వ్యవసాయ మంత్రిత్వ శాఖ

పూర్తిస్థాయిలో పప్పుధాన్యాలు, నూనె గింజలు, గోధుమల సేకరణ రూ.2,682 కోట్ల విలువైన పప్పుధాన్యాలు, నూనె గింజల సేకరణ

3.25 లక్షల మంది రైతులకు లబ్ధి
వేసవి పంటల సాగు విస్తీర్ణంలో గణనీయమైన పెరుగుదల

Posted On: 05 MAY 2020 6:10PM by PIB Hyderabad

2020-21 రబీ సీజన్ కింద మే 2, 2020 వరకు, 2,61,565 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, 3,17,473 మెట్రిక్ టన్నుల నూనె గింజలను కనీస మద్దతు ధరతో కేంద్ర ప్రభుత్వం సేకరించింది. వీటి విలువ రూ.2,682 కోట్లు. దీనివల్ల 3,25,565 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఈ పరిమాణంలో.. 14,859 మెట్రిక్ టన్నుల పప్పులు, 6706 మెట్రిక్ టన్నుల నూనె గింజలను మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల నుంచి తీసుకున్నారు. 2020 మే 1, 2 తేదీల్లో ఈ సేకరణ జరిగింది. ఇదికాక, 2020-21 రబీ మార్కెటింగ్ సీజన్‌లో మొత్తం 1,87,97,767 మెట్రిక్ టన్నుల గోధుమలు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి వచ్చాయి. ఇందులో 1,81,36,180 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేశారు.

ఈ ఏడాది వేసవి పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ఆ వివరాలు:

బియ్యం: ఈ ఏడాది సుమారు 34.80 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేసంగి వరిధాన్యం సాగయింది. గతేడాది ఇదే కాలంలో ఇది 25.26 లక్షల హెక్టార్లుగా ఉంది. 

పప్పుధాన్యాలు: ఈ ఏడాది 8.77 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవగా, గత సంవత్సరం ఇదే సమయంలో సాగు విస్తీర్ణం 5.44 లక్షల హెక్టార్లు.

తృణధాన్యాలు: ఈ ఏడాది 9.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో తృణధాన్యాలను పండించారు. గతేడాది ఇదేకాలంలో ఈ విస్తీర్ణం 5.49 లక్షల హెక్టార్లు.

నూనె గింజలు: నూనె గింజలను సుమారు 8.87 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ఏడాది సాగు చేశారు. గత సంవత్సరం ఇదేకాలంలో 7.00 లక్షల హెక్టార్లలో పండించారు.

    ఈ లాక్‌డౌన్ కాలంలో, రైతులకు సాయంతోపాటు వ్యవసాయ కార్యకలాపాలను సులభతరం చేయడానికి భారత ప్రభుత్వ వ్యవసాయ సహకార, రైతు సంక్షేమ విభాగం అనేక చర్యలు తీసుకుంటోంది. లాక్‌డౌన్‌ సమయమైన 24.3.2020 నుంచి ఇప్పటివరకు, ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌‌) పథకం కింద రూ.18,134 కోట్లను విడుదల చేశారు. దీనివల్ల దాదాపు 9.06 కోట్ల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది.



(Release ID: 1621286) Visitor Counter : 408