PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 01 MAY 2020 7:00PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • కోవిడ్‌-19 కేసుల సంఖ్య 35,043.. వీరిలో 8.888 మందికి నయంకాగా- కోలుకున్నవారి శాతం 25.37కు పెరిగింది.
 • నిన్నటినుంచి పెరిగిన కేసుల సంఖ్య 1,993గా నమోదైంది.
 • దేశంలోని జిల్లాలన్నీ గ్రీన్‌, ఆరెంజ్‌, రెడ్‌ జోన్లుగా విభజించబడ్డాయి.
 • దేశంలోని వివిధ రంగాలకు ఉత్తేజమివ్వడంపై సమాలోచన దిశగా వరుస సమావేశాలు నిర్వహించిన ప్రధానమంత్రి.
 • చిక్కుకుపోయిన వలస కార్మికులు, యాత్రికులు తదితరులు రైళ్లద్వారా వెళ్లేందుకు దేశీయాంగ శాఖ అనుమతి.
 • చిక్కుకుపోయినవారి తరలింపు నిమిత్తం ‘శ్రామిక ప్రత్యేక రైళ్లు’ ప్రారంభించిన రైల్వేశాఖ
 • దేశంలో వస్తుసేవల సరఫరా కొనసాగింపు దిశగా ట్రక్కులు/వస్తు రవాణా వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చూడాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు దేశీయాంగ శాఖ సూచన.
 • ఎఫ్‌సీఐద్వారా నెలవారీ సగటుకన్నా రెట్టింపు మేర ఏప్రిల్‌లో 60 లక్షల టన్నుల ఆహారధాన్యాల రవాణా

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం

దేశంలో కోవిడ్‌-19 బారినపడి నయమైన వారి సంఖ్య 8,888కు చేరడంతో కోలుకున్నవారి శాతం 25.37కు పెరిగింది. దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్‌-19 నిర్ధారిత కేసుల సంఖ్య 35,043 కాగా, నిన్నటినుంచి 1,993 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రెడ్‌, ఆరెంజ్‌ జోన్లలోగల జిల్లాల్లో రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు నిశితంగా దృష్టి సారించి, వ్యాధి వ్యాప్తి నిరోధానికి, నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620172

పౌర విమానయాన రంగంపై ప్రధానమంత్రి సమీక్ష సమావేశం

దేశంలో పౌర విమానయాన రంగాన్ని మరింత సమర్థంగా రూపొందించగల వ్యూహాలపై సమీక్ష కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విస్తృత సమావేశం నిర్వహించారు. విమాన ప్రయాణ సమయం తగ్గించడంద్వారా ప్రయాణికులకు ప్రయోజనంతోపాటు సైనిక వ్యవహారాల శాఖ సన్నిహిత సహకారంతో నిర్వహణ వ్యయం తగ్గింపు దిశగా విమాన సంస్థలకు లబ్ధి చేకూరేలా గగనతల సమర్థ వినియోగం జరగాలని సమావేశం నిర్ణయించింది. రాబడిని మరింత పెంచడానికి, విమానాశ్రయాల్లో సామర్థ్యం పెంపు దిశగా సత్వర చర్యలు చేపట్టాలని పౌర విమానయాన శాఖకు సూచించింది. తదనుగుణంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ప్రాతిపదికన దేశంలోని మరో 6 విమానాశ్రయాలను అప్పగించే టెండర్లు, తదితరాల ప్రక్రియను మూడు నెలల్లోగా ప్రారంభించాలని కోరింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620164

విద్యుత్‌ రంగంపై ప్రధానమంత్రి సమీక్ష సమావేశం

విద్యుత్‌ రంగంపై కోవిడ్‌-19 ప్రభావంపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సమగ్ర సమావేశం నిర్వహించారు. ఈ రంగంలో సుస్థిరత, పటుత్వం, సామర్థ్యం పెంచేందుకు చేపట్టాల్సిన సంస్కరణలపైనా ఆయన చర్చించారు. అలాగే వాణిజ్య సౌలభ్యం, పునరుత్పాదక వనరులకు ప్రాచుర్యం, బొగ్గు సరఫరాలో సరళత, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాల పాత్ర, విద్యుత్‌ రంగంలో పెట్టుబడుల పెంపు తదితరాలపై చర్చ సాగింది. ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంలో విద్యుత్‌ రంగానికిగల ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. అలాగే ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణ కోసం ఒప్పందాలను సమర్థంగా అమలు చేయడంపైనా సమావేశం చర్చించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620160

రక్షణ, అంతరిక్ష రంగాలకు ఉత్తేజ‌మిచ్చే మార్గాల‌పై స‌మావేశం నిర్వ‌హించిన ప్రధానమంత్రి

కోవిడ్-19 నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజ‌మివ్వ‌గ‌ల‌, సాయుధ దళాల స్వల్ప-దీర్ఘ కాలిక అవసరాలను తీర్చ‌గ‌ల పటిష్ఠ స్వావలంబిత రక్షణ పరిశ్రమల రంగం దిశ‌గా చేప‌ట్టాల్సిన సంస్కరణలపై స‌మ‌గ్ర చ‌ర్చ‌కోసం ప్ర‌ధాన‌మంత్రి శ్రీ నరేంద్రమోదీ విస్తృత సమావేశం నిర్వహించారు. ఆర్డినెన్సు ఫ్యాక్టరీల పనితీరు సంస్క‌ర‌ణ‌, కొనుగోలు విధానాల క్రమబద్ధీకర‌ణ‌, ప్ర‌త్యేక వనరుల కేటాయింపు, పరిశోధన-అభివృద్ధి/ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ప్రోత్సాహం, కీల‌క రక్షణ సాంకేతిక పరిజ్ఞానాల్లో పెట్టుబడులను ఆకర్షించడం, ఎగుమతులను ప్రోత్స‌హించ‌డం త‌దిత‌రాల‌పై స‌మావేశం లోతుగా చ‌ర్చించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619869

బొగ్గు, గ‌నుల రంగాల‌ను ముందుకు న‌డిపించే మార్గాల‌పై సమావేశం నిర్వ‌హించిన ప్ర‌ధాన‌మంత్రి

కోవిడ్ -19 మ‌హ‌మ్మారి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చేలా బొగ్గు-గనుల రంగాల్లో చేప‌ట్టాల్సిన ఆర్థిక సంస్కరణలపై చర్చించేందుకు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌ నరేంద్ర మోదీ విస్తృత‌ సమావేశం నిర్వహించారు. దేశీయ వనరుల నుంచి సుల‌భంగా, స‌మృద్ధిగా ఖనిజాలు లభించేలా చూడటం, గ‌నుల అన్వేషణను పెంచడంతోపాటు  పెట్టుబడి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల‌ను ఆకర్షించడం, పారదర్శక-సమర్థ ప్రక్రియల ద్వారా పెద్దఎత్తున ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌డం వంటి అంశాల‌పై ఈ సంద‌ర్భంగా చ‌ర్చించారు. అంతేకాకుండా అదనపు గనుల వేలం-పోటీదారులు విస్తృతంగా పాల్గొనేలా చూడటం, ఖనిజ వనరుల ఉత్పత్తి పెంపు, తవ్వకపు వ్యయం తగ్గింపు, వాణిజ్య సౌలభ్యం పెంపుసహా సుస్థిర పర్యావరణ ప్రగతిద్వారా కర్బన ఉద్గారాల తగ్గింపు తదితర అంశాలు ఈ చర్చల్లో చోటుచేసుకున్నాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619831

కోవిడ్‌-19 దిగ్బంధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా చిక్కుకుపోయినవారి కోసం ప్రత్యేక రైళ్లు

దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు తదితరులు క్షేమంగా స్వస్థలాలకు వెళ్లడం కోసం రైల్వే మంత్రిత్వశాఖ ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దేశీయాంగ శాఖ అనుమతించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620066

దిగ్బంధంవల్ల వివిధ ప్రాంతాల్లో చిక్కకున్న వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు తదితరులను తరలించడం కోసం ‘శ్రామిక ప్రత్యేక రైళ్ల’ను ప్రారంభించిన రైల్వేశాఖ

దిగ్బంధంవల్ల వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు తదితరుల కోసం దేశీయాంగ శాఖ ఇచ్చిన మార్గదర్శకాల మేరకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఇవాళ్టినుంచి ‘శ్రామిక ప్రత్యేక రైళ్ల’ను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. చిక్కుకుపోయిన వారిని స్వీకరించేందుకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు, ప్రామాణిక విధివిధానాల ప్రకారం ఈ రైళ్లను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి నేరుగా నడిపించనుంది. ఈ ‘శ్రామిక ప్రత్యేక రైళ్ల’ నిర్వహణపై సమన్వయం కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వేశాఖ సీనియర్‌ అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించాల్సి ఉంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620122

దేశంలో వస్తుసేవల సరఫరా కొనసాగింపు దిశగా ట్రక్కులు/వస్తు రవాణా వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చూడాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు దేశీయాంగ శాఖ సూచన

దిగ్బంధం సంబంధిత చర్యలపై జారీచేసిన నవీకరించిన ఏకీకృత మార్గదర్శకాల మేరకు ట్రక్కులు, వస్తు రవాణా/ఖాళీ వాహనాలు ఆటంకాలు లేకుండా రాకపోకలు సాగించేందుకు ప్రత్యేక పాసుల జారీ అవసరం లేదని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఇచ్చిన తమ ఆదేశాలను దేశీయాంగ శాఖ పునరుద్ఘాటించింది. దిగ్బంధ సమయంలో దేశవ్యాప్తంగా వస్తుసేవల సరఫరా శృంఖలం నిరంతరాయంగా కొనసాగేందుకు వాహనాలు స్వేచ్ఛగా ప్రయాణించడం అవసరమని స్పష్టంచేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619743

ఎఫ్‌సీఐద్వారా నెలవారీ సగటుకన్నా రెట్టింపు మేర ఏప్రిల్‌లో 60లక్షల టన్నుల ఆహారధాన్యాల రవాణా

భారత ఆహార సంస్థ-ఎఫ్‌సీఐ ఏప్రిల్‌ నెలలో దేశంలోని వివిధ ప్రాంతాలకు 60 లక్షల టన్నుల ఆహారధాన్యాలను రవాణా చేసింది. తద్వారా 2014 మార్చిలో నెలకొల్పిన 38 లక్షల టన్నుల రికార్డుకన్నా 57 శాతం అధికంగా రవాణా చేసింది. ఎఫ్‌సీఐ సాధారణంగా నెలకు 30 లక్షల టన్నుల మేర ఆహారధాన్యాలను రవాణా చేస్తూంటుంది. దీనితో పోలిస్తే 2020 ఏప్రిల్‌లో ఈ నెలవారీ సగటుకన్నా రెట్టింపుగా నమోదైంది. ఈ కొత్త రికార్డులో రోడ్డుమార్గాన కశ్మీర్‌లోయసహా లేహ్‌/లద్దాఖ్‌లకు పంపిన లక్ష టన్నులు, ఈశాన్యభారత రాష్ట్రాలు అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయలకు పంపిన 0.81 లక్షల టన్నులతోపాటు సముద్రమార్గాన అండమాన్‌, లక్షదీవులకు పంపిన 0.1 లక్షల టన్నులు కూడా భాగంగా ఉన్నాయి. మొత్తంమీద కోవిడ్‌-19 వ్యాప్తి పరిస్థితుల నడుమ పలు ఆటంకాలను ఎదుర్కొన్నప్పటికీ భూ మార్గాన దేశంలోని వివిధ రాష్ట్రాలకు 2020 ఏప్రిల్‌లో 58 లక్షల టన్నులు సరఫరా చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619809

వ్యవసాయోత్పత్తుల విక్రయం కోసం ‘ఈ-నామ్‌ వేదిక’ పరిధిలోకి 7 రాష్ట్రాల్లోని మరో 200 కొత్త మండీలు

దేశవ్యాప్తంగాగల రైతులు తమ ఉత్పత్తుల విక్రయం కోసం వినియోగించుకుంటున్న ఆన్‌లైన్‌ వేదిక ‘ఈ-నామ్‌’ పరిధిలోగల మండీల సంఖ్య 2020 మేనెలలోనే వెయ్యికి చేరుతుందని కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమశాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ చెప్పారు. ఢిల్లీలోని కృషి భవన్‌లో ఇవాళ 7 రాష్ట్రాల్లోని 200 కొత్త మండీలను ఈ-నామ్‌లో చేర్చిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇదే సమయంలో కర్నూలు, హుబ్లీ మండీలలో వేరుశనగ, మొక్కజొన్న అమ్మకాలను దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రత్యక్షంగా పరిశీలించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620224

భారత్‌ను పెట్టుబడుల ప్రాధాన్య గమ్యంగా రూపుదిద్దేందుకు కృషిచేయాలని విదేశీ దౌత్య కార్యాలయాలకు శ్రీ పీయూష్‌ గోయల్‌ సూచన

కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ విదేశాల్లోని దౌత్య కార్యాలయాలతో సంభాషించారు. తాము విధులు నిర్వహిస్తున్న దేశాల్లో భారత ఎగుమతులు, వాణిజ్య అవకాశాలను గుర్తించడంలో కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా వారికి సూచించారు. అంతేకాకుండా పెట్టుబడులకు ఒక విశ్వసనీయ, ప్రాధాన్య గమ్యంగా భారత్‌కు ప్రాచుర్యం సాధించాలని కోరారు. ఈ మేరకు విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ఎస్‌.జైశంకర్‌తో కలసి దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా 131 దేశాల్లోని దౌత్య అధికారులతో గోయల్‌ చర్చించారు. సరికొత్త సంస్కరణలద్వారా పరిశ్రమలను మెరుగుపరచే దిశగా కోవిడ్‌-19 పరిస్థితులను ఒక అవకాశంగా మలచుకోవాలని సూచించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620206

రవాణా కార్యకలాపాల పరివర్తన దిశగా రవాణా పరిశ్రమ ప్రముఖులతో రైల్వేశాఖ మంత్రి సమావేశం

కోవిడ్‌-19 నేపథ్యంలో రైల్వేశాఖ పోషిస్తున్న కీలకపాత్ర గురించి మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ దిగ్బంధం సమయంలో కోవిడ్‌ సంక్షోభంపై రైల్వేశాఖ సానుభూతితో, శ్రద్ధతో వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. ఆ మేరకు దేశవ్యాప్తంగా నిత్యావసరాల, ఆహారధాన్యాల రవాణాద్వారా దేశానికి జీవనరేఖగా మారిందన్నారు. ఇదంతా కాకుండా మరోవైపు ఈ సమయాన్ని పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికోసం సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు. తదనుగుణంగా ప్రధాన మార్గాల మధ్య అనుసంధానం పెంపు, దీర్ఘకాలంగా ఆగిన నిర్వహణ పనులు, ధ్వంసమైన వంతెనలు కూలగొట్టడం/మరమ్మతులు, మౌలిక సదుపాయాల మెరుగుదల తదితరాలు పూర్తిచేసినట్లు శ్రీ గోయల్‌ వివరించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620163

ప్రాధాన్యం మేరకు వైద్య పరికరాల కొనుగోలు; ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు ప్రాముఖ్యం

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620165

వివిధ పరీక్షలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు తేదీలను పొడిగించిన/సవరించిన జాతీయ పరీక్షల ప్రాధికార సంస్థ-ఎన్‌టీఏ

కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా వివిధ పరీక్షలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల దాఖలు గడువు తేదీల పొడిగింపు/సవరణ చేపట్టాలని జాతీయ పరీక్షల ప్రాధికార సంస్థ-ఎన్‌టీఏకి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్‌ పోఖ్రియాల్‌ ‘నిషాంక్‌’ సూచించారు. తదనుగుణంగా ఆయా పరీక్షల ఆన్‌లైన్‌ దరఖాస్తుల దాఖలు గడువు తేదీలను పొడిగిస్తూ/సవరిస్తూ ఎన్‌టీఏ ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619820

వ్యాపార సంస్థ‌ల‌కు వెసులుబాటు దిశ‌గా ఈసీఆర్ దాఖలును సులభతరం చేసిన ఈపీఎఫ్‌వో

కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధం దిశ‌గా ప్ర‌భుత్వం దిగ్బంధం విధించింది. దీంతోపాటు ఇత‌ర‌త్రా అంత‌రాయాల‌వ‌ల్ల వాణిజ్య‌-వ్యాపార సంస్థ‌ల సాధార‌ణ కార్య‌క‌లాపాలు కుంటుపడట‌మేగాక ఉద్యోగుల సంబంధిత‌ చ‌ట్ట‌బ‌ద్ధ చెల్లింపుల‌కు ద్ర‌వ్య‌ల‌భ్య‌త కొర‌వ‌డింది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్‌-అండ్ ఎంపీ చట్టం-1952 ప్రకారం పాటించాల్సిన నిబంధ‌న‌ల‌ను ఉద్యోగుల భ‌విష్య‌నిధి సంస్థ-ఈపీఎఫ్‌వో స‌ర‌ళీక‌రించింది. ఇందులో భాగంగా  నెలవారీ ఎలక్ట్రానిక్ చ‌లాన్ కమ్ రిటర్న్ (ఈసీఆర్‌) దాఖలును, అందులో పేర్కొనే చట్టబద్ధ‌ చెల్లింపుల‌ను  వేరుచేసింది. ఆ మేర‌కు యాజ‌మాన్యాలు ఈసీఆర్ దాఖ‌లు చేసి, ఆ తర్వాత అందులో పేర్కొన్న మేరకు చెల్లింపులు జమ చేయవ‌చ్చు. దీనివల్ల సదరు చట్టం పరిధిలోకి వచ్చే యాజమాన్యాలతోపాటు ఉద్యోగులకూ వెసులుబాటు లభిస్తుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619758

'ఆయురక్ష- కరోనా సే జంగ్-ఢిల్లీ పోలీస్ కే సంగ్'ను ఆవిష్కరించిన అఖిల భారత ఆయుర్వేద సంస్థ

ఆయుష్ మంత్రిత్వశాఖ పరిధిలోని అఖిలభారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ), ఢిల్లీ పోలీసులతో కలిసి ఇవాళ ‘ఆయురక్ష’ కార్యక్రమం నిర్వహించింది. ‘కరోనా సే జంగ్-ఢిల్లీ పోలీస్ కే సంగ్’ పేరిట సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం కింద రోగనిరోధకతను పెంచే సంప్రదాయక ఆయుర్వేద వైద్య పద్ధతులను పాటించడంసహా కరోనాపై పోరాటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయుష్‌ మంత్రిత్వశాఖ మార్గదర్శకాల మేరకు ఈ చర్యలు చేపడతారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619818

వైద్య, పోలీసు సిబ్బంది కోసం కేంద్రీయ భాండార్‌ తయారు చేసిన 4,900 రక్షణ కిట్లను అందజేసిన డాక్టర్‌ జితేంద్రసింగ్‌

కోవిడ్‌-19 సంక్షోభంలో వైద్య, పోలీసు సిబ్బంది అందిస్తున్న నిస్వార్థ సేవలను డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ కొనియాడారు. వారి సేవలకు కృతజ్ఞతగా వైద్య, పోలీసు సిబ్బంది కోసం కేంద్రీయ భాండార్‌ తయారుచేసిన 4,900 రక్షణ కిట్లను చేర్చడం కోసం ఇక్కడ నిర్వహించిన ఓ చిన్న కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖతోపాటు ఢిల్లీ పోలీసుశాఖ ప్రతినిధులకు అందజేశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620162

కోవిడ్-19పై పోరాటానికి మద్దతుగా 415 లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాల సేవలు

‘లైఫ్‌లైన్‌ ఉడాన్‌’ కింద ఎయిరిండియా, అలయెన్స్‌ ఎయిర్‌, ఐఏఎఫ్‌, ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు ఇప్పటిదాకా 415 విమానాలను నడిపాయి. తద్వారా 4,07,139 కిలోమీటర్ల మేర నడిచిన విమానాలు దాదాపు 779.86 టన్నుల సామగ్రిని రవాణా చేశాయి.

కోవిడ్‌-19పై భారత్‌ పోరాటానికి మద్దతుగా దేశంలోని మారుమూల ప్రాంతాలకు నిత్యావసరాలు, అత్యవసర వైద్య సామగ్రిని చేరవేయడం కోసం కేంద్ర పౌర విమానయాన శాఖ దేశీయ రంగంలో ‘లైఫ్‌లైన్‌ ఉడాన్‌’ విమానాలను నడుపుతోంది. కాగా, పవన్‌హన్స్‌ లిమిటెడ్‌ సంస్థ హెలికాప్టర్‌ సర్వీసులద్వారా 2020 ఏప్రిల్‌ 29వరకూ 7,257 కిలోమీటర్లు ప్రయాణించి 2.0 టన్నుల సామగ్రిని రవాణా చేశాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619833

న‌వ్య కరోనా వైర‌స్‌ను  విచ్ఛిన్నం చేయగ‌ల సూక్ష్మ‌త‌రంగ ప‌రిక‌రం సిద్ధం

న‌వ్య క‌రోనా వైర‌స్ జ‌న్యుక్ర‌మ విచ్ఛిన్నం కోసం ర‌క్ష‌ణ ప‌రిశోధ‌న‌-అభివృద్ధి సంస్థ-డీఆర్‌డీవో ప‌రిధిలోగ‌ల పుణెలోని స్వ‌తంత్ర విశ్వ‌విద్యాల‌యం డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ ‘అతుల్య‌’ పేరిట క్రిమినాశ‌క సూక్ష్మ‌త‌రంగ ప‌రిక‌రాన్ని రూపొందించింది. ఈ ప‌రిక‌రంద్వారా 56-60 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌తో వెలువ‌డే సూక్ష్మ త‌రంగాలవ‌ల్ల క‌రోనా వైర‌స్ విచ్ఛిన్న‌మ‌వుతుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619738

‘దేఖో అప్నాదేశ్‌’ సిరీస్‌ కింద “సెలెబ్రేటింగ్‌ ది ఇన్‌క్రెడిబుల్‌ ఇండియన్‌ వుమన్‌ ఇన్‌ రెస్పాన్సిబుల్‌ టూరిజం” ఇతివృత్తంగా 12వ వెబినార్‌ నిర్వహించిన పర్యాటక శాఖ

‘దేఖో అప్నాదేశ్‌’ సిరీస్‌లో 12వ విడత కింద “సెలెబ్రేటింగ్‌ ది ఇన్‌క్రెడిబుల్‌ ఇండియన్‌ వుమన్‌ ఇన్‌ రెస్పాన్సిబుల్‌ టూరిజం” ఇతివృత్తంగా ప్రత్యామ్నాయ సృజనాత్మక పర్యాటకాన్ని నిర్వచించగల దేశంలోని కొందరు శక్తిమంతులైన మహిళల వ్యక్తిగత కథనాలను కేంద్ర పర్యాటక శాఖ 2020 ఏప్రిల్‌ 30న వెబినార్‌ ద్వారా ప్రసారం చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620119

కోవిడ్-19 మహమ్మారిపై పోరులో అంతర్జాతీయ డిజిటల్ సమన్వయం సాధనకు జి-20 డిజిటల్ మంత్రుల సదస్సు పిలుపు

ప్రపంచ మహమ్మారిపై పోరు దిశగా అంతర్జాతీయ డిజిటల్ సమన్వయ ప్రతిస్పందన అవసరమని జి-20 దేశాల డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ కార్యాచరణ బృందం, కోవిడ్‌-19 మంత్రిత్వ ప్రకటన పిలుపునిచ్చింది. ఇందుకోసం నెట్‌వర్క్‌ అనుసంధానం-క‌మ్యూనికేష‌న్ మౌలిక వ‌స‌తుల బలోపేతం, అత్యంత సుర‌క్షిత‌ రీతిలో వ్య‌క్తిగ‌తేతర సమాచార ఆదానప్రదానం,  ఆరోగ్య సంర‌క్ష‌ణ‌లో డిజిట‌ల్ మార్గానుసరణ, సైబ‌ర్ భ‌ద్రతతో కూడిన ప్రపంచ వ్యవస్థ, ప‌టిష్ట వాణిజ్య పర్యావరణ క‌ల్పన తదితర చర్యలు చేపట్టాలని పేర్కొంది. కోవిడ్-19 మ‌హ‌మ్మారి విసిరిన స‌వాలుపై చ‌ర్చించి డిజిట‌ల్ టెక్నాల‌జీల ఆధారంగా ప్ర‌పంచ‌స్థాయి స‌మ‌న్వయ స్పందన సాధ‌నకు మార్గాన్వేషణ ల‌క్ష్యంగా జి-20 డిజిట‌ల్ ఎకాన‌మీ మంత్రుల అసాధారణ దృశ్యమాధ్యమ స‌మావేశం నిర్వ‌హించారు. ఇందులో కేంద్ర చట్ట-న్యాయ వ్య‌వ‌హారాలు;  క‌మ్యూనికేష‌న్లు, ఎల‌క్ర్టానిక్స్-ఐటీశాఖల మంత్రి శ్రీ ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ భార‌త్‌కు ప్రాతినిధ్యం వహించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619917

ఆయుష్‌ రంగ సామర్థ్యం అపారం; భారత్‌ను అద్వితీయ ఆర్థికశక్తిగా నిలపడంలో ముఖ్యపాత్ర పోషించగలదు: శ్రీ నితిన్‌ గడ్కరీ

భారత్‌ను ప్రపంచంలో అద్వితీయ ఆర్థిక శక్తిగా నిలపగల అపార సామర్థ్యం అనాదిగా మనం అనుసరిస్తున్న ఆయుష్ వైద్య విధానాలకు ఉందని శ్రీ నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. శతాబ్దాలుగా భారతీయులు పాటిస్తున్న ఆయుర్వేద ప్రత్యామ్నాయ చికిత్స పద్ధతులకు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పెరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. ఆయుష్ రంగం మరింత ప్రగతి సాధించడానికి వీలుగా పరిశోధనలు, ఆవిష్కరణలను ముమ్మరం చేయాల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఆయన ఇవాళ ‘ఆయుష్ ఆంత్రప్రెన్యూర్ షిప్ డెవెలప్‌మెంట్” కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రసంగించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619823

దిగ్బంధం నడుమ ఐఐపీఏ ఆన్‌లైన్‌ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ప్రసంగం

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఐఐపీఏ) తన 45వ ‘అడ్వాన్స్‌డ్‌ ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌ ఇన్ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌’ (ఏపీపీపీఏ)ను పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో దిగ్బంధం నడుమ నిర్వహించిన ఆన్‌లైన్‌ స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాగా, అఖిలభారత-కేంద్ర సర్వీసుల గ్రూప్‌ ‘ఎ’ సీనియర్‌ అధికారులతోపాటు సాయుధ దళాలకు చెందిన అన్ని విభాగాల నుంచి మొత్తం 45 మంది సీనియర్‌ అధికారులు ‘ఏపీపీపీఏ’ కోర్సుకు హాజరయ్యారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619751

భిన్న వినియోగానికి అనువైన 25 మందులు/మందుల నమూనాలను గుర్తించిన సీఎస్‌ఐఆర్‌

కోవిడ్‌-19పై జాతి పోరాటంలో సీఎస్‌ఐఆర్‌ బహుముఖంగా నాయకత్వం వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమైన భిన్న వినియోగ మందులకు ప్రాధాన్యమిస్తోంది. కొత్తగా మందుల రూపకల్పనకు దాదాపు దశాబ్దకాలం పడుతుందిగనుక ప్రస్తుత ప్రధాన ఔషధాలను ప్రయోగాత్మకంగా భిన్న వినియోగానికి అనుమతించవచ్చు. తదనుగుణంగా కోవిడ్‌-19 రోగులకు చికిత్సలో వినియోగించదగిన 25 ప్రధాన మందులు/నమూనాలను సీఎస్‌ఐఆర్‌ గుర్తించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619710

కోవిడ్‌-19 నిర్వహణపై విశాఖపట్నం స్మార్ట్‌ సిటీ కార్యకలాపాల కేంద్రం 24 గంటల విధులు

జాడ పసిగట్టడం, పర్యవేక్షించడం, అవగాహన కల్పన కార్యకలాపాలను ఈ కేంద్రం నిర్వహిస్తుది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620155

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • చండీగఢ్‌: చండీగ‌ఢ్‌లో పోలీసులు అష్ట‌దిగ్బంధం చేసిన బాపూధామ్ కాలనీ, సెక్టార్ 30-బి ప‌రిధిలోని ప్రాంతాల్లో కిరాణ వ‌స్తు విక్ర‌యాల కోసం రెండు ప్రత్యేకమైన బస్సులను పాల‌న యంత్రాంగం ఏర్పాటు చేసింది. త‌ద‌నుగుణంగా వ‌స్తు కొనుగోళ్ల‌లో సామాజిక దూరం నిబంధ‌న‌ను త‌ప్ప‌క పాటించాల‌ని స్థానికుల‌ను ఆదేశించింది. కాగా, న‌గ‌రంలోని 47,800 అర్హతగల కుటుంబాలకు పిఎంజీకేఏ గోధుమలు, పప్పుదినుసులను అధికారులు పంపిణీచేశారు. ఈ మేర‌కు న‌గ‌రంలో పంపిణీ ల‌క్ష్యాన్ని 75 శాతందాకా సాధించారు.
 • పంజాబ్: దేశం వెలుపల చిక్కుకుపోయి, రాష్ట్రానికి రాద‌ల‌చుకున్న పంజాబీలు ఆ మేర‌కు స‌మాచారం ఇవ్వ‌డం కోసం #COVIDHELP డాష్‌బోర్డ్‌లో ఒక ఆన్‌లైన్ లింకును రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. తిరిగి రాద‌ల‌చుకున్న‌వారు www.covidhelp.punjab.gov.in ద్వారా లాగిన్ అయి, స‌మాచార ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. కాగా, స్థానిక పాల‌న యంత్రాంగాల‌కు ఇప్ప‌టికే స‌మాచారం ఇచ్చిన‌వారు ఈ ఫారాన్ని నింపే అవ‌స‌రం లేదు. మ‌రోవైపు కోవిడ్‌-19 ముంద‌స్తు భ‌ద్ర‌త చ‌ర్య‌లు, ప‌ని ప్ర‌దేశంలో కార్మిక‌శ‌క్తి ల‌భ్య‌త‌ల‌పై క్షేత్ర‌స్థాయిలో స‌మ‌గ్ర అంచ‌నాల త‌ర్వాత‌ ప్రతిష్టాత్మక షాపూర్కండీ ఆనకట్ట నిర్మాణ పనులను ప్ర‌భుత్వం తిరిగి ప్రారంభించింది.
 • హర్యానా: రాష్ట్రంలో 33.80 ల‌క్ష‌ల‌ మందికిపైగా ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. కాగా, SARI, ILI త‌దిత‌ర అనారోగ్య స్థితి తనిఖీ కోసం ఇప్పటికే 550కిపైగా సంచార ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల బృందాల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. త‌ద‌నుగుణంగా నియంత్ర‌ణ జోన్లుస‌హా అన్ని జిల్లాల్లోనూ ఆరోగ్య స్థితిపై ఇంటింటి తనిఖీ కొన‌సాగుతోంది. ఆహారం-భ‌ద్ర‌త చ‌ట్టం-2006 కింద పాన్ మసాలా, గుట్కా, బ‌బుల్ గమ్ త‌దిత‌రాల వాడ‌కం/అమ్మకంపై నిషేధం విధించ‌బ‌డింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, ఖైనీ వినియోగాల నిషేధంపైనా ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలు జారీచేసింది.
 • హిమాచల్ ప్రదేశ్: ఇతర రాష్ట్రాల నుంచి ఇటీవల హిమాచల్ ప్రదేశ్ తిరిగి వచ్చినవారు స్వీయ గృహ నిర్బంధాన్ని క‌చ్చితంగా పాటించాలని ముఖ్యమంత్రి కోరారు. దీనివ‌ల్ల వారికి మాత్రమేగాక కుటుంబానికి, సమాజానికి ప్ర‌యోజ‌న‌క‌ర‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. మ‌రోవైపు ఇతర రాష్ట్రాల నుండి తిరిగి వచ్చిన వ్యక్తులపై నిశిత ప‌రిశీల‌న అవ‌స‌ర‌మ‌ని, అలాగే వారు స్వీయ గృహ నిర్బంధం నిబంధనలను తూచా త‌ప్ప‌కుండా అనుస‌రించేలా చూడాల‌ని పంచాయ‌తీరాజ్ సంస్థ‌లు, ప‌ట్ట‌ణ‌-స్థానిక సంస్థ‌ల ప్ర‌తినిధుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం సూచించింది.
 • మహారాష్ట్ర: దేశంలో 10,000 కోవిడ్-19 కేసుల సంఖ్య దాటిన తొలి రాష్ట్రంగా  మ‌హ‌రాష్ట్ర రికార్డుల‌కెక్కింది. ఇవాళ 583 కొత్త కేసులు రావ‌డంతో మొత్తం కేసుల సంఖ్య 10,498కి చేరింది. తాజాగా 27 మంది మరణించ‌డంతో మృతుల సంఖ్య 459కి పెరిగింది. ఇప్ప‌టిదాకా 1,773 మంది కోలుకున్నారు. న‌వీకృత‌ జిల్లాల వ‌ర్గీక‌ర‌ణ‌లో రాష్ట్రంలోని 14 జిల్లాలు రెడ్ జోన్‌లో చేర‌గా, మిగిలినవాటిలో 16 ఆరెంజ్, 6 గ్రీన్ జోన్‌లో చేరాయి.
 • గుజరాత్: గుజరాత్‌లో 313 మందికి పరీక్షలు నిర్వ‌హించ‌గా వారిలో 249 మంది ఒక్క‌ అహ్మదాబాద్ వాసులు కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో రాష్ట్రంలో కోవిడ్ -19 రోగుల సంఖ్య 4,395కు పెరిగింది. వీరిలో 613 మంది కోలుకోగా, 214 మంది మరణించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇవాళ ప్ర‌భుత్వం 60వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వాన్ని నిర్వ‌హించ‌లేదు. కాగా- మాస్కులు ధ‌రిస్తామ‌ని, భౌతిక‌దూరం పాటిస్తామ‌ని, క్రమం తప్పకుండా చేతులు కడుక్కుంటామ‌ని ప్ర‌తిజ్ఞ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్ర‌జ‌ల‌కు వీడియో సందేశంలో విజ్ఞ‌ప్తి చేశారు.
 • రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ 118 కొత్త కేసులు రావ‌డంతో మొత్తం కేసుల సంఖ్య 2,584కు చేరింది. వీరిలో 836 మంది కోలుకోగా, 58 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌లోని 8 జిల్లాలను రెడ్ జోన్‌లో చేర్చ‌గా, 19 ఆరెంజ్‌, 6 జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉన్నాయి.
 • మధ్యప్రదేశ్: గ‌డ‌చిన 24 గంటల్లో 99 కొత్త కేసులతో మధ్యప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 2,660కు చేరింది. వీరిలో 482 మందికి వ్యాధి నయం కాగా, 137 మంది మరణించారు.
 • ఛత్తీస్‌గ‌ఢ్‌: ఛత్తీస్‌గ‌ఢ్ ప్ర‌స్తుతం 4 యాక్టివ్ కేసులుండ‌గా మొత్తం 38 కేసుల‌కుగాను 34 మంది వ్యాధినుంచి కోలుకుని ఇళ్ల‌కు వెళ్లారు.
 • గోవా: గోవాలో 7 కేసులకుగాను అంద‌రూ కోలుకోవ‌డంతో యాక్టివ్ కేసు ఒక్క‌టి కూడా లేదు.
 • కేరళ :. కేరళలోని వలస కార్మికుల‌ను తీసుకెళ్లేందుకు తొలి రైలు శుక్రవారం ఒడిసా నుంచి బయల్దేరింది. రేపు మరో 5 రైళ్లు నడుస్తాయి. కాగా, కన్నూర్, కోట్ట‌యం జిల్లాలు ఇవాళ కేంద్రం విడుదల చేసిన కొత్త రెడ్ జోన్ జాబితాలో చేర‌గా, రాష్ట్రంలో ఈ జాబితాలో ఉన్న‌ది ఈ రెండు జిల్లాలే కావ‌డం గ‌మ‌నార్హం. కేంద్రం సూచనల మేర‌కే మే 3 తర్వాత దిగ్బంధం నిబంధనలపై ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేస్తుంది. కాగా, యాంత్రిక ఫిషింగ్ కోసం ఉద్దేశించిన సడలింపులు ఇవాళ్టినుంచి అమల్లోకి వచ్చాయి. ఇక కేర‌ళీయులైన మ‌రో ఇద్ద‌రు గ‌ల్ఫ్ దేశాల్లో, మ‌రో న‌ర్సు బ్రిట‌న్‌లో క‌రోనా వైర‌స్‌కు బ‌లయ్యారు. దీంతో విదేశాల్లోగ‌ల కేర‌ళీయుల్లో మృతుల సంఖ్య 70కి చేరింది.
 • తమిళనాడు: చెన్నైలో మ‌రో 31 నియంత్ర‌ణ మండ‌ళ్లు చేర‌డంతో మొత్తం 233కు చేరాయి. వీటిలో ఒక్క రాయ‌పురంలోనే 56 ఉన్నాయి. నిన్నటిదాకా మొత్తం కేసులు: 2,323, యాక్టివ్ కేసులు: 1,035, మరణాలు: 27, డిశ్చార్జ్ అయిన‌వారు: 1,258 మంది. చెన్నైలో గ‌రిష్ఠంగా 906 కేసులు.
 • కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ 11 కొత్త కేసులు నిర్ధార‌ణ కాగా, వీటిలో మాండ్యా 8, బెళ‌గావి 3 న‌మోద‌య్యాయి. మొత్తం కేసులు 576; డిశ్చార్జ్ అయిన‌వారు 235 మంది కాగా, మరణాల సంఖ్య 22కి పెరిగింది.
 • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో వైఎస్సార్ పెన్ష‌న్ కానుక కింద బ‌యోమెట్రిక్స్‌కు బ‌దులు లబ్ధిదారు ఫోటోలను జియో-ట్యాగింగ్ ద్వారా 58.22 లక్షల మందికి రూ.1421.20 కోట్ల నిధులు పంపిణీ మొద‌లైంది. గడ‌చిన 24 గంటల్లో 60 కొత్త కేసులు రాగా, కోలుకున్న‌వారి సంఖ్య 82కు చేరింది. రాష్ట్రంలో ఇవాళ ఇద్ద‌రు మ‌ర‌ణించారు. మొత్తం కేసుల సంఖ్య 1,463కు చేర‌గా, యాక్టివ్ కేసులు 1,027, కోలుకున్నవి: 403, మరణాలు: 33గా ఉన్నాయి. కేసుల సంఖ్య రీత్యా కర్నూలు (411), గుంటూరు (306), కృష్ణా (246) అగ్ర‌స్థానాల్లో ఉన్నాయి.
 • తెలంగాణ: వేతనాలు త‌క్కువ‌గా ఇస్తున్నారంటూ ఇటీవ‌ల ఐఐటీ-హైద‌రాబాద్ ప్రాంగ‌ణంలో ఆందోళ‌న‌కు దిగిన వ‌ల‌స కార్మికుల‌ను లింగంపల్లి నుంచి ప్రత్యేక రైలులో ఝార్ఖండ్‌కు తిరిగి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అభ్యర్థన మేరకు తెలంగాణ నుంచి వ‌ల‌స కార్మికుల‌తో ఇవాళ బ‌య‌ల్దేరిన తొలి రైలు ఇదే. కాగా, ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, ఆహార రంగంలోనివి మిన‌హా 2.3 మిలియన్ ఎంఎస్‌ఎంఇలు దిగ్బంధం కార‌ణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయ‌ని అంచ‌నా. రాష్ట్రంలో ఇప్పటిదాకా న‌మోదైన కేసుల సంఖ్య 1,038కిగాను యాక్టివ్ కేసులు 568, కోలుకున్నవి 442, మొత్తం మరణాలు 28గా న‌మోద‌య్యాయి.
 • అరుణాచల్ ప్రదేశ్: దిగ్బంధంవ‌ల్ల రాష్ట్ర రాజ‌ధాని ఇటాన‌గ‌ర్‌లో చిక్కుకుపోయిన 300 మందికిపైగా వ్య‌క్తుల‌ను 27 బస్సుల్లో వారి ప్రాంతాల‌కు పంపారు.
 • అసోం: అసోంలోని గోలఘాట్‌లో ఒక‌రు, మోరేగావ్‌లో ఇద్ద‌రు కోవిడ్ రోగులు ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. గువ‌హ‌టిలో చికిత్స పొందుతున్న నాగాలాండ్ వాసి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ ట్వీట్ల ప్రకారం రాష్ట్రంలో 9 యాక్టివ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయి.
 • మణిపూర్: రాష్ట్ర ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి విరాళంగా అందిన రూ.11.33 కోట్లలో ఇప్పటిదాకా రూ.7.07 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి.
 • మేఘాలయ: రాష్ట్రంలోని గ్రీన్ జోన్ జిల్లాల‌ మధ్య ప్రైవేటు వాహనాల రాక‌పోక‌ల కోసం సంబంధిత క‌లెక్ట‌ర్ లేదా ఎవ‌రైనా అధీకృత అధికారి జారీచేసే చెల్లుబాటయ్యే పాస్ పొందాల్సి ఉంటుంది. అలాగే ప్ర‌వేశ‌, నిష్క్ర‌మ‌ణ ప్రాంతాల్లో అన్ని విధివిధానాల‌నూ త‌ప్ప‌క పాటించాలి. కాగా, షిల్లాంగ్‌లోని పౌర ఆస్ప‌త్రిలో ఇద్ద‌రు రోగుల‌కు 14 రోజుల ఏకాంత చికిత్స త‌ర్వాత వ‌రుస‌గా రెండుసార్లు నిర్వ‌హించిన ప‌రీక్షల్లో వ్యాధి న‌య‌మైన‌ట్లు నిర్ధార‌ణ అయింద‌ని ముఖ్య‌మంత్రి కాన్రాడ్ సంగ్మా ట్వీట్ చేశారు.
 • నాగాలాండ్: తదుపరి ఉత్తర్వులు జారీచేసేదాకా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలనూ మూసి ఉంచాల‌ని ప్ర‌భుత్వ‌ ప్రధాన కార్యదర్శి పునరుద్ఘాటించారు. మ‌రోవైపు తమ కార్యక్రమాలలో భాగంగా పాఠ‌శాల‌ల పాఠ్యాంశాల ప్ర‌సారానికి అంగీక‌రించిన దూర‌ద‌ర్శ‌న్‌, ఆలిండియా రేడియో కేంద్రాల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
 • సిక్కిం: రాష్ట్రంలోకి జంతువులు, కోళ్లు, మాంస‌-స‌ముద్ర ఆహార‌ ఉత్ప‌త్తులను త‌దుప‌రి ఉత్త‌ర్వులు జారీచేసేదాకా తీసుకురాకుండా ప్ర‌భుత్వం నిషేధం విధించింది.
 • త్రిపుర: రాష్ట్రంలోని దామ్‌చెరా స‌మితి ప‌రిధిలో ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న ప‌థ‌కంలో భాగంగా పీఎం కిసాన్  ప‌థ‌కం కింద 3,314 మంది రైతులు ల‌బ్ధిపొందారు.

FACTCHECK

****(Release ID: 1620229) Visitor Counter : 44


Read this release in: English , Urdu , Hindi , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam