హోం మంత్రిత్వ శాఖ

విదేశాల్లో చిక్కుకుపోయిన భారత జాతీయులు, భారత్ లో చిక్కుకుపోయిన విదేశీయుల ప్రయాణాలకు అనుమతిస్తూ హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు

Posted On: 05 MAY 2020 8:13PM by PIB Hyderabad

దేశంలో లాక్ డౌన్ ను మే 4వ తేదీ వరకు రెండు వారాల పాటు పొడిగించిన నేపథ్యంలో వైపరీత్యాల నిర్వహణ చట్టం-2005 పరిధిలో పలు చర్యలను సూచించే ఉత్తర్వులతో పాటు అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ)  జారీ చేసింది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో పొడిగించిన లాక్ డౌన్ సమయంలో అంతర్జాతీయ ప్రయాణాలను ఎంహెచ్ఏ  పూర్తిగా నిషేధించింది.

అయితే ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం ఉద్యోగం, విద్య/ఇంటర్న్ షిప్ లు, విహార యాత్రలు, వ్యాపార అవసరాల కోసం లాక్ డౌన్ కన్నా ముందే విదేశాలకు వెళ్లిన వారు అక్కడే చిక్కుకుపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో వివిధ దేశాల్లో  నిలిచిపోయిన వారందరూ తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతూ వీలైనంత త్వరగా స్వదేశానికి చేరాలని కోరుతున్నారు. వీరు మాత్రమే కాకుండా పలువురు భారతీయులు వైద్యపరమైన అవసరాలు లేదా కుటుంబ సభ్యుల మరణం కారణంగా భారతదేశం రావాలని ఆకాంక్షిస్తున్నారు. అంతే కాదు, కొందరు భారత సందర్శనకు వచ్చిన విదేశీయులు కూడా ఇక్కడ చిక్కుకుపోయారు. వివిధ అత్యవసర కారణాల వల్ల వారందరూ తమ దేశాలకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు.

అలాంటి వారందరి ప్రయాణాలకు అనుమతిస్తూ హోం మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/  ప్రభుత్వ శాఖలకు, రాష్ట్రప్రభుత్వాలు/  కేంద్రపాలిత ప్రాంతాలకు, రాష్ర్టాలు/  కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు ప్రామాణిక అనుసరణ విధివిధానాల ఉత్తర్వులు (ఎస్ఓపి) జారీ చేసింది. వాటిని కచ్చితంగా పాటించి తీరాలని కూడా ఆదేశించింది.


(Release ID: 1621412) Visitor Counter : 273