వాత మద్యం దుకాణాలను తెరిచారు. కాగా, గల్ఫ్ సహా ఇతర దేశాలనుంచి తెలంగాణకు చెందిన 1,750 మంది కార్మికుల తొలి బృందం మే 7 నుంచి వారం వ్యవధిలో తిరిగి రానుంది. రాష్ట్రంలో ఇప్పటిదాకా మొత్తం కోవిడ్ కేసులు 1,096, యాక్టివ్ కేసులు: 439, కోలుకున్నవి: 628, మరణాలు: 29.
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రం వెలుపలినుంచి నిర్మాణ సామగ్రి, హార్డ్‌వేర్, తదితర వస్తువులను రవాణా చేసే వాహనాలను ఇటానగర్ పాలక సంస్థ అనుమతించింది. అయితే, ఉదయం 6 నుంచి 8 గంటలవరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు.
- అసోం: రాష్ట్రంలో మరో ఇద్దరు రోగులకు మూడు పునరావృత పరీక్షల తర్వాత వ్యాధి నయమైనట్లు ఫలితాలు రావడంతో వారిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 44గా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వశర్మ ట్వీట్ చేశారు.
- మణిపూర్: దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈశాన్య భారతానికి తిరిగివచ్చే ప్రజల రైలు ప్రయాణ ఖర్చును భరించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. అలాగే రాజధానికి తిరిగి వచ్చే పౌరులను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా ఇంఫాల్ నగరంలోని పెద్ద మార్కెట్లను మూసివేయాలని తీర్మానించింది.
- మిజోరం: కోవిడ్-19 రోగుల వ్యక్తిగత గుర్తింపు ఏ మాధ్యమంలో బహిర్గతం చేసినా శిక్షార్ష నేరంగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే రూ.5000 జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష విధించాలని నిర్ణయించింది.
- నాగాలాండ్: రాష్ట్రంలోని లాంగ్లెంగ్ జిల్లా పరిధిలో కోవిడ్-19 మృతుల అంత్యక్రియలకు అభ్యంతరం తెలుపరాదని జిల్లా పాలన యంత్రాంగంతోపాటు పౌరసమాజ సంస్థలు నిర్ణయించాయి.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో ఇవాళ 984 కరోనావైరస్ కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 15,525కు చేరుకుంది; అలాగే మరో 34 మంది మృతితో మొత్తం మరణాల సంఖ్య 617కు పెరిగింది. మొత్తం కొత్త కేసులలో 635 మంది ముంబైకి చెందినవారు కాగా, మంగళవారం ఇక్కడ 26 మరణాలు సంభవించాయి. ఒక్క ముంబై నగరంలోనే 9,758 కేసులు నమోదవడం ఈ సందర్భంగా గమనార్హం. మరోవైపు జాతీయ మరణాల సగటు 3.2 శాతం కాగా, రాష్ట్రంలో నెల కిందట 7.2 శాతంగా ఉన్న సగటు ఇప్పుడు 4.0 శాతానికి తగ్గింది. కోవిడ్-19 రోగులకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పడకలను సమకూర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని భారత సైన్యం, నావికాదళం, రైల్వేలు, ఓడరేవులు తదితర కేంద్ర సంస్థలను కోరింది. అంతేకాకుండా నగరంలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యశాలల్లో కోవిడ్-19 రోగుల కోసం అదనపు పడకలు/వార్డులు/సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరేందుకు ముంబై మునిసిపల్ కమిషనర్ నగరంలోని అన్ని వార్డుల అధికారులకు అధికారం ఇచ్చారు.
- గుజరాత్: రాష్ట్రంలో ఇవాళ 441 కొత్త కరోనావైరస్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 6,245కు పెరిగింది. ఇప్పటిదాకా వ్యాధి సోకినవారిలో 1,381 మంది కోలుకోగా, 368 మంది మరణించారు.
- రాజస్థాన్: రాజస్థాన్‌లో ఇవాళ 35 మందికి వ్యాధి నిర్ధారణ కావడంతో కోవిడ్-19 రోగుల సంఖ్య 3,193కు చేరింది. కొత్త కేసులలో 22 జైపూర్‌కు చెందినవి కాగా, ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 1,069కి పెరిగింది.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో ఇవాళ 107 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,049కి పెరిగింది. కాగా, వ్యాధినయమైన ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య 1,000దాకా ఉంటుందని అధికారులు ప్రకటించారు. మరోవైపు ఇండోర్, భోపాల్, ఉజ్జయిని నగరాల్లో వ్యాధి సంక్రమణపై నిశిత నిఘా నిర్వహిస్తున్నారు.
- ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో మద్యం దుకాణాలవద్ద రద్దీ నియంత్రణ దిశగా గ్రీన్‌జోన్ ప్రాంతాల్లో ఇళ్లకే మద్యం సరఫరా ప్రారంభమైంది. దీంతో దేశంలో పంజాబ్ తర్వాత ఈ విధానం అనుమతించిన రెండో రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ పరిగణనలోకి వచ్చింది. మద్యం కావాల్సిన వారు ఆధార్ కార్డు నంబరుసహా పూర్తి వివరాలను పేర్కొంటూ ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్‌ద్వారా ఆర్డర్ ఇవ్వవచ్చు.
FACT CHECK


***
(Release ID: 1621629)
|