ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

గుజరాత్, మహారాష్ట్రలలో కోవిడ్ -19 మహమ్మారి అదుపు చర్యల సన్నద్ధతపై డాక్టర్ హర్ష వర్ధన్ సమీక్ష

రాష్ట్రాలకు అన్నిరకాల చేయూతపై హామీ

"కోవిడ్ -19 మహమ్మారి మరణాల రేటు తగ్గించేందుకు రోగులకు తగిన సమయంలో చికిత్స చేయడానికి వీలుగా నిఘాను పెంచడం మరియు సంబంధీకులను కనుగొనడంపై దృష్టి పెడదాం "

Posted On: 06 MAY 2020 5:40PM by PIB Hyderabad

కోవిడ్ -19 మహమ్మారి ప్రస్తుత పరిస్థితి,  అదుపు చర్యల సన్నద్ధతపై రెండు రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కలసి కేంద్ర ఆరోగ్య ,  కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్  హర్ష వర్ధన్ బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో  సమీక్ష జరిపారు.  ఆయన వెంట కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే  ఉన్నారు.  గుజరాత్ ఉపముఖ్యమంత్రి,  ఆరోగ్య శాఖను నిర్వహిస్తున్న శ్రీ నితిన్ భాయ్ పటేల్,  మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ రాజేష్ తోపేతో  పాటు   కేంద్ర , రాష్ట్రాలకు చెందిన  సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.  

ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలలో మహమ్మారి పరిస్థితిపై  లఘు చిత్ర ప్రదర్శన జరిపారు.   రెండు రాష్ట్రాలలోని కొన్ని జిల్లాలలో మరణాల  ఎక్కువగా సంభవించడం పట్ల  డాక్టర్ హర్షవర్ధన్ ఆందోళన  వ్యక్తం చేశారు. " మరణాల  రేటు  తగ్గించడానికి రాష్ట్రాలు  నిఘాను పెంచి  రోగుల బంధువులు,  సంబంధీకుల జాడ తీయడం మరియు  సత్వర రోగ నిర్ధారణతో పాటు  తగిన సమయంలో  చికిత్సకు చర్యలు తీసుకోవాలి"  అని ఆయన అన్నారు.   ఊపిరి తీసుకోవడంలో  ఇబ్బంది,  శీతల జ్వరం,  ఇన్ ఫ్లూయెంజా  వంటి  అస్వస్థతో  బాధపడుతున్న రోగులను గుర్తించి వారికి నయం చేయడంపై దృష్టిని కేంద్రీకరించడం  ద్వారా  ఇతరులకు  సంక్రమించకుండా చర్యలు  తీసుకోవాలని అన్నారు.   వైరస్ వ్యాప్తి చెందకుండా  అదుపు చేసేందుకు  సమర్ధవంతమైన  వ్యూహాన్ని అమలు చేయడానికి  ప్రాధాన్యం ఇవ్వడం  ద్వారా మాత్రమే  మరణాల  రేటు తగ్గించవచ్చని మంత్రి అన్నారు.  కేంద్ర ప్రభుత్వం  నిర్దేశించిన నియమాలను పాటిస్తూ  క్రమం తప్పకుండా సమగ్ర చర్యలు తీసుకోవాల్సిన  ఆవశ్యకత ఉందని అన్నారు.  

కరోనా వ్యాధి  సోకిందనే  అపవాదు కారణంగా  పొరుగువారు వెలివేస్తారనే భయంతో  చాలామంది  రోగాన్ని దాచిపెట్టి తిరుగుతున్నారని,  చాలా ఆలస్యంగా ఆసుపత్రులకు వస్తున్నారని ,   అందువల్ల ప్రజల ప్రవర్తనలో వస్తున్న మార్పులపై దృష్టిని  కేంద్రకరించాలని  కూడా
మంత్రి అన్నారు.  

మహమ్మారి అదుపునకు గుర్తించిన ప్రాంతాలలో నిఘా బృందాలకు తోడుగా సామజిక వాలంటీర్లు వార్డు స్థాయిలో ప్రజలను జాగృతం చేయాలనీ,  చేతులు శుభ్రం చేసుకోవడం ,  భౌతిక దూరం పాటించడం గురించి  స్థానికులకు తెలియజెప్పాలని  అన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా కేంద్రం  తక్షణ,  దీర్ఘకాలిక  చర్యలు చేపట్టి  రాష్ట్రాల్లో ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేసేందుకు  పూర్తి మద్దతు ఇవ్వగలదని  డాక్టర్ హర్ష వర్ధన్ తెలిపారు.  65 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు ప్రాధాన్యత ఇచ్చి ఆయుష్మాన్ భారత్ స్వస్థత కేంద్రాలలో పరీక్షలు జరపాలని  అన్నారు.   రాష్ట్రాల వద్ద ఉన్న ఆరోగ్య సమాచారాన్ని  గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోవాలని అన్నారు.  

రాష్ట్రాల అభ్యర్ధన మేరకు  కేంద్రం నుంచి  అదనపు బృందాలను కూడా పంపుతామని డాక్టర్ హర్షవర్ధన్ హామీ ఇచ్చారు.   ఎయిమ్స్ వంటి కేంద్ర సంస్థలు  ఇచ్చే సహాయం నుంచి రాష్ట్రాలు ప్రయోజనం పొందాలని అన్నారు.     దేశంలోని ఎక్కడి నుంచైనా  ఒకే ఒక  మొబైల్ నెంబర్  +91 9115444155కు ఫోన్ చేసి   కోవిడ్ -19   గురించి  వైద్య నిపుణుల సలహాలు పొందవచ్చు.   రోగులకు చికిత్స చేసేందుకు వైద్యులు కూడా పెద్ద డాక్టర్ల సలహాలు  తీసుకొని రోగులకు చికిత్స చేయవచ్చునని  ఆయన తెలియజేశారు.   ఆరోగ్య సేతు మొబైల్ యాప్ కు రాష్ట్రాలు ప్రచారం ఇవ్వాలని,  అదేవిధంగా  ల్యాండ్ లైన్ నుంచి 1921కి ఫోన్ చేయడం ద్వారా ఆరోగ్య సేతు  ఐ వి ఆర్ ఎస్ ద్వారా  కోవిడ్ -19  సమాచారం,  సలహాలు పొందవచ్చు.  

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరం మురికి వాడల్లో  "కరోనా యోధ సమితిలు"  ఏర్పాటు చేసి  ప్రతి కుటుంబానికి  సబ్బులు,  మాస్కులు పంపిణీ ,  మురికి వాడల్లో  చేతులు  కడుక్కునే యంత్రాల ఏర్పాటు వంటి పనులు చేస్తున్నారని,  దానిని ఇతర జిల్లాలలో  ఆచరించాలని   మంత్రి అన్నారు.  

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  కార్యదర్శి ప్రీతి సుడాన్,  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓఎస్డీ శ్రీ రాజేష్ భూషణ్,  ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి  శ్రీ సంజీవ కుమార్,  జాతీయ ఆరోగ్య మిషన్  అధికారి   వందన గుర్నాని,  డిజిహెచ్ఎస్,  డాక్టర్ రాజీవ్ గార్గ్,  
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో  జాయింట్ సెక్రెటరీ డాక్టర్ మనోహర్ అఙ్నాని ,  
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో  జాయింట్ సెక్రెటరీ శ్రీ లవ్ అగర్వాల్,   ఎన్సిడిసి  డైరెక్టర్ డాక్టర్ ఎస్.కె. సింగ్,   రెండు రాష్ట్రాల  ఆరోగ్య శాఖ ప్రిసిపల్ సెక్రెటరీలు , మహారాష్ట్ర, గుజరాత్  రాష్ట్రాల అన్ని జిల్లాలకు  చెందిన  మునిసిపల్ కమిషనర్లు/జిల్లా కలెక్టర్లు /జిల్లా మేజిస్ట్రేట్ లు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.  


(Release ID: 1621621) Visitor Counter : 187