ప్రధాన మంత్రి కార్యాలయం

బొగ్గు, గ‌నుల రంగాల‌ను ముందుకు తీసుకువెళ్లేందుకు మార్గాలపై చర్చించ‌డానికి సమావేశం ఏర్పాటు చేసిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర మోదీ

Posted On: 30 APR 2020 8:52PM by PIB Hyderabad

కోవిడ్ -19 మ‌హ‌మ్మారి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చేలా, గనులు, బొగ్గు రంగాలలో  అవ‌కాశం ఉన్న‌ ఆర్థిక సంస్కరణలను  చర్చించడానికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌ నరేంద్ర మోడీ విస్తృత‌ సమావేశం నిర్వహించారు. దేశీయ వనరుల నుండి ఖనిజ వనరులు సుల‌భంగా,  సమృద్ధిగా లభించేలా చూడటం, గ‌నుల అన్వేషణను పెంచడం, పెట్టుబడి , ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకర్షించడం, పారదర్శక,‌ సమర్థవంతమైన ప్రక్రియల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌డం వంటి అంశాల‌ను ఈ సంద‌ర్భంగా చ‌ర్చించారు.

అదనపు బ్లాకులను వేలం వేయడం, వేలంలో విస్తృతంగా పాల్గొనడాన్ని ప్రోత్సహించడం, ఖనిజ వనరుల ఉత్పత్తిని పెంచడం, మైనింగ్ ఖర్చు, రవాణా ఖర్చులను తగ్గించడం, వ్యాపారం చేసే సౌలభ్యాన్ని పెంచడం, పర్యావరణ సుస్థిర అభివృద్ధితో కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించడం కూడా ఈ చర్చల్లో ప్ర‌ధాన‌మైన అంశాలుగా ఉన్నాయి.

వేలం వ్య‌వ‌స్థ‌లో సంస్కరణలు, సమర్థవంతమైన సంస్థాగత ఏర్పాట్లు, గ‌నుల అన్వేషణ ,మైనింగ్‌లో ప్రైవేటు రంగాల భాగస్వామ్యం, ప్రభుత్వ రంగాన్ని మరింత పోటీగా మార్చడంతో పాటు ఖనిజ అభివృద్ధి నిధి ద్వారా సమాజ అభివృద్ధి కార్యకలాపాలను విస్తృతంగా చేప‌ట్ట‌డం వంటి అంశాలు కూడా చర్చించారు. దేశీయ సామాగ్రిస‌ర‌ఫ‌రాల‌ కోసం సముద్ర మార్గాలను ఉపయోగించడం సహా ఖనిజాల తరలింపు, మౌలిక సదుపాయాలను విస్తరించడం, మెరుగుపరచడం వంటి అంశాలు కూడా ఈసంద‌ర్భంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి.
 
గనుల నుండి రైల్వే స్లైడింగ్ వరకు బొగ్గు రవాణా కోసం సమర్థవంతమైన , పర్యావరణ హిత‌క‌ర‌మైన విధంగా ఉత్ప‌త్తి నుంచి తొలిద‌శ ర‌వాణా అనుసంధాన‌త‌ను పెంచడం, రైలు వ్యాగన్లపై ఆటోమేటిక్ లోడింగ్, బొగ్గు గ్యాసిఫికేషన్ , ద్రవీకరణ, బొగ్గు బెడ్ మీథేన్ అన్వేషణ వంటి అంశాల‌లో సంస్కరణలకుగ‌ట్టి అవ‌కాశం ఉన్న అంశాల‌పై చ‌ర్చించారు.
ఉపాధి అవకాశాలను పెంచడంలో, వృద్ధిని పెంచడంలో గనుల రంగం అందించిన సహకారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షించారు.

ఖనిజాల ఉత్పత్తిలో దేశ స్వావలంబనను మెరుగుపరచడం ,వాటి దేశీయ ప్రాసెసింగ్‌పై ప్ర‌ధాన‌మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఖనిజ రంగం, తన కార్యకలాపాలను అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి తీసుకువెళ్లాల‌ని ,అందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని వారికి సూచించారు.

సమర్థవంతమైన మైనింగ్ కార్య‌క‌లాపాల కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిందిగా ప్ర‌ధాన‌మంత్రి ఈ సంద‌ర్భంగా  గ‌ట్టిగా కోరారు.. ఆర్థిక వ్యవస్థవృద్ధికి,  ప్రైవేటు పెట్టుబడులు పెరగడానికి వీలుగా అనుమతులు పొందడంలో జాప్యాన్ని తగ్గించాల‌ని , రాష్ట్రాలతో భాగస్వామ్యం పెట్టుకోవాలని ఆయన సూచించారు..



(Release ID: 1619831) Visitor Counter : 188