ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఢిల్లీలో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వ్యాధుల నివారణ, నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో సమావేశం
కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో వెక్టర్ జనిత వ్యాధుల నివారణకోసం వినూత్న చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించిన కేంద్ర మంత్రి
ప్రజల సహకారంతోపాటు సంబంధిత శాఖల భాగస్వామ్యంతో వెక్టర్ జనిత వ్యాధుల నివారణ, నియంత్రణ చేయాలని ఆదేశించిన కేంద్రమంత్రి
Posted On:
05 MAY 2020 7:28PM by PIB Hyderabad
ఢిల్లీలో వెక్టర్ జనిత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వ్యాధుల నివారణ, నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం జరిగింది. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.
ఢిల్లీలో డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా రోగాల పరిస్థితి గురించి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖకు చెందిన జాయింట్ సెక్రటరీ శ్రీమతి రేఖా శుక్లా వివరించారు. వీటిని నియంత్రించడానికి తీసుకునే చర్యల గురించి వివరించారు. డెంగ్యూ వ్యాధి ( కేటగిరీ 1) కేసులు జులై నెలలో మొదలవుతాయని,అక్టోబర్ నెలలో పెరుగుతాయని, నవంబర్, డిసెంబర్ నాటికి తగ్గుతాయని తెలిపారు. అలాగే చికున్ గున్యా, మలేరియా వ్యాధుల గురించి కూడా వివరించారు. వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టే వ్యూహాల గురించి వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలు, మునిసిపల్ కార్పొరేషన్ సంస్థలు సమన్వయంతో వ్యవహరించి వీటిని నివారించవచ్చని అన్నారు.
కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు వెక్టర్ జనిత వ్యాధుల నివారణ, నియంత్రణకు కృషి చేయాలని కేందమంత్రి శ్రీ హర్షవర్ధన్ అన్నారు.
వెక్టర్ జనిత వ్యాధులు రాకుండా వుండడానికిగాను పరిసరాల పారిశుద్ధ్యం చాలా ముఖ్యమని, వెక్టర్ లేకుండా చేసుకోవాలని కేంద్ర మంత్రి అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ పని చేయాలని అధికారులకు సూచించారు. దోమలు లేకుండా చూసుకోవాలని, అన్ని శాఖలు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు.
ప్రస్తుతం కోవిడ్ -19 వైరస్ కారణంగా తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నామని ఇలాంటి పరిస్థితుల్లో వెక్టర్ జనిత వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలని కేంద్ర మంత్రి శ్రీ హర్షవర్ధన్ కోరారు. 2015లో ఢిల్లీలో 16 వేల మందికి డెంగ్యూ జ్వరం వచ్చిందని 60 మంది చనిపోయారని ఈ సారి ఇంతవరకూ 50 కేసులు నమోదయ్యాయని మంత్రి అన్నారు. ఈ విషయంలో గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగ్గా వుందని అన్నారు.
గతంలో వెక్టర్ జనిత వ్యాధులపై స్కూలు పిల్లలు చక్కటి చైతన్యం తెచ్చారని గుర్తు చేశారు శ్రీ హర్షవర్ధన్. అయితే ప్రస్తుతం కోవిడ్ -19 కారణంగా పాఠశాలలు మూసేయడం జరిగింది కాబట్టి స్కూలు విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారని ఈ పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఎవరికివారు తమ పరిసరాలను శుభ్రంగా వుంచుకోవాలని కోరారు. మురుగు నీరు లేకుండా చూసుకోవాలని, దోమలు నివసించడానికి వీలు లేకుండా చూసుకోవాలని కోరారు.
ఢిల్లీ ప్రభుత్వానికి కావలసిన సాయాన్ని అందించడానికి కేంద్రం సదా సిద్ధంగా వుందని ఆయన అన్నారు.
ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ శ్రీ అనిల్ బాయ్ జాల్ మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా రోగాల నివారణ, నియంత్రణకోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యేంద్ర జైన్ ఇంకా పలువురు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
(Release ID: 1621408)
Visitor Counter : 234