ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి అంతర్జాతీయ డిజిటల్ సమన్వయం సాధించాలని జి-20 డిజిటల్ మంత్రుల శిఖరాగ్రం పిలుపు
సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి కారక ఆర్థిక వ్యవస్థలు, సమాజాల నిర్మాణం జి20 దేశాల బాధ్యత అని వక్కాణించిన భారత్
Posted On:
30 APR 2020 9:37PM by PIB Hyderabad
నెట్ వర్క్ అనుసంధానత, కమ్యూనికేషన్ మౌలిక వసతులు, అత్యంత సురక్షితమైన విధానాల ద్వారా వ్యక్తిగతం కాని డేటా మార్పిడి, ఆరోగ్య సంరక్షణకు డిజిటల్ పరిష్కారాల వినియోగం, సైబర్ భద్రత కలిగిన ప్రపంచం ఏర్పాటు, పటిష్ఠమైన వ్యాపార వాతావరణం కల్పన ఆధారిత చర్యల ద్వారా అంతర్జాతీయ శత్రువైన కోవిడ్-19ని దీటుగా ఎదుర్కొనేందుకు సమన్వయపూర్వకమైన అంతర్జాతీయ డిజిటల్ స్పందన వ్యవస్థ ఏర్పాటు చేయాలని జి-20 డిజిటల్ ఎకానమీ టాస్క్ ఫోర్స్ కు సంబంధించిన మంత్రులు పిలుపు ఇచ్చారు. కోవిడ్-19 మహమ్మారి విసిరిన సవాలుపై చర్చించి డిజిటల్ టెక్నాలజీల ఆధారంగా ప్రపంచస్థాయి సమన్వయ స్పందన సాధనకు మార్గాలు అన్వేషించడం లక్ష్యంగా జి-20 డిజిటల్ ఎకానమీ మంత్రుల అసాధారణ వర్చువల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర న్యాయ వ్యవహారాలు; కమ్యూనికేషన్లు, ఎలక్ర్టానిక్స్, ఐటి శాఖల మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహించిన ఈ సమావేశంలో 19 ఇతర జి-20 దేశాలు, ఆహ్వానిత దేశాల డిజిటల్ మంత్రులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఆ మహమ్మారిని అదుపు చేయడానికి, ప్రజలను పరిరక్షించడానికి డిజిటల్ సాధనాల శక్తిని వినియోగించుకోవాలని జి-20 డిజిటల్ మంత్రులు ఒక అంగీకారానికి వచ్చారు. ఎలాంటి విపత్తులనైనా దీటుగా ఎదుర్కొనగల మరింత సమానత్వం, సమ్మిళితం, సుస్థిరతతో కూడిన ఆర్థిక వ్యవస్థలు, సమాజాల స్థాపనకు ప్రస్తుత సంక్షోభ సమయంలోను, భవిష్యత్తులోను కృషి చేయడం అందరి బాధ్యత అని శ్రీ రవిశంకర్ ప్రసాద్ నొక్కి చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ఈ వ్యాధి వ్యాప్తిని నిలువరించడానికి తీసుకున్న చర్యలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రపంచం మొత్తం అనుసరించగల చక్కని రోడ్ మ్యాప్ ను కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించినట్టు మంత్రి తెలిపారు. అదే సమయంలో కోవిడ్-19పై పోరాటం కొనసాగిస్తూనే ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేయడం కూడా అంతే ప్రధానమని ఆయన అన్నారు.
ప్రజల జీవనోపాధిపై ప్రభావం చూపగల, భిన్న రంగాల్లో వేగం పెంచే, సరఫరా వ్యవస్థను పటిష్ఠం చేసే, సైబర్ సురక్షిత ప్రపంచాన్ని నిర్మించగలిగే అప్లికేషన్లపై తదుపరి దశ డిజిటలైజేషన్ లో దృష్టి సారించాలని మంత్రి పిలుపు ఇచ్చారు. సామాజిక దూరం, సమానమైన దూరాన్ని పాటిస్తూ పని చేసే కార్మిక శక్తి, ప్రపంచ సరఫరాల వ్యవస్థ మారుతున్న స్వభావం అన్నింటికీ చక్కని పరిష్కారాలు అందించగల సొల్యూషన్లు సిద్ధం చేయడానికి అందరి మధ్య మరింత సమన్వయం అవసరమని ప్రస్తుత వాతావరణం నిరూపిస్తున్నదని జి-20 మంత్రులకు శ్రీ రవిశంకర్ ప్రసాద్ నివేదించారు. అంతర్జాతీయ మహమ్మారితో పోరాటం చేయడానికి పటిష్ఠమైన డిజిటల్ కార్యాచరణను సిద్ధం చేయాలని జి-20 దేశాలకు ఆయన పిలుపు ఇచ్చారు. అంతర్జాతీయ వ్యాపారాల కొనసాగింపునకు అవసరం అయిన పరిష్కారాలు చూపడంలో భారత ఐటి-ఐటిఇఎస్ పరిశ్రమ పాత్ర కీలకమని ఆయన నొక్కి చెప్పారు. ప్రస్తుత కల్లోలం కారణంగా దెబ్బ తిన్న ప్రపంచ సరఫరా వ్యవస్థకు లాభదాయకమైన గమ్యం గా భారత్ నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
(Release ID: 1619917)
Visitor Counter : 193