ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ఆరోగ్య సేతు సేవలు మరింత విస్తృతం

ఫీచర్‌ ఫోన్ లేదా ల్యాండ్‌లైన్‌ ఉన్నవారి కోసం ఐవీఆర్‌ఎస్‌ సేవలు వృద్ధి
కొవిడ్‌-19 బారిన పడకుండా ఎప్పటికప్పుడు అందనున్న హెచ్చరికలు

Posted On: 06 MAY 2020 4:13PM by PIB Hyderabad

కొవిడ్‌-19పై పోరాటంలో భాగంగా, భారత ప్రభుత్వం అనేక నివారణ చర్యలు చేపడుతోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సహకారంతో వాటిని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. 'ఆరోగ్య సేతు' పేరిట ప్రారంభించిన మొబైల్‌ అప్లికేషన్‌ వీటిలో ప్రముఖమైనది. కేంద్ర ఎలక్ర్టానిక్స్‌ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఆరోగ్య సేతు యాప్‌ను రూపొందించింది. కరోనా వైరస్‌ సోకే ప్రమాదాన్ని తమంతట తాముగా ప్రజలు ఈ యాప్‌ను ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఓ వ్యక్తి ఇతరులను కలుస్తున్న తీరు ఆధారంగా, అత్యాధునిక బ్లూటూత్ పరిజ్ఞానం, అల్గారిథంలు, కృత్రిమ మేధస్సును ఉపయోగించి వైరస్‌ సోకే అవకాశాలను ఇది లెక్కిస్తుంది. పౌరులందరూ ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ యాప్‌ కలిగిన వ్యక్తి కరోనా పాజిటివ్‌ ఉన్నవారిని కలిసినప్పుడు వెంటనే సమాచారం అందించేలా అప్లికేషన్‌ రూపొందించారు.

    ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న వ్యక్తి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. కొవిడ్‌-19 లక్షణాలకు దగ్గరగా ఆ సమాధానాలు ఉంటే ఆ సమాచారం ప్రభుత్వానికి చేరుతుంది. వెంటనే తగిన చర్యలు తీసుకోవడానికి, అవసరమైతే ఐసోలేషన్‌ ప్రక్రియను ప్రారంభించడానికి ఇది ఉపయోగపడుతుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌ (ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం), iOS యాప్‌ స్టోర్‌ (ఐఫోన్ల కోసం)లో యాప్‌ అందుబాటులో ఉంది. ఇది, 10 భారతీయ భాషలు, ఇంగ్లీషులో అందుబాటులో ఉంది.

    ఇప్పటివరకు స్మార్ట్‌ ఫోన్లకే పరిమితమైన యాప్‌ను ఫీచర్‌ ఫోన్లు, ల్యాండ్‌లైన్ల కోసం కూడా వృద్ధి చేశారు. "ఆరోగ్య సేతు ఇంటెరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌" (ఐవీఆర్‌ఎస్‌)ను అందుబాటులోకి తెచ్చారు. ఈ సేవ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ప్రజలు ఫీచర్‌ ఫోన్‌ లేదా ల్యాండ్‌లైన్‌ నుంచి 1921 టోల్‌ ఫ్రీ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే, వెంటనే వారికి తిరిగి కాల్‌ వస్తుంది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఈ కాల్‌ బ్యాక్‌ ద్వారా సేకరిస్తారు. ఆరోగ్య సేతు యాప్‌ సంబంధిత ప్రశ్నలు కాల్‌ బ్యాక్‌లో ఉంటాయి. తర్వాత, తమ ఆరోగ్య స్థితిపై ప్రజలు ఎస్‌ఎంఎస్‌లు, ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకునేలా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందుకుంటారు. మొబైల్‌ అప్లికేషన్‌ తరహాలోనే ఐవీఆర్‌ఎస్‌ సేవలు 11 స్థానిక భాషల్లో అందుబాటులో ఉంటాయి. పౌరులు అందించిన సమాచారం ఆరోగ్య సేతు డేటాబేస్‌లో భాగం అవుతుంది. అక్కడ ఆ సమాచారాన్ని క్రోడీకరించి, పౌరులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేలా హెచ్చరికలు పంపుతుంటారు.

    COVID-19కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు, సూచనలపై ప్రామాణిక, కొత్త సమాచారం కోసం https://www.mohfw.gov.in/ ను తరచూ చూస్తూ ఉండాలి. 

    కొవిడ్‌-19పై సాంకేతికపర సందేహాలు ఉంటే technicalquery.covid19[at]gov[dot]in కు, ఇతర సందేహాలు ఉంటే ncov2019[at]gov[dot]in కు ఈమెయిల్‌ చేయాలి. @CovidIndiaSeva ను ట్వీట్ల రూపంలోనూ సంప్రదించవచ్చు.

    ఫోన్‌ చేయడం ద్వారా కూడా కొవిడ్‌-19కు సంబంధించిన సందేహాలు తీర్చుకోవచ్చు. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్‌ నంబర్‌ +91-11-23978046 లేదా 1075 కు కాల్‌ చేయవచ్చు. ఇవి టోల్‌ ఫ్రీ నంబర్లు. https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్‌ నంబర్ల జాబితా అందుబాటులో ఉంది.


(Release ID: 1621505) Visitor Counter : 380