వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఇండియాను ఎక్కువమంది ఇష్టపడే గమ్యస్థానంగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషించాలని విదేశాలలో ఉన్న దౌత్య కార్యాలయాలకు పిలుపు ఇచ్చిన శ్రీ పీయూష్ గోయల్ ;

భారత దౌత్య కార్యాలయాలు విదేశాలలో వ్యాపార మరియు ఎగుమతి అవకాశాలను గుర్తించాలి;

కోవిడ్ తరువాత ఇండియా కోలుకొని ముందంజ వేయడానికి వర్తకం, పెట్టుబడి ద్వారా మాత్రమే సాధ్యమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అన్నారు

Posted On: 01 MAY 2020 5:42PM by PIB Hyderabad

విదేశాలలో ఉన్న భారత దౌత్య కార్యాలయాలు ఆయా దేశాలలో భారతీయ వ్యాపారానికి మరియు ఎగుమతికి గల అవకాశాలను గుర్తించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాలని కేంద్ర వాణిజ్య,  పారిశ్రామిక మరియు రైల్వేల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపు ఇచ్చారు.     ఇండియాను ఎక్కువమంది మదుపరులు  ఇష్టపడే గమ్యస్థానంగా,  పెట్టుబడులకు విశ్వసనీయమైన  గమ్యంగా మార్చడానికి దౌత్యాధికారులు కృషిచేయాలని ఆయన కోరారు.  విదేశీ వ్యవహారాల శాఖ  మంత్రి శ్రీ ఎస్. జయశంకర్ తో కలసి  శ్రీ పీయూష్ గోయల్    ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న 131 రాయబార కార్యాలయాల దౌత్యాధికారులతో  గురువారం సాయంత్రం  వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు.  
కోవిడ్ -19  మహమ్మారి దరిమిలా తలెత్తిన పరిస్థితిని ఒక అవకాశంగా మార్చుకుని మన పరిశ్రమలను మెరుగుపరచుకునేందుకు  కొత్త సంస్కరణలు తెచ్చేందుకు కృషిచేయాలని  శ్రీ గోయల్ అన్నారు.    మూడింతల ఆర్ధిక ప్రగతి లక్ష్యంగా మనం కృషి చేయాలని ఆయన అన్నారు.   కోవిడ్ అనంతరం తలెత్తే  పరిస్థితి  వల్ల  ఉత్పన్నమయ్యే అవకాశాలను అందిపుచ్చుకోవడానికి  ఉన్నత స్థాయిలో చర్చలు జరిపి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు.    ఈరోజు మన ప్రధానమంత్రి సత్తా ఉన్న నాయకుడుగా గుర్తింపు పొందారని,  అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్ఫూర్తిప్రదాతగా ఎదిగారని అన్నారు.   భారతీయ ఔషధ రంగం ద్వారా దాదాపు 100 దేశాలు ప్రయోజనం పొందాయని అన్నారు.   వసుధైక కుటుంబంపై విశ్వాసంతో ఇండియా ఇతర దేశాలతో సోదర భావంతో  వ్యవహరిస్తున్నదని అన్నారు.    అన్ని దేశాలు మంచి మీడియా ఉండి   పారదర్శకతతో ప్రజాస్వామ్య పంథాలో న్యాయపాలన సాగిస్తున్న దేశాల కోసం అన్ని దేశాలు వెతుకుతున్నాయని అన్నారు.   ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఇండియాను విశ్వసనీయమైన భాగస్వామిగా ,  నమ్మదగినదిగా పరిగణిస్తున్నాయని అన్నారు.   భారత దౌత్యాధికారులు తమ కార్యాలయాలు ఉన్న  దేశాలలో గల వ్యాపార అవకాశాలను గుర్తించడంలో ప్రభుత్వానికి సహాయపడాలని మంత్రి అన్నారు.  
దేశంలో ఫ్యాక్టరీలు,  ఉత్పత్తి విభాగాలు ఏర్పాటు చేయడానికి  ఇన్వెస్ట్ ఇండియా,  పెట్టుబడులు మరియు వర్తక ప్రోత్సాహక శాఖ కలసి  నికార్సయిన సేవలు అందించే సింగిల్ విండోను ఏర్పాటు చేయడానికి సమన్వయంతో  కృషిచేస్తున్నాయని మంత్రి తెలిపారు.   ఇతర దేశాలలో ఉన్న అవకాశాలపై నివేదికలు పంపాలని దౌత్య కార్యాలయాలను కోరుతూ,  దేశంలో వర్తకాన్ని మరియు పెట్టుబడులను ప్రోత్సహించడం ఉమ్మడి బాధ్యత అని శ్రీ గోయల్ అన్నారు.   కోవిడ్ అనంతరం వివిధ దేశాల్లో ఉత్పన్నం కాగల అవకాశాలపై ప్రతిపాదనలు పంపాలని,  ఆ  ప్రతిపాదనలు వినూత్నతతో పాటు  ఎగుమతులను ప్రోత్సహించే సూచనలతో  ఉండాలని  అన్నారు.  దౌత్య కార్యాలయాలు అధునాతన టెక్నాలజీని ఉపయోగించడంతో పాటు  యుద్ధప్రాతిపదికపై పనిచేయవలసిన ఆవశ్యకత ఉందని  అన్నారు.    వారు తమ నెట్వర్క్ , కొత్తవారితో పరిచయాలు పెంచుకోవాలని మంత్రి సూచించారు.  
ఒక భౌగోళిక ప్రాంతంపై ఎక్కువగా ఆధార పడటం వల్ల జరిగే అనర్ధాల గురించి మొత్తం ప్రపంచానికి తెలియవచ్చిందని,  అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇండియా స్వయంగా ఎదగాలని విదేశీ వ్యవహారాల మంత్రి శ్రీ ఎస్. జయశంకర్ అన్నారు.   కరోనా వల్ల అన్ని దేశాలకు నష్టం జరిగిందని,   ఇండియా తేరుకొని ముందంజవేయడానికి వర్తకం, పెట్టుబడుల మార్గం ద్వారా  మాత్రమే సాధ్యమని ఆయన అన్నారు.   ఇప్పుడు దౌత్యాధికారులు  ఆయా దేశాలలో ఉన్న కంపెనీలతో మాట్లాడి ఇండియాలో పెట్టుబడులు పెట్టవలసిందిగా చెప్పి ఒప్పించాలని శ్రీ  జయశంకర్ అన్నారు.    దౌత్య కార్యాలయాలు విదేశాలలోనే  కాక, స్వదేశంలో కూడా  క్రియాశీలక పాత్ర పోషించి మంత్రిత్వ శాఖలతో కలసి పని చేయాలని కోరారు.  
వాణిజ్య శాఖ కార్యదర్శి డాక్టర్ అనూప్ వాధ్వాన్ మాట్లాడుతూ ఎగుమతులు పెంచేందుకు అవకాశాలు విస్తారంగా ఉన్నాయని అన్నారు.   దౌత్య కార్యాలయాల సాయంతో వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆ పని చేయగలదని అన్నారు.   దౌత్య కార్యాలయాలు చేయగల మూడు కార్యాలను ఆయన గుర్తించారు.  అవి:  విదేశీ ఎగుమతులకు ప్రోత్సాహం,  ఇండియాలో పర్యాటక వృద్ధికి ప్రోత్సాహం,  ఇండియాలో ఆచరించగల ఆవశ్యక టెక్నాలజీని అంచనా వేయడం.  

 

***


(Release ID: 1620206) Visitor Counter : 246