రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ఆర్థిక మందగమనం నుంచి బయట పడేందుకు బస్ మరియు కార్ ఆపరేటర్లకు పూర్తి మద్ధతు లభిస్తుందని హామీ ఇచ్చిన శ్రీ గడ్కరీ

Posted On: 06 MAY 2020 4:18PM by PIB Hyderabad

దేశంలో ఉండే బస్సు, కారు ఆపరేటర్ల సమస్యల గురించి ప్రభుత్వానికి పూర్తిగా అవగాహన ఉందని, వారి సమస్యలు తీర్చేందుకు పూర్తిగా ప్రభుత్వం సహకరిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారులు, ఎం.ఎస్.ఎం.ఈ. శాఖల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. కోవిడ్ -19 మహమ్మారి సృష్టిస్తున్న క్లిష్ట పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్న ప్రధాని, ఆర్థిక మంత్రితో తాను క్రమం తప్పకుండా మాట్లాడుతున్నానని తెలిపారు.

బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసగించిన శ్రీ గడ్కరీ, రవాణా మరియు రహదారులను పునరుద్ధరించడం ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించడంలో మేలి అడుగు అని తెలిపారు. కొన్ని మార్గదర్శకాలతో ప్రజా రవాణా త్వరలో ప్రారంభమౌతుందని ఆయన తెలిపారు. అయినప్పటికీ బస్సులు మరియు కార్లను నడుపుతున్నప్పుడు సామాజిక దూరాన్ని నిర్వహించడం మరియ హ్యాండ్ వాష్, శానిటైజింగ్, ఫేస్ మాస్క్ వంటి అన్ని భద్రతా చర్యలు అవలంబించాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా వారు లేవనెత్తిన ప్రశ్నలకు స్పందించిన శ్రీ గడ్కరీ, తక్కువ ప్రభుత్వ నిధులతో ప్రైవేట్ భాగస్వామ్యంలో నడుస్తున్న లండన్ ప్రజా రవాణా నమూనాను అవలంబించడంపై తమ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని తెలిపారు. భారతీయ బస్సు మరియు ట్రక్ ల బాడీల పేలవమైన ప్రమాణాలను కూడా ఆయన ఎత్తి చూపారు. ఇది 5 నుంచి 7 సంవత్సరాలు మాత్రమే పని చేస్తాయని, అలా కాకుండా యూరోపియన్ నమూనాలు దాదాపు 15 ఏళ్ళు చెక్కు చెదరవని తెలిపారు. అందుకే మంచి పద్ధతులు అవలంబించడం మీద అందరూ దృష్టి పెట్టాలని శ్రీ గడ్కరీ నొక్కి చెప్పారు. ఇది దీర్ఘకాలంలో దేశీయ పరిశ్రమలకు ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందని అన్నారు.  

ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి వల్ల ఎదురౌతున్న సవాళ్ళ నేపథ్యంలో భారత మార్కెట్ యొక్క కఠినమైన ఆర్థిక పరిస్థితి గురించి తనకు అవగాహన ఉందని మంత్రి తెలిపారు. కానీ, దాన్ని ఎదుర్కొనేందుకు వాటాదారులంతా కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచ పరిశ్రమల నుంచి భారతదేశం వైపు చూస్తున్న మంచి వ్యాపార అవకాశాలను ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. చైనా మార్కెట్ నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్న ఆ విదేశీ కంపెనీలను భారత్ కు ఆహ్వానించడాన్ని అవకాశంగా భారత పరిశ్రమ వినియోగించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం కరోనాతో ఒకటి, ఆర్థిక మందగమనంతో మరొకటి రెండు యుద్ధాలను దేశ ప్రజలు చేస్తున్నారని, ఈ రెండు యుద్ధాలను దేశం గెలిచి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

వడ్డీ చెల్లింపు మినహాయింపులను విస్తరించడం, ప్రజా రవాణాను పునఃప్రారంభించడం, జీవిత పరిమితిని పొడగించడం, రాష్ట్ర పన్నులను వాయిదా వేయడం, ఎం.ఎస్.ఎం.ఈ. ప్రయోజనాలను విస్తరించడం, బీమా పాలసీ చెల్లుబాటును విస్తరించడం మొదలైన వాటితో సహా ప్రజా రవాణా పరిస్థితిని మెరుగు పరిచేందుకు ఈ సమాఖ్య సభ్యులు అనేక సూచనలు చేశారు. 

***

(Release ID: 1621522) Visitor Counter : 231