పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా క్లిష్టమైన వైద్య సామ‌గ్రి చేర‌వేత‌కు లైఫ్‌లైన్ ఉడాన్ ప‌థ‌కంలో భాగంగా 465 విమానాల‌తో స‌రుకు ర‌వాణా

Posted On: 06 MAY 2020 4:32PM by PIB Hyderabad

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో క్లిష్ట‌మైన వైద్య సామ‌గ్రిని దేశ వ్యాప్తంగా చేర వేసే ప‌నిని లైఫ్‌లైన్ ఉడాన్ విమానాల‌తో స‌ర్కారు చేప‌డుతోంది. దాదాపు 465 విమానాలు ఈ ర‌వాణా కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్నాయి. ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్, ఐఏఎఫ్‌ మరియు ప్రైవేట్ క్యారియర్ల విమానాలు ర‌వాణా కార్య‌క్ర‌మాల‌లో పాలు పంచుకుంటున్నాయి. ఇందులో ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్ సంస్థ‌లకు చెందిన 278 విమానాలు ఉన్నాయి. ఈ సంస్థల‌ విమానాలు ఈ రోజు వ‌ర‌కు దాదాపు 835.94 టన్నుల మేర స‌రుకును రవాణా చేశాయి. ఇప్పటి వరకు లైఫ్‌లైన్ ఉడాన్‌లో భాగంగా ఆయా విమానాలు 4,51,038 కి.మీ. వైమానిక దూరం మేర ప్ర‌యాణించాయి. కోవిడ్ -19 వైర‌స్‌కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న యుద్ధానికి మద్దతుగా నిలిచేలా కేంద్ర పౌర విమాన‌యాన శాఖ (ఎంఓసీఏ) మారుమూల మ‌రియు క్లిష్ట‌మైన కొండ ప్రాంతాల‌తో స‌హా దేశంలో అన్ని ప్రాంతాలకు
అవసరమైన వైద్య సరుకును రవాణా చేయడానికి ‘లైఫ్‌లైన్ ఉడాన్’లో భాగంగా ప‌లు  విమానాలను న‌డుపుతోంది.
వైద్య సరుకు, రోగుల రవాణాకు హెలికాప్టర్ సేవలు
పవన్ హన్స్ లిమిటెడ్ సహా వివిధ సంస్థ‌ల హెలికాప్టర్ సేవల‌ను కూడా వినియోగిస్తున్నారు. జమ్ము అండ్ కాశ్మీర్‌, లడాఖ్‌తో స‌హా వివిధ ద్వీప ప్రాంతాలు (ఐలాండ్స్) మరియు ఈశాన్య‌
ప్రాంతాల‌లో క్లిష్టమైన వైద్య సరుకు, రోగుల రవాణాకు ఈ హెలికాప్టర్ సేవలు వాడుతున్నారు.
పవన్ హన్స్ హెలికాప్ట‌ర్‌లు 5 మే 2020 వరకు 7,729 కిలోమీటర్ల దూరం ప్ర‌యాణించి 2.27 టన్నుల సరుకును ర‌వాణా చేశాయి. ఈశాన్య ప్రాంతం, దేశ ద్వీప భూభాగాలు మరియు కొండ ప్రాంత‌ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టితో ఈ సేవ‌ల‌ను వినియోగిస్తున్నారు. జ‌మ్ము మ‌రియు కాశ్మీర్‌, లడాఖ్, దేశ ఈశాన్య ప్రాంతం మరియు ఇతర ద్వీప ప్రాంతాలకు సేవ‌లందించేందుకు గాను
ఎయిర్ ఇండియా మరియు ఐఏఎఫ్ ప్రధాన సౌజ‌న్యంతో ముందుకు సాగుతున్నాయి.
వాణిజ్య ప్రాతిప‌దిక‌న విమాన ర‌వాణా..
దేశీయ కార్గో ఆపరేటర్లు స్పైస్ జెట్, బ్లూ డార్ట్, ఇండిగో మరియు విస్తారా సంస్థ‌లు వాణిజ్య ప్రాతిపదికన స‌రుకు ర‌వాణా విమానాలను అందిస్తున్నాయి. స్పైస్ జెట్ సంస్థ దాదాపు 819 కార్గో విమానాలను 13,83,854 ‌కిలోమీటర్ల దూరం ప్రయాణింప జేసి 5,946 టన్నుల సరుకును ర‌వాణా చేసింది. వీటిలో 294 అంతర్జాతీయ కార్గో విమానాలు కూడా ఉన్నాయి. మ‌రోవైపు బ్లూ డార్ట్ సంస్థ 278 కార్గో విమానాలను 3,09,272 కిలోమీటర్ల దూరం మేర ప్ర‌యాణింప‌జేసి దాదాపు 4,683 టన్నుల సరుకును ర‌వాణా చేసింది. వీటిలో దాదాపు 14 అంతర్జాతీయ కార్గో విమానాలూ ఉన్నాయి. ఇండిగో సంస్థ 95 కార్గో విమానాలను నడిపింది. మొత్తం 1,59,158 కిలోమీటర్ల దూరం మేర ఈ విమానాలు ప్ర‌యాణించి దాదాపు 470 టన్నుల సరుకును ర‌వాణా చేసింది. ఇందులో దాదాపు 38 అంతర్జాతీయ విమానాలు కూడా ఉన్నాయి. ఇందులో ప్ర‌భుత్వానికి ఉచితంగా ర‌వాణా చేసిన వైద్య సామాగ్రి కూడా ఉంది. మ‌రోవైపు విస్తారా సంస్థ 23 కార్గో విమానాల‌ను న‌డిపించాయి. ఈ విమానాలు 32,321 కిలో మీటర్ల దూరం ప్ర‌యాణించి దాదాపు 150 టన్నుల సరుకును ర‌వాణా చేశాయి.
తూర్పు ఆసియాతో వాయు ర‌వాణా..
తూర్పు ఆసియాతో ఔషధాలు, వైద్య పరికరాలు మరియు కోవిడ్ -19 ఉపశమన పదార్థాల రవాణా కోసం కార్గో ఎయిర్ బ్రిడ్జ్ (వాయు వంతెన‌)స్థాపించబడింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎయిర్ ఇండియా సంస్థ తీసుకువచ్చిన వైద్య సామ‌గ్రి పరిమాణం 972 టన్నులుగా ఉంది. దీనికి అద‌నంగా బ్లూ డార్ట్ సంస్థ త‌న విమానాల ద్వారా ఏప్రిల్ 14 నుంచి మే 5వ తేదీ వ‌ర‌కు
గ్వాంగ్జౌ మరియు షాంఘై నుండి దాదాపు 114 టన్నుల మేర వైద్య సంబంధిత స‌రుకును, హాంకాంగ్ నుండి దాదాపు 24 టన్నుల మేర వైద్య సామాగ్రిని ర‌వాణా చేసింది. మ‌రోవైపు స్పైస్‌జెట్ సంస్థ మే 5వ తేదీ వ‌ర‌కు షాంఘై మరియు గ్వాంగ్జౌల‌ నుండి 204 టన్నుల వైద్య సామాగ్రిని, హాంగ్ కాంగ్ మరియు సింగపూర్ నుండి 16 టన్నుల వ‌ర‌కు వైద్య సామ‌గ్రి ర‌వాణాను చేప‌ట్టింది.

 



(Release ID: 1621502) Visitor Counter : 256