ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరియు పోర్చుగల్ ప్రధానమంత్రి గౌరవనీయులు ఆంటోనియో కోస్టా మధ్య టెలిఫోన్ సంభాషణ.

Posted On: 05 MAY 2020 7:02PM by PIB Hyderabad

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరియు పోర్చుగల్ ప్రధానమంత్రి గౌరవనీయులు ఆంటోనియో కోస్టా ఈ రోజు ఫోనులో మాట్లాడుకున్నారు. 

ఫిబ్రవరిలో పోర్చుగల్ అధ్యక్షుడు గౌరవనీయులు మార్కేలో రెబెలో డే సౌజా భారతదేశంలో చేసిన అధికార పర్యటనను ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

కోవిడ్-19 మహమ్మారి ప్రస్తుత పరిస్థితి గురించీ, తమ దేశాల్లో ప్రజల ఆరోగ్యం, దేశ ఆర్ధికపరిస్థితి గురించీ ఇరువురు నాయకులు చర్చించారు. ఈ సంక్షోభాన్ని సమర్ధవంతంగా కట్టడి చేసినందుకు ప్రధానమంత్రి మోడీ,  పోర్చుగల్ ప్రధానమంత్రి కోస్టా ను అభినందించారు. 

వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి జాతీయ స్థాయిలో తీసుకునే క్రియాశీల చర్యలు ఉపయోగపడతాయని ఇద్దరు నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు పరస్పరం సహకరించుకోవాలని వారు నిర్ణయించారు.  కోవిడ్-19 ని కట్టడిచేసే ఉద్దేశ్యంతో కలిసి పరిశోధన మరియు ఆవిష్కరణలు చేయాలని  కూడా వారు అంగీకరించారు.

లాక్ డౌన్ కారణంగా పోర్చుగల్ లో చిక్కుకున్న భారతీయ ప్రయాణీకుల వీసాల చెల్లుబాటును పొడిగిస్తున్నందుకు ప్రధానమంత్రి పోర్చుగీసు ప్రధానమంత్రి కోస్టా కు కృతజ్ఞతలు తెలిపారు.  అదేవిధంగా భారతదేశంలో చిక్కుకున్న పోర్చుగీసు పౌరులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నందుకు పోర్చుగీసు ప్రధానమంత్రి కోస్టా తన ప్రశంసలను వ్యక్తం చేశారు. 

ప్రస్తుత సంక్షోభం పరిణామాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలనీ, కోవిడ్ అనంతరం పరిస్థితిని సమీక్షించుకోవాలనీ, ఇందుకోసం ఒకరి కొకరు నిరంతరం సంప్రదించుకోవాలనీ ఇరువురు నాయకులు అంగీకరించారు. 

****



(Release ID: 1621362) Visitor Counter : 262