వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
60 లక్షల టన్నుల ధాన్యం తరలింపుతో ఎఫ్‌సీఐ రికార్డు నెల సగటు కంటే ఏప్రిల్‌లో రెట్టింపు పరిమాణం తరలింపు
వినియోగ రాష్ట్రాల్లో ఏప్రిల్‌లో 58 లక్షల మెట్రిక్ టన్నులు అన్‌లోడ్
130 లక్షల మెట్రిక్ టన్నులు దాటిన గోధుమ సేకరణ
Posted On:
30 APR 2020 6:45PM by PIB Hyderabad
భారత ఆహార సంస్థ (FCI), 2020 ఏప్రిల్ నెలలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాలకు తరలించింది. FCI చరిత్రలోనే ఒక నెలలో తరలించిన అత్యధిక పరిమాణం ఇది. 2014 మార్చిలో 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తరలించి నెలకొల్పిన రికార్డును, ఈనెలలో 57 శాతం అధికంగా తరలించడం ద్వారా FCI అధిగమించింది. సాధారణ నెల సగటు అయిన 30 లక్షల మెట్రిక్ టన్నులకు ఇది రెట్టింపు మొత్తం. కశ్మీర్ లోయ, లెహ్/లడఖ్‌కు రహదారి మార్గంలో తరలించిన లక్ష మెట్రిక్ టన్నులు, ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయకు తరలించిన 0.81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా కలిపి ఈ రికార్డును సృష్టించింది. అండమాన్ మరియు లక్షద్వీపాలకు కూడా సముద్రమార్గంలో 0.1 లక్షల మెట్రిక్ టన్నులను FCI పంపించింది.
అత్యధిక నిల్వలు అందుకున్న బిహార్, కర్ణాటక
కొవిడ్-19 సమయంలోనూ, ఏప్రిల్ నెలలో, వివిధ వినియోగ రాష్ట్రాల్లో 58 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం నిల్వలను FCI అన్‌లోడ్ చేసింది. అత్యధికంగా, బిహార్ దాదాపు 7.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అందుకోగా, కర్ణాటక 7 లక్షల మెట్రిక్ టన్నులను పొందింది. కొవిడ్-19 విజృంభిస్తూ కొత్త హాట్‌స్పాట్లు, కంటైన్‌మెంట్ జోన్లను సృష్టిస్తున్న వేళ, అవే ప్రాంతాల్లో ఉన్న అన్‌లోడింగ్ కేంద్రాల్లో ధాన్యాన్ని దించడం ఒక సవాలే. అయినా, కొవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న చాలా కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాల చురుకైన సహకారంతో ధాన్యాన్ని FCI అన్‌లోడ్ చేయగలిగింది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆ ధాన్యం ప్రజలకు చేరేలా రాష్ట్రాలకు అందించింది.
కేటాయించిన మొత్తంలో సగం నిల్వలు తరలింపు
'ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన' (PMGKAY) కింద, ప్రతి పేదవాడికి 5 కిలోల ధాన్యాన్ని ఉచితంగా పంపిణీ చేసేలా FCI ఈ ధాన్యాన్ని తరలించింది. ఇందుకోసం కేటాయించిన 120 లక్షల మెట్రిక్ టన్నుల్లో సగమైన 60 లక్షల మెట్రిక్ టన్నులను తరలించి, దాదాపు 80 కోట్ల మంది ప్రజలకు ధాన్యం అందేలా సహకరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే తరలించడానికి వీలుగా దేశవ్యాప్తంగా సరిపడినన్ని ఆహార ధాన్యం నిల్వలను FCI
సిద్ధంగా ఉంచింది.
68 లక్షల మెట్రిక్ టన్నులతో తొలిస్థానంలో పంజాబ్
మరోవైపు, కేంద్ర ప్రభుత్వ గోధుమల సేకరణ 130 లక్షల మెట్రిక్ టన్నులను దాటింది. దీనిలో, 68 లక్షల మెట్రిక్ టన్నులతో పంజాబ్ తొలిస్థానంలో ఉండగా, హర్యానా 30 లక్షల మెట్రిక్ టన్నులతో, మధ్యప్రదేశ్ 25 లక్షల మెట్రిక్ టన్నులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆహార ధాన్యాల సేకరణ స్థిరంగా కొనసాగుతున్నందున, NFSA మరియు PMGKAY సహా వివిధ పథకాల కింద దాదాపు 122 లక్షల మెట్రిక్ టన్నులను తరలించినా, మొత్తం ఆహార ధాన్యాల నిల్వలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
(Release ID: 1619809)
Visitor Counter : 174