రైల్వే మంత్రిత్వ శాఖ

లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నవారి తరలింపు 'శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్ల'ను నడుపుతున్న రైల్వే మంత్రిత్వ శాఖ

వలస కూలీలు, యాత్రికులు, సందర్శకులు, విద్యార్థులు, ఇతరుల తరలింపు
ఏవైనా రెండు రాష్ట్రాల పరస్పర అభ్యర్థనలతో రైళ్లు నడపనున్న రైల్వే శాఖ

Posted On: 01 MAY 2020 4:51PM by PIB Hyderabad

లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతించిన నేపథ్యంలో, శ్రామిక దినోత్సవం సందర్భంగా నేటి నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు, యాత్రికులు, సందర్శకులు, విద్యార్థులు, ఇతరులను తరలించేందుకు 'శ్రామిక్‌ స్పెషల్‌' పేరిట రైళ్లను నడుపుతున్నారు.

నోడల్‌ అధికారులుగా సీనియర్‌ అధికారులు
    ఏవైనా రెండు రాష్ట్రాలు పరస్పర అవగాహనతో, ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ పౌరులను పరస్పరం స్వస్థలాలకు తరలించుకోవడానికి అంగీకరించాలి. ఈ అంగీకారాల ప్రకారం ఆ రెండు రాష్ట్రాల మధ్య ప్రజలను తరలించడానికి రైల్వే శాఖ 'శ్రామిక్‌ స్పెషల్‌' రైళ్లను నడుపుతుంది. ఈ తరలింపు ప్రక్రియ సమన్వయానికి, సాఫీగా సాగడానికి, సీనియర్‌ అధికారులను రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నోడల్‌ అధికారులుగా నియమిస్తాయి.

ప్రజలను పంపే సమయంలో వైద్య పరీక్షలు
    స్వస్థలాలకు పంపేవారికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య పరీక్షలు నిర్వహించాలి. కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. రాష్ట్రప్రభుత్వాలు ప్రజలను విడతలవారీగా పంపాలి. సామాజిక దూరం సహా ఇతర ఆరోగ్యపర సూచనలు పాటిస్తూ, శానిటైజ్‌ చేసిన బస్సుల్లో నిర్దేశిత రైల్వే స్టేషన్లకు వారిని తరలించాలి. మాస్కులు ధరించడం ప్రతి ప్రయాణీకుడికి తప్పనిసరి. ప్రజలను పంపే ప్రభుత్వాలు, మొదటి రైల్వేస్టేషన్‌లోనే వారందరికీ భోజనం, మంచినీళ్ల వసతి కల్పించాలి.

గమ్యస్థానం చేరిన తర్వాత కూడా వైద్య పరీక్షలు
    రైళ్లలోనూ ప్రజలు సామాజిక దూరం పాటించేలా, పరిశుభ్రతగా ఉండేలా రైల్వే అధికారులు కృషి చేస్తారు. దూర ప్రయాణాలు చేసేవారికి రైల్వే మంత్రిత్వ శాఖ భోజన వసతి కల్పిస్తుంది. గమ్యస్థాన స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణీకులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. అనుమానిత లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్లకు పంపాలి. ఎలాంటి అనారోగ్యం లేనివారిని స్వస్థలాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలి.

    ఈ సంక్షోభ సమయంలో తోటి భారతీయులకు సేవ చేసేందుకు రైల్వే అధికారులు, సిబ్బంది కట్టుబడి ఉన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరి మద్దతు కోరుతున్నారు.


(Release ID: 1620122) Visitor Counter : 363